భారత పౌర అణు కార్యక్రమం వ్యవసాయం నుండి ఆధునిక ఆవిష్కర్తల వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో సహాయపడింది: ప్రధాని మోదీ
తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడంతో, మన అణు శాస్త్రవేత్తలు మరో ప్రధాన విజయంతో భారతదేశపు గర్వాన్ని మరింత పెంచారు: ప్రధాని మోదీ
భారత అణు కార్యక్రమానికి అమూల్యమైన సేవలు అందించిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను: ప్రధాని మోదీ
భారతదేశపు పవన విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఇప్పుడు 56 గిగావాట్లను దాటింది. కేవలం గత ఒక్క సంవత్సరంలోనే, దాదాపు 6 గిగావాట్ల కొత్త సామర్థ్యం జోడించబడింది: ప్రధాని మోదీ
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల నడుమ, బుద్ధుని బోధనలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి: ప్రధాని మోదీ
ఈ ఏడాది జరిగిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కూడా ఎంతో చిరస్మరణీయంగా నిలిచింది. వాయుసేన, సైన్యం, నావికా దళం మరియు CAPF బ్యాండ్‌లు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాయి: ప్రధాని మోదీ
మొదటిసారిగా, 'బీటింగ్ రిట్రీట్' సంగీతం WAVES OTTలో కూడా అందుబాటులో ఉంది: ప్రధాని మోదీ
మనం ప్రకృతిని అర్థం చేసుకుని, దానిని గౌరవించి, దానితో సామరస్యంగా జీవించినప్పుడు, మార్పు స్పష్టంగా కనిపిస్తుంది: ప్రధాని మోదీ
ఈశాన్య ప్రాంతమంతటా నేడు వెదురు రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రజలు నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ దానికి విలువను జోడిస్తున్నారు: ప్రధాని మోదీ
మీరందరూ www.abhilekh-patal.in ను సందర్శించాలని నేను కోరుతున్నాను. ఇది మీకు మన చరిత్ర యొక్క అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది: ప్రధాని మోదీ
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు గణిత ఒలింపియాడ్ కార్యక్రమంలో పాల్గొంటారు: ప్రధాని మోదీ
జాతీయ జనాభా లెక్కలు కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. అది మనందరి బాధ్యత: ప్రధాని మోదీ
నేడు, భారతీయ చీజ్ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏదైనా సరే, భారతదేశపు రుచి ప్రపంచపు పళ్ళెంలోకి చేరుతోంది: ప్రధాని మోదీ
కొన్ని రోజుల్లో, మే 9వ తేదీన 'పోచిషే బోయిషాఖ్' సందర్భంగా మనం గురుదేవ్ టాగోర్ జయంతిని జరుపుకోబోతున్నాం: ప్రధాని మోదీ

ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' మరో ఎపిసోడ్‌లో మీ అందరితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల సందడిలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీ ఉత్తరాలు, సందేశాల ద్వారా దేశం, దేశ ప్రజలు  సాధించిన విజయాలపై మన ఆనందాలను పరస్పరం పంచుకుంటూనే ఉన్నాం. దేశం సాధించిన అటువంటి ఒక ముఖ్యమైన విజయంతో ఈసారి 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

మిత్రులారా! భారతదేశం ఎల్లప్పుడూ దేశ పురోగతితో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానించింది. ఈ దార్శనికతతో మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి ప్రయత్నాలు దేశ నిర్మాణానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి. దీని ఫలితంగా మన పారిశ్రామిక వృద్ధికి, ఇంధన రంగానికి, ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎంతో ప్రయోజనం లభించింది. రైతుల నుండి ఆధునిక ఆవిష్కర్తల వరకు ప్రతి ఒక్కరికీ భారతదేశ పౌర అణు కార్యక్రమం ఎంతో సహాయపడింది. మిత్రులారా! కొద్ది రోజుల కిందటే మన అణు శాస్త్రవేత్తలు మరో ప్రధాన విజయంతో భారతదేశ గౌరవాన్ని మరింత పెంచారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. క్రిటికాలిటీ అనేది ఒక రియాక్టర్ మొట్టమొదటిసారిగా స్వీయ-నిర్వహణ అణు శృంఖల చర్య విజయాన్ని సాధించే దశ. ఈ దశ రియాక్టర్ కార్యాచరణ దశలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ అణుశక్తి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. అంతేకాకుండా ఈ అణు రియాక్టర్ రూపకల్పన పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జరగడం విశేషం.

