స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ ఆత్మనిర్భర్‌గా మారే దిశలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనున్న హరిత రవాణా కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో ప్రారంభించారు. గణనాథుని పండుగ వాతావరణం మధ్య 'మేడిన్ ఇండియా' ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయంగా ప్రధాని పేర్కొన్నారు. "భారత్‌తో తయారీ, ప్రపంచం కోసం తయారీ" అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోజు నుంచి 100 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. దేశంలో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ తయారీని కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్, జపాన్ మధ్య స్నేహానికి ఈరోజు కొత్త కోణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భారత ప్రజలందరితో పాటు జపాన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారత్ విజయగాథకు బీజాలు 12-13 సంవత్సరాల కిందటే పడిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని.. 2012లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మారుతీ సుజుకీకి హన్సల్‌పూర్‌లో భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఆ సమయంలో కూడా ఆత్మనిర్భర్ భారత్, భారత్‌లో తయారీ అనే దార్శనికతలు ఉన్నాయని ప్రధానంగా చెప్పారు. ఆ కాలంలో పడిన తొలి అడుగులే ఇప్పుడు దేశానికి ఉన్న లక్ష్యాలను నెరవేర్చటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

దివంగత శ్రీ ఒసాము సుజుకీతో తనకున్న జ్ఞాపకాలను మోదీ గుర్తు చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించిందన్నారు. భారత్‌లోని మారుతీ సుజుకీ విషయంలో శ్రీ ఒసాము సుజుకీ కలిగి ఉన్న ప్రణాళికలు విస్తృత స్థాయిలో అమలవటం పట్ల ప్రధానమంత్రి మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
"భారత్ ప్రజాస్వామ్య శక్తినీ, జనాభా విషయంలో సానుకూలతనూ కలిగి ఉంది. దేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా ఉంది. ఇది అన్ని పక్షాలకు లాభం చేకూర్చే పరిస్థితిని సృష్టిస్తుంది" అని మోదీ ప్రధానంగా చెప్పారు. ‘సుజుకీ జపాన్’ కంపెనీ భారత్‌లో వాహనాలను తయారు చేస్తోందని, వీటిని తిరిగి జపాన్‌కు ఎగుమతి చేస్తోందని ప్రధానంగా పేర్కొన్నారు. ఇది భారత్-జపాన్ సంబంధాల శక్తిని మాత్రమే కాకుండా ప్రపంచ కంపెనీలకు భారత్ విషయంలో పెరుగుతోన్న నమ్మకాన్ని కూడా తెలియజేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. మారుతీ సుజుకీ వంటి కంపెనీలు ‘భారత్‌లో తయారీ’కి ప్రచారకర్తలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. వరుసగా నాలుగు సంవత్సరాలుగా మారుతీ సుజుకీ భారతదేశపు అతిపెద్ద కార్ల ఎగుమతిదారుగా ఉందని అన్నారు. నేటి నుంచి ఈవీ ఎగుమతులు కూడా అదే స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాలలో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు గర్వంగా ‘మేడిన్ ఇండియా’ అనే లేబుల్‌ను కలిగి ఉంటాయని అన్నారు.
ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం బ్యాటరీ అని చెబుతూ, కొన్ని సంవత్సరాల కింద వరకు భారత్ బ్యాటరీలను పూర్తిగా దిగుమతి చేసుకునేదని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని బలోపేతం చేసేందుకు భారత్‌లో దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని అన్నారు. ఈ దార్శనికతతోనే 2017లో టీడీఎస్‌జీ బ్యాటరీ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. టీడీఎస్‌జీ తీసుకున్న కొత్త కార్యక్రమం కింద మూడు జపాన్ కంపెనీలు సంయుక్తంగా భారత్‌లో మొదటిసారిగా బ్యాటరీలను తయారు చేస్తాయని ప్రకటించారు. బ్యాటరీ సెల్ ఎలక్ట్రోడ్‌లు కూడా దేశంలోనే స్థానికంగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఈ స్థానికీకరణ దేశ స్వావలంబనకు శక్తినిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన రంగ వృద్ధిని ఇది వేగవంతం చేస్తుందని అన్నారు. ఈ చరిత్రాత్మక ప్రారంభోత్సవానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపారు.

