ప్రధానమంత్రి క్రిస్టఫర్‌ లక్సాన్‌ మహోదయా,

 

భారత్‌-న్యూజీలాండ్‌ వాణిజ్యవేత్తలారా..

 

నమస్కారం!

 

కియా ఓరా! (శుభాభినందనలు)

 

అక్లాండ్‌లో ఈ రోజున మీ అందరితో సమావేశం కావడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ఈ సందర్భంగా భారత్‌ విషయంలో ప్రధానమంత్రి లక్సాన్‌ నిబద్ధతకు, సానుకూల దృక్పథానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

నేటి ఈ సమావేశానికి మీరంతా హాజరు కావడం న్యూజీలాండ్‌ వాణిజ్య, ఆవిష్కరణల స్ఫూర్తిని, దూరదృష్టి గల విధానాలను ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ తరఫున మా 140 కోట్ల మంది ప్రజల ఆశలు-ఆకాంక్షలను నాతోపాటు తెచ్చాను.

 

మిత్రులారా!

 

భారత్-న్యూజీలాండ్ సంబంధాలు నేడొక కీలక మలుపును చేరిన తరుణంలో మనమిక్కడ సమావేశమయ్యాం. ఈ స్నేహ బంధాన్ని ఒక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి మనం చేర్చబోతున్నాం. ఇది ఓ కీలక దౌత్యపరమైన ఘట్టం మాత్రమే కాదు… రెండు దేశాల భవిష్యత్తుపై సరికొత్త నిబద్ధత.

 

రెండు దేశాల మధ్య కేవలం 9 నెలల స్వల్ప రికార్డు స్థాయి వ్యవధిలో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. మార్కెట్ ప్రవేశం, పెట్టుబడులు, సేవలు, సాంకేతికత, ప్రతిభావంతుల ఆదానప్రదానం తదితర రంగాల్లో ఈ ఒప్పందం మీకందరికీ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. అందువల్ల నవ్యోత్తేజంతో, ఇనుమడించిన ఉత్సాహంతో 2030 నాటికి మన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

భారత్‌లో రాబోయే పదిహేనేళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు న్యూజీలాండ్ కూడా హామీ ఇచ్చింది. ఈ నిబద్ధత పెట్టుబడులకు మాత్రమే పరిమితమైనది కాదు… భారత వృద్ధి ప్రస్థానంలో భాగస్వామ్యానికి సంబంధించినది కూడా అనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

 

ప్రపంచంలో శరవేగంగా పురోగమిస్తున్న నేటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ ఒకటి. దేశంలో విస్తరిస్తున్న మధ్యతరగతి, భారీస్థాయిలో డిజిటల్ ఉపకరణాల వినియోగం, బలమైన మౌలిక సదుపాయాల కల్పన మా దేశాభివృద్ధి ప్రస్థానానికి ఒక ప్రత్యేకతనిచ్చాయి.

 

మా దేశంలో పరిపాలనకు సంస్కరణ-పనితీరు-రూపాంతరీకరణలను మేం పునాదిగా రూపొందించుకున్నాం. తద్వారా విధాన-రాజకీయ స్థిరత్వంతో భారత్‌ వృద్ధి ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతోంది.

 

ఆ మేరకు భారత్‌ కేవలం ఒక మార్కెట్ కాదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక కాగలదని ప్రపంచానికి మేం స్పష్టమైన సందేశమిస్తున్నాం.

 

భారత్‌లో అందివచ్చే అవకాశాల సద్వినియోగంలో మీకు అన్నివిధాలా సాయపడే దిశగా కొన్ని అంశాలను నేనిప్పుడు ఉదాహరిస్తాను. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహకాల పథకాన్ని మేం ప్రారంభించాం. దీనికింద ఆహార తయారీ నుంచి వస్త్ర పరిశ్రమ దాకా 14 రంగాలకు సుమారు 20 బిలియన్ డాలర్ల మేర చేయూత ఇస్తున్నాం. తయారీ రంగం వేగం పుంజుకుంటున్న ఈ తరుణంలో మీరంతా అందులో భాగస్వాములు కావాలని ఆహ్వానం పలుకుతున్నాను.

 

భారత్‌లో విమానాశ్రయాలు, ప్రాంతీయ అనుసంధానం, గగనమార్గ సరకు రవాణా సహా పర్యాటక రంగం కూడా వేగంగా విస్తరిస్తోది. మా దేశం నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా రూపొందింది. ఈ నేపథ్యంలో మనమంతా ఒక్కటై సరకు రవాణా కారిడార్లను సృష్టించడం సహా విమాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడి పర్యాటక ప్యాకేజీలకు రూపుదిద్దవచ్చు.

 

కివీ, ఆపిల్స్, తేనె, సముద్ర ఆహారోత్పత్తులు నశ్వర వస్తు రవాణా తదితరాల్లో వినూత్న మార్గాను అన్వేషించవచ్చు. ఉద్యాన విజ్ఞానం, అటవీ రంగాల్లో న్యూజీలాండ్‌కు విస్తృత నైపుణ్యం ఉంది. భారత్‌కు విశాలమైన వినియోగదారు మార్కెట్, ఫుడ్ పార్కులు, వ్యవసాయ-సాంకేతిక ప్రతిభ వంటి బలాలున్నాయి. కాబట్టి, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్ వరకూ విలువ వ్యవస్థతోపాటు ప్రపంచ ఎగుమతి వేదికలను మనం సమష్టిగా రూపొందించగలం.