మిత్రులారా! దీన్ని బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు పిలుస్తారనే విషయం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా స్వయంగా ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థ ఇది. మిత్రులారా! 2024 మార్చిలో కల్పక్కంలోని రియాక్టర్‌లో కోర్ లోడింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూసిన సమయం నాకు స్పష్టంగా గుర్తుంది. భారతదేశ అణు కార్యక్రమానికి అమూల్యమైన సహకారం అందించిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన దేశ ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు, సులభతరం చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ప్రశంసనీయం. ఇది వికసిత భారతదేశం కోసం మన సంకల్పానికి కూడా కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా, అదృశ్యంగా ఉండే ఒక శక్తి గురించి ఈ రోజు 'మన్ కీ బాత్'లో మాట్లాడాలనుకుంటున్నాను. అది లేకుండా మన జీవితాలు ఒక్క క్షణం కూడా ముందుకు సాగవు. ఈ శక్తే భారతదేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇదే మన పవన శక్తి.

'వాయుర్వా ఇతి వ్యష్టిఃవాయురవై సమష్టిః'

అని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అంటే గాలి కేవలం మూలకాల సముచ్చయం కాదు. అది జీవశక్తి, అది సామూహిక శక్తి.

మిత్రులారా! ఈనాడు ఈ పవన శక్తి భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త గాథను లిఖిస్తోంది. పవన శక్తి రంగంలో భారతదేశం ఇటీవల ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. భారతదేశ పవన శక్తి ఉత్పాదన సామర్థ్యం ఇప్పుడు 56 గిగావాట్లను దాటింది. కేవలం గత ఒక్క సంవత్సరంలోనే దాదాపు 6 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని అదనంగా సాధించింది. పవన శక్తి రంగంలో భారతదేశం వేగంగా పురోగమిస్తోంది. ప్రపంచం కూడా మన వైపు చూస్తోంది. మిత్రులారా!ఈనాడు పవన శక్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. ఇది మన ఇంజనీర్ల కృషి. ఇది మన యువత పట్టుదల. ఇది దేశ సామూహిక సంకల్పానికి ప్రతీక.

మిత్రులారా! గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ రంగంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. గుజరాత్‌లోని కచ్, పాటన్, బనాస్ కాంఠా వంటి ప్రాంతాలు ఒకప్పుడు కేవలం ఎడారిగా ఉండేవి. ఇప్పుడు పెద్ద పునరుత్పాదక ఇంధన పార్కులకు నిలయంగా మారాయి. దీనివల్ల యువతీయువకులు ప్రయోజనం పొందుతున్నారు. కొత్త అవకాశాలు సృష్టించుకుంటున్నారు. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి.

మిత్రులారా! భారతదేశ అభివృద్ధికి సౌర శక్తి, పవన శక్తి ఎంతో అవసరం. ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన విషయం కాదు. ఇది మన భవిష్యత్తును కాపాడుకోవడానికి సంబంధించిన విషయం. ఇందులో మనందరి బాధ్యత ఉంది. మనం విద్యుత్తును పొదుపు చేయాలి. స్వచ్ఛమైన శక్తిని పొందాలి. దేశంలో ప్రతి స్థాయిలో ఇటువంటి ప్రయత్నాలు ఎంతో అవసరం. ఎందుకంటే అవి భారీ పరివర్తనకు దారి తీస్తాయి.

