ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటిస్తారు. జనవరి 10 సాయంత్రానికి ప్రధాని సోమనాథ్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అనంతరం డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.
జనవరి 11 ఉదయం సుమారుగా 9:45 గంటలకు శౌర్య యాత్రలో ప్రధానమంత్రి పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలర్పించిన వీరులందరి గౌరవార్థం ఈ యాత్ర చేపడుతున్నారు. అనంతరం ఉదయం 10:15లకు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వం సందర్భంగా నిర్వహించే సమావేశంలో ప్రధాని పాల్గొంటారు.
ఆ తర్వాత కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం నిర్వహిస్తున్న వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు రాజ్‌కోట్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సదస్సులో వాణిజ్య ప్రదర్శన, ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. రాజ్‌కోట్‌లోని మార్వాడి విశ్వవిద్యాలయంలో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
రాజ్‌కోట్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రధానమంత్రి బయలుదేరతారు. సాయంత్రం 5:15 గంటలకు సెక్టర్ 10 ఏ నుంచి మహాత్మా మందిర్ వరకు నిర్మించిన అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 చివరి భాగాన్ని మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభిస్తారు.
జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ప్రధాని భేటీ అవుతారు. ఉదయం 9:30 ప్రాంతంలో నాయకులిద్దరూ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం సబర్మతీ ముఖద్వారం వద్ద నిర్వహించే అంతర్జాతీయ పతంగుల ఉత్సవాల్లో ఉదయం 10 గంటలకు పాల్గొంటారు.
అనంతరం ఉదయం 11:15 నుంచి గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్లో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత్-జర్మనీ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి, జర్మన్ ఛాన్సలర్ ఇద్దరూ సమీక్షిస్తారు.


