· జైన సంస్కృతీ సంప్రదాయాలను, కాలాతీతమైన దాని మానవీయ విలువలను చాటేలా సామ్రాట్ సంప్రతి మ్యూజియం
· కోబా తీర్థం నుంచి మహావీరుడి చరణాలకు నమస్సులర్పిస్తున్నాను.. దేశ ప్రజలందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు
· సామ్రాట్ సంప్రతి మ్యూజియం లక్షలాది దేశ ప్రజల వారసత్వ సంపద.. దేశ గత వైభవానికి ప్రతీక
· సింహాసనాధిష్టాన అనంతరం అహింసను అవలంబించిన చక్రవర్తి.. సత్యం, అస్తేయం, అపరిగ్రహాలను బోధించిన సంప్రతి
· భారత్‌లో జ్ఞానం స్వేచ్ఛావాహిని వంటిది
· ప్రతి యుగంలోనూ తీర్థంకరులు, రుషులు, చింతనాపరుల అవతరణ

జై జైనేంద్ర!

జై జైనేంద్ర!

ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!

భగవాన్ మహావీర్ జయంతి పవిత్ర పండుగ శుభ సందర్భంగా ఈ రోజు ఈ పవిత్ర జైన పుణ్యక్షేత్రానికి విచ్చేసే భాగ్యం నాకు లభించింది. మొదటగా నేను భగవాన్ మహావీర్ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఈ కోబా తీర్థ్ నుంచి దేశ ప్రజలందరికీ భగవాన్ మహావీర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజున పరమ పూజ్య ఆచార్య శ్రీ కైలాస్ సాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ గారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తున్నాను. ఆయన కల సాకారమై ఈ కోబా గడ్డ మీద ఈ గొప్ప జ్ఞాన, విశ్వాసాల కేంద్రం ఆవిర్భవించింది. ఈ కోబా తీర్థ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఏ ప్రదేశం శక్తి ఇంత దివ్యంగా ఉంటుందో, ఎక్కడైతే ఎంతోమంది జైన మునులు, సాధువుల తపస్సు అనుసంధానమై ఉంటుందో, అటువంటి చోట సృష్టి, సేవలు వాటంతటవే వ్యక్తమై, కొనసాగుతుంటాయి. కోబా తీర్థంలో అధ్యయనం, ఆధ్యాత్మిక సాధన, సంయమనాలకు సంబంధించిన ఒక నిరంతర సంప్రదాయం కొనసాగుతున్న తీరును నేను ఏళ్ళ తరబడి గమనిస్తూనే ఉన్నాను. ఇక్కడ విలువల పరిరక్షణ, సాంస్కృతిక విలువల బలోపేతంతో పాటు జ్ఞానం పెంపొందుతోంది. ఈ 'త్రివేణి' (మూడింటి సంగమం)యే భారతీయ నాగరికతకు పునాది. ఈ త్రివేణి ప్రవాహాన్ని నిరంతరం కొనసాగించడం మనందరి బాధ్యత.

మిత్రులారా,

వేల సంవత్సరాల భారతీయ వారసత్వాన్ని, జైనమత కాలాతీత జ్ఞానాన్ని, మన సంపదలను, వాటి నుంచి పొందిన స్ఫూర్తిని, రాబోయే శతాబ్దాల కోసం శాశ్వతం చేయడానికి... వాటిని ఒక నూతన, ఆధునిక రూపంలో తరువాతి తరానికి అందించడానికి... మన సాధువులు ఈ జైన వారసత్వ మ్యూజియంను రూపొందించారని తెలిసి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు, ఆ ఆలోచన ఒక గొప్ప రూపంలో సాకారమవుతోంది. ఈ సమ్రాట్ సంప్రతి మ్యూజియం జైన తత్వానికి, భారతీయ సంస్కృతికి, మన ప్రాచీన వారసత్వానికి ఒక పవిత్ర కేంద్రంగా మారింది. ఈ విశిష్ట కృషికి మన జైన మునులు, సాధువులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఈ పని కోసం అపారమైన కృషి చేసిన ఆ వేలాది మంది అంకితభావం గల వ్యక్తులందరినీ నేను అభినందిస్తున్నాను.