కొన్ని సంవత్సరాల కింద వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కేవలం ప్రత్యామ్నాయంగా చూసేవారని మోదీ అన్నారు. పలు రకాల సవాళ్లకు ఖచ్చితమైన పరిష్కారాలను ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధానంగా పేర్కొన్నారు. గత సంవత్సరంలో చేపట్టిన సింగపూర్ పర్యటన సందర్భంగా పాత వాహనాలు, అంబులెన్సులను హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని తాను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని సవాలుగా స్వీకరించి కేవలం ఆరు నెలల్లోనే పనిచేసే ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసినందుకు మారుతీ సుజుకీని ఆయన ప్రశంసించారు. హైబ్రిడ్ అంబులెన్స్ ప్రోటోటైప్‌ను తాను వ్యక్తిగతంగా పరిశీలించినట్లు తెలిపిన ఆయన.. ఈ హైబ్రిడ్ అంబులెన్సులు పీఎం ఈ-డ్రైవ్ పథకానికి సరిపోతాయని అన్నారు. ఈ రూ. 11,000 కోట్ల విలువైన పథకం కింద ఈ-అంబులెన్సుల కోసం కోసం ప్రత్యేక బడ్జెట్టు ఉన్నట్లు తెలిపారు. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, పాత వాహనాలను మార్చేందుకు ఆచరణీయమైన పరిష్కారాన్ని అందిస్తాయని ప్రధానంగా పేర్కొన్నారు.
స్వచ్ఛ ఇంధనం, స్వచ్ఛ రవాణా అనేవి దేశ భవిష్యత్తును తెలియజేస్తాయని ప్రధానంగా చెప్పారు. ఈ విషయంలో జరుగుతున్న పనుల వల్ల భారత్ స్వచ్ఛ ఇంధనం, స్వచ్ఛ రవాణా విషయంలో నమ్మకమైన కేంద్రంగా తయారవుతోందని అన్నారు.
ప్రపంచ సరఫరా రవాణా వ్యవస్థ అంతరాయాలతో సతమతమౌతున్న తరుణంలో గత దశాబ్దం కాలంగా భారత్ తీసుకున్న విధాన నిర్ణయాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014లో దేశానికి సేవ చేసే అవకాశం లభించినప్పటి నుంచి ఈ పరివర్తనకు సన్నాహాలు మొదలయ్యాయని తెలిపారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని తీసుకురావటం.. ప్రపంచ, దేశీయ తయారీదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. తయారీ రంగాన్ని సమర్థవంతంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండేలా తీర్చిదిద్దేందుకు భారత్ కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. ఈ దార్శనికతకు అనుగుణంగానే పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తక్షణం ఉపయోగించుకునే వీలున్న (ప్లగ్ అండ్ ప్లే) మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద అనేక రంగాల్లో తయారీదారులకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాన సంస్కరణలను తీసుకువచ్చి, పెట్టుబడిదారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ సంస్కరణలు భారత తయారీ రంగంలో పెట్టుబడి పెట్టడాన్ని ఇన్వెస్టర్లకు సులభతరం చేశాయని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాల ఫలితాలు కళ్లకు కనిపిస్తున్నాయంటూ, ఈ పదేళ్లలోనే భారత్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సుమారు 500 శాతం మేర పెరిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2014తో పోలిస్తే 2,700 శాతం మేర పెరిగిందనీ, రక్షణ రంగంలో ఉత్పత్తి కూడా గత దశాబ్ద కాలంలో 200 శాతాని కన్నా పెరిగిందనీ ప్రధానమంత్రి చెప్పారు. ఈ విజయం దేశమంతటా రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తోందని, సంస్కరణలతో పాటు పెట్టుబడి విషయంలో సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సంబంధించి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి పూర్తి దేశానికి మేలు జరిగిందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వ్యాపార సౌలభ్యాన్ని పెంచే సంస్కరణలను, అభివృద్ధికి సహకరించే విధానాలను రూపొందించాల్సిందిగా రాష్ట్రాలకు శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.
‘‘భారత్ ఇక్కడితోనే ఆగిపోదు... ఇండియా చక్కగా రాణించిన రంగాల్లో మరింత ఎక్కువ ప్రావీణ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ ప్రగతికి ఊతంగా నిలిచేందుకే స్వదేశీ తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. భారత్ ఇక తన దృష్టిని భవిష్యత్తు అవసరాలను తీర్చగల పరిశ్రమలపై కేంద్రీకరిస్తుందని ఆయన అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ జోరందుకుంటున్న తీరును ఆయన వివరిస్తూ దేశవ్యాప్తంగా ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారనీ, దేశంలో సెమీకండక్టర్ తయారీని మరింత ముందుకు తీసుకుపోతామనీ వివరించారు.

