నా దేశ ప్రజలారా,
నమస్కారం!
దేశంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ శుభవేళ మీకు, మీ కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్నీ, సంతోషాన్నీ, సమృద్ధినీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఈ ఏడాది, పండుగ సమయాల్లో ఆనందం రెట్టింపయ్యేందుకు మరో కారణం ఉంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణల అమలు ప్రారంభమైంది. దీంతో దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ లేదా ‘జీఎస్టీ పొదుపు పండుగ’ కూడా మొదలైంది.
ఈ సంస్కరణలు పొదుపును పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులూ ఎంఎస్ఎంఈలూ... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ నేరుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అవి అభివృద్ధినీ పెట్టుబడులనూ ప్రోత్సహిస్తూ.. ప్రతీ రాష్ట్ర, ప్రాంత పురోగతిని వేగవంతం చేస్తాయి.
ప్రధానంగా 5 శాతం, 18 శాతం శ్లాబులు ఉండటం ఈ కొత్త జీఎస్టీ సంస్కరణల్లో ముఖ్యాంశం.
ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్ పేస్టులు, బీమా వంటి రోజువారీ నిత్యావసరాలు, అనేక ఇతర వస్తువులు ఇప్పుడు పన్ను రహితంగానో, లేదా కనిష్ఠ శ్లాబు 5 శాతం పరిధిలోకో వస్తాయి. గతంలో 12 శాతం పన్ను విధించిన వస్తువులు దాదాపుగా 5 శాతం పరిధిలోకి వచ్చాయి.
పన్నులు- సంస్కరణలకు ముందు, ఆ తర్వాత అంటూ తేదీలను సూచించేలా అనేక మంది దుకాణదారులు, వర్తకులు ‘నాడు, నేడు’ పేరుతో బోర్డులు పెట్టడం సంతోషాన్నిస్తోంది.
గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. దీంతో ఆశావహమైన నయా మధ్యతరగతి ఏర్పడింది.
అంతేకాకుండా, ఆదాయపు పన్నును భారీగా తగ్గించడం ద్వారానూ మన మధ్యతరగతిని బలోపేతం చేశాం. రూ. 12 లక్షల వరకూ వార్షికాదాయంపై పన్ను ఉండబోదు.
ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త జీఎస్టీ సంస్కరణలను కలిపి చూస్తే.. వాటి వల్ల ప్రజలకు దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయి.
మీ ఇంటి ఖర్చులు తగ్గుతాయి. ఇల్లు కట్టుకోవాలనో, వాహనం కొనుక్కోవాలనో, గృహోపకరణాలను కొనుక్కోవాలనో, బయట తినాలనో అనుకుంటున్నా, లేదా కుటుంబంతోపాటు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా... ఇప్పుడవన్నీ సులభంగా నెరవేరుతాయి.
2017లో మన దేశ జీఎస్టీ ప్రయాణం ప్రారంభమైంది. మన ప్రజలను, వాణిజ్యాలను అనేక పన్నుల ఉచ్చు నుంచి విముక్తులను చేసే దిశగా ఇదొక కీలక మలుపు. జీఎస్టీ దేశాన్ని ఆర్థికంగా ఏకం చేసింది. ‘ఒక దేశం, ఒకే పన్ను’.. ఇది ఏకరూపతనూ ఉపశమనాన్నీ అందించింది. కేంద్రం - రాష్ట్రాలు రెండింటి క్రియాశీల భాగస్వామ్యం ఉన్న జీఎస్టీ కౌన్సిల్.. అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంది.
ఇప్పుడీ కొత్త సంస్కరణలు మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. వ్యవస్థను సరళీకృతం చేస్తూ, ధరలను తగ్గిస్తాయి. ప్రజలు మరింతగా పొదుపు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి.
మన చిన్న పరిశ్రమలు, దుకాణదారులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకూ కూడా వాణిజ్య సౌలభ్యంతోపాటు నిబంధనల అనుసరణ కూడా సరళతరం అయింది. తక్కువ పన్నులు, తక్కువ ధరలు, సరళమైన నియమాల ద్వారా.. అమ్మకాలు పెరగడమే కాకుండా అనుమతుల భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో అవకాశాలు పెరుగుతాయి.
2047 నాటికి వికసిత్ భారత్ సాధన మనందరి లక్ష్యం. దానిని సాకారం చేసుకునేందుకు ఆత్మనిర్భర మార్గంలో ప్రయాణించడం కీలకం. ఈ సంస్కరణలు మన స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. దాంతో ఆత్మనిర్భర భారత్ దిశగా మార్గం సుగమం అవుతుంది.
ఇందుకోసం ఈ పండుగ వేళ.. భారత్‌లో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కూడా సంకల్పిద్దాం. అంటే.. బ్రాండ్‌తోనూ వాటిని తయారు చేసిన కంపెనీతోనూ నిమిత్తం లేకుండా భారతీయులు చెమటోడ్చి, శ్రమించి తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం.
మన కళాకారులు, కార్మికులు, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తిని మీరు కొంటున్నారంటే.. అనేక కుటుంబాలు జీవనోపాధిని పొందేందుకు మీరు దోహదపడుతున్నారన్నమాట. మన యువతకు ఉద్యోగ అవకాశాలనూ కల్పించినవారవుతారు.
భారత్‌లో తయారైన ఉత్పత్తులనే విక్రయించాలని మన దుకాణదారులు, వ్యాపారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
గర్వంగా చెబుదాం – స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేద్దాం.
గర్వంగా చెబుదాం – స్వదేశీ వస్తువులనే విక్రయిద్దాం.
పరిశ్రమలను, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను.
మరోసారి మీకు, మీ కుటుంబాలకు నవరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ సమయం మీ అందరిలో సంతోషాన్ని నింపాలని, ‘జీఎస్టీ పొదుపు పండుగ’ మీ ఆదాయాన్ని విశేషంగా పెంపొందించాలని కోరుకుంటున్నాను.
ఈ సంస్కరణలు ప్రతి భారతీయ కుటుంబంలోనూ మరింత సమృద్ధిని తీసుకురావాలని కాంక్షిస్తున్నాను.






