· “వికసిత భారత్‌ దిశగా దేశం నేడు శరవేగంగా పయనిస్తున్న నేపథ్యంలో బెంగాల్ భాగస్వామ్యం వాంఛనీయం... అత్యావశ్యకం”
· “ఈ సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు... ఆవిష్కరణలు... పెట్టుబడులకు నవ్యోత్తేజమిస్తోంది”
· “భారతదేశ భవిష్యత్తుకు బెంగాల్‌ పురోగమనమే పునాది”
· “ఈ నగర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు ఒక పైప్‌లైన్కు పరిమితం కాదు... ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే నిబద్ధతకు నిదర్శనం”
· “చౌక.. కాలుష్యరహిత... ఇంధన సౌలభ్యాన్ని సుసాధ్యం చేసే భారత్‌ వైపు మనమిప్పుడు అడుగులు వేస్తున్నాం”

కేంద్ర మంత్రివర్గ సహచరులు సుకాంతో మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, అలీపుర్‌దువార్ ఎంపీ, సోదరులు మనోజ్ టిగ్గా గారు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, బెంగాల్‌లోని నా సోదర సోదరీమణులారా!

ఈ చారిత్రాత్మక అలీపుర్‌దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!

ఈ అలీపుర్‌దువార్ సరిహద్దులతోనే కాకుండా గొప్ప సంస్కృతులతో కూడా అనుసంధానమై ఉంది. ఒక వైపు భూటాన్ సరిహద్దు, మరోవైపు అస్సాం అభివాదం. ఒక వైపు జల్పైగురి సౌందర్యం, మరోవైపు కూచ్ బెహార్ గర్వం. ఇలాంటి పుణ్యభూమిలో మీ అందరినీ కలిసే అదృష్టం ఈ రోజు నాకు లభించింది.

మిత్రులారా,

నేడు, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తున్న తరుణంలో, బెంగాల్ భాగస్వామ్యం ఆశించదగినది, అత్యంత ముఖ్యమైనది. ఈ కారణంగానే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు నిరంతరం కొత్త ఊపునిస్తోంది. బెంగాల్ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు పునాది. ఆ పునాదికి మరో బలమైన ఇటుకను జోడించాల్సిన రోజు ఇది. కొద్దిసేపటి క్రితం, మేం ఈ వేదిక నుంచి అలీపుర్‌దువార్, కూచ్ బీహార్‌లలో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షలకు పైగా గృహాలకు పైప్‌లైన్ ద్వారా శుభ్రమైన, సురక్షితమైన వంటగ్యాస్ చౌకగా సరఫరా జరుగుతుంది. ఇది వంటగది కోసం సిలిండర్ కొనాలనే ఆందోళనను తొలగించడమే కాకుండా, కుటుంబాలకు సురక్షితమైన గ్యాస్ సరఫరాను అందిస్తుంది. దీంతో పాటు, సీఎన్‌జీ స్టేషన్ల నిర్మాణం హరిత ఇంధన సదుపాయాలను విస్తరిస్తుంది. ఇది డబ్బును, సమయాన్ని ఆదా చేస్తుంది. అలాగే పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఈ కొత్త ప్రారంభం సందర్భంగా అలీపుర్‌దువార్, కూచ్ బెహార్ ప్రజలకు అభినందనలు. ఈ నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్ కేవలం పైప్‌లైన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇది ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయనే దానికి ఒక ఉదాహరణ కూడా.

 

మిత్రులారా,

గడిచిన కొన్నేళ్లలో ఇంధన రంగంలో భారత్ సాధించిన పురోగతి అపూర్వమైనది. నేడు మన దేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. 2014కి ముందు, దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే నగర గ్యాస్ సరఫరా కేంద్రాలు ఉండేవి. నేడు, నగర గ్యాస్ సరఫరా నెట్‌వర్క్ 550కి పైగా జిల్లాలకు చేరుకుంది. ఈ నెట్‌వర్క్ ఇప్పుడు మన గ్రామాలు, చిన్న పట్టణాలకూ చేరుకుంటోంది. లక్షలాది ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ అందుతోంది. సీఎన్‌జీ కారణంగా ప్రజా రవాణా కూడా మారిపోయింది. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తోంది. అంటే, దేశవాసుల ఆరోగ్యం మెరుగుపడుతోంది.. వారి జేబులపై భారం కూడా తగ్గుతోంది.