మిత్రులారా! మే నెల ఒక పవిత్రమైన సందర్భంతో ప్రారంభమవుతోంది. మరికొన్ని రోజుల్లో మనం బుద్ధ పౌర్ణమిని జరుపుకోబోతున్నాం. నా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. గౌతమ బుద్ధ భగవానుని జీవిత సందేశం నేటికీ అంతే ప్రాసంగికత కలిగి ఉంది. శాంతి మనలోనే మొదలవుతుందని, ఆత్మవిజయమే గొప్ప విజయమని ఆయన మనకు బోధించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల కారణంగా బుద్ధుని బోధనలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

మిత్రులారా! దక్షిణ అమెరికాలోని చిలీలో ఒక సంస్థ బుద్ధ భగవానుడి బోధనలను ప్రచారం చేస్తోంది. లడఖ్‌లో జన్మించిన డ్రబ్ పోన్ ఓత్జర్ రిన్ పోచే గారి మార్గదర్శకత్వంలో ఈ పని జరుగుతోంది. ఈ సంస్థ ధ్యానాన్ని, కరుణను ప్రజల జీవితాలతో అనుసంధానిస్తోంది. కోచీగూఆజ్ లోయలోని స్థూపం ప్రజలకు శాంతి భావనను కలిగిస్తుంది. ఇది చూడటం నిజంగా గర్వకారణం. భారతదేశ ప్రాచీన ప్రవాహం ప్రపంచానికి చేరుతోంది. సుదూర ప్రాంతాల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు.

మిత్రులారా! ప్రకృతితో మమేకం కావాలని బౌద్ధ సంప్రదాయం మనకు బోధిస్తుంది. బుద్ధ భగవానుడు ఒక చెట్టు కింద జ్ఞానోదయం పొందారు. ప్రకృతి మన జీవితంలో ఒక అంతర్భాగం. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని కర్మ మఠం దీనికి ఒక మంచి ఉదాహరణ. ఈ మఠం 100 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక సజీవ అటవీ ప్రాంతం. ఈ అడవిలో 700కు పైగా దేశీయ వృక్షాలను సంరక్షించారు. మిత్రులారా! బుద్ధుని సందేశం కేవలం గతానికి సంబంధించినది కాదు. అది నేటికీ సందర్భోచితం. భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఈ బుద్ధ పౌర్ణమి మనకు స్ఫూర్తినిస్తుంది. మన జీవితాలలో శాంతిని పెంపొందించుకుందాం. కరుణను స్వీకరిద్దాం. సమతుల్యతతో ముందుకు సాగుదాం.

ప్రియమైన దేశప్రజలారా! మన దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీ నుండి గాంధీజీ వర్ధంతి అయిన జనవరి 30వ తేదీ వరకు గణతంత్ర మహోత్సవాలను జరుపుకుంటామని మీ అందరికీ తెలుసు. ఈ మహోత్సవాల్లో 'బీటింగ్ రిట్రీట్' ఒక ముఖ్యమైన భాగం. ఈ రోజు నేను మీతో 'బీటింగ్ రిట్రీట్' గురించి చర్చిస్తున్నాను. ఎందుకంటే దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది.

మిత్రులారా! ఈ వేడుక వివిధ బ్యాండుబృందాల విభిన్న సంగీత సంప్రదాయాలను ప్రదర్శిస్తుందని మీరు గమనించే ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇందులో భారతీయ సంగీతం   భాగస్వామ్యం పెరిగింది. దేశ ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారు. ఈ సంవత్సరం జరిగిన 'బీటింగ్ రిట్రీట్' వేడుక కూడా చాలా గుర్తుండిపోయేలా జరిగింది. వైమానిక దళం, సైన్యం, నౌకా దళం, సి.ఏ.పి.ఎఫ్. బ్యాండు బృందాలు చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చాయి.

మిత్రులారా! అద్భుతమైన సంగీతంతో పాటు ఉత్సాహభరితమైన విన్యాసాలతో కూడిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వైమానిక దళ బృందం 'సిందూర్ ఫార్మేషన్'ను ప్రదర్శించింది. నౌకా దళ బృందం 'మత్స్య యంత్ర ఫార్మేషన్'ను ప్రదర్శించింది. సైనిక బృందం 'వందేమాతరం' 150 సంవత్సరాలను, క్రికెట్‌లో భారతదేశం సాధించిన విజయాన్ని కూడా ప్రదర్శించింది.

