చారిత్రక పర్యటన, శాశ్వత భాగస్వామ్యం

అధికారిక పర్యటన నిమిత్తం రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్‌కు వెళ్లిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులైడ్స్ స్వాగతం పలికారు. సైప్రస్‌లో ప్రధాని జూన్ 15,16 లలో పర్యటిస్తారు. గడచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్‌‌ను సందర్శించడం ఇదే మొదటి సారి.  ఈ చరిత్రాత్మక మైలు రాయి.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దృఢమైన స్నేహాన్ని సూచిస్తుంది. ఈ పర్యటన ఉమ్మడి చరిత్రను మాత్రమే కాకుండా.. రెండు దేశాల వ్యూహాత్మక దృక్పథం, పరస్పర నమ్మకం, గౌరవంతో కూడిన భాగస్వామ్య భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తుంది
.
సైప్రస్, భారత్ మధ్య పెరుగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధాన దృష్టి సారిస్తూ, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాల నాయకులు విస్తృతంగా చర్చించారు. ఆర్థిక, సాంకేతిక, ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని వారు స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న శక్తిమంతమైన స్నేహబంధాన్ని ప్రతిబింబిస్తుంది.  

విలువలు, ఆసక్తులు, అంతర్జాతీయ దృక్పథం, ఆలోచనలపై పెరుగుతున్న సమన్వయాన్ని గుర్తిస్తూ.. ఈ భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు పక్షాలు దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సంక్షేమం, స్థిరత్వానికి దోహదపడే నమ్మకమైన, ఆవశ్యక భాగస్వామ్యులుగా సైప్రస్, భారత్ తమ సహకారాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నాయి.

దిగువన పేర్కొన్న ఉమ్మడి ప్రకటనకు వారు అంగీకరించారు:


ఉమ్మడి విలువలు, అంతర్జాతీయ లక్ష్యాలు

శాంతి, ప్రజాస్వామ్యం, న్యాయం, ప్రభావవంతమైన బహుపాక్షికత్వం, సుస్థిరమైన అభివృద్ధి విషయంలో ఇరు దేశాల నాయకులు తమ ఉమ్మడి అంకితభావాన్ని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా క్రమబద్ధమైన నియమ ఆధారిత అంతర్జాతీయ శాంతికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. నౌకా స్వేచ్ఛ, సముద్ర హక్కుల్లో సార్వభౌమత్వానికి సంబంధించి సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి సమావేశం (యూఎన్‌సీఎల్‌వోఎస్)కు చర్చల్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు.

అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ఇరువురు నాయకులు తమ మద్దతును ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధంతో సహా అంతర్జాతీయ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక వ్యవస్థ ప్రాధాన్యంపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. అణ్వాయుధాలను సరఫరా చేసే దేశాల సమూహంలో భారత్‌కున్న విలువను గుర్తించారు.

ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ సహా అంతర్జాతీయ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని నాయకులు వ్యక్తం చేశారు. అలాగే 2024 అపియా కామన్వెల్త్ ఓషన్ డిక్లరేషన్ ను అమలు చేసేందుకు కలసి పనిచేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందాన్నిఅంతర్జాతీయ స్థిరత్వానికి సముద్ర కార్యకలాపాలు మూలాధారంగా పేర్కొన్నాయి. ఇదే అంశంపై సైప్రస్‌లో ఏప్రిల్ 2024లో జరిగిన కామన్వెల్త్ సముద్ర దేశాల మంత్రిత్వ స్థాయి మొదటి సమావేశం జరిగింది. ఇది కామన్వెల్త్ సభ్యదేశాల్లో సుస్థిరమైన సముద్ర కార్యకలాపాల నిర్వహణను ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన బ్లూ చార్టర్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటును తెలియజేస్తుంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు చర్చించారు. దాన్ని మరింత ప్రభావవంతంగా, సమర్థంగా మార్చడానికి, సమకాలీన భౌగోళిక రాజకీయ సవాళ్లను తెలియజెప్పే మార్గాలపై సైతం చర్చించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వాల మధ్య సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లడానికి నాయకులిద్దరూ మద్దతు ప్రకటించారు. అలాగే రాతపూర్వక ఒప్పంద ఆధారిత చర్చల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లే నిరంతర ప్రయత్నాల పట్ల తమ నిబద్ధతను స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్యాన్ని ఇచ్చేలా తన మద్దతు ఇస్తానని సైప్రస్ తెలియజేసింది.

ఐక్యరాజ్యసమితిలో ఒకరికొకరు సహకరించుకోవడానికి, బహుపాక్షిక వేదికల్లో ఒకరి అభ్యర్థిత్వాన్ని మరొకరు బలపరిచేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.

రాజకీయ చర్చలు

వివిధ రంగాలలో సమన్వయాన్ని క్రమబద్ధీకరించడానికి, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి క్రమం తప్పకుండా చర్చలు జరపాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. దీనికోసం సైప్రస్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య ఉన్న ద్వైపాక్షిక యంత్రాంగాలను ఉపయోగించాలని నిర్ణయించాయి. ఈ మంత్రిత్వ శాఖలు రెండు దేశాలకు చెందిన సమర్థులైన అధికారులతో సన్నిహిత సమన్వయం ద్వారా కార్యాచరణ ప్రణాళికలో చేర్చాల్సిన సహకార రంగాల పనితీరును సమీక్షించి, పర్యవేక్షిస్తాయి.

సార్వభౌమత్వం, శాంతికి మద్దతు

దీర్ఘకాలంగా సైప్రస్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి సమగ్రమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించే ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పున:ప్రారంభించే దిశగా తమ దృఢమైన సంకల్పాన్ని రెండు దేశాలు వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా సమానత్వంతో కూడిన బైజోనల్, బైకమ్యూనల్ ఫెడరేషన్ ఆధారంగా ఈ చర్యలు పున: ప్రారంభం కావాలని రెండు దేశాలు ఆకాంక్షించాయి.  


రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యత విషయలో సంపూర్ణ మద్దతును అందిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అర్థవంతమైన చర్చల పున:ప్రారంభానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ఏకపక్ష చర్యలకు తావు లేకుండా చూడాల్సిన అవసరాన్ని రెండు పక్షాలు స్పష్టం చేశాయి.

భద్రత, రక్షణ, సంక్షోభ సమయంలో సహకారం

అంతర్జాతీయ, సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాద, హింసతో కూడిన అతివాద చర్యలను సైప్రస్, భారత్ ఖండించాయి. శాంతి, సుస్థితరకు భంగం కలిగించే ఈ తరహా ముప్పులను ఎదుర్కోవడానికి ఉమ్మడి అంకిత భావాన్ని స్పష్టం చేశాయి.

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ సాగిస్తున్న పోరాటానికి సైప్రస్ సంఘీభావాన్ని, మద్ధతును తెలిపింది. ఇటీవలే భారత్‌లో జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరుల ప్రాణాలను అత్యంత పాశవికంగా బలిగొన్న సంఘటనను ఇరు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, అలాంటి చర్యలను సమర్ధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ దాడులకు పాల్పడిన వారిని పరిణామాలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, సీమాంతర ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని నాయకులు అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేయాలని, వాటి స్థావరాలను నాశనం చేయాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర, సమన్వయ, సుస్థిర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అలాగే సహకార ధోరణిలో ద్వైపాక్షికంగా, బహుపాక్షింగా పని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బహుపాక్షిక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. అలాగే ఐక్యరాజ్య సమితి నియమాలకు లోబడి అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని వారు పిలుపునిచ్చారు. 1267 యూఎన్ఎస్‌సీ ఆంక్షల కమిటీ ప్రకారం ఉగ్రవాదులతో సహా ఐక్యరాజ్యసమితి, ఈయూ నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, అనుబంధ ప్రాక్సీ గ్రూపులు, వాటికి సహాయం చేసేవారు, మద్దతుదారులపై సంఘటితంగా చర్య తీసుకోవాలని వారు కోరారు. ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ద్వారా ఉగ్రవాద నిధుల మార్గాలను విచ్ఛిన్నం చేయడానికి చురుకైన చర్యలు తీసుకోవడం, వాటిని కొనసాగించడానికి వారు తమ అచంచలమైన సంకల్పాన్ని స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయ భద్రతకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్న విషయాన్ని నేతలు అంగీకరిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, రక్షణ సన్నద్ధతలతో పాటు రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.

