నా తోటి భారతీయులారా,

నమస్కారం!

నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాగం దేశ పురోగతిని స్పష్టతతో, దృఢ నిశ్చయంతో నిరంతరం ముందుకు నడిపిస్తున్న పవిత్ర గ్రంథం. అందుకే, దాదాపు దశాబ్దం కిందట 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది.

మన రాజ్యాంగానికి ఉన్న ఈ శక్తే నాలాంటి ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని 24 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా సేవ చేయగలిగేలా చేసింది. 2014లో నేను మొదటిసారి పార్లమెంటుకు వచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్య దేవాలయం మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మళ్ళీ, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నేను సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడూ... శిరస్సు వంచి గౌరవ చిహ్నంగా నా నుదిటితో రాజ్యాంగాన్ని తాకి నమస్కరించాను. ఈ రాజ్యాంగం నాలాంటి అనేక మందికి కలలు కనే శక్తినీ, వాటి కోసం పనిచేసే శక్తినీ ఇచ్చింది.

రాజ్యాంగ దినోత్సవం రోజున మనం... రాజ్యాంగ రూపకల్పనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కృషి చేసిన రాజ్యాంగ సభలోని స్ఫూర్తిదాయక సభ్యులందరి సేవలను స్మరించుకుంటాం. అద్భుతమైన దూరదృష్టితో ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషినీ మనం గుర్తు చేసుకుంటాం. రాజ్యాంగ సభలోని అనేక మంది విశిష్ట మహిళా సభ్యులు తమ ప్రభావవంతమైన ఆలోచనలు, దార్శనిక దృక్పథాలతో రాజ్యాంగాన్ని సుసంపన్నం చేశారు.

నా మనస్సు 2010 సంవత్సరం వైపు మళ్లింది. భారత రాజ్యాంగం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అపురూప సందర్భం అది. విచారమేమంటే, ఆ సందర్భానికి జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యం లభించలేదు. కానీ, రాజ్యాంగం పట్ల మా సమష్టి కృతజ్ఞతను, నిబద్ధతను వ్యక్తపరచడానికి మేం గుజరాత్‌లో 'సంవిధాన్ గౌరవ్ యాత్ర'ను నిర్వహించాం. మన రాజ్యాంగాన్ని ఏనుగుపై ఉంచి ఊరేగించాం. నేను, వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కలిసి ఆ ఊరేగింపులో పాల్గొనే గౌరవాన్ని పొందాం.

రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం భారత ప్రజలకు అసాధారణ మైలురాయిగా నిలవాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకునేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే భాగ్యం... దేశవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం మాకు లభించింది. ఈ కార్యక్రమాల్లో రికార్డు స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కనిపించింది.

ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం పలు కారణాల వల్ల మరింత ప్రత్యేకమైంది. ఇది ఇద్దరు అసాధారణ వ్యక్తులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం. వారిద్దరూ మన దేశం కోసం అమూల్యమైన కృషి చేశారు. సర్దార్ పటేల్ దార్శనిక నాయకత్వం భారత రాజకీయ ఏకీకరణకు భరోసానిచ్చింది. ఆర్టికల్ 370, 35(A) లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆయన ప్రేరణ, ధైర్యసాహసాలే మా చర్యలకు మార్గనిర్దేశం చేశాయి. భారత రాజ్యాంగం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో సంపూర్ణంగా అమలులో ఉంది. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలకు అన్ని రాజ్యాంగ హక్కులనూ నిర్ధరిస్తుంది. భగవాన్ బిర్సా ముండా జీవితం మన గిరిజన వర్గాలకు న్యాయం, గౌరవం, సాధికారతను అందించాలనే భారత సంకల్పానికి స్ఫూర్తినిస్తూనే ఉంది.

