ఇది భారతదేశ అద్భుత క్రీడా ప్రతిభను పండుగ చేసుకొనే ఘడియ..
దేశం నలుమూలలా ఉన్న క్రీడాకారుల ఉత్సాహాన్ని ప్రదర్శించే వేదిక కూడా: ప్రధాని
మేం క్రీడలను భారత సంపూర్ణ అభివృద్ధికి ఒక కీలక ఇంజినుగా చూస్తున్నాం: ప్రధానమంత్రి
మన క్రీడాకారులకు మరిన్ని ఎక్కువ అవకాశాలనిస్తున్నాం.. దాంతో వారు వారి ప్రతిభను పూర్తిస్థాయిలో పెంచుకోవచ్చు: ప్రధాని
భారత్ 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది: ప్రధానమంత్రి

భారతమాత! చిరకాలం వర్ధిల్లు!!

దేవభూమి ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్, యువ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, నా మంత్రివర్గ సహచరులు అజయ్ తమ్తా, రక్షా ఖడ్సే, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి, క్రీడల మంత్రి రేఖా ఆర్య, కామన్వెల్త్ గేమ్స్ అధ్యక్షుడు క్రిస్ జెంకిన్స్, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా, ఎంపీ మహేంద్ర భట్, దేశం నలుమూలల నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు, ఇతర ప్రముఖులారా!

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

పరీక్షించిన తరువాత బంగారం స్వచ్ఛంగా మారుతుందని మనం తరచుగా వింటుంటాం. ఆటగాళ్ల సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఏడాది పొడవునా అనేక టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ఖేలో ఇండియా సిరీస్ కు అనేక కొత్త టోర్నమెంట్లు జోడించారు. ఖేలో ఇండియా యువజన క్రీడల కారణంగా యువ ఆటగాళ్లకు ముందుకు సాగే అవకాశం లభించింది. యూనివర్శిటీ గేమ్స్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ ద్వారా పారా అథ్లెట్ల ప్రదర్శన కొత్త పుంతలు తొక్కుతోంది. కొద్ది రోజుల క్రితమే లద్దాఖ్ లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఐదో ఎడిషన్ ప్రారంభమైంది. గత ఏడాదే బీచ్ గేమ్స్ కూడా నిర్వహించాం.

మిత్రులారా,

ఇదంతా ప్రభుత్వం మాత్రమే చేస్తోందని కాదు. నేడు వందలాది మంది బీజేపీ ఎంపీలు తమ ప్రాంతాల్లో ఎంపీ క్రీడాపోటీలు నిర్వహించి కొత్త ప్రతిభను ముందుకు తెస్తున్నారు. నేను కూడా కాశీ నుంచి ఎంపీనే. నేను నా పార్లమెంటరీ నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడితే, ప్రతి సంవత్సరం ఎంపీ క్రీడా పోటీలో, కాశీ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల మంది యువకులు ఆడటానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం పొందుతున్నారు. అలా దేశంలో ఒక అందమైన క్రీడా గుచ్చాన్ని తయారు చేశాం... ఇందులో ప్రతి రుతువులో పువ్వులు వికసిస్తాయి. టోర్నమెంట్లు నిరంతరం జరుగుతాయి. 

 