కీలక ఖనిజాల కొరత కారణంగా వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ రంగంలో జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్’ను ప్రారంభించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఈ మిషన్‌లో భాగంగా, కీలక ఖనిజాల్ని గుర్తించడానికి 1200 కన్నా ఎక్కువ అన్వేషణ కార్యక్రమాలను దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
వచ్చే వారంలో తాను జపాన్ వెళ్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. భారత్- జపాన్ సంబంధాలు దౌత్యబంధాలకు మించినవి. సంస్కృతితో పాటు పరస్పర నమ్మకం బలమైన పునాదిగా నిలిచి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒక దేశం అభివృద్ధితోనే రెండో దేశం అభివృద్ధి కలిసి ఉందని రెండు దేశాలూ భావిస్తున్నట్లు తెలిపారు. మారుతీ సుజుకీతో మొదలైన ఈ ప్రయాణం ప్రస్తుతం బులెట్ ట్రైన్ వేగాన్ని అందుకొందని శ్రీ మోదీ చెబుతూ… భారత్-జపాన్ భాగస్వామ్యానికున్న పారిశ్రామిక సత్తాను వినియోగించుకొనే ప్రధాన కార్యక్రమం గుజరాత్‌లో మొదలైందన్నారు. వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సును 20 ఏళ్ల కిందట ప్రారంభించినప్పుడు, జపాన్ ఒక కీలక భాగస్తురాలిగా ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గుజరాతీయులు జపాన్ ప్రతినిధులపై చూపిన ఆదరణ అపూర్వమని ఆయన అన్నారు. పరిశ్రమకు సంబంధించిన నియమ నిబంధనలను సులభంగా అర్థం చేసుకొనేందుకు జాపనీస్ భాషలో ప్రచురించినట్లు ఆయన ప్రస్తావించారు. జపాన్ నుంచి వచ్చిన అతిథుల కోసం వారి దేశపు వంటకాలనే ఏర్పాటు చేశారన్నారు. జపాన్ దేశస్థులకు గోల్ఫ్ అంటే ఉన్న మక్కువను దృష్టిలో పెట్టుకొని, ఏడెనిమిది గోల్ఫ్ మైదానాలను రూపొందించారని కూడా ఆయన చెప్పారు. భారత్‌లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం జాపనీస్ భాషలో విద్యాబోధనకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయని కూడా శ్రీ మోదీ తెలిపారు.
‘‘భారత్ ప్రస్తుత ప్రయత్నాలు భారత్, జపాన్ ప్రజల మధ్య పరస్పర సంబంధాలను బలపరుస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధిలోను, మానవ వనరుల పరంగాను ప్రస్తుతం రెండు దేశాలూ తమ తమ అవసరాలను నెరవేర్చుకొనే స్థితిలో ఉన్నాయి’’ అని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా, ఇరు దేశాల యువజనుల రాకపోకలతో ముడిపడ్డ కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా మారుతీ సుజుకీ వంటి కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

రాబోయే కాలంలో అన్ని రంగాల్లో పురోగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేందుకు ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు పునాది వేస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో జపాన్ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని తాను నమ్ముతున్నానని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ ఒనో కీచీ, సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
నేపథ్యం
అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్ సుజుకీ మోటారు ప్లాంటులో రెండు చారిత్రక ఘట్టాలకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ రెండు ఘట్టాలూ ‘భారత్‌లో తయారీ’, ‘స్వావ లంబన భారత్’ విషయంలో ప్రధానమంత్రి తన నిబద్ధతను సూచిస్తూనే కాలుష్యానికి చోటివ్వని రవాణా సాధనాల తయారీలో ప్రపంచ కూడలిగా భారత్ ఎదుగుతోందని చాటుతున్నాయి.

‘భారత్‌లో తయారీ’ విజయానికి ఒక ప్రధాన ఉదాహరణగా ‘ఈ-విటారా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది సుజుకీ తీసుకువచ్చిన బ్యాటరీతో నడిచే మొదటి విద్యుత్తు వాహనం (బీఈవీ). భారత్‌లో తయారైన బీఈవీలను యూరోప్, జపాన్‌లతో పాటు వంద కన్నా ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ చారిత్రక మలుపుతో, భారత్ ఇక విద్యుత్తు వాహనాలకు సుజుకీ అంతర్జాతీయ తయారీ కూడలిగా మారినట్లయింది.
గుజరాత్‌లోని టీడీఎస్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంటులో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా భారత బ్యాటరీ అనుబంధ విస్తారిత వ్యవస్థ తరువాతి దశను కూడా ప్రధానమంత్రి ప్రారంభించినట్లయింది. ఈ ప్లాంటు తోషిబా, డెన్సో, సుజుకీల సంయుక్త సంస్థ. ఈ ప్లాంటు దేశీయ తయారీ స్థాయితో పాటు స్వచ్ఛ ఇంధన నవకల్పనను కూడా పెంపొందించనుంది. ఈ ప్లాంటు ప్రారంభ ఘట్టంతో బ్యాటరీల్లో 80 శాతానికి పైగా భారత్‌లోనే తయారు కానున్నాయి.
Click here to read full text speech
Make in India, Make for the World. pic.twitter.com/KZsJB9qrKt
— PMO India (@PMOIndia) August 26, 2025
India has the power of democracy, the advantage of demography and a very large pool of skilled workforce, making it a win-win situation for every partner. pic.twitter.com/TggFpUSLlR
— PMO India (@PMOIndia) August 26, 2025
The world will drive EVs that say… Made in India! pic.twitter.com/HFDCW83sqV
— PMO India (@PMOIndia) August 26, 2025
The Make in India initiative has created a favourable environment for both global and domestic manufacturers. pic.twitter.com/1RjY3VYjVo
— PMO India (@PMOIndia) August 26, 2025
In the coming times, the focus will be on futuristic industries and India is taking off in the semiconductor sector. pic.twitter.com/oVQcksqurI
— PMO India (@PMOIndia) August 26, 2025







