"శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకోవటం నిజంగా ఒక చారిత్రక సందర్భం"
"గత 550 సంవత్సరాల్లో కాలం విసిరిన లెక్కలేనన్ని సవాళ్లను తట్టుకున్న మఠం”
యుగాలు- తరాలు మారినా, దేశం- సమాజం అనేక పరివర్తనలకు లోనైనా కూడా మారుతున్న కాలం,
"గోవాకు ప్రత్యేక లక్షణం ఉంది. ప్రతి మార్పులో కూడా సంస్కృతికి ఉన్న ఆత్మను గోవా కోల్పోలేదు.. కాలంతో పాటు సంస్కృతి పునరుజ్జీవనకు గురైంది. ఈ ప్రయాణంలో పర్తగాలి మఠం వంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి."
"నేడు భారతదేశం అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోంది. అయోధ్యలోని రామ మందిరం పునరుద్ధరణ, కాశీ విశ్వనాథ ధామ్ ఘనమైన పునరుజ్జీవనం, ఉజ్జయినిలోని మహాకాల్ మహాలోక్ విస్తరణ..

ఈ రోజు గోవాలో నిర్వహించిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ పవిత్రమైన క్షణంలో మనస్సు గాఢమైన శాంతితో నిండిందని వ్యాఖ్యానించారు. సాధువుల సమక్షంలో కూర్చోవడం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం అని ఆయన చెప్పారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఈ మఠానికి ఉన్న శతాబ్దాల నాటి జీవశక్తిని మరింతగా పెంచుతున్నారన్న ఆయన.. ఈ వేడుకలో ఇక్కడ ప్రజల మధ్య ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇక్కడికి రాకముందు రామ మందిరం, వీర్ విఠల్ మందిరాన్ని సందర్శించే అవకాశం లభించినట్లు ప్రస్తావించారు. ఇక్కడున్న శాంతి, వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మికతను మరింతగా పెంచాయని పేర్కొన్నారు. 

“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 

ఒక సంస్థ సత్యం, సేవల ఆధారంగా నిలబడినప్పుడు అది కాలంలో వచ్చే మార్పులకు కుంగిపోవటానికి బదులుగా సమాజానికి నిలబడే శక్తిని ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మఠం ఈ రోజు ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తోందని ఆయన చెప్పారు. ఇక్కడ 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల క్రితం అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేసే అదృష్టం పొందానని, ఈ రోజు ఇక్కడ గొప్ప శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించే సద్భాగ్యం లభించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రామాయణం ఆధారంగా రూపొందించిన ఒక థీమ్ పార్క్‌ కూడా ప్రారంభమైనట్లు ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మఠంతో ముడిపడి ఉన్న కొత్త సౌకర్యాలు భవిష్యత్ తరాలకు జ్ఞానం, ప్రేరణ, ఆధ్యాత్మిక సాధనను ఇచ్చే శాశ్వత కేంద్రాలుగా మారబోతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న మ్యూజియం, ఆధునిక సాంకేతికతతో కూడిన 3డీ థియేటర్ మఠానికి ఉన్న సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే కొత్త తరానికి దీని వారసత్వాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల భాగస్వామ్యంతో 550 రోజులకు పైగా నిర్వహించిన శ్రీరామ నామ జప యజ్ఞం, రామ రథ యాత్ర సమాజంలో భక్తి- క్రమశిక్షణకు సంబంధించిన సామూహిక శక్తికి చిహ్నాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఈ సామూహిక శక్తి ఈ రోజు దేశంలోని ప్రతి మూలలో ఒక నూతన చైతన్యాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.

ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించే ఈ ఏర్పాట్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త నిర్మాణల విషయంలో ఆయన అందరినీ అభినందించారు. శతాబ్దాలుగా సమాజాన్ని ఐక్యం చేసిన ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా స్మారక నాణేలు, పోస్టల్ స్టాంప్‌లు కూడా విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.