మిత్రులారా,

ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో ఈ మార్పు మరింత ఊపందుకుంది. మా ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోట్లాది మంది పేద సోదరీమణుల జీవితాలను సులభతరం చేసింది. ఇది మహిళలను పొగ నుంచి విముక్తి చేసింది. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది.. మరీ ముఖ్యంగా, ఇంటి వంటగదిలో గౌరవప్రదమైన వాతావరణం ఏర్పడింది. 2014 నాటికి మన దేశంలో 14 కోట్ల కంటే తక్కువ ఎల్‌పీజీ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. నేడు వాటి సంఖ్య 31 కోట్లకు పైగా ఉంది. అంటే ప్రతి ఇంటికి గ్యాస్ అందించాలనే కల ఇప్పుడు సాకారం అవుతోంది. దీని కోసం, మా ప్రభుత్వం దేశంలోని ప్రతి మూలలో గ్యాస్ సరఫరా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. అందువల్ల, దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ పంపిణీదారుల సంఖ్య కూడా రెట్టింపు అయింది. 2014కి ముందు, దేశంలో 14 వేలలోపు ఎల్‌పీజీ పంపిణీదారులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 25 వేలకు పెరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో గ్యాస్ సిలిండర్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి.

 

మిత్రులారా,

మీ అందరికీ ఉర్జా గంగా ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసు. ఈ ప్రాజెక్ట్ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మక ముందడుగు. ఈ పథకం కింద, తూర్పు భారత్‌లోని రాష్ట్రాలకు గ్యాస్ పైప్‌లైన్‌లను అనుసంధానించే పని జరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ సహా తూర్పు భారత్‌లోని అనేక రాష్ట్రాలకు పైపుల ద్వారా గ్యాస్ అందుతోంది. భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలన్నీ నగరాల్లో.. గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయి. పైపులైన్లు వేయడం నుంచి గ్యాస్ సరఫరా వరకు ప్రతి స్థాయిలో ఉపాధి పెరిగింది. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కూడా దీని నుంచి ప్రోత్సాహాన్ని పొందాయి. ఇప్పుడు మనం సరసమైన, శుభ్రమైన, అందరికీ అందుబాటులో ఉండే ఇంధనం గల భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం.

 

మిత్రులారా,

భారతీయ సంస్కృతి, జ్ఞానం, శాస్త్రాలకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్ కల బెంగాల్ అభివృద్ధి లేకుండా నెరవేరదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇక్కడ వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించింది. పూర్వ ఎక్స్‌ప్రెస్‌వే, దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు ఆధునీకరణ, కోల్‌కతా మెట్రో విస్తరణ, న్యూ జల్పైగురి స్టేషన్ పునరుద్ధరణ, దూవర్స్ మార్గంలో కొత్త రైళ్ల నిర్వహణ సహా బెంగాల్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసింది. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్ కేవలం పైప్‌లైన్ కాదు. ఇది పురోగతికి జీవనాడి. మీ జీవితాన్ని సులభతరం చేయడానికి, మీ భవిష్యత్తును తేజోమయం చేయడానికి మేం చేస్తున్న ప్రయత్నం. మన బెంగాల్ అభివృద్ధి దిశగా వేగంగా పయనించాలని ఆశిస్తూ, ఈ అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరో 5 నిమిషాల తర్వాత, నేను ఇక్కడి నుంచి బహిరంగ వేదికకు వెళ్తున్నాను. మీరు నా నుంచి చాలా విషయాలు వినాలనుకుంటున్నారు. ఆ వేదిక అందుకు మరింత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మిగిలిన విషయాలను 5 నిమిషాల తర్వాత మీకు చెబుతాను. ఈ కార్యక్రమంలో ఇది చాలు, మీరు ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి.

శుభాకాంక్షలు.. అందరికీ ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 డిసెంబర్ 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat