తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పవిత్ర శ్రావణమాస ప్రాధాన్యాన్ని, చారిత్రక బృహదీశ్వరాలయం నిర్మాణ సహస్రాబ్ది సందర్భాన్ని గుర్తుచేస్తూ- ఇలాంటి విశిష్ఠ సమయాన బృహదీశ్వరుని పాదార్చన తనకు దక్కిన అదృష్టమని ఆయన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత నిరంతర పురోగమనం, 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం చరిత్రాత్మక బృహదీశ్వరాలయంలో ప్రార్థిస్తూ, ఆదిదేవుని ఆశీస్సులు అందరికీ అందాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
వెయ్యేళ్ల కిందటే మానవాళి సంక్షేమం-సౌభాగ్యం కోసం మన పూర్వికులు రూపొందించిన చారిత్రక ప్రణాళికపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రదర్శనను ప్రజలంతా చూడాలని శ్రీ మోదీ కోరారు. చిన్మయ మిషన్ రూపొందించిన తమిళ గీత గుచ్ఛం ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. దేశ వారసత్వ పరిరక్షణ సంకల్పానికి ఇది సరికొత్త శక్తినిస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, ఈ కృషిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
శ్రీలంక, మాల్దీవ్స్ సహా ఆగ్నేయాసియా వరకూ చోళ రాజులు దౌత్య-వాణిజ్య సంబంధాలను విస్తరించారని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మాల్దీవ్స్ నుంచి నిన్న తిరిగివచ్చిన తాను, ఇవాళ తమిళనాడులో యాదృచ్ఛికంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడాన్ని ఆయన గుర్తుచేశారు.
శివధ్యాన నిమగ్నులైనవారు ఆదిదేవుని తరహాలో నిత్యమై నిలిచిపోతారని ఇతిహాసాలు పేర్కొనడాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. మహదేవునిపై అచంచల భక్తిభావనలో భారతదేశ చోళ వారసత్వం అజరామరమైందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుని వారసత్వం భారతదేశ గౌరవ ప్రతిష్ఠలకు చిహ్నం” అని ఉద్ఘాటించారు. చోళ సామ్రాజ్య చరిత్ర-వారసత్వాలను భారత వాస్తవిక సామర్థ్యానికి ప్రతీకలుగా అభివర్ణించారు. వికసిత భారత్ సంకల్ప సాకారంపై జాతి ఆకాంక్షకు ఇవి స్ఫూర్తినిస్తాయన్నారు. రాజేంద్ర చోళుడికి దేశం నివాళి అర్పిస్తున్నదని, ఆయన నిత్యసజీవ వారసత్వానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. ఇటీవలి ఆడి తిరువాతిరై వేడుకను ప్రస్తావిస్తూ- నేటి ఈ విశిష్ట కార్యక్రమంతో అది సమాప్తం అవుతున్నదని గుర్తుచేస్తూ, దీనిలో పాలుపంచుకున్న అందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.

“చోళుల కాలాన్ని భారత స్వర్ణయుగాలలో ఒకటిగా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇది సైనిక బలం వైశిష్ట్యాన్ని చాటిచెప్పిన విభిన్న శకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలను చోళ సామ్రాజ్యం మరింత వర్ధిల్లేలా చేసినా, ప్రపంచ చరిత్రలో ఇది విస్మరణకు గురైందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై చర్చలో బ్రిటన్ ‘మాగ్నా కార్టా’ గురించి చరిత్రకారులు ప్రస్తావిస్తుంటారని, దీనికి శతాబ్దాల కిందటే “కుడవోలై అమైప్పు” వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల విధానాలను చోళ సామ్రాజ్యం అమలు చేసిందని పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో జల నిర్వహణ-పర్యావరణ పరిరక్షణ చుట్టూ చర్చలు కేంద్రీకృతం కావడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. అయితే, మన పూర్వికులు ఈ సమస్యల పరిష్కార ప్రాముఖ్యాన్ని ఆనాడే అర్థం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. అనేక విజయాలతో బంగారం, వెండి లేదా పశుసంపద పోగుచేసినవారుగా చాలామంది రాజులు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అయితే, పవిత్ర గంగాజలాన్ని దక్షిణాదికి తెచ్చిన భగీరథుడుగా రాజేంద్ర చోళుడు ప్రసిద్ధి చెందాడని ఆయన ఉటంకించారు. ఉత్తర భారతం నుంచి గంగను తెచ్చిన ఆ రాజు ఘనతను గుర్తుచేస్తూ- “గంగా జలమయం జయస్తంభం” అనే పదబంధాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ నీటిని చోళ గంగా సరస్సులోకి మళ్లించారని, దీన్ని నేడు ‘పొన్నేరి సరస్సు’గా పిలుస్తున్నామని పేర్కొన్నారు.