ద్వైత వేదాంతం అనే దివ్య పునాదిని స్థాపించిన గొప్ప గురు పరంపర ఈ మఠానికి నిరంతరాయంగా శక్తినిస్తోందని ప్రధాని మోదీ ప్రముఖంగా చెప్పారు. అద్వితీయ ఆచార్య జగద్గురు శ్రీ మధ్వాచార్యులవారు అందించిన జ్ఞాన సంప్రదాయ విస్తరణే 1475లో ఈ మఠాన్ని శ్రీమద్ నారాయణ తీర్థ స్వామీజీ స్థాపించారని మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆచార్యులకు వందనం చేసిన ఆయన.. ఉడుపి, పర్తగాలి మఠాలు ఒకే ఆధ్యాత్మిక నదికి జీవధారలుగా ఉండటం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. భారత పశ్చిమ తీర సాంస్కృతిక ప్రవాహానికి మార్గనిర్దేశం చేస్తోన్న గురు, శక్తి ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే రోజున ఈ సంప్రదాయానికి ముడిపడి ఉన్న రెండు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించడం ఒక ప్రత్యేకమైన యాదృచ్చికమని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సంప్రదాయంతో అనుబంధం ఉన్న కుటుంబాలు తరతరాలుగా జీవితాలకు క్రమశిక్షణ, జ్ఞానం, కష్టపడి పనిచేయడం, శ్రేష్ఠతను పునాదిగా చేసుకున్నాయనేది గర్వకారణం అని ప్రధానమంత్రి అన్నారు. వాణిజ్యం నుంచి ఆర్థికం వరకు, విద్య నుంచి సాంకేతికత వరకు వారిలో కనిపించే నైపుణ్యం, నాయకత్వం, అంకితభావం అనేవి జీవితానికి ఉన్న లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంప్రదాయంతో ముడిపడి ఉన్న కుటుంబాలు, వ్యక్తులకు అనేక స్ఫూర్తిదాయకమైన విజయ గాథలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ విజయాలన్నింటికీ మూలాలు వినయం, విలువలు, సేవలో ఉన్నాయని అన్నారు. ఈ విలువలను పరిరక్షించడంలో ఈ మఠం మూలస్తంభంగా ఉందన్న ఆయన.. ఇది భవిష్యత్ తరాలకు శక్తినిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఈ చారిత్రక మఠానికి మరొక ముఖ్యమైన లక్షణం ఉందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శతాబ్దాలుగా సమాజంలోని ప్రతి ఒక్కరికి సహాయం చేసిన సేవా స్ఫూర్తిని గుర్తు చేసిన ఆయన..  శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజలు తమ ఇళ్లను వదిలి కొత్త ప్రదేశాలలో ఆశ్రయం వెతుక్కోవాల్సి వచ్చిందని, అప్పుడు ఈ మఠమే ఆయా ప్రజలకు అండగా నిలుస్తూ వ్యవస్థీకృతంగా సహాయం చేసిందని తెలిపారు. దీనితో పాటు కొత్త ప్రదేశాలలో ఆలయాలు, మఠాలు, ఆశ్రయాలను ఈ మఠం స్థాపించినట్లు పేర్కొన్నారు. మఠం కేవలం ధర్మాన్ని మాత్రమే కాకుండా మానవత్వం, సంస్కృతిని కూడా రక్షించిందని వ్యాఖ్యానించారు. కాలక్రమేణా సేవల పరిధి మరింతగా విస్తరించిందని అన్నారు. ఈ రోజు విద్య నుంచి  హాస్టళ్ల వరకు, వృద్ధుల సంరక్షణ నుంచి అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసే వరకు మఠం ఎల్లప్పుడూ సొంత వనరులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించిందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో నిర్మించిన హాస్టళ్లు కావొచ్చు.. ఆధునిక పాఠశాలలు కావొచ్చు లేదా కష్ట సమయాల్లో సహాయక చర్యలు కావచ్చు.. ఆధ్యాత్మికత, సేవ కలిసి నడిచినప్పుడు స్థిరత్వం, ముందుకు సాగేందుకు కావాల్సిన ప్రేరణ రెండింటినీ సమాజం పొందుతుందనే దానికి ఈ మఠం తీసుకున్న ప్రతి కార్యక్రమం నిదర్శనమని అన్నారు. 

గోవాలో ఆలయాలు- స్థానిక సంప్రదాయాలు సంక్షోభాలను ఎదుర్కోవటం, భాష- సాంస్కృతిక గుర్తింపు ఒత్తిడికి లోనైన సమయాలు ఉన్నాయన్న ప్రధాని.. ఈ పరిస్థితులు సమాజ ఆత్మను బలహీనపరచలేదని, బదులుగా మరింత బలోపేతం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రతి మార్పులో కూడా గోవా అసలైన  సాంస్కృతిక సారాన్ని కాపాడుకుందని, కాలంతో పాటు పునరుజ్జీవింపజేసుకుందన్న ఆయన.. ఇదే గోవా ప్రత్యేక లక్షణమని అన్నారు. ఈ విషయంలో పర్తగాలి మఠం వంటి సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించాయని ఆయన ప్రధానంగా చెప్పారు. 

 

"ఈ రోజు భారత్‌ ఒక అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోంది. అయోధ్యలో రామ మందిరం పునరుద్ధరణ, కాశీ విశ్వనాథ్ ధామ్ ఘనమైన పునరాభివృద్ధి, ఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ.. ఇవన్నీ దేశ జాగృతిని తెలియజేస్తున్నాయి. ఇది నూతన శక్తితో దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుద్ధరిస్తోంది" అని మోదీ వ్యాఖ్యానించారు. రామాయణ సర్క్యూట్, కృష్ణ సర్క్యూట్, గయాలో అభివృద్ధి పనులు, అపూర్వమైన కుంభమేళా నిర్వహణ వంటి కార్యక్రమాలు నేటి భారత్‌ సాంస్కృతిక గుర్తింపును కొత్త సంకల్పం, విశ్వాసంతో ఎలా ముందుకు తీసుకువెళుతుందో చూపించే ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. ఈ జాగృతే మూలాలతో భవిష్యత్ తరాలు అనుబంధంగా ఉండేందుకు ప్రేరణనిస్తాయని చెప్పారు. 

