· “మణిపూర్‌ రాష్ట్రానికి రైల్వేల అనుసంధానం వేగంగా సాగుతోంది”
· “రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ఉద్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలను మేం కొనసాగిస్తున్నాం”
· “మణిపూర్‌లో ఇక ఆశా... విశ్వాసాల నవోదయం తథ్యం”
· “ఈ రాష్ట్రాన్ని శాంతి.. సౌభాగ్యం.. ప్రగతికి చిహ్నంగా మార్చడం మా లక్ష్యం”

భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, రాష్ట్ర ప్రభుత్వ పాలనాధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ కు చెందిన నా సోదరీసోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం!

ఈ మణిపూర్ నేల ధైర్యసాహసాలకూ, సంకల్పబలానికీ ప్రతీక. ఈ కొండలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం మాత్రమే కాకుండా, మీ అందరి నిరంతర శ్రమకు కూడా చిహ్నాలు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి నా అభివాదం. ఈ భారీ వర్షంలో కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు మీ ప్రేమకు నా కృతజ్ఞతలు.   భారీ వర్షం కారణంగా నా హెలికాప్టర్ రాలేకపోయింది.  అందుకే  రోడ్డు మార్గంలో చేరుకున్నా. రోడ్డు మార్గంలో వస్తుండగా నేను  చూసిన దృశ్యాలు  ఈ రోజు నా హెలికాప్టర్ ఎగరకుండా దేవుడు మంచి పనే చేశాడనిపించింది. దారిలో చిన్నా పెద్దా అందరూ త్రివర్ణ పతాకం పట్టుకొని చూపిన ఆత్మీయత, ప్రేమను చూశాను. నా జీవితంలో ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. మణిపూర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, వైవిధ్యం, చైతన్యం భారతదేశ మహత్తర శక్తిని ప్రతిబింబిస్తాయి.  ‘మణిపూర్’ అనే పేరులోనే ‘మణి’ (ఆభరణం)  ఉంది. ఈ ఆభరణం  రాబోయే రోజుల్లో మొత్తం ఈశాన్యాన్ని మరింత ప్రకాశవంతం చేయనుంది. మణిపూర్ ను అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ స్ఫూర్తితోనే నేను ఈ రోజు మీ అందరి మధ్యకు వచ్చాను. కొద్దిసేపటి క్రితమే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఈ వేదిక నుంచి ప్రారంభించాం. ఈ ప్రాజెక్టులు మణిపూర్ ప్రజల, కొండలలో నివసించే గిరిజన వర్గాల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టులు మీ అందరికీ కొత్త ఆరోగ్య,  విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయి. ఈ ప్రాజెక్టు పనుల ప్రారంభం సందర్భంగా మణిపూర్ ప్రజలందరికీ, చురచంద్‌పూర్‌ లోని ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.  

మిత్రులారా,

మణిపూర్ సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రం. ఇక్కడ కనెక్టివిటీ ఎప్పుడూ ఒక పెద్ద సవాల్ గానే ఉంది. మంచి రోడ్లు లేకపోవడం వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే, 2014 నుంచి  మణిపూర్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై నేను నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. ఇందుకోసం భారత ప్రభుత్వం రెండు స్థాయులలో ప్రయత్నాలు చేపట్టింది. మొదటిది, మణిపూర్ లో రైలు మార్గాలు, రోడ్ల కోసం బడ్జెట్ ను అనేక రెట్లు పెంచాం. రెండోది,  నగరాలకు మాత్రమే కాకుండా గ్రామాలకు కూడా రహదారులను విస్తరించడంపై దృష్టి సారించాు. 

మిత్రులారా,

ఇటీవలి సంవత్సరాలలో ఇక్కడి జాతీయ రహదారుల కోసం 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 8,700 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడి గ్రామాలకు చేరుకోవడం ఎంత కష్టంగా ఉండేదో మీకు బాగా తెలుసు. ఇప్పుడు, ఈ ప్రాంతంలోని వందలాది గ్రామాలకు రహదారి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇందువల్ల కొండలు,  గిరిజన గ్రామాలలో నివసించే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగింది. 

 

మిత్రులారా,

మా ప్రభుత్వ హయాంలో మణిపూర్ లో రైలు సౌకర్యాలు కూడా విస్తరిస్తున్నాయి. జిరిబామ్ - ఇంఫాల్ రైలు మార్గం  త్వరలో రాజధాని నగరం ఇంఫాల్ ను జాతీయ రైల్వే వ్యవస్థతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.22,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 400 కోట్ల రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించిన ఇంఫాల్ విమానాశ్రయం ఆకాశ అనుసంధానాన్ని కూడా కొత్త శిఖరాలకు తీసుకుపోతోంది. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు  హెలికాప్టర్ సేవలు కూడా మొదలయ్యాయి. పెరుగుతున్న ఈ అనుసంధానత  మణిపూర్ ప్రజలందరికీ సౌకర్యాలను పెంచుతోంది. ఇక్కడి యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.