మిత్రులారా,

భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి మేం క్రీడలను ప్రధాన మాధ్యమంగా భావిస్తున్నాం. ఒక దేశం క్రీడల్లో పురోగతి సాధిస్తే ఆ దేశ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. ఆ దేశ ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. అందువల్ల నేడు క్రీడలను భారతదేశ అభివృద్ధితో అనుసంధానించాం. దీన్ని భారత యువత ఆత్మవిశ్వాసంతో ముడిపెడుతున్నాం. నేడు, భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా కదులుతోంది. ఈ ప్రయాణంలో  క్రీడలకు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర ఉండాలని మా అభిలాష. మీకు తెలుసా... ఏదైనా క్రీడలో కేవలం ఆటగాడు మాత్రమే ఆడడు... దాని వెనుక మొత్తం వ్యవస్థ ఉంటుంది. కోచ్‌లు, శిక్షకులు, పోషకాహారం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారు, వైద్యులు, సాధన సామగ్రి—ఇవన్నీ కలిసి క్రీడా ప్రపంచాన్ని నిర్మిస్తాయి. అంటే, ఇందులో సేవా రంగంతో పాటు తయారీ రంగానికీ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఉపయోగించే వివిధ క్రీడా సామగ్రిని భారతదేశం నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసే కేంద్రంగా మారుతోంది. ఇక్కడి నుంచి చాలా దేశాలకు సరఫరా జరుగుతోంది. మీరట్ ఇక్కడి నుంచి ఎక్కువ దూరంలో లేదు. అక్కడ 35 వేలకుపైగా చిన్నా పెద్ద కర్మాగారాలు క్రీడా సామగ్రిని తయారు చేస్తున్నాయి. అందులో మూడు లక్షలకు పైగా ప్రజలు పని చేస్తున్నారు. ఈరోజు, దేశం ఇలాంటి క్రీడా వ్యవస్థలను ప్రతి మూలలో నిర్మించేందుకు కృషి చేస్తోంది.

మిత్రులారా,

కొంతకాలం క్రితం ఢిల్లీలోని నా నివాసంలో ఒలింపిక్ జట్టును కలిసే అవకాశం వచ్చింది. సంభాషణలో, ఒక స్నేహితుడు  నా విషయంలో ‘ప్రధానమంత్రి‘ కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. దేశ క్రీడాకారులు తనను పీఎంగానో లేదా ప్రధానిగానో భావించడం లేదని, ‘పరమ మిత్ర‘ గా భావిస్తారని అన్నారు. మీ ఈ నమ్మకం నాకు అపారమైన శక్తిని ఇస్తుంది. మీ అందరి పైనా, మీ ప్రతిభ, సామర్థ్యాల పైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ సామర్థ్యాలను పెంచడానికి, మీ ఆటను మెరుగుపరచడానికి మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా, మీ ప్రతిభకు మద్దతు ఇవ్వడంపై మేము నిరంతరం దృష్టి పెట్టాం. పదేళ్ల కిందట ఉన్న క్రీడా బడ్జెట్ నేడు మూడు రెట్లు పెరిగింది. టాప్స్ స్కీమ్ కింద దేశంలోని డజన్ల కొద్దీ క్రీడాకారులపై వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.  నేడు పాఠశాలల్లో కూడా క్రీడలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీని మణిపూర్ లో నిర్మిస్తున్నారు.

 

మిత్రులారా,

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితాలను క్షేత్రస్థాయిలో చూస్తున్నాం, పతకాల పట్టికలో ఇది కనిపిస్తోంది. నేడు భారత ఆటగాళ్లు ప్రతి అంతర్జాతీయ ఈవెంట్ లో మన జెండాను ఎగురవేస్తున్నారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. ఉత్తరాఖండ్ కు చెందిన పలువురు క్రీడాకారులు కూడా పతకాలు సాధించారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ రోజు చాలా మంది పతక విజేతలు ఈ వేదికకు రావడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా,

హాకీకి పూర్వ వైభవం  రోజులు తిరిగి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే మన ఖోఖో జట్టు ప్రపంచ కప్ గెలుచుకుంది. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను మన గుకేష్ గెలుచుకోవడంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. కోనేరు హంపి మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయాలు భారతదేశంలో క్రీడలు ఇప్పుడు కేవలం పాఠ్యేతర కార్యకలాపం మాత్రమే గాక మన యువతకు  ప్రధాన వృత్తి అవకాశంగా మారుతున్నాయనడానికి ఒక స్పష్టమైన సంకేతం.

మిత్రులారా,

మన ఆటగాళ్లు ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లే, మన దేశం కూడా పెద్ద సంకల్పాలతో ముందుకు సాగుతోంది. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తే అది భారత క్రీడలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడం ఖాయం. ఒలింపిక్స్ అనేది కేవలం ఆటకు సంబంధించిన ఈవెంట్ మాత్రమే కాదు. ప్రపంచంలో ఏ దేశంలో ఒలింపిక్స్ జరిగినా అనేక రంగాలకు ఊతం లభిస్తుంది. ఒలింపిక్స్ కోసం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాలు కూడా ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి. భవిష్యత్తులో ఆటగాళ్లకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయి. ఒలింపిక్స్ జరిగే నగరంలో  కనెక్టివిటీ కోసం నిర్మించే కొత్త మౌలిక సదుపాయాలు నిర్మాణ సంబంధిత పరిశ్రమను బలోపేతం చేస్తాయి. రవాణా రంగం కూడా పురోగమిస్తుంది. దేశ పర్యాటక రంగానికి అతిపెద్ద ప్రయోజనం చేకూరుతుంది. అనేక కొత్త హోటళ్లు  ఏర్పాటవుతాయి. ఒలింపిక్స్ లో పాల్గొనడానికి,  చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. దీని వల్ల దేశం మొత్తం ప్రయోజనం పొందుతుంది.ఇదే విధంగా, దేవభూమి ఉత్తరాఖండ్ లో జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నారు. వీటిలో ఆడేందుకు, వీటిని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు  ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. దీని అర్థం... క్రీడోత్సవాలు  కేవలం ఆటగాళ్లకు మాత్రమే ప్రయోజనం కాదు, వాటి వల్ల ఇతర అనేక రంగాల ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది.

 

మిత్రులారా!

ప్రస్తుత 21వ శతాబ్దాన్ని ప్రపంచం మొత్తం భారత శతాబ్దంగా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో కేదారనాథుని దర్శనానంతరం ‘ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌ దశాబ్దం’ అనే మాట నా హృదయపు లోతుల నుంచి అసంకల్పితంగా బయల్పడింది. ఈ రాష్ట్రం ప్రగతి పథాన శరవేగంగా పయనించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ నిన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. ఈ స్మృతిని నేను తరచూ లౌకిక పౌరస్మృతిగా వ్యవహరిస్తుంటాను. ఎందుకంటే- మన కుమార్తెలు, తల్లులు, సోదరీమణుల గౌరవప్రద జీవనానికి ఇదే ప్రాతిపదిక. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని ఉమ్మడి పౌరస్మృతి పటిష్ఠం చేస్తుంది. ఈ రోజు నేనిక్కడ క్రీడోత్సవంలో పాలు పంచుకుంటున్న నేపథ్యంలో దీనితో మీరు కూడా అనుసంధానం అయినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా క్రీడాస్ఫూర్తి మనను వివక్ష భావనకు దూరంగా ఉంచుతుంది. ప్రతి విజయానికి, ప్రతి పతక సాధనకు సమష్టి కృషే (సబ్‌కా ప్రయాస్‌) తారకమంత్రం. క్రీడలు మనలో జట్టు స్ఫూర్తిని నింపుతాయి... అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి కూడా మనకు అదే ప్రేరణనిస్తుంది. అది ఏ ఒక్కరిపైనా వివక్ష చూపదు... అందరూ సమానమే. ఈ చరిత్రాత్మక ముందడుగుపై ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వానికి నా అభినందనలు.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌లో తొలిసారి ఇంత భారీ జాతీయ కార్యక్రమం నిర్వహించడం నిజంగా విశేషం. దీనివల్ల రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి యువతరానికి చేతినిండా పని దొరుకుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రగతికి మరిన్ని కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇకమీదట చార్‌ధామ్‌ యాత్రలపై మాత్రమే ఆధారపడరాదు. ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలు పెంచుతూ యాత్రలపై ప్రజాకర్షణ పెరిగేందుకు నిరంతం చర్యలు తీసుకుంటోంది. అందువల్లనే ప్రతి సీజన్‌లోనూ భక్తుల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కానీ, ఇది ఎంతమాత్రం సరిపోదు.. శీతాకాలంలోనూ ఆధ్యాత్మిక యాత్రలను ప్రోత్సహించడం కూడా ముఖ్యం. ఈ దిశగా ప్రభుత్వం కొన్ని సరికొత్త చర్యలు చేపట్టడం హర్షణీయం.