సోదరీ సోదరులారా,

నూతన తరానికి శాశ్వత జ్ఞానాన్ని అందించేందుకు, సరికొత్త జీవచైతన్యాన్ని నింపేందుకు మనం నూతన ఆవిష్కరణలు చేపట్టినప్పుడు వాటి ద్వారా మన వారసత్వం సుసంపన్నమవుతుంది. భవిష్యత్తుకూ స్ఫూర్తి లభిస్తుంది. 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' దేశంలోని కోట్లాది ప్రజల వారసత్వం. ఇది భారత వైభవోపేతమైన గత కాలపు వారసత్వం. ఈ సందర్భంగా, దేశ ప్రజలందరికీ నేను అనేకానేక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

సమ్రాట్ సంప్రతి కేవలం ఒక చారిత్రక రాజు పేరు మాత్రమే కాదు. సమ్రాట్ సంప్రతి భారత తత్వశాస్త్రాన్ని, ఆచరణను అనుసంధానించే ఒక వారధి వంటివారు. మనం చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచంలోని అనేక నాగరికతల్లో గొప్ప ఆలోచనాపరులు, తత్వవేత్తలు జన్మించారని మనకు తెలుస్తుంది. మానవతా ఆదర్శాలు వివిధ నిర్వచనాలతో రూపుదిద్దుకున్నాయి. కానీ అధికారం, శక్తి అనే ప్రశ్న తలెత్తినప్పుడు... చాలా మంది పాలకులు ఆదర్శాలను, విలువలను పక్కన పెట్టారు. దీని కారణంగానే ఆలోచనకు-ఆచరణకు, ఆలోచనకు-వ్యవస్థకు మధ్య అగాధం ఏర్పడుతూనే ఉంది. దేశంలో సమ్రాట్ సంప్రతి వంటి పాలకులూ ఉన్నారు. వారు అధికారాన్ని సేవగా, ఆధ్యాత్మిక సాధనగా భావించి పనిచేశారు. ఒకవైపు కొందరు పాలకులు హింసను ఆయుధంగా చేసుకుని పరిపాలిస్తే... మరోవైపు సమ్రాట్ సంప్రతి సింహాసనంపై ఆసీనుడై అహింసను విస్తరించారు. ఆయన సత్యాన్ని, వైరాగ్యాన్ని, నిస్వార్థ భావనను ప్రోత్సహించారు. పరిపాలనను ఒక సేవా మాధ్యమంగా భావిస్తూ... అటువంటి వైరాగ్యంతో, నిస్వార్థ భావనతో జీవితాన్ని గడపడమనే ఈ పాఠం మనకు భారత ఘనమైన గతం నుంచి మాత్రమే లభిస్తుంది. మనం ఈ మ్యూజియంలో ఈ గతాన్ని భద్రపరుస్తున్నాం.

మిత్రులారా,

నేను చూస్తుండగానే ఈ మ్యూజియం అడుగడుగునా భారత ఘనమైన గుర్తింపును ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. దీని ఏడు గ్యాలరీల్లో... ప్రతి గ్యాలరీ భారత భిన్నత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతుంది. మొదటి గ్యాలరీలో మనం నవ పదాన్ని చూస్తాం. నవపదం అంటే అరిహంత్, సిద్ధ, ఆచార్య, ఉపాధ్యాయ, సాధు, సరైన లక్ష్యం, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన, సరైన తపస్సు. అంటే, స్వయంగా తపస్సు చేయడం ద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న వారి నుంచి మనం నేర్చుకోవాలి. మనం సంపాదించే జ్ఞానం సరైనదై ఉండాలి! మన నడవడిక సరైనదై ఉండాలి! జ్ఞానం సరైనది అయినప్పుడు... అది సమదృష్టికి, సేవకూ పునాది అవుతుంది.

మిత్రులారా,

మూడో గ్యాలరీలో మన తీర్థంకరుల జీవితాలు, వారి బోధనలు, వారి జీవితంలోని ముఖ్య ఘట్టాలనూ కళాత్మక రీతిలో సజీవంగా ఆవిష్కరించారు.

