రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.
ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన జాతీయ అంశాలపై చర్చించబోతున్న నేపథ్యంలో.. చైర్మన్ నేతృత్వం రాజ్యసభ కార్యాచరణను మరింత మెరుగుపరుస్తుందని శ్రీ మోదీ దీమా వ్యక్తం చేశారు.
రైతు కుటుంబానికి చెందిన చైర్మన్ రాధాకృష్ణన్ యావజ్జీవితాన్నీ సమాజ సేవకే అంకితం చేశారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “సామాజిక సేవే ఆయనకు ఎన్నటికీ చెరగని గుర్తింపు. రాజకీయాలు.... ఒక్క పార్శ్వం మాత్రమే. సేవా స్ఫూర్తే ఆయన జీవన కార్యాచరణ కేంద్రం” అని శ్రీ మోదీ అన్నారు. సామాజిక సేవకు విలువనిచ్చే ప్రతి ఒక్కరికీ.. ప్రజా సంక్షేమం పట్ల ఆయన చిరకాల నిబద్ధత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
చైర్మన్ విస్తృత ప్రజా జీవితాన్ని ప్రస్తావిస్తూ.. కాయిర్ బోర్డును చరిత్రాత్మకంగా, అత్యుత్తమ సంస్థగా నిలపడంలో ఆయన విజయాలను ప్రధానమంత్రి కొనియాడారు. జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, పుదుచ్చేరిలలో గవర్నరుగా, లెఫ్టినెంట్ గవర్నరుగా అంకితభావంతో సేవలందించారని శ్రీ మోదీ అభినందించారు. తరచూ మారుమూల గ్రామాలకు వెళ్లి, ఆ చిన్నచిన్న జనావాసాల్లోనే రాత్రిపూట బస చేసి ప్రజల అవసరాలను తెలుసుకున్నారంటూ... జార్ఖండ్ గిరిజనులతో ఆయనకు ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. “గవర్నరుగా ఉన్న సమయంలో మీ సేవాస్ఫూర్తి ఇంకా పెరిగింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అనేక ఏళ్లపాటు ఆయనతో ఉన్న అనుబంధం ద్వారా, వ్యక్తిగతంగా తాను గమనించిన అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రొటోకాల్ పరిమితులను అధిగమించి వ్యవహరిస్తూ, శ్రీ రాధాకృష్ణన్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. “అధికారిక హోదాలకు అతీతంగా వ్యవహరించడం ప్రజా జీవితంలో గొప్ప శక్తినిస్తుంది. ఆ శక్తి మీలో పుష్కలంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గొప్ప పేరున్న ‘డాలర్ సిటీ’లో జన్మించినప్పటికీ.. అక్కడున్న బీదసాదల సంక్షేమం కోసమే ఆయన పనిచేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
చిన్నతనంలో అవినాశి ఆలయ కోనేరులో మునిగిపోయిన శ్రీ సి.పి. రాధాకృష్ణన్ దాదాపు మృత్యువు అంచుల దాకా వెళ్లివచ్చారని ప్రధానమంత్రి చెప్పారు. దేవుడి దయ వల్లే ఆయన బతికారని చైర్మన్, ఆయన కుటుంబం ఎప్పుడూ చెప్తుంటారని శ్రీ మోదీ అన్నారు. మరో ప్రాణాంతక ఘటనను ప్రస్తావిస్తూ.. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ యాత్రకు కొద్దిసేపటి ముందు కోయంబత్తూరులో జరిగిన తీవ్రమైన బాంబు పేలుడును ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ పేలుడు దాదాపు 60 నుంచి 70 మంది ప్రాణాలను బలిగొంది. చైర్మన్ తృటిలో తప్పించుకున్నారు.
“ఈ ఘటనల్లో దేవుడే తనను రక్షించాడని ఆయన చెప్తారు. సమాజ సేవకు తనను తాను పూర్తిగా పునరంకితం చేసుకోవాలన్న ఆయన సంకల్పం దీంతో మరింత దృఢతరమైంది” అని శ్రీ మోదీ అన్నారు. అలాంటి జీవితానుభవాలను ఆయన అత్యంత సానుకూలంగా మలచుకున్నారని, ఈ అంకితభావం చైర్మన్ అద్భుత వ్యక్తిత్వాన్ని ప్రతిబంబిస్తుందని ఆయన అన్నారు.
చైర్మన్ రాధాకృష్ణన్ మొదటిసారి కాశీకి వచ్చినప్పుడు గంగా మాత ఆశీస్సులతో ఎంతో స్ఫూర్తిని పొంది, మాంసాహారం మానేస్తానని ప్రమాణం చేశారని ప్రధానమంత్రి తెలిపారు. ఆహార అలవాట్లపై నియంత్రణ కన్నా కూడా.. ఆధ్యాత్మిక సునిశితత్వాన్ని, ఆంతరంగిక ప్రేరణను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. “విద్యార్థి జీవితం నుంచే మీలో నాయకత్వ లక్షణాలను స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజు మీరు ఈ స్థానంలో దేశ నాయకత్వ దిశగా మాకు మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఇది మా అందరికీ గర్వకారణం” అని శ్రీ మోదీ అన్నారు.
అత్యవసర పరిస్థితి వేళ ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఎదురైన సమయంలో.. పరిమిత వనరులే ఉన్నప్పటికీ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ చూపిన సాహసోపేత వైఖరిని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. అచంచలమైన స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. “మీ ప్రజాస్వామ్య పోరాటంలో భాగంగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలనూ నిర్వహించారు. మీరు ప్రజలకు స్ఫూర్తినిచ్చిన విధానం ప్రజాస్వామ్య ఔత్సాహికులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ స్ఫూర్తి కొనసాగుతుంది” అని శ్రీ మోదీ అన్నారు.
ఆయన సంస్థాగత నైపుణ్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించారని, కొత్త ఆలోచనలను స్వీకరించారని, ఐక్యతను పెంపొందించారని, యువ నాయకులకు అవకాశాలను అందించారని శ్రీ మోదీ అన్నారు. “కోయంబత్తూరు ప్రజలు మిమ్మల్ని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు. సభలోనూ మీ నియోజకవర్గ అభివృద్ధి అవసరాలను మీరు ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎదుటా, పార్లమెంటులోనూ వారికి పెద్దపీట వేశారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సభ్యుడిగా, రాజ్యసభ చైర్మన్‌గా, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా శ్రీ రాధాకృష్ణన్‌కు ఉన్న అపారమైన అనుభవం.. సభకు, దేశానికి దారిదీపంగా నిలుస్తుందని ప్రధానమంత్రి దీమా వ్యక్తం చేశారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Thiru CP Radhakrishnan Ji comes from a humble farming background and has devoted his entire life to public service: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 1, 2025
Seva, Samarpan and Sanyam have been integral to the personality of Thiru CP Radhakrishnan Ji: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 1, 2025