మిత్రులారా,

భారత్ నేడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అతి త్వరలో, మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. అభివృద్ధి ఫలితాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూడటమే నా నిరంతర ప్రయత్నం.  ఒకప్పుడు ఢిల్లీలో చేసిన ప్రకటనలు ఇక్కడ అమలు కావడానికి దశాబ్దాలు పట్టేవి. నేడు, మన చురచంద్‌పూర్‌, మన మణిపూర్, దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు పురోగమిస్తున్నాయి. ఉదాహరణకు, మేం దేశవ్యాప్తంగా పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించే పథకాన్ని ప్రారంభించాం. మణిపుర్ లో వేల కొద్దీ కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి  పొందాయి.  ఇక్కడ దాదాపు అరవై వేల ఇళ్ళ నిర్మాణం జరిగింది.  అదేవిధంగా, ఈ ప్రాంతం ఇంతకుముందు విద్యుత్ సరఫరాలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. మా ప్రభుత్వం  మిమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేసింది, ఆ మేరకు  మణిపూర్ లో లక్షకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ కనెక్షన్లను పొందాయి.

మిత్రులారా,

మన తల్లులు, అక్కాచెల్లెమ్మలు మంచినీరు తెచ్చుకోవడంలో ఎన్నో కష్టాలు పడేవారు. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి  ప్రతి ఇంటికీ తాగునీరు పథకాన్ని మేం ప్రారంభించాం. గత కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 15 కోట్లమందికి పైగా ప్రజలు ఇళ్లలోనే కుళాయిల ద్వారా తాగునీరు అందుకునే సౌకర్యాన్ని పొందారు. మణిపూర్ లో కేవలం ఏడెనిమిది సంవత్సరాల కిందట 25,000 నుంచి  30,000 కుటుంబాలకు మాత్రమే పైపుల ద్వారా నీటి కనెక్షన్లు ఉన్నాయి. నేడు, ఇక్కడ 350,000 కంటే ఎక్కువ కుటుంబాలు కుళాయి నీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. మణిపూర్ లోని ప్రతి కుటుంబానికి అతి త్వరలో పైపుల ద్వారా నీరు అందుతుందని నేను విశ్వసిస్తున్నాను.

 

మిత్రులారా,

గతంలో కొండలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మంచి పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు కేవలం కలగానే ఉండేవి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఆసుపత్రికి చేర్చడానికి చాలా ఆలస్యం అయ్యేది. నేడు కేంద్రప్రభుత్వ కృషి వల్ల ఆ పరిస్థితి మారుతోంది. చురచంద్‌పూర్‌ లో ఇప్పుడు వైద్య కళాశాల  సిద్ధమైంది. ఇది కొత్త వైద్యులను తయారు చేస్తుంది.  ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక దశాబ్దాలుగా, మణిపూర్ లోని కొండ ప్రాంతాల్లో వైద్య కళాశాల లేదు. ఇప్పుడు ఈ ఘనతను మా ప్రభుత్వమే సాధించింది. ప్రధానమంత్రి  దివ్య యోజనలో భాగంగా, మా ప్రభుత్వం అయిదు కొండ జిల్లాలలో ఆధునిక ఆరోగ్య  సేవలను అభివృద్ధి చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఈ పథకం కింద మణిపూర్‌లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది రోగులు ఉచిత చికిత్స పొందారు. ఈ సదుపాయం లేకపోతే ఇక్కడి నా పేద సోదరులు,  సోదరీమణులు వైద్య చికిత్స కోసం తమ జేబుల నుంచి  350 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ మొత్తం ఖర్చును భారత ప్రభుత్వం భరించింది.  ఎందుకంటే ప్రతి పేదవాడి సమస్యలను పరిష్కరించడం మా ప్రాధాన్యత.

మిత్రులారా,

మణిపూర్ భూభాగం, ఈ  ప్రాంతం ఆశలు, సంకల్పాలతో కూడిన భూమి. దురదృష్టవశాత్తు, ఈ అద్భుతమైన ప్రాంతంలో హింస ప్రబలింది. కొద్దిసేపటి క్రితం, శిబిరాల్లో జీవిస్తున్న హింస ప్రభావిత వ్యక్తులను నేను కలిసాను. వారితో మాట్లాడిన తర్వాత, మణిపూర్ కోసం  ఆశ, నమ్మకాలతో కూడిన కొత్త ఉదయం వేచి ఉందని నేను చెప్పగలను.