మిత్రులారా! 'బీటింగ్ రిట్రీట్' తర్వాత ఈ కఠోర శ్రమ, సాధించిన విజయం క్రమంగా దూరమయ్యాయి. కానీ, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి ఒక మంచి ప్రయత్నం జరిగింది. 'బీటింగ్ రిట్రీట్' సంగీతం మొదటిసారిగా వేవ్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇది ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు తప్పకుండా వినండి. మన సాయుధ దళాలు, వారి సంప్రదాయాలను చూసి మీరు చాలా గర్వపడతారు.

మిత్రులారా! గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన గాథలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గాథలు మనకు భరోసానిస్తాయి. మనలో గర్వాన్ని నింపుతాయి. 'మన్ కీబాత్' శ్రోతలతో నేను కొన్ని ఉదాహరణలను పంచుకోవాలనుకుంటున్నాను. వాటిని వినడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముందుగా రాన్ ఆఫ్ కచ్ గురించి మాట్లాడుకుందాం. వర్షాలు ముగియగానే ఇక్కడి భూమి జీవం పోసుకుంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది ఫ్లెమింగో పక్షులు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంతమంతా గులాబీ రంగుతో నిండిపోతుంది. అందుకే దీనికి 'ఫ్లెమింగో సిటీ' అని పేరు వచ్చింది. ఈ పక్షులు ఇక్కడ తమ గూళ్లను నిర్మించుకుని, తమ పిల్లలను పెంచుతాయి. కచ్ ప్రజలు వీటిని ‘లాఖా జీ బారాతీలు’ అని పిలుస్తారు. ఇప్పుడు కచ్‌లో ఈ లాఖా జీ బారాతీలు పర్యావరణ పరిరక్షణకు ఒక సుందర చిహ్నంగా మారాయి.

మిత్రులారా! మానవులు, వన్యప్రాణుల మధ్య సహకారానికి సంబంధించిన మరో గాథ ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్ కు సంబంధించినది. అక్కడి తరాయి ప్రాంతంలో పంట కోత కాలంలో ఏనుగుల గుంపులు గ్రామాల వైపు వస్తాయి. ఇది సంఘర్షణ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో కూడా ‘గజ్ మిత్ర’  వంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏనుగులపై దృష్టి పెట్టేందుకు గ్రామస్థులు బృందాలుగా ఏర్పడతారు. వారు ప్రజలను సకాలంలో అప్రమత్తం చేస్తారు. ఇది సంఘర్షణను తగ్గించి, ప్రజలకు భరోసాను పెంచుతోంది.

మిత్రులారా! మధ్య భారతదేశం నుండి కూడా ఒక శుభవార్త ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో బ్లాక్ బక్ అంటే కృష్ణజింకలు తిరిగి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. కానీ నిరంతర ప్రయత్నాల వల్ల వాటి సంరక్షణ పెరిగింది. ఈ రోజు అవి పొలాల్లో బహిరంగంగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది మనం కోల్పోయిన వారసత్వం తిరిగి రావడాన్ని సూచిస్తుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్ట మేక పిట్ట  సంరక్షణలో కూడా ఇలాంటి ఆశే కనిపిస్తోంది. ఈ పక్షి ఒకప్పుడు మన ఎడారి ప్రాంతాలకు ఒక ప్రత్యేక చిహ్నంగా ఉండేది. అయితే ఒకప్పుడు వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఈ పక్షి అంతరించిపోయే అంచున ఉండేది. కానీ ఇప్పుడు దాని పరిరక్షణ కోసం ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రజనన కేంద్రాలను స్థాపించారు. ఇప్పుడు నవ జీవనానికి ప్రారంభ మార్గాలు కనిపిస్తున్నాయి.

మిత్రులారా! ప్రకృతి, మానవులు వేరు కాదు. మనం ఒకరికొకరం మిత్రులం.  మనం ప్రకృతిని అర్థం చేసుకుని, గౌరవించి, సామరస్యంగా జీవించినప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఈ మార్పు దేశంలోని ప్రతి మూల నుండి నూతన ఆశగా ఆవిర్భవిస్తోంది.