రాజేంద్ర చోళుడు నిర్మించిన గంగైకొండ చోళపురం ఆలయ వైశిష్ట్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఇదొక వాస్తుశిల్ప అద్భుతంగా నేటికీ ప్రపంచ ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు. కావేరీ మాత ప్రవహించే నేలపై గంగామాతకు లభించిన గౌరవం కూడా చోళ సామ్రాజ్య వారసత్వమేనని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ కాశీ నుంచి తమిళనాడుకు గంగాజలాన్ని మరోసారి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనితో ఆలయ ప్రదేశంలో సంప్రదాయక కార్యక్రమం సమాప్తం కావడంపై హర్షం వెలిబుచ్చారు. కాశీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా గంగామాతతో తనది లోతైన భావోద్వేగ బంధమని ప్రధానమంత్రి చెప్పారు. చోళ రాజులతో ముడిపడిన కృషి, కార్యక్రమాలు పవిత్ర కార్యాలకు ప్రతీకలని, “ఒకే భారత్-శ్రేష్ఠ భారత్” సూత్రానికి చిహ్నమేగాక, దానికొక సరికొత్త, చిరస్మరణీయ ఉత్తేజమిచ్చాయని ఆయన వివరించారు.

“చోళ చక్రవర్తులు ఈ దేశాన్ని సాంస్కృతిక ఐక్యత సూత్రంతో పెనవేశారు. నాటి చోళ దృక్పథాన్ని మా ప్రభుత్వం నేడు కొనసాగిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి కార్యక్రమాలు శతాబ్దాల నాటి ఈ ఐక్యత బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. తమిళనాడులోని గంగైకొండ చోళపురం వంటి ప్రాచీన ఆలయాలను భారత పురావస్తు అధ్యయన సంస్థ (ఏఎస్‌ఐ) ద్వారా ప్రభుత్వం సంరక్షిస్తున్నదని శ్రీ మోదీ తెలిపారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభం సందర్భంగా శైవాధీన మఠం సాధువులు ఆధ్యాత్మికంగా వేడుకను నడిపించి, తమిళ సంస్కృతిలో అంతర్భాగమైన పవిత్ర సెంగోల్‌ను ఆ సౌధంలో సగౌరవంగా ప్రతిష్ఠించారని గుర్తుచేశారు. ఆ ఘట్టం స్మరణకు వచ్చినపుడల్లా అనుక్షణం తానెంతో గర్విస్తానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చిదంబరం నటరాజ ఆలయ దీక్షితులను కలుసుకోవడాన్ని ప్రస్తావిస్తూ- శివుడు నటరాజుగా పూజలందుకునే దివ్యాలలయ పవిత్ర నైవేద్యాన్ని తనకు అందజేశారని శ్రీ మోదీ భక్తి పురస్సరంగా ప్రకటించారు. భారత తత్త్వశాస్త్ర, విజ్ఞాన పునాదులకు ఈ నటరాజ రూపం ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నటరాజు ఆనంద తాండవ విగ్రహం రెండేళ్ల (2023) కిందటి జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకులు సమావేశమైన ఢిల్లీలోని భారత్ మంటపానికి వినూత్న శోభనిచ్చిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
“భారత సాంస్కృతిక ప్రతిష్ఠకు రూపమివ్వడంలో శైవ సంప్రదాయం కీలకపాత్ర పోషించింది. ఆ వారసత్వాన్ని సమున్నత స్థాయికి చేర్చింది చోళ చక్రవర్తులే. ఈ సజీవ సంప్రదాయం నేటికీ వర్ధిల్లే ప్రధాన కేంద్రాల్లో తమిళనాడు ఒకటి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పూజ్యనీయ నయనార్ సాధువుల వారసత్వం, భక్తి సాహిత్యం, తమిళ సాహితీ రచనలు, అధీనాల ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సామాజిక-ఆధ్యాత్మిక రంగాల్లో నవశకానికి ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచం నేడు అస్థిరత, హింస, పర్యావరణ సంక్షోభం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఇలాంటి సవాళ్లకు శైవ తర్కం అర్థవంతమైన పరిష్కారాలను సూచించగలదని స్పష్టం చేశారు. ‘అణ్బే శివం’ (ప్రేమే దైవం) పేరిట ప్రసిద్ధ తమిళ సాహితీవేత్త తిరుమూలర్ ప్రబోధించిన ప్రేమతత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ప్రపంచం ఈ ధోరణిని అనుసరిస్తే, అనేక సంక్షోభాలు వాటికవే సమసిపోగలవని చెప్పారు. “ఒకే ప్రపంచం-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు' నినాదంతో ఈ తత్త్వాన్ని భారత్ విస్తరింపజేస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.

“ఇటు వికాసం-అటు వారసత్వం’ అన్నది మన దేశం అనుసరిస్తున్న తారకమంత్రం. తదనుగుణంగా తన చరిత్రపై నేటి నవ భారత్ గర్విస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు. ఈ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ దిశగా గడచిన దశాబ్దం నుంచీ దేశం ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నదని వ్యాఖ్యానించారు. అపహరణకు గురైన, విదేశాల్లో విక్రయించబడిన ప్రాచీన విగ్రహాలు, కళాఖండాలను తిరిగి తేవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా 2014 నుంచి వివిధ దేశాల్లోగల 600కుపైగా పురాతన కళాఖండాలను స్వదేశానికి చేర్చామని గుర్తుచేశారు. వీటిలో 36 ప్రత్యేకించి తమిళనాడుకు చెందినవేనని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “నటరాజ, లింగోద్భవ, దక్షిణామూర్తి, అర్థనారీశ్వర, నందికేశ్వర, ఉమా పరమేశ్వరి, పార్వతి, శైవ తత్త్వవేత్త సంబందర్” సహా అమూల్య వారసత్వ సంపద తమిళ నేలను ప్రకాశింపజేసిందని ఆయన వివరించారు.
భారతీయ వారసత్వం, శైవతత్త్వ ప్రభావం ఇకపై భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశంగా భారత్ అవతరించినపుడు వ్యోమనౌక దిగిన “శివశక్తి”గా నామకరణం చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ఘట్టం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
“చోళుల కాలంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న భారత ఆర్థిక-సైనిక శక్తి నేటికీ మనకు స్ఫూర్తిదాయకం. రాజరాజ చోళుడు శక్తిమంతమైన నావికాదళాన్ని రూపొందించగా రాజేంద్ర చోళుడు దాన్ని మరింత బలోపేతం చేశాడు” అని ప్రధానమంత్రి జ్ఞప్తికి తెచ్చారు. చోళుల కాలంలో స్థానిక పాలన వ్యవస్థల సాధికారత, శక్తిమంతమైన ఆదాయార్జన విధానం వంటి కీలక పరిపాలన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. వాణిజ్య ప్రగతి, సముద్ర మార్గాల వినియోగం, కళాసంస్కృతులకు ప్రోత్సాహం తదితరాల ద్వారా భారత్ నలుదిశలా వేగంగా పురోగమించిందని తెలిపారు. నవ భారతాన్ని తీర్చిదిద్దడంలో నాటి ఘనతర చోళ సామ్రాజ్య విధానం మనకు ప్రాచీన ప్రణాళికగా ఉపకరిస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలంటే ఐక్యతకు భారత్ ప్రాధాన్యమివ్వాలి. నావికాదళం సహా రక్షణ బలగాలను మరింత బలోపేతం చేయాలి. కొత్త అవకాశాలను అన్వేషించడంతోపాటు తనదైన