 

సోదరీ సోదరులారా,

ఈ మ్యూజియంలో భారత గొప్ప ప్రత్యేకత, గొప్ప బలం కనిపిస్తుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మన ఈ బలం – భారత భిన్నత్వం... భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచం ఎల్లప్పుడూ నమ్మకం, మతం, విశ్వాసాల పేరుతో జరిగిన ఘర్షణలను చూసింది. అయితే ఈ మ్యూజియంలో దేశంలోని మతాలన్నింటికీ అద్భుతమైన ప్రాతినిధ్యం ఉంది. వైదిక, బౌద్ధ సంప్రదాయాలు, వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం, యోగా, తత్వశాస్త్రం - విభిన్న సంప్రదాయాలనే అన్ని రంగులూ ఒక ఇంద్రధనుస్సులా కలిసి ఉండటం మన దేశంలో మాత్రమే సాధ్యమవుతుంది.

మిత్రులారా,

ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అస్థిరత, అశాంతి అనే అగ్నిజ్వాలల్లో ప్రపంచం మండిపోతున్న తీరును గమనిస్తే... ఈ సంగ్రహాలయపు వారసత్వం, సందేశం కేవలం భారత్‌కే కాకుండా సమస్త మానవాళికీ అత్యంత ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చే ఔత్సాహికులు, విద్యార్థులు, పరిశోధకుల సంఖ్య మరింతగా పెరిగేలా కృషి చేయడం మన కర్తవ్యం కావాలి. ఇక్కడికి వచ్చే సందర్శకులు భారత, జైనమతపు బోధనలను ప్రపంచంలోని నలుమూలలకూ తీసుకువెళ్లాలి.

మిత్రులారా,

భారత్‌లో జ్ఞానం ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ప్రవహిస్తూనే ఉంది. ప్రతి యుగంలోనూ తీర్థంకరులు, రుషులు-తార్కిక వేత్తలు జన్మించారు. కాలక్రమేణా ఎన్నో కొత్త విషయాలు చేరడంతో జ్ఞాన సంచయం పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు తక్షశిల, నలంద వంటి మన విశ్వవిద్యాలయాలు లక్షలాది పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలతో నిండి ఉండేవి. విదేశీ దురాక్రమణదారులు మతపరమైన సంకుచిత మనస్తత్వంతో జ్ఞానాన్నీ తమ శత్రువుగానే భావించి, వాటిని తగలబెట్టారు. మానవాళికి చెందిన అటువంటి గొప్ప వారసత్వ సంపద నాశనమైంది. ఆ క్లిష్ట సమయంలో, ప్రజలు మిగిలి ఉన్న తాళపత్ర గ్రంథాలను తరతరాలుగా భద్రపరిచి, వాటిని సంరక్షించారు. స్వాతంత్య్రం తరువాత వాటిని కనుగొని, భద్రపరచడం దేశ బాధ్యత అయి ఉండాలి. దురదృష్టవశాత్తూ బానిస మనస్తత్వం కారణంగా దీనిపై ఎవరూ శ్రద్ధ పెట్టలేదు. ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ వంటి మహనీయులు, సాధువులు దీని ప్రాముఖ్యాన్ని గ్రహించారు. వారు తమ జీవితాన్ని పూర్తిగా దీనికే అంకితం చేశారు. తమ 60 ఏళ్ల జీవితంలో గ్రామగ్రామాలు, నగరాలతో పాటు దేశంలోని ప్రతి మూలనా వారు తాళపత్ర గ్రంథాల కోసం అన్వేషించారు. తాళపత్రాలు, భూర్జపత్రాలపై లిఖించిన వందల సంవత్సరాల నాటి పురాతన జ్ఞానానికి ప్రతీకలైన మూడు లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలను సేకరించి ఈ రోజు కోబాలో భద్రంగా ఉంచారు. ఇది భారత ఘనమైన గతం, వర్తమానం, భవిష్యత్తు కోసం చేసిన గొప్ప సేవ.