నా ప్రియమైన దేశవాసులారా! ఈశాన్య ప్రాంతం మనందరికీ అష్టలక్ష్మి వంటిది. ఇక్కడ అపారమైన ప్రతిభ ఉంది. ఈశాన్య ప్రాంత సహజ సౌందర్యం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 'మన్ కీ బాత్'లో మనం ఈశాన్య ప్రాంత ప్రజల విజయాల గురించి తరచుగా చర్చించాం. ఈ రోజు నేను మీతో అలాంటి మరో విజయం గురించి చర్చిస్తాను. అది వెదురు రంగంలో ఈశాన్య ప్రాంతం సాధించిన విజయం. మిత్రులారా! ఒకప్పుడు భారంగా భావించిన విషయం ఇప్పుడు ఉపాధి, వాణిజ్యం, ఆవిష్కరణలకు కొత్త ఊపునిస్తోంది. మన తల్లులు, సోదరీమణులే దీనికి అతి పెద్ద లబ్ధిదారులు. వెదురు నిర్వచనాన్ని మార్చడం ద్వారా ఎంత మార్పు వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మిత్రులారా! బ్రిటిష్ వారు చేసిన చట్టం ప్రకారం వెదురును ఒక చెట్టుగా నిర్వచించారు. దానికి సంబంధించిన నియమాలు చాలా కఠినంగా ఉండేవి. వెదురును ఎక్కడికైనా రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. ఫలితంగా ఇక్కడి ప్రజలు వెదురు సంబంధిత వ్యాపారాల నుండి దూరంగా ఉండటం ప్రారంభించారు. మిత్రులారా! 2017లో చట్టాన్ని మార్చడం ద్వారా వెదురును చెట్ల క్యాటగిరీ నుండి తొలగించాం. దాని ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఈరోజు ఈశాన్య ప్రాంతమంతటా వెదురు రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రజలు నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ, దానికి విలువను జోడిస్తున్నారు.

మిత్రులారా! త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన బిజోయ్ సూత్రధార్, దక్షిణ త్రిపురకు చెందిన ప్రదీప్ చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం. వారు కొత్త చట్టాలను తమకు ఒక గొప్ప అవకాశంగా చూశారు. ఆ తర్వాత వారు తమ పనిని సాంకేతికతతో అనుసంధానించారు. ఈరోజు వారు గతంలో కంటే ఉత్తమంగా,  ఎక్కువ వెదురు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నాగాలాండ్‌లోని దిమాపూర్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వెదురు ఆధారిత ఆహార ఉత్పత్తులకు విలువను జోడించిన అనేక స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. అలాగే వెదురు ఫర్నిచర్, హస్తకళలపై పనిచేస్తున్న 'ఖోరోలో క్రియేటివ్ క్రాఫ్ట్స్' వంటి బృందాలు కూడా ఉన్నాయి.

మిత్రులారా! మిజోరంలోని మామిత్ జిల్లాలో వెదురు కణజాల సాగు, పాలీ-హౌస్ నిర్వహణపై పనిచేస్తున్న బృందాలు ఉన్నాయి. సిక్కింలోని గాంగ్‌టక్ సమీపంలో ఉన్న లగస్టల్ బాంబూ ఎంటర్‌ప్రైజ్ టీమ్ గురించి కూడా నాకు తెలిసింది. ఈ బృందం వెదురుతో హస్తకళలు, అగరబత్తులు, ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేస్తుంది.