మూల విలువలను పరిరక్షించుకోవాలని శ్రీ మోదీ అన్నారు. ఈ దృక్కోణంతోనే దేశం నేడు ముందడుగు వేస్తున్నదని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతర్గత భద్రతే నేటి భారత్ అగ్ర ప్రాథమ్యమని వివరిస్తూ- ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ మేరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే ఏ ముప్పునైనా భారత్ దృఢంగా, నిర్ణయాత్మకంగా తిప్పికొట్టగలదనే వాస్తవం నేడు ప్రపంచం కళ్లకు కట్టిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు, దేశ శత్రువులకు ఈ నేల సురక్షిత ప్రదేశం కాబోదని ఈ ఆపరేషన్ విస్పష్ట హెచ్చరిక పంపిందని చెప్పారు. అంతేకాకుండా దేశ ప్రజలలో సరికొత్త విశ్వాసం నింపిందని, దీనికి యావత్ ప్రపంచం సాక్షిగా నిలిచిందన్నారు. గంగైకొండ చోళపురం ఆలయ నిర్మాణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- రాజేంద్ర చోళుడి వారసత్వాన్ని ప్రస్ఫుటం చేసే ఆలోచనాత్మక దృష్టాంతాన్ని ఉదాహరించారు. ఈ మేరకు తంజావూరులో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయంతో పోలిస్తే ఈ ఆలయ గోపురం ఎత్తును కాస్త తగ్గించి తన తండ్రిపై అత్యున్నత గౌరవాన్ని రాజేంద్ర చోళుడు చాటుకున్నాడని వివరించారు. తండ్రికి దీటుగా తానూ ఎన్నో విజయాలు సాధించినా, రాజేంద్ర చోళుడు వినయం ప్రదర్శించాడని గుర్తుచేశారు. “నేటి నవ భారత్ ఇదే స్ఫూర్తితో ఒకవైపు శక్తిమంతం అవుతూనే, మరోవైపు ప్రపంచ సంక్షేమం, ఐక్యత తదితర విలువలకు నిరంతర ప్రాధాన్యమిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారత వారసత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంపై ప్రధానమంత్రి దృఢ సంకల్పం ప్రకటించారు. ఇందులో భాగంగా తమిళనాడులో రాజరాజ చోళుడితోపాటు పాలన దక్షుడుగా పేరొందిన ఆయన కుమారుడు ‘ఒకటో రాజేంద్ర చోళుడి’ విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ విగ్రహాలు భారత చారిత్రక చైతన్యానికి ఆధునిక మూలధారాలు కాగలవని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం వర్ధంతి అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపించడానికి చోళరాజులు, డాక్టర్ కలాం తరహా యువత లక్షలాదిగా ముందుకు రావడం అవశ్యమని వ్యాఖ్యానించారు. అటువంటి అంకితభావం, శక్తిమంతమైన యువత 140 కోట్ల మంది భారతీయుల కలలను నెరవేర్చగలరని స్పష్టం చేశారు. మనమంతా భుజం కలిపి, ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ సంకల్ప సాకారానికి కృషి చేద్దామని పిలుపునిస్తూ- ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రసిద్ధ మఠాల సాధువులు, తమిళనాడు గవర్నర్ శ్రీ ఎన్.రవి, కేంద్ర మంత్రి డాక్టర్ మురుగన్, ఇతర ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
నేపథ్యం

గంగైకొండ చోళపురం ఆలయంలో ఆడి తిరువాతిరై వేడుకల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సుప్రసిద్ధ భారతీయ చక్రవర్తులలో ఒకరైన ఒకటో రాజేంద్ర చోళుని గౌరవార్థం స్మారక నాణాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు.