పవిత్రమైన గోవా నేలకు శతాబ్దాల నాటి భక్తి- సాధు సంప్రదాయం, సాంస్కృతిక అభ్యాసాల నిరంతర ప్రవాహంతో కూడిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేలకు సహజ సౌందర్యంతో పాటు ‘దక్షిణ కాశీ’ అనే గుర్తింపు ఉందన్న ఆయన.. దీనిని పర్తగాలి మఠం మరింతగా ధృడంగా చేసిందని అన్నారు. మఠం ప్రభావం కొంకణ్, గోవాకు మాత్రమే పరిమితం కాలేదని, దీని సంప్రదాయం దేశంలోని వివిధ ప్రాంతాలు, వారణాసి పవిత్ర భూమికి కూడా ముడిపడి ఉందని పేర్కొన్నారు. వ్యవస్థాపకులు ఆచార్య శ్రీ నారాయణ తీర్థ ఉత్తర భారతదేశంలో పర్యటించే సమయంలో వారణాసిలో ఒక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా మఠానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకెళ్లారన్నారు. వారణాసి పార్లమెంట్ సభ్యుడిగా ఈ విషయంలో గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా వారణాసిలో ఉన్న ఈ కేంద్రం సమాజానికి సేవలను అందిస్తూనే ఉందని తెలిపారు. 

ఈ పవిత్ర మఠం 550 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం కేవలం చరిత్రను వేడుకగా చేసుకోవటమే కాకుండా భవిష్యత్తు దిశను కూడా నిర్ణయిస్తున్నామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌కు మార్గం ఏకత్వమేనని ఆయన అన్నారు. సమాజం కలిసి వచ్చినప్పుడు ప్రతి ప్రాంతం, ప్రతి వర్గం ఐక్యంగా నిలబడినప్పుడు దేశం గొప్ప పురోగతిని సాధిస్తుందన్నారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం ప్రాథమిక లక్ష్యం ‘ప్రజలను అనుసంధానించడం, మనస్సులను అనుసంధానించడం, సంప్రదాయం - ఆధునికత మధ్య ఒక వారధిని నిర్మించడం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందుకే అభివృద్ధి చెందిన భారత్‌ దిశగా దేశం చేస్తోన్న ప్రయాణంలో ఈ మఠం ఒక ముఖ్యమైన ప్రేరణా కేంద్రం పాత్ర పోషిస్తుందన్నారు. 

ఎక్కడ అనురాగం ఉంటుందో అక్కడ గౌరవంగా కొన్ని అభ్యర్థనలు చేస్తానని ప్రధాని అన్నారు. ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చినందున సహజంగా మనస్సులోకి కొన్ని ఆలోచనలు వచ్చాయని.. వాటిని పంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మఠం ప్రజలకు తెలియజేయాల్సిన తొమ్మిది విజ్ఞప్తులను చెబుతున్నట్లు ఆయన ప్రధానంగా చెప్పారు. ఇవి తొమ్మిది సంకల్పాల వంటివని అన్నారు. భూమి మనందరి మాత, మఠం బోధనలు ప్రకృతిని గౌరవించమని మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణను మన కర్తవ్యంగా భావించినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ అనే కల నెరవేరుతుందని ప్రధాని పేర్కొన్నారు. నీటిని సంరక్షించడం.. నీటిని ఆదా చేయడం.. నదులను రక్షించడం అనేది మొదటి సంకల్పం అయి ఉండాలని తెలిపారు. మొక్కలు నాటడాన్ని రెండో సంకల్పంగా తెలియజేసిన ఆయన.. తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఈ దేశవ్యాప్త కార్యక్రమం ఉపందుకుంటోందన్న ఆయన.. ఈ సంస్థకు ఉన్న బలం కూడా తోడైతే దీని ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. పరిశుభ్రత అనేది మూడో సంకల్పం అయి ఉండాలన్న ఆయన.. ప్రతి వీధి, పరిసర ప్రాంతాలు, నగరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. నాలుగో సంకల్పం ‘స్వదేశీని స్వీకరించడం’ అన్న ఆయన.. నేడు దేశం ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ మంత్రంతో ముందుకు సాగుతోందన్నారు. దేశం "వోకల్ ఫర్ లోకల్" అని నినదిస్తోందన్నారు. ఈ సంకల్పాన్ని మనం కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