మిత్రులారా! నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. భారతదేశంలో వెదురు రంగ   విజయ గాథల జాబితా చాలా పెద్దది. మీరందరూ ఈశాన్య ప్రాంతం నుండి ఏదైనా వెదురు ఉత్పత్తిని కొనుగోలు చేయాలని నేను కోరుతున్నాను. మీరు దాన్ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. మీ ప్రయత్నాలు వెదురు ఉత్పత్తులను తయారు చేయడానికి తమ చెమటను ధారపోసేవారిని ప్రోత్సహిస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా! వేగంగా మారుతున్న ఈ కాలంలో సాంకేతికత మన జీవితంలో ఒక పెద్ద భాగమైంది. మన గతాన్ని వర్తమానంతో అనుసంధానించడంలో సాంకేతికత   అద్భుతాలను ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ దిశలో ఇటీవల జరిగిన ఒక పరిణామం విద్యా రంగంలో ఉన్నవారిని, చరిత్రపై ఆసక్తి ఉన్నవారిని ఆనందపరిచింది. మిత్రులారా! కొద్ది రోజుల కిందట భారత జాతీయ ఆర్కైవ్స్ ఒక ప్రత్యేక పోర్టల్‌లో ఒక విశిష్టమైన డేటాబేస్‌ను పంచుకుంది. ఈ సంస్థ 20 కోట్లకు పైగా అమూల్యమైన దస్తావేజులను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కొన్ని చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి. బిర్చ్ వృక్షాల బెరడుపై రాసిన 7వ శతాబ్దపు గిల్గిత్ తాళపత్రాలు వీటిలో ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన ఆసక్తికరమైన గ్రంథం ‘శ్రీ భువాలయ్’ ను కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.  సంఖ్యలపై ఆధారపడిన ఈ పుస్తకం ఒక గ్రిడ్ రూపంలో ఉంది. రాణి లక్ష్మీబాయికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేఖలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవి 1857లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెల్లడిస్తాయి. ఇవి ఆమె ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిమానుల కోసం నేతాజీ జీవితం, ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ ప్రసంగాలకు సంబంధించిన అనేక పత్రాలు ఉన్నాయి. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు సంబంధించిన అనేక పత్రాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. వీటిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు, హిందీ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంది. మన రాజ్యాంగ సభకు సంబంధించిన అనేక విశిష్టమైన పత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరందరూ www.abhilekh-patal.in వెబ్ సైట్ ను సందర్శించాలని నేను కోరుతున్నాను. ఇది మీకు మన చరిత్రకు సంబంధించి  అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

మిత్రులారా! ఒక్కసారి ఊహించుకోండి: మీరు ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులతో పోటీ పడుతున్నారు. మీ ముందు చాలా కష్టమైన గణిత సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి మీకు కేవలం నాలుగున్నర గంటల సమయం మాత్రమే ఉంది. అంటే సమయం చాలా పరిమితం. పోటీ అంతర్జాతీయస్థాయికి చెందింది. చాలా కఠినమైంది. అటువంటి పరిస్థితిలో ఆందోళన చెందడం చాలా సహజం. కానీ సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే మన అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. ఈ నెల మొదట్లో ఫ్రాన్స్‌లోని బోర్డోలో యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ జరిగింది. గణితంపై అమితమైన ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థినుల కోసం రూపొందించిన ఒక ప్రధాన పోటీ ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఒకటి. ఈ ఒలింపియాడ్‌లో మన అమ్మాయిలు తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ ప్రతిభావంతమైన జట్టును చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ జట్టులో ముంబాయికి చెందిన శ్రేయ ముంధ్రా, తిరువనంతపురానికి చెందిన సంజన చాకో, చెన్నైకి చెందిన శివాని భరత్ కుమార్, కోల్‌కతాకు చెందిన శ్రిమోయి బేరా ఉన్నారు. మన జట్టు ప్రపంచంలో ఆరవ ర్యాంకు సాధించింది. శ్రేయ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. సంజన రజత పతకం, శివాని కాంస్య పతకం గెలుచుకున్నారు.

మిత్రులారా! భారతదేశంలో ఈ ఒలింపియాడ్‌ ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. దీనికి బహుళ-దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కఠినమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. దీని తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు నెల రోజుల పాటు జరిగే గణిత శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. ఈ శిబిరం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో జరుగుతుంది. ఈ శిబిరం చివరిలో జట్టు ఎంపిక పరీక్ష జరుగుతుంది. ఇందులో కనబరిచిన ప్రతిభ ఆధారంగా భారత జట్టును ఎంపిక చేస్తారు.

మిత్రులారా! ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ గణిత ఒలింపియాడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణా ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంటే దేశంలోని అమ్మాయిలలో ఒలింపియాడ్ సంస్కృతికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిభావంతులైన ఈ అమ్మాయిలకు సహకరిస్తున్న వారి తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రస్తుతం మన దేశంలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. దీని గురించి ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. అదే జనగణన కార్యక్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన. మిత్రులారా! ఇప్పటికే ఇలాంటి ప్రక్రియలో పాల్గొన్న వారికి ఈసారి భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. జనగణన 2027ను డిజిటల్ రూపంలోకి మార్చారు. మొత్తం సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమంలో నమోదు జరుగుతుంది.   జనగణన కోసం ఇంటింటికీ వెళ్ళే సిబ్బంది దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటుంది. వారు మీతో మాట్లాడి, అందులో సమాచారాన్ని నమోదు చేస్తారు. మిత్రులారా! ఈసారి జనగణనలో మీ భాగస్వామ్యం మరింత సులభతరమైంది. మీ సమాచారాన్ని మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ సదుపాయం జనగణన సిబ్బంది రాకకు 15 రోజుల ముందే ప్రారంభమవుతుంది. మీరు మీ సౌలభ్యం మేరకు మీకు వీలైన సమయంలో సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మీకు ఒక ప్రత్యేక ఐడీ సంఖ్య లభిస్తుంది. ఈ ఐడీ సంఖ్య మీ మొబైల్ లేదా ఈమెయిల్‌కు వస్తుంది. ఆ తర్వాత జనగణన సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఈ ఐడీ సంఖ్యను చూపించి మీ సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల సమాచారాన్ని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రక్రియను సులభతరం చేస్తుంది. మిత్రులారా! స్వీయ-గణన పూర్తయిన రాష్ట్రాల్లో జనగణన చేసే సిబ్బంది బృందాలు  కుటుంబాల జాబితా రూపొందించే పనిని కూడా ప్రారంభించాయి.

ఇప్పటివరకు సుమారు ఒక కోటి 20 లక్షల కుటుంబాల ఇళ్ల జాబితా పని పూర్తయింది. మిత్రులారా! జాతీయ జనగణన కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఇది మనందరి బాధ్యత. మీ భాగస్వామ్యం చాలా ముఖ్యం. మీరు అందించే సమాచారం పూర్తిగా సురక్షితం. ఇది గోప్యంగా ఉంటుంది. డిజిటల్ భద్రతతో ఉంటుంది. మనమందరం కలిసి ఈ ప్రక్రియలో పాల్గొందాం. జనగణన 2027ను విజయవంతం చేద్దాం. 

మిత్రులారా! మన దేశంలో ఆహార పానీయాల సంప్రదాయం కేవలం రుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంప్రదాయంలో ఒక ఆసక్తికరమైన భాగం భారతీయ చీజ్. కొన్ని రోజుల కిందట నేను ఒక ట్వీట్ ద్వారా కొంత సమాచారాన్ని పంచుకున్నాను. బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ చీజ్ పోటీలో రెండు భారతీయ చీజ్ బ్రాండ్‌లు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాయి. ఈ విజయంపై  సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. భారతదేశంలోని చీజ్ వైవిధ్యం గురించి కూడా చర్చించాలని చాలా మంది నాతో చెప్పారు.

మిత్రులారా! భారతదేశ పాడి పరిశ్రమ రంగంలో ఒక భారీ పరివర్తన జరుగుతోంది. ఈ రంగంలో విలువ జోడింపులు మన సాంప్రదాయిక రుచులకు ఒక కొత్త గుర్తింపును ఇచ్చాయి. ఈనాడు భారతీయ చీజ్ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం ఏదైనా సరే, భారతదేశ రుచి ప్రపంచ పళ్ళెంలోకి చేరుతోంది.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కలారి చీజ్‌నే తీసుకోండి. దీన్ని ‘కాశ్మీర్ మొజెరెలా’ ​​అని పిలుస్తారు. గుజ్జర్-బకర్వాల్ సమాజానికి చెందినవారు తరతరాలుగా దీన్ని తయారు చేసి తింటున్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లలో ‘ఛుర్పి’ చాలా ప్రసిద్ధి చెందింది. దాని రుచిలో పర్వత ప్రాంతాల సరళత, మృదుత్వం స్పష్టంగా కనిపిస్తాయి. యాక్ పాలతో తయారు చేయడం ఈ చీజ్ ప్రత్యేకత.

మిత్రులారా! ‘సుర్తీ చీజ్’ అని కూడా పిలిచే ‘టోప్లీ ను పనీర్’కు కూడా మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను ఇక్కడ కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించాను. కానీ మన దేశంలో ఈ రుచుల ప్రపంచం చాలా విస్తృతమైంది. ఈనాడు ఈ సంప్రదాయం కొత్త బలాన్ని పుంజుకుంటోంది. అనేక భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ప్యాకేజింగ్ మెరుగుపడుతోంది. మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పురోగమిస్తున్నాయి. దీని ఫలితంగా భారతీయ చీజ్ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి ప్రపంచ మార్కెట్లకు, రెస్టారెంట్లకు చేరుతోంది. ఈ రోజు మనం లోకల్ నుండి గ్లోబల్ స్థాయికి వెళ్లడం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భారతీయ చీజ్ ఉదాహరణ మనకు ముందుకు వెళ్ళే  మార్గాన్ని చూపిస్తుంది. భారతదేశ రుచి, భారతీయ సంప్రదాయం, భారతీయ నాణ్యత ప్రపంచానికి ఒక కొత్త అనుభూతిని అందించి, భారతదేశంతో ఒక కొత్త బంధాన్ని ఏర్పరుస్తాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ నెలలో దేశంలోని అనేక ప్రాంతాలలో నూతన సంవత్సరంతో సహా అనేక పండుగలు జరుపుకున్నారు. కొన్ని రోజుల్లో మే 9వ తేదీన ‘పొచ్చీశే బోయిశాఖ్' సందర్భంగా మనం గురుదేవ్ టాగోర్ జయంతిని జరుపుకుంటాం. గురుదేవ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గొప్ప రచయిత, తత్త్వవేత్త మాత్రమే కాదు- అనేక ప్రఖ్యాత సంస్థలను కూడా తీర్చిదిద్దారు. గురుదేవ్ టాగోర్ స్థిరమైన ఉపాధిని కల్పించే పరిశ్రమలను, గ్రామాల సంక్షేమాన్ని ప్రోత్సహించారు. ఆయన రవీంద్ర సంగీతం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. శాంతినికేతన్‌కు నేను చేసిన యాత్రలు నాకు మరపురానివి. ఆయన పూర్తి అంకితభావంతో పోషించి, అభివృద్ధి చేసిన సంస్థ ఇదే. ఆయనకు మరోసారి నా వినమ్రపూర్వక నివాళి.

మిత్రులారా! మే మాసం మనకు 1857 నాటి మొదటి స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా గుర్తు చేస్తుంది. ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని జాగృతం చేసిన మాతృభూమి వీరపుత్రులందరికీ నేను వందనం సమర్పిస్తున్నాను. ఇది పాఠశాల విద్యార్థులకు సెలవుల సమయం కూడా. వారు తమ సెలవులను పూర్తిగా ఆస్వాదించాలని, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుతున్నాను. ఈ వేసవి కాలంలో మీరందరూ మీ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. వచ్చే నెలలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కొన్ని కొత్త అంశాలతో, దేశ ప్రజల కొత్త విజయాలతో వచ్చే నెల కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses delight as Sarnath is inscribed on the UNESCO World Heritage List
July 25, 2026

Prime Minister Shri Narendra Modi today expressed that it is a proud moment for every Indian, sharing his delight that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

He noted that Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

Shri Modi highlighted that this recognition celebrates India’s profound civilisational and spiritual heritage. The Prime Minister observed that it will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

In a post on X, the Prime Minister shared:

 "A proud moment for every Indian!

Delighted that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

This recognition celebrates India’s profound civilisational and spiritual heritage. It will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

@UNESCO"