 

మిత్రులారా,

తాళపత్ర గ్రంథాలను నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పును, ఈ రోజు మేం సరిదిద్దుతున్నాం. ఇందుకోసం మేం ‘జ్ఞాన భారతం మిషన్’ను ప్రారంభించాం. ఈ పనిలో మేం సాంకేతికతనూ ఉపయోగిస్తున్నాం. ఈ మిషన్ ద్వారా ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి, వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షిస్తున్నాం. ఈ దిశగా స్కానింగ్, రసాయన శుద్ధి, డిజిటల్ సేకరణ వంటి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈ దిశగా ఒక సర్వేనూ ప్రారంభించిన తీరును ఈ ఆదివారం ‘మన్ కీ బాత్’లో నేను వివరంగా ప్రస్తావించాను. ఇందులో, దేశవ్యాప్తంగా ప్రజలు తమ వద్ద భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలను అప్‌లోడ్ చేస్తున్నారు. దేశంలోని ప్రతి మూలలో చెల్లాచెదురుగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సేకరించడంలో ఈ ప్రచారం గణనీయ పాత్ర పోషిస్తోంది.

మిత్రులారా,

ప్రభుత్వ స్థాయిలో చేపట్టిన ‘జ్ఞాన్ భారతం మిషన్’... ‘కోబా తీర్థ్’ అసాధారణ కృషి... సమాజం, ప్రభుత్వం సమష్టిగా సాగిస్తున్న ఈ ప్రయత్నాలు భారత నూతన సాంస్కృతిక పునరుజ్జీవనానికీ ప్రతీకగా నిలుస్తున్నాయి.

మిత్రులారా,

ఈ రోజు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, దానిని ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ప్రతి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాళపత్ర గ్రంథాలు, జ్ఞాన వారసత్వాన్ని పరిరక్షించే పని కొనసాగుతుండగా... దానితో పాటు ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ, పుణ్యక్షేత్రాల అభివృద్ధి, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి, ఆయుర్వేదం-యోగా ప్రచారం, విస్తరణ వంటి పనులు ప్రతి స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడే గుజరాత్‌లోని లోథాల్‌లో ఒక భారీ మారిటైమ్ మ్యూజియం నిర్మాణంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మారిటైమ్ మ్యూజియంగా నిలవబోతోంది. ఇది ఇక్కడి నుంచి కేవలం 70-80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరోవైపు వడ్నగర్‌లోనూ అతి పెద్ద మ్యూజియం ఉంది. ఇది ఇప్పటికే ప్రపంచంలోని అత్యుత్తమ మ్యూజియంల సరసన స్థానాన్ని సంపాదించుకుంది. ఢిల్లీలో ‘యుగే యుగీన్ భారత్’ మ్యూజియం నిర్మాణానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాట చరిత్రను సంపూర్ణ రూపంలో ముందుకు తీసుకురావడానికి ఈనాడు మొదటిసారిగా అర్థవంతమైన కృషి జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి... గతంలో ఈ పనులు రాజకీయ కోణంలోనే జరిగాయి. ఒక రాజకీయ కుటుంబ కథనాన్ని ఎలా రూపొందించాలి... ఓటు బ్యాంకుకు అనుగుణంగా విషయాలను ఎలా ప్రస్తావించాలి... ఇలా అన్నీ దాని చుట్టూనే తిరిగేవి. మేం ఈ మనస్తత్వానికి ముగింపు పలికాం. మేం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. ఈ మంత్రమే అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు ఆత్మ.

 

మిత్రులారా,

మీరంతా భారత వారసత్వాన్ని పరిరక్షించడానికి గొప్ప కృషి చేస్తున్నారు. మనం వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతంగా ఎదిగి... సమాజ, దేశ లక్ష్యాల కోసం పనిచేసినప్పుడు దేశాభివృద్ధి మరింత ఊపందుకుంటుంది. ఇదే భావనతో నేనూ నవకార్ మహామంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ కార్యక్రమంలో నాలుగు వర్గాల వారు ఒకేచోట సమావేశమయ్యారు. ఆ చరిత్రాత్మక సందర్భంలో నేను తొమ్మిది అభ్యర్థనలు చేశాను. తొమ్మిది తీర్మానాల గురించి మాట్లాడాను. వాటిని మన ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ ఇప్పుడే ప్రస్తావించారు. ప్రతిసారీ, నేను ఆ తొమ్మిది తీర్మానాలను మీ ముందు తప్పకుండా పునరుద్ఘాటిస్తాను. నేటి సందర్భం కూడా వాటిని మరోసారి పునరుద్ఘాటించడానికే. మొదటి తీర్మానం - నీటిని పొదుపు చేయాలి. రెండో తీర్మానం - తల్లి పేరు మీద ఒక చెట్టును నాటి సంరక్షించాలి. మూడో తీర్మానం - పరిశుభ్రతా ఉద్యమం. నాలుగో తీర్మానం - స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం. ఐదో తీర్మానం - దేశ దర్శనం (దేశ పర్యటన). ఆరో తీర్మానం - ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం. ఏడో తీర్మానం - ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం. ఎనిమిదో తీర్మానం - జీవితంలో యోగా, క్రీడలను భాగం చేసుకోవడం. తొమ్మిదో తీర్మానం – పేదలకు చేతనైన సహాయం చేయడం. మీరంతా స్వయంగా జోడించిన పదో తీర్మానం - భారత వారసత్వ సంపదను పరిరక్షించడం. నేటి కార్యక్రమం దీనికి ప్రతిబింబమే.