మిత్రులారా!

   ఒక విధంగా ఉత్తరాఖండ్ నా రెండో నివాసం. ఆ మేరకు శీతాకాల యాత్రలో భాగస్వామిని కావాలని నేనూ ఆకాంక్షిస్తున్నాను. చలికాలంలో ఉత్తరాఖండ్‌ హిమ సోయగాన్ని తప్పక ఆస్వాదించాలని దేశ యువతకు సూచిస్తున్నాను. ఆ సమయంలో భక్తుల సంఖ్య అంతగా ఉండదు కాబట్టి, మీరిక్కడ సాహస క్రీడల్లో, ఇతర సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు అధికం. మీరంతా క్రీడాకారులు కాబట్టి, ఈ జాతీయ క్రీడల అనంతరం వాటి గురించి తప్పకుండా తెలుసుకోండి. వీలైతే మరికొన్ని రోజులు ఈ దేవభూమి ఆతిథ్యం స్వీకరించే ప్రయత్నం చేయండి.

 

మిత్రులారా!

   దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరంతా సంబంధిత క్రీడల్లో హోరాహోరీ తలపడతారు. అనేక జాతీయ రికార్డులు బద్దలు కావడమే కాకుండా కొత్త రికార్డులు నమోదవుతాయి. మీరు సంపూర్ణ సామర్థ్యంతో మీ ప్రతిభాపాటవాలను 100 శాతం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా మీకందరికీ నాదొక విజ్ఞప్తి. ఈ జాతీయ క్రీడోత్సవం కేవలం ఆటలపోటీలకు పరిమితం కాదు. ఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్‌’కు ఓ బలమైన వేదిక కూడా. భారత వైవిధ్యంపై మనమంతా గర్వించే సందర్భం. మీ పతకాలు దేశ ఐక్యత, ఘనతను చాటేవిగా చూసుకోవాలి. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల భాషలు, ఆహారం, ఆటపాటలు, సంగీతం వగైరాలపై అవగాహనతో మీరంతా ఇక్కడి నుంచి విజ్ఞానవంతులుగా తిరిగి వెళ్లాలి. అలాగే పరిశుభ్రత విషయంలో మీకు నా మనవి... దేవభూమి వాస్తవ్యులైన ప్రజానీకం కృషితో ఉత్తరాఖండ్ ప్లాస్టిక్ రహితంగా రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా ముందడుగు వేస్తున్న ప్లాస్టిక్ రహిత ఉత్తరాఖండ్ సంకల్పం సాకారం కావాలంటే మీ అందరి తోడ్పాటు అవశ్యం. కాబట్టి, ఈ పరిశుభ్రత కార్యక్రమం విజయంలో మీ వంతుగా సహకరించండి.

మిత్రులారా!