మిత్రులారా,

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిని నెలకొల్పడం చాలా అవసరం. గత పదకొండేళ్లలో ఈశాన్య ప్రాంతంలో అనేక దీర్ఘకాల వివాదాలు, ఘర్షణలు  పరిష్కారమయ్యాయి. ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. కొండలు,  లోయల్లోని వివిధ సమూహాలతో ఒప్పందాలకు రావడానికి ఇటీవల చర్చలు ప్రారంభమైనందుకు నేను సంతోషిస్తున్నాను. చర్చలు, గౌరవం,  పరస్పర అవగాహన ద్వారా శాంతిని నెలకొల్పాలనే భారత ప్రభుత్వ నిబద్ధతకు ఈ ప్రయత్నాలు సంకేతం. శాంతి మార్గంలో ముందుకు సాగాలని, వారి కలలను నెరవేర్చుకోవాలని, వారి పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలని నేను అన్ని వర్గాలను కోరుతున్నాను. నేను మీతో ఉన్నానని, భారత ప్రభుత్వం మీతో, మణిపూర్ ప్రజలతో ఉందని నేను మీకు ఈరోజు హామీ ఇస్తున్నాను.

 

మిత్రులారా,

మణిపూర్ లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిర్వాసితులైన కుటుంబాలకు ఏడు వేల కొత్త ఇళ్లను నిర్మించేందుకు మా ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఇటీవల, దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఆమోదం లభించింది. నిరాశ్రయులకు సహాయం చేయడానికి 500 కోట్ల రూపాయల ప్రత్యేక కేటాయింపు కూడా జరిగింది. 

మిత్రులారా,

మణిపూర్ లోని గిరిజన యువత కలలు,  పోరాటాల గురించి నాకు బాగా తెలుసు. మీ ఆందోళనలను పరిష్కరించడానికి, వివిధ పరిష్కారాలపై పని చేస్తున్నాం. స్థానిక పరిపాలనా సంస్థలను బలోపేతం చేయడానికి, వాటి అభివృద్ధికి అవసరమైన  నిధులను కేటాయించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మిత్రులారా,

ప్రతి గిరిజన సమాజాన్ని  అభివృద్ధి చేయడం నేడు దేశానికి ఎంతో ప్రాధాన్యం. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడానికి తొలిసారిగా 'ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్' అమలు జరుగుతోంది. ఈ పథకం కింద, మణిపూర్‌లోని 500కి పైగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను కూడా పెంచుతున్నారు. మణిపూర్ లో కూడా ఇలాంటి 18 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల ఆధునికీకరణ ఇక్కడి కొండ జిల్లాల్లో విద్యా సౌకర్యాలను ఎంతో మెరుగుపరుస్తుంది.

 

మిత్రులారా,

మణిపూర్ సంస్కృతి ఎల్లప్పుడూ 'నారీ శక్తి' (మహిళా సాధికారత) ను ప్రోత్సహిస్తుంది. మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కూడా చురుగ్గా పని చేస్తోంది. మణిపూర్ కుమార్తెలకు మద్దతుగా ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. 

మిత్రులారా,

మణిపూర్ ను శాంతి, సౌభాగ్యం, ప్రగతికి చిహ్నంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మణిపూర్ అభివృద్ధితో పాటు నిర్వాసితులకు వీలైనంత త్వరగా తగిన ప్రదేశాలలో పునరావాసం కల్పించడంలోనూ, శాంతి స్థాపనలోనూ మణిపూర్ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం కూడా సహకరిస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి అభినందనలు. మణిపూర్ ప్రజలు చూపించిన ప్రేమ,  గౌరవాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  రండి- మనమందరం కలిసి చెబుదాం.

భారత మాతా కీ జై,

భారత మాతా కీ జై,

భారత మాతా కీ జై.

ధన్యవాదాలు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President’s address on the eve of 80th Independence Day reflects the nation’s strength and inspires renewed determination for a Viksit Bharat: PM
August 14, 2026

Prime Minister Shri Narendra Modi today lauded the address delivered by President of India, Smt. Droupadi Murmu, on the eve of 80th Independence Day noting that it was motivating and thoughtful.

The Prime Minister observed that her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian. He stated that her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

In a post on X, the Prime Minister shared:

"A motivating and thoughtful address by Rashtrapati Ji on the eve of Independence Day.

Her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian.

Her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

@rashtrapatibhvn"