మిత్రులారా,

రాబోయే కాలం కోసం మన ముందు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. మనం గొప్ప సంకల్పాలను నెరవేర్చాల్సి ఉంది. ఈ క్రమంలో మన ఐక్యత, మన సాంస్కృతిక ఆధారాలు మనకు బలంగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లోనూ ఈ దిశగా 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' కీలక పాత్ర పోషిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది జ్ఞానానికి, ఆధ్యాత్మిక సాధనకు, సంస్కృతికి సంబంధించిన అద్భుత కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. దీని నుంచి నూతన తరం స్ఫూర్తిని పొందుతుంది. సమాజం ఒక నూతన శక్తిని సంతరించుకుంటుంది. ఈ నమ్మకంతోనే, ఈ మహత్తర కార్యానికి గానూ మీ అందరికీ నేను మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ఈ సందర్భంలో నేను మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. మహారాజ్ సాహెబ్ ఇదంతా ఎంతో శ్రమించి రూపొందించారు. మరి మనం కనీసం దీనిని చూడటానికి కూడా సమయం కేటాయించకపోతే, ఇక ప్రయోజనం ఏమిటి? కేవలం ఇక్కడికి వచ్చి, చూసి వెళ్లిపోయే వారి సంఖ్య మాత్రమే పెరిగిపోకూడదు. దీనిని గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక అమూల్యమైన నిధి. గుజరాత్‌లోని అన్ని తరాల ప్రజలు తమ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి, మనసారా దీనిని సందర్శించి... ఇక్కడి జ్ఞానాన్ని, గొప్ప వారసత్వాన్ని చూసి గర్వపడాలని నేను కోరుకుంటున్నాను. ఇక నా విషయానికి వస్తే, నేటి 'మహవీర్ జయంతి' నాకు అనేక విధాలుగా ఎంతో శుభప్రదమైనది. గాంధీనగర్‌కు చేరుకుని ఈ గుజరాత్ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే నేను పాల్గొన్న మొదటి కార్యక్రమం మన 'మూలాలతో అనుసంధానం' కావడం. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు సనంద్‌కు వెళ్తాను. అక్కడ నా రెండో కార్యక్రమం ఉంది. అది 'ప్రపంచంతో అనుసంధానం' కావడం. ఇక్కడ నేను మన గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలనూ, వైభవోపేతమైన భారత గతాన్నీ ఆస్వాదించాను. ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక సాంకేతికతతో కూడిన చిప్స్ (సెమీకండక్టర్ల) తయారీ కేంద్రం నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సనంద్‌లో జరగబోతోంది. ఇక్కడ మన మూలాలతో అనుసంధానం కావడం... అక్కడి నుంచి ప్రపంచంతో అనుసంధానం కావడం... ఇదంతా గుజరాత్ గడ్డపై, భారత గడ్డపైనే జరుగుతుండటం విశేషం. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు.

జై జైనేంద్ర!

జై జైనేంద్ర!

జై జైనేంద్ర!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen

Media Coverage

UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Raja Parba
June 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, today extended his greetings on the occasion of Raja Parba.

In a post on X, the Prime Minister said:

“Warm wishes on the joyous occasion of Raja Parba. May this special festival deepen the spirit of happiness and harmony in society. May everyone be blessed with prosperity and good health.”