భారత్ నేడు సవాళ్లను అధిగమిస్తూ నూతన విశ్వాసంతో ముందుకు సాగుతోంది: ప్రధాని
గల్ఫ్ దేశాల నుంచి పాశ్చాత్య దేశాల వరకు, గ్లోబల్ సౌత్ నుంచి పొరుగు దేశాల వరకు భారత్ అందరికీ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోంది: ప్రధానమంత్రి
దేనికి ప్రాధాన్యం ఉంటుందో అది మెరుగుపడుతుంది… చివరకు మార్పు చెందుతుంది: ప్రధాని
ఇది నవ భారతం; ఏ అవకాశాన్ని వదలకుండా అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తుంది: ప్రధానమంత్రి

'భారత్ - ప్రపంచం' ఇతివృత్తంతో టీవీ9 నెట్‌వర్క్ ఈ రోజు నిర్వహించిన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ, క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కీలక సమయంలో ఆలోచనల మార్పిడికి ఒక వేదికను సిద్ధం చేసిన టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రధాని అభినందించారు. "నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు అసాధారణమైనవి. అత్యంత క్లిష్టమైనవి. ఇలాంటి సమయంలో ఆలోచనల మార్పిడికి టీవీ9 నెట్‌వర్క్ ఒక ముఖ్యమైన వేదికను సిద్ధం చేసింది” అని శ్రీ మోదీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వివాదాలు నెలకొన్న తరుణంలో భారత్ స్థానం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, 2014 నాటి పరిస్థితులను అధిగమించి, భారత ఆర్థిక వ్యవస్థ నేడు సరికొత్త ఆత్మవిశ్వాసంతో శీఘ్రగతిన ముందుకు సాగుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత సవాళ్లు పెరుగుతున్నా,  140 కోట్ల మంది పౌరుల ఐక్యత వల్లే భారత్ ప్రతి సవాల్ ను ఎదుర్కోగలిగిందని ఆయన పేర్కొన్నారు. “ఫిబ్రవరి 28 నుంచి  ఈ 23 రోజుల్లో భారత్ తన సంబంధాల బలోపేత శక్తిని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని, సంక్షోభ నిర్వహణ దక్షతను చాటి చెప్పింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. 

ప్రపంచ దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ భారత్ తన దౌత్య సంబంధాలతో గల్ఫ్ దేశాల నుంచి పాశ్చాత్య దేశాల వరకు, గ్లోబల్ సౌత్ నుంచి  పొరుగు దేశాల వరకు  అందరికీ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ ఏ పక్షాన ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ' మేం భారత్ పక్షాన ఉంటాం. భారత ప్రయోజనాల వైపు ఉంటాం. మాది శాంతి,  చర్చల మార్గం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

 

ప్రపంచ సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతున్న సమయంలో భారత ప్రత్యామ్నాయ నమూనా, అధిగమించే శక్తి  గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇంధనం, ఎరువులు లేదా నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో పౌరులకు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘'వైవిధ్యం, దృఢత్వం విషయంలో భారత్ ఒక నమూనాను చూపింది. మన ప్రజలు కష్టాల బారిన పడకుండా చూడటమే మా నిరంతర లక్ష్యం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. .

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ పై చూపే ప్రభావం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం లోక్‌సభలో తాను చేసిన ప్రకటనను ప్రస్తావించారు. నేటి పరస్పర అనుసంధాన ప్రపంచంలో యుద్ధాలు భౌగోళికంగా భారతదేశ సరిహద్దులకు దూరంగా జరుగుతున్నప్పటికీ, వాటి ప్రతికూల ప్రభావాల నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని ఆయన పేర్కొన్నారు. "ఇది సంయమనం, సున్నితత్వంతో వ్యవహరించాల్సిన సమయం. దేశప్రజలందరూ ఐక్యంగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని ఫలితాలు ఎల్లప్పుడూ అర్థవంతంగా ఉంటాయి" అని అన్నారు.

 

ప్రపంచ కల్లోలాల మధ్య కూడా భారత అభివృద్ధి వేగం అంతరాయం లేకుండా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి గడిచిన 23 రోజుల వివరాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.  ఢిల్లీ మెట్రో రైలు కీలక కారిడార్ల ప్రారంభోత్సవం, సిల్చార్ హై-స్పీడ్ కారిడార్, కొత్త కోట విమానాశ్రయానికి శంకుస్థాపన, మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. 100 ప్లగ్-అండ్-ప్లే ఇండస్ట్రియల్ పార్కుల ఆమోదం, 1,500 మెగావాట్ల అదనపు సామర్థ్యం కోసం 'స్మాల్ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్'కు ఆమోదం, జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించడం వంటి అంశాలను ఆయన కూడా ప్రస్తావించారు. వీటితో పాటు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.18,000 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం,  ఎం ఎస్ఎంఈలు, ఎగుమతిదారుల కోసం రూ. 500 కోట్ల ఉపశమన ప్యాకేజీ ప్రకటనను కూడా ఆయన పేర్కొన్నారు. "ఈ చర్యలన్నీ వికసిత్ భారత్ సాధన కోసం దేశం ఎంతో వేగంగా పని చేస్తోందనడానికి నిదర్శనం" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

మేనేజ్‌మెంట్ సూత్రాలను ఉటంకిస్తూ, “ఏది ప్రాధాన్యమో,