తరతరాలుగా భారతీయుల సమష్టి సంకల్పాన్ని ప్రతిధ్వనించే పదాలతో కూడిన వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్నీ ఈ సంవత్సరమే మనం జరుపుకుంటున్నాం. ఈ సమయంలోనే శ్రీ గురు తేగ్ బహదూర్ గారి 350వ వర్ధంతి సందర్భంగా మనం ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. ఆయన జీవితం, త్యాగం... మనల్ని ధైర్యం, కరుణ, శక్తితో ప్రకాశింపజేస్తూనే ఉన్నాయి.

ఈ వ్యక్తులు, వారి విజయాలు మన విధులకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. రాజ్యాంగం కూడా ఆర్టికల్ 51ఏ ద్వారా ప్రాథమిక విధుల గురించి ప్రధానంగా చెబుతోంది. సామాజిక, ఆర్థిక పురోగతిని మనం సమష్టిగా ఎలా సాధించాలో ఈ విధులు మార్గనిర్దేశం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ ఒక పౌరుడికి ఉండే విధులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. విధిని సక్రమంగా నిర్వర్తించటం ద్వారా అది దానికి సంబంధించిన ఒక హక్కును సృష్టిస్తుందని.. నిజమైన హక్కులు విధులను నిర్వర్తించిన ఫలితమేనని ఆయన విశ్వసించారు.

ఈ శతాబ్దం ప్రారంభమై ఇప్పటికే 25 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి నుంచి కేవలం రెండు దశాబ్దాలకు పైబడిన కాలంలోనే వలస పాలన నుంచి విముక్తి పొంది 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 2049 సంవత్సరానికి రాజ్యాంగాన్ని స్వీకరించి వంద సంవత్సరాలు అవుతాయి. ఈ రోజు మనం రూపొందించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు, మన సామూహిక చర్యలు రాబోయే తరాలతరాల జీవితాలను తీర్చిదిద్దుతాయి.

దీని నుంచి ప్రేరణ పొంది మనం వికసిత్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు మన దేశం పట్ల మనకున్న విధులను అన్నివేళలా మన మనసులలో అగ్రస్థానంలో ఉంచుకోవాలి.
మన దేశం మనకు ఎంతో ఇచ్చింది. ఈ భావమే హృదయాంతరాల నుంచి లోతైన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది. ఈ భావనతో మనం జీవించినప్పుడు.. మన విధులను నెరవేర్చడం మన స్వభావంలో అంతర్భాగం అవుతుంది. మన విధులను నిర్వహించేందుకు ప్రతి పనిలో మనం పూర్తి సామర్థ్యం, అంకితభావాన్ని పెట్టటం తప్పనిసరి అవుతుంది. మన ప్రతి చర్య రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి. జాతీయ లక్ష్యాలు, ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లాలి. అన్నింటికీ మించి మన రాజ్యాంగ నిర్మాతల కలలను నెరవేర్చడం మన బాధ్యత. మనం ఈ భావనతో పనిచేసినప్పుడు మన దేశ సామాజిక, ఆర్థిక పురోగతి అనేక రెట్లు పెరుగుతుంది.

మన రాజ్యాంగం మనకు ఓటు హక్కును ఇచ్చింది. మనం నమోదు చేసుకున్న జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని వదలుకోకపోవడం అనేది మన విధి. ఇతరులను ప్రేరేపించేందుకు మనం ప్రతి నవంబర్ 26న పాఠశాలలు, కళాశాలల్లో 18 ఏళ్లు నిండేవారిని ఉద్దేశించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు. ఈ విధంగా మొదటిసారి ఓటర్లుగా ఉండే విద్యార్థులు తాము దేశ నిర్మాణ ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా కూడా ఉన్నట్లు భావిస్తారు.

మనం మన యువతకు బాధ్యత, గర్వంతో కూడిన స్ఫూర్తితో ప్రేరణ కలిగించినప్పుడు వారు తమ జీవితాంతం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటారు. ఈ నిబద్ధతా భావమే ఒక బలమైన దేశానికి పునాది.
ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు ఈ గొప్ప దేశంలోని పౌరులుగా మన విధులను నెరవేరుస్తామన్న మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించుకుందాం. ఇలా చేయడం ద్వారా మనం అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన భారత్ నిర్మాణానికి అర్థవంతమైన సహకారం అందించగలం.