ఇక సాంకేతికార్థిక వ్యవస్థ (ఫిన్‌టెక్‌)లో భారత్‌ నేడు ప్రపంచ అగ్రగామి. అంతర్జాతీయంగా ప్రత్యక్ష డిజిటల్ చెల్లింపులలో సుమారు 50 శాతం మా దేశంలోనే నమోదవుతున్నాయి. ఈ సామర్థ్యం ప్రాతిపదికగా డిజిటల్ చెల్లింపులలోనే కాకుండా గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్‌రంగంలోనూ ద్వైపాక్షిక సహకార విస్తృతికి మనం కృషి చేయవచ్చు.

 

అలాగే, అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ భాగస్వామ్యానికి మేం వీలు కల్పించాం. దీంతో భారత్‌ ఇవాళ 400కు పైగా అంతరిక్ష అంకుర సంస్థల నిలయంగా రూపొందింది. అంతేకాకుండా ఈ రంగంలో ఇప్పటికే తొలి యూనికార్న్‌ యూనిట్‌ ఆవిర్భవించింది. మన రెండు దేశాల కంపెనీలు భారత అంతరిక్ష వ్యవస్థలో చిన్న ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్, సముద్ర పర్యవేక్షణ వంటి రంగాలలో సహకారం పెంచుకోవచ్చు.

 

మరోవైపు స్మార్ట్ సిటీస్ మిషన్ కింద భారత్‌లోని 100 నగరాలలో 8,000కు పైగా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ రవాణా, జల-వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లోనూ సహకారానికి వీలుంది.

 

మిత్రులారా!

 

ఈ సమావేశంలో పాల్గొన్న మౌరీ వ్యాపార దిగ్గజాలకు నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను. భారత నాగరికత-మౌరీ సంప్రదాయాలు రెండూ ప్రకృతి, సమాజం, సుస్థిరతతో ప్రగాఢ అనుబంధం కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా మౌరీ వ్యాపార దిగ్గజాలకు అవకాశాల కల్పనలో ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంది. ఈ ఉమ్మడి విలువల ఆధారంగా మనం సార్వజనీన, సుస్థిర వాణిజ్యానికి ఓ కొత్త నమూనాను సృష్టించగలం.

 

మిత్రులారా!

 

అత్యంత ప్రతిష్టాత్మక భవిష్యత్‌ వాణిజ్య ప్రణాళిక రూపకల్పన దిశగా మన సంయుక్త కృషిని ప్రతిపాదిస్తున్నాను. మన శక్తిసామర్థ్యాలను ఏకం చేసి, కనీసం 5 ప్రధాన ప్రాజెక్టులను గుర్తించి, విజయవంతం చేయడానికి తగిన కాలవ్యవధి సహిత సమీక్ష యంత్రాంగాన్ని ఏర్పాటు చేద్దాం. తద్వారా మన భాగస్వామ్యంలోని సంపూర్ణ సామర్థ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోగలం. తద్వారా రెండు దేశాల ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేయగలం.

ఈ ప్రస్థానంలో మాతో భుజం కలిపి ముందుకు సాగాలని మిమ్మల్నందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.

 

మన భాగస్వామ్యాన్ని సౌభాగ్య వేదికగా, ఆవిష్కరణల వారధిగా, ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుదాం.

 

భారత్-న్యూజీలాండ్‌ ఒక ఉమ్మడి వినూత్న శక్తిగా ఆవిర్భవించాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష.

 

ఈ సందర్భంగా మరో అభ్యర్థన చేస్తున్నాను… కొద్ది క్షణాల కిందట మీరు ప్రస్తావించినట్లుగా- ఈ ఏడాది ద్వైపాక్షిక మధ్య క్రీడా సంబంధాలు ఒక శతాబ్దం పూర్తి చేసుకున్నాయి. ఇదొక కీలక సందర్భం కాబట్టి, మనం తప్పకుండా వేడుకలు నిర్వహించుకోవాలి. ఇందులో భాగంగా భారత్‌-న్యూజీలాండ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్కులైన వాణిజ్యవేత్తలతో భారీ ప్రతినిధి బృందాల ఆదానప్రదానానికి మనం కృషి చేయవచ్చు కదా! మన భాగస్వామ్యాన్ని ఈ రూపంలో మరింత విస్తృతం చేసుకుంటూ ఓ కొత్త తరాన్ని మనం సిద్ధం చేయవచ్చు.

ఈ మేరకు శుభాకాంక్షలతో, మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UPI completes 10 years, clocks nearly 13,000-fold rise in transaction volume

Media Coverage

UPI completes 10 years, clocks nearly 13,000-fold rise in transaction volume
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister invites citizens to share their UPI experiences as UPI completes a decade
August 25, 2026

The Prime Minister, Shri Narendra Modi recalled the transformative journey of the Unified Payments Interface (UPI), which was rolled out a decade ago and marked a major turning point in India’s digital payments journey.

Highlighting the scale and reach achieved by UPI over the past ten years, Shri Modi said that its remarkable journey is something every Indian can be proud of. The Prime Minister invited citizens to share their experiences of using UPI and how it has impacted their daily lives.

The Prime Minister posted on X:

A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.

The sheer scale and reach of UPI are something every Indian must be proud of.

Tell me about your UPI experience and how it impacted your life...

#10YearsOfUPI