అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో లోహిత్ నదిపై రూ.14,105.83 కోట్ల వ్యయంతో 1200 ఎండబ్ల్యూ సామర్థ్యం గల కలై-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్ఈపీ) నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 78 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా.
1200 ఎండబ్ల్యూ (6x190 ఎండబ్ల్యూ, 1x60 ఎండబ్ల్యూ) సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఏడాదికి 4852.95 ఎంయూల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా. లోహిత్ బేసిన్‌లో నిర్మించనున్న తొలి జలవిద్యుత్ ప్రాజెక్టు ఇది. రాష్ట్ర విద్యుత్ సరఫరాను మెరుగుపరచడమే కాక, అధిక డిమాండు సమయాల్లో విద్యుత్ అవసరాలను తీర్చటంలో, జాతీయ గ్రిడ్ సమతుల్యతను కాపాడటంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, వంతెనలు, సంబంధిత విద్యుత్ సరఫరా నిర్మాణానికి భారత ప్రభుత్వం రూ. 599.88 కోట్ల బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో మరో రూ.750 కోట్లను ఆర్థిక సహాయంగా కేంద్రం అందిస్తుంది.
రాష్ట్రానికి 12 శాతం ఉచిత విద్యుత్, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి (ఎల్ ఏడీఎఫ్)కి కేటాయించిన అదనపు ఒక శాతం విద్యుత్ లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్రాంతంలో గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్‌సాయ్, అంజా జిల్లాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. ఇందులో భాగంగా సుమారు 29 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారులు, వంతెనలను స్థానిక ప్రజలు వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు పలు రకాల పరిహారాలు, ఉపాధి అవకాశాలు, సీఎస్ఆర్ కార్యక్రమాలతో ప్రయోజనం చేకూరుతుంది.
A major boost to clean energy and development in the Northeast! The approval of the Kalai-II Hydro Electric Project in Arunachal Pradesh will strengthen power supply, generate sustainable energy and bring infrastructure and opportunities to the region. https://t.co/49DhkiKdp6
— Narendra Modi (@narendramodi) April 8, 2026