ఒకటో రాజేంద్ర చోళుని ఐతిహాసిక ఆగ్నేయాసియా సముద్ర యాత్ర సహస్రాబ్ది (వెయ్యేళ్లు) సహా వాస్తుశిల్ప అద్భుతానికి ప్రతీకగా ప్రపంచ ప్రశంసలు అందుకున్న గంగైకొండ చోళపురం ఆలయ శంకుస్థాపన ఘట్టాన్ని ఈ ప్రత్యేక వేడుకలు ప్రతిబింబించాయి.

భారత చరిత్రలో అత్యంత శక్తిమంతుడైన, దార్శనిక పాలకులలో ఒకటో రాజేంద్ర చోళుడు (1014–1044 సీఈ) ఒకరు. ఆ చక్రవర్తి నాయకత్వంలో దక్షిణ-ఆగ్నేయాసియా అంతటా చోళ సామ్రాజ్య ప్రభావం విస్తరించింది. తన విజయ యాత్రల తర్వాత గంగైకొండ చోళపురం రాజధానిగా తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అక్కడ ఆయన నిర్మించిన ఆలయం 250 ఏళ్లకుపైగా కాలం నుంచి శైవభక్తి, అద్భుత వాస్తుశిల్పం, పాలనా నైపుణ్యానికి ప్రతీకగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది. సునిశిత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు, చోళ కాంస్య విగ్రహాలు, ప్రాచీన శాసనాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

చోళులు ఆదరించిన సుసంపన్న శైవభక్తి తత్త్వానికి ఆడి తిరువాతిరై వేడుక ఒక చిహ్నంగా నిలుస్తుంది. తమిళ శైవ సాధువులైన 63 మంది నయనార్‌ల అజరామర శైవభక్తి సంప్రదాయాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా, రాజేంద్ర చోళుని జన్మ నక్షత్రం తిరువాతిరై (ఆర్ద్ర) జూలై 23న ప్రారంభం కాగా, ఈ ఏడాది వేడుకలకు ఇదొక విశిష్ట సందర్భంగా నిలిచింది.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Rajaraja Chola and Rajendra Chola symbolise India's identity and pride.
— PMO India (@PMOIndia) July 27, 2025
The history and legacy of the Chola Empire reflect the strength and true potential of our great nation. pic.twitter.com/3YrRyQJxlj
The Chola era was one of the golden periods of Indian history.
— PMO India (@PMOIndia) July 27, 2025
This period is distinguished by its formidable military strength. pic.twitter.com/RIMsri522c
Rajendra Chola established the Gangaikonda Cholapuram Temple.
— PMO India (@PMOIndia) July 27, 2025
Even today, this temple stands as an architectural wonder admired across the world. pic.twitter.com/CswBrMsYUp
The Chola emperors had woven India into a thread of cultural unity.
— PMO India (@PMOIndia) July 27, 2025
Today, our government is carrying forward the same vision of the Chola era.
Through initiatives like the Kashi-Tamil Sangamam and the Saurashtra-Tamil Sangamam, we are strengthening these centuries-old bonds of… pic.twitter.com/5kFCZ02WZ3
When the new Parliament building was inaugurated, the saints from our Shaivite Adheenams led the ceremony spiritually.
— PMO India (@PMOIndia) July 27, 2025
The sacred Sengol, deeply rooted in Tamil culture, has been ceremoniously installed in the new Parliament. pic.twitter.com/mWhBB8O2Qw
Our Shaivite tradition has played a vital role in shaping India's cultural identity.
— PMO India (@PMOIndia) July 27, 2025
The Chola emperors were key architects of this legacy. Even today, Tamil Nadu remains one of the most significant centres where this living tradition continues to thrive. pic.twitter.com/jjFmDinKTs
The economic and military heights India reached during the Chola era continue to inspire us even today.
— PMO India (@PMOIndia) July 27, 2025
Rajaraja Chola built a powerful navy, which Rajendra Chola further strengthened. pic.twitter.com/acdUWLHTdO