   శరీర దారుఢ్యం ఎంత కీలకమో మీకు తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో నేనివాళ మనం ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన సమస్యను ప్రస్తావిస్తున్నాను. దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ దీనిబారిన పడుతుండటం సహజంగానే తీవ్ర ఆందోళనకర అంశం. ఎందుకంటే- ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి ముప్పు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా సుదృఢ భారత్‌ (ఫిట్ ఇండియా) ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. తద్వారా నేడు దేశం దారుఢ్యం, ఆరోగ్యకర జీవనశైలి గురించి తెలుసుకుంటుండటం నాకెంతో సంతృప్తినిస్తోంది. ఇక ప్రస్తుత జాతీయ క్రీడలు శారీరక శ్రమ, క్రమశిక్షణ, సమతుల జీవనం ఆవశ్యకతను మనకు తేటతెల్లం చేస్తాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రెండు విషయాలను కచ్చితంగా వివరించాలని భావిస్తున్నాను. ఇవి రెండూ వ్యాయామం-ఆహారంతో ముడిపడినవి. ఆ మేరకు నిత్యం కొంత సమయం తప్పనిసరిగా వ్యాయామానికి కేటాయించండి. నడక నుంచి వివిధ కసరత్తుల రూపంలో శారీరక శ్రమకు సాధ్యమైనంత ప్రాధాన్యం ఇవ్వండి. రెండోది... ఆహారంపై నిశితంగా దృష్టి సారించాలి. అది సమతులమైనదే కాకుండా పౌష్ఠికంగానూ ఉండాలన్న వాస్తవం మరువకండి.

   మరొక ముఖ్యమైన విషయం... మీ ఆహారంలో అనారోగ్యకర కొవ్వులు, నూనెలను తగ్గించండి. సాధారణంగా మనం నెల మొదట్లో కిరాణ సరకులు తెచ్చుకుంటుంటాం. అందులో భాగంగా మీరు ప్రతి నెలా రెండు లీటర్ల వంట నూనె తెస్తున్నట్లయితే, అందులో కనీసం 10 శాతం మేర వాడకం తగ్గించండి. స్థూలకాయం నివారణకు దిశగా ఇలాంటి కొన్ని మార్గాలను మనం అనుసరించాలి. ఈ విధంగా చిన్నచిన్న జాగ్రత్తలతో మీ ఆరోగ్యంలో గణనీయ మార్పు కనిపిస్తుంది. మన పెద్దల జీవనశైలి ఇలాంటిదే... తాజా పండ్లు, కూరగాయలు సహా సహజ పదార్థాలు, సమతుల ఆహారానికి వారు ప్రాధాన్యమిచ్చేవారు. ఆరోగ్యకర దేహమే ఆరోగ్యకర మేధకు నిలయం. భారత్‌ ఆరోగ్యకర దేశంగా రూపొందాలంటే ఈ సూత్రం సదా అనుసరణీయం. కాబట్టి దీనిపై అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, కార్యాలయాలు, సామాజిక ఉద్యమకారులను కూడా కోరుతున్నాను. ముఖ్యంగా క్రీడాకారులందరికీ దీనిపై స్వీయానుభవం ఉంటుంది. తదనుగుణంగా సమతుల పోషకాహారం గురించి సమాచారాన్ని నిరంతరం ప్రజలతో పంచుకోవాలని మీకు నా విజ్ఞప్తి. ఈ పిలుపుతో మనమంతా సమష్టిగా ‘సుదృఢ భారత్‌’ను సృష్టిద్దాం కదలి రండి!

 

మిత్రులారా!

   జాతీయ క్రీడలను ప్రారంభించడం నా బాధ్యతే అయినప్పటికీ, ఈ రోజు మిమ్మల్నందర్నీ ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నాను. ఈ మేరకు క్రీడా సంరంభం ఆరంభానికి చిహ్నంగా మీరంతా మీ మొబైల్‌ ఫ్లాష్ లైట్లను ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ... మొబైల్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేయాలి. భేష్‌... ఇప్పుడు మీ అందరితో సంయుక్తంగా నేను ఈ 38వ జాతీయ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను. మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FIIs pour over $1 billion into Indian stocks, biggest weekly buying since June 2025

Media Coverage

FIIs pour over $1 billion into Indian stocks, biggest weekly buying since June 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives due to boat capsizing in South 24 Parganas district of West Bengal
July 13, 2026
Prime Minister announces ex-gratia

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal.

The Prime Minister conveyed his thoughts to the bereaved families in this hour of grief and prayed for the speedy recovery of the injured.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.

The Prime Minister’s Office posted on X;

“The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”