మీ,

నరేంద్ర మోదీ

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
173 years of Indian Railways: From steam engines to India’s first hydrogen train

Media Coverage

173 years of Indian Railways: From steam engines to India’s first hydrogen train
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం
July 06, 2026

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు.


సురక్షిత, సుఖవంతమైన జీవితానికి లోటు లేని బాల్యం ఆయనది. శ్యామా ప్రసాద్‌ తండ్రి, సర్ అశుతోష్ ముఖర్జీ సమకాలీన అగ్రశ్రేణి విద్యావేత్తలలో.. మేధావులలో ఒకరు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. అంతటి తీవ్ర వ్యక్తిగత విషాదాలను చవిచూసినప్పటికీ దేశ సేవపై ఆయన సంకల్పం మరింత బలపడి, తిరుగులేని నిబద్ధతతో ముందుకే నడిపింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే- అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి.. అంతిమ శ్వాసలోనూ ఒక వ్యక్తి త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి క్షణాల్లో డాక్టర్ ముఖర్జీ జీవన ప్రస్థానం ఒకటిగా మిగిలింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు- తాను విశ్వసించిన ఆదర్శం కోసం డాక్టర్ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.


డాక్టర్ ముఖర్జీ సదా దేశానికే ప్రథమ స్థానమిచ్చారు... భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణంగా ఆనాటి సంప్రదాయ ఆలోచనలకు సవాలు విసురుతూ సంస్థల, వ్యవస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా- “భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి” అని కుండబద్దలు కొట్టారు.


డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం అనేక విధాలుగా ముందంజ వేసింది. ఆయన హయాంలో గ్రంథాలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనం, వ్యవసాయంలో కొత్త కోర్సులకు శ్రీకారం వంటి విశిష్ట కృషి కొనసాగింది. క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం తదితరాలపైనా ఆయన ఏకకాలంలో దృష్టి సారించారు. ప్రస్తుత-పూర్వ విద్యార్థులలో తమ విశ్వవిద్యాలయంపై సగర్వ భావనను ప్రోది చేస్తూ, ఏటా జనవరి 24న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విశ్వవిద్యాలయంపై ఒక పాట రాయాల్సిందిగా గురుదేవులు రవీంద్ర నాథ్‌ టాగోర్‌ను ఆయన అభ్యర్థించారు.


ఈ స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన జీవిత చరమాంకంలో కనిపిస్తుంది. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయాన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ఎంచుకోవడం గమనార్హం. ప్రమిద ఎంత చిన్నదైనా, దాని వెలుగు స్వల్పమే అయినా తన పరిధికి మించి చీకటిని పారదోలగల శక్తి దానికి ఉంటుందని భావించారు. తదనంతర క్రియాశీల మనుగడలోనూ జనసంఘ్ ఇదేవిధంగా ముందడుగు వేసింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు-పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, అసాధారణ నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో పారిశ్రామిక రంగాన్ని దేశానికి గౌరవం, అవకాశాలు, విశ్వాసాలను పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిగణించారు. తదనుగుణంగా సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులందరూ ఆయనలో అసమాన నిబద్ధతగల మద్దతుదారును కనుగొన్నారు.


ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాబోదు.


సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం భారత నాగరిక సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి డాక్టర్ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు.


పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డాక్టర్ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. అటుపైన 50 ఏళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్య విలువల మూలాలపై మరోసారి దెబ్బకొడుతూ 42వ సవరణ చట్టం తెచ్చారు.


మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ డాక్టర్ ముఖర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరువు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.


ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ- “మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా... క్షుణ్ణంగా... అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్థాంతరంగా వదిలేయకండి... అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి.. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి” అని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో నేటి యువత దృక్పథం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నేటి సందర్భానికి తగినట్లు వారంతా డాక్టర్‌ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.