 

'దేశ్ దర్శన్'ను ఐదో సంకల్పంగా ప్రస్తావించిన ఆయన.. దేశంలోని వివిధ ప్రాంతాల గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని అన్నారు. ఆరో సంకల్పమైన ‘సహజ వ్యవసాయాన్ని’ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించటాన్ని ఏడో సంకల్పంగా పేర్కొన్న ఆయన..  శ్రీ అన్నం – చిరుధాన్యాలను తింటూ ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని సూచించారు. 8వ సంకల్పం ‘యోగా, క్రీడలను స్వీకరించడం’  అయి ఉండాలని పేర్కొన్నారు. పేదలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయటాన్ని 9వ సంకల్పంగా చెప్పారు.

ఈ సంకల్పాలను సామూహిక ప్రజా నిబద్ధతలుగా ఈ మఠం మార్చగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. కాలంతో పాటు బాధ్యతలను కూడా పెంచుకున్నప్పుడే సంప్రదాయం అనేది సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందన్న గొప్ప విషయాన్ని ఈ మఠానికి ఉన్న 550 సంవత్సరాల అనుభవం మనకు తెలియజేస్తోందని ఆయన అన్నారు. శతాబ్దాలుగా ఈ మఠం సమాజానికి ఇచ్చిన శక్తినిప్పుడు భవిష్యత్ భారత్‌ను తయారు చేసేందుకు మళ్లించాలని ఆయన కోరారు. 

 

ఆధునిక అభివృద్ధి మాదిరిగానే గోవాకు ఉన్న ఆధ్యాత్మిక వైభవం కూడా విలక్షణమైనదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలలో గోవా ఒకటని, పర్యాటక రంగం- ఫార్మా - సేవా రంగానికి ఈ రాష్ట్ర గణనీయంగా దోహదపడుతోందని అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విద్య, ఆరోగ్యంలో కొత్త ఘనతలను సాధించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గోవా మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నాయని తెలిపారు. రహదారులు, విమానాశ్రయాలు, రైలు అనుసంధానత పెరగటం వల్ల భక్తులు, పర్యాటకులకు కూడా ప్రయాణం సులభతరం అవుతోందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ అనే  జాతీయ దార్శనికతలో పర్యాటకం ఒక ప్రధాన భాగంగా ఉందని చెప్పారు. దీనికి గోవా అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 

“భారత్‌ ఒక నిర్ణయాత్మక దశలో ఉంది. ఇక్కడ యువత బలం, పెరుగుతున్న దేశ ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక మూలాల మీద మక్కువ అన్నీ కలిసి ఒక నూతన భారత్‌ను రూపొందిస్తున్నాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మికత, జాతీయ సేవ, అభివృద్ధి కలిసి ముందుకు సాగినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పం నెరవేరుతుందని ఆయన ప్రముఖంగా చెప్పారు. ఈ దిశగా పవిత్రమైన గోవా నేల, ఈ మఠం ఒక ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. ప్రసంగాన్ని ముగించిన ఆయన.. ఈ పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ శ్రీపాద నాయక్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

 

నేపథ్యం:

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం ‘సార్ధ పంచశతామనోత్సవ’ అంటే 550వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. దక్షిణ గోవాలోని కానకోనాలో ఉన్న మఠాన్ని సందర్శించారు.

 

ప్రధానమంత్రి శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో 77 అడుగుల ఎత్తు ఉన్న కాంస్యంతో తయారు చేసిన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం అభివృద్ధి చేసిన ‘రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను’ కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు, స్మారక నాణేన్ని కూడా విడుదల చేశారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం అనేది మొదటి గౌడ సారస్వత బ్రాహ్మణ వైష్ణవ మఠం. క్రీస్తు శకం 13వ శతాబ్దం‌లో జగద్గురు మధ్వాచార్యులవారు స్థాపించిన ద్వైత సిద్ధాంతాన్ని ఇది అనుసరిస్తుంది. ఈ మఠం ప్రధాన కేంద్రం దక్షిణ గోవాలోని ఒక చిన్న పట్టణమైన పర్తగాలిలో కుశావతి నది ఒడ్డున ఉంది.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey

Media Coverage

India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Jagadguru Basaveshwara on Basava Jayanthi
April 20, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid homage to Jagadguru Basaveshwara on the occasion of Basava Jayanthi.

Shri Modi said that on the special occasion of Basava Jayanthi, he is paying homage to Jagadguru Basaveshwara and his enduring teachings. He noted that Basaveshwara’s vision of a just society, along with his unwavering efforts to empower the people, will always motivate us.

The Prime Minister posted on X;

“On the special occasion of Basava Jayanthi, paying homage to Jagadguru Basaveshwara and his enduring teachings. His vision of a just society, along with his unwavering efforts to empower the people, will always motivate us.”