రక్షణపరమైన, భద్రతపరమైన సహకారాన్ని విస్తరించుకోవాలని వారు అంగీకరించారు. దీనిలో భాగంగా తమ రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంచుకోవాలనీ, సైబర్‌ సెక్యూరిటీపైనా, ఇప్పుడిప్పుడే ఉనికి లోకి వస్తున్న సాంకేతికతలపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు వారు సమ్మతించారు.

భారత్‌తో పాటు సైప్రస్ సుదీర్ఘ నౌకాదళ చరిత్రను కలిగి ఉన్న నౌకావాణిజ్య దేశాలన్న సంగతిని నేతలు గుర్తిస్తూ, నౌకావాణిజ్య రంగం సహా ఇతరత్రా సహకారాన్ని పెంపొందించుకోవడాన్ని గురించి కూడా చర్చించారు. భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు సముద్రయానంలో భాగంగా రెగ్యులర్ పోర్ట్ కాల్స్ ప్రోత్సహించడంతో పాటు సంయుక్త శిక్షణ, అభ్యాస కార్యకలాపాల నిర్వహణకు అవకాశాలు ఏ మేరకు ఉన్నదీ అన్వేషించాలనీ, నౌకావాణిజ్యంలో చైతన్యాన్నీ, ప్రాంతీయ భద్రతనూ పెంచుకోవాలనీ వారు అభిప్రాయపడ్డారు.

ఇదే విధంగా, ప్రస్తుతం ప్రపంచంలో పలు చోట్ల సంకట స్థితులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో, అత్యవసర సన్నద్ధతతో పాటు సమస్య ఎదురైతే సమన్వయపూర్వకంగా ప్రతిస్పందించే విషయాల్లో పరస్పర సహకారాన్ని బలపరచుకొందామంటూ ఇరు పక్షాలు నిబద్ధతను వ్యక్తం చేశాయి. గతంలో తమ ప్రయత్నాలు సఫలం అయిన సందర్భాలను నేతలు గుర్తుకు తెచ్చుకొంటూ, ఆపదలో చిక్కుకొన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, జాడ తెలియని వారిని గుర్తించడం, రక్షించడం(ఎస్ఏఆర్) వంటి కార్యకలాపాలలోనూ సమన్వయ బాధ్యతను సంస్థాగతీకరించడానికి నేతలు అంగీకరించారు.

సంధానం, ప్రాంతీయ సహకారం

సైప్రస్, భారత్‌లు ఈ ప్రాంతాల మధ్య వారిధులుగా పనిచేయాలనే వ్యూహాత్మక దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. మార్పునకు కారణం కాగల, మల్టి-నోడల్ కార్యక్రమంగా ఇండియా-మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)కి ఉన్న ప్రాధాన్యాన్ని నేతలిద్దరూ ప్రధానంగా ప్రస్తావించారు. ఇది శాంతినీ, ఆర్థిక సమగ్రతనూ, స్థిరాభివృద్ధినీ పెంపొందించగలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఫలప్రద ప్రాంతీయ సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా ఐఎంఈసీ పనిచేయగలదని తలపోస్తూ, తూర్పు మధ్యధరా ప్రాంతంలోనూ, సువిశాల మధ్య ప్రాచ్యంలోనూ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం కోసం తమ రెండు పక్షాలు కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు. భారత్  ద్వీపకల్పం మొదలు సువిశాల మధ్య ప్రాచ్యం నుంచి యూరప్ గుండా పరస్పర అనుసంధానిత కారిడార్లు, ఇప్పటి కన్నా ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండేందుకు పెద్దపీట వేయాలని వారు స్పష్టం చేశారు.

యూరప్‌నకు ప్రవేశద్వారంగా సైప్రస్ పోషిస్తున్న పాత్రనూ, ఇదే సందర్భంలో, నౌకలు వాటి తుది గమ్యస్థానానికి చేరే కన్నా ముందు, ఒక నౌక నుంచి మరొక నౌక లోకి రవాణా సరకును బదలాయించే ప్రక్రియ (ట్రాన్స్‌షిప్‌మెంట్), నిల్వ, పంపిణీ, ఆధునిక రవాణా వ్యవస్థ.. ఈ కార్యకలాపాలకు ఓ ప్రాంతీయ కూడలిగా ఎదగగల అవకాశాలు సైతం సైప్రస్‌కు ఉన్నాయని నేతలు గుర్తించారు. భారతీయ నౌకావాణిజ్య కంపెనీలు సైప్రస్‌లో వాటి వాణిజ్యం నిర్వహించుకునేందుకు అవకాశాలు ఉన్నాయంటూ నేతలు దీనిని స్వాగతించారు. సైప్రస్ కేంద్రంగా ఏర్పాటయ్యే భారతీయ నౌకా వాణిజ్య సంస్థలకు భూమిక ఉండే సంయుక్త సంస్థలను (జేవీ) నెలకొల్పి వాటి ద్వారా నౌకావాణిజ్య సంబంధ సహకారాన్ని ప్రోత్సహించాలని యోచించారు. ఈ రూపంలో ఇరు దేశాల ఆర్థిక, ఆధునిక రవాణా వ్యవస్థపరమైన సంబంధాలను ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా బలోపేతం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈయూ-భారత్ వ్యూహాత్మక వాగ్దానం

యూరోపియన్ యూనియన్‌ (ఈయూ) కౌన్సిల్‌కు 2026 లో అధ్యక్ష పదవీబాధ్యతలను సైప్రస్ స్వీకరించనుండగా, ఈయూ-భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేద్దామంటూ నేతలు ఇద్దరూ వారి వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ భారతదేశాన్ని సందర్శించిన మహత్తర ఘట్టాన్ని నేతలు గుర్తుకు తెచ్చుకున్నారు. మొట్టమొదటి ‘ఇండియా-ఈయూ వూహాత్మక చర్చలకు’ నాందీ ప్రస్తావన జరగడంతో పాటు సందర్శన కాలంలో వాణిజ్యం, రక్షణ, భద్రత, నౌకావాణిజ్యం, సంధానం (కనెక్టివిటీ), స్వచ్ఛ-పర్యావరణ హిత ఇంధన రంగం, అంతరిక్షం సహా గుర్తించిన ప్రాధాన్య రంగాల్లో ఇప్పటికే నమోదైన ప్రగతి పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈయూ కౌన్సిల్ కు తాను అధ్యక్ష పదవీబాధ్యతలను నిర్వర్తించే కాలంలో, ఈయూ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించే దిశగా పనిచేస్తానని సైప్రస్ తెలిపింది. ఈయూ-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ ఎంతో ప్రాధాన్యం ఉందని ఇరు పక్షాలు గుర్తించి, ఒప్పందం ఈ సంవత్సరం చివరికల్లా ముగింపు దశకు చేరుకొనేలా మద్దతును తెలపడానికి సమ్మతించాయి. ఈయూ-ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న కృషికి సైతం వారు తమ మద్దతును తెలుపుతూ, ఈ కీలక ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం 2025 వ్యూహాత్మక పరిధికి మించి పురోగామి దృక్పథం కలిగి ఉండే కార్యక్రమాలను అనుసరిద్దామని పరస్పరం వాగ్దానం చేసుకొన్నారు.

వాణిజ్యం, నవకల్పన, సాంకేతికతలతో పాటు ఆర్థిక రంగంలో అవకాశాలు

సైప్రస్, భారత్‌ల మధ్య వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారం నానాటికీ విస్తరిస్తోందని నేతలు గుర్తిస్తూ, సైన్సు-విజ్ఞానశాస్త్రం-నవకల్పన-పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం ద్వారా వాణిజ్యాన్ని, పెట్టుబడిని విస్తరించుకొందామని తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

సహకారాన్ని పెంచుకోవడానికి, సైప్రసుకు చెందిన వాణిజ్య  ప్రతినిధులు సహా ఓ ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం భారత్‌ను సందర్శిస్తే బాగుంటుందనీ, అలాగే పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడానికి సైప్రస్-ఇండియా బిజినెస్ ఫోరమ్ ఏర్పాటైతే కూడా బాగుంటుందనీ ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు. ఒక వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోవడం అనే అంశంపై ఏర్పాటు చేసిన సైప్రస్-ఇండియా బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో నేతలు ఇరువురూ పాల్గొని ప్రసంగించారు.

పరిశోధన, నవకల్పన, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలనీ, అంకుర సంస్థల మధ్య, విద్యాబోధన సంస్థల మధ్య, పరిశ్రమ రంగంలో బలమైన సంబంధాలను పెంచి పోషించుకోవాలనీ ఇద్దరు నేతలు అంగీకరించారు. కృత్రిమ మేధ, డిజిటల్ రంగంలో మౌలిక సదుపాయాలు, పరిశోధన వంటి కీలక రంగాల్లో నవకల్పనలను ఇచ్చి పుచ్చుకోవాలనీ, వీలయితే ఈ రంగాలకు సంబంధించి అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకోవాలనీ వారు సమ్మతించారు.

మొబిలిటీ, పర్యటన, ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలు

రెండు దేశాల ప్రజల మధ్య గల పరస్పర సంబంధాలను ఒక వ్యూహాత్మక సంపత్తిగా నేతలిద్దరూ గుర్తించారు. ఈ సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక బంధాలను విస్తృతపరచుకోవడంలో అనేక రెట్ల ప్రభావాన్ని ప్రసరించగలుగుతాయని వారు గమనించారు. ఈ సంవత్సరం ముగిసే లోపు ఒక మొబిలటీ పైలట్ ప్రోగ్రామ్ అరేంజ్‌మెంటును ఖరారు చేసేందుకు ఇరు పక్షాలు కసరత్తు చేయనున్నాయి.

సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల వెలుగులో పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి. సైప్రస్‌కు, భారత్‌కు మధ్య నేరు వైమానిక సంధానాన్ని ఏర్పాటు చేయడం, పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో అన్వేషించడానికీ, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ద్వైపాక్షిక ఆదాన ప్రదానాలను పెంచడం, ఉమ్మడి భాగస్వాములతో పాటు విమాన మార్గాలను పెంచడానికి సైతం వారు అంగీకరించారు.

భవిష్యత్తు కాలం: 2025-2029 కార్యాచరణ ప్రణాళిక

సైప్రస్‌కు, భారత్‌కు మధ్య గల వ్యూహాత్మక బంధాన్ని ఈ సంయుక్త ప్రకటన పునరుద్ఘాటిస్తోంది. ప్రస్తుతం ద్వైపాక్షిక సహకారంలో చోటు చేసుకుంటున్న ప్రగతి పట్ల నేతలిద్దరూ సంతోషాన్ని ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ఇక మీదట కూడా వర్ధిల్లుతుందని, ఆయా ప్రాంతాలతో పాటు ఇతరత్రా శాంతినీ, స్థిరత్వాన్నీ, సమృద్ధినీ ప్రోత్సహిస్తుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.

వచ్చే అయిదేళ్లలో సైప్రస్, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మార్గదర్శకత్వం వహించేలా ఒక కార్యాచరణ ప్రణాళికను సైప్రస్, భారత్‌ల విదేశీ వ్యవహారాల శాఖల పర్యవేక్షణలో రూపొందించాలని నేతలు అంగీకరించారు.‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Moody’s projects stable outlook for India's banking sector, NPAs to remain low

Media Coverage

Moody’s projects stable outlook for India's banking sector, NPAs to remain low
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the blessings of Mother Earth
February 10, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting the blessings of Mother Earth:

"अस्मे वोऽअस्त्विन्द्रियमस्मे नृम्णमुत क्रतुरस्मे वर्चांसि सन्तु वः।

नमो मात्रे पृथिव्यै नमो मात्रै पृथिव्याऽ इयन्ते राड् यन्तासि यमनो ध्रुवोसि धरुणः कृष्यै त्वा क्षेमाय त्वा रय्यै त्वा पोषाय त्वा॥"

The Subhashitam conveys, "We bow to mother Earth, from whom we receive wealth and the means essential for life. You are steadfast, sustaining all and keeping everything in balance. We seek your refuge for agriculture, prosperity, and our nourishment."

The Prime Minister wrote on X;

“अस्मे वोऽअस्त्विन्द्रियमस्मे नृम्णमुत क्रतुरस्मे वर्चांसि सन्तु वः।

नमो मात्रे पृथिव्यै नमो मात्रै पृथिव्याऽ इयन्ते राड् यन्तासि यमनो ध्रुवोसि धरुणः कृष्यै त्वा क्षेमाय त्वा रय्यै त्वा पोषाय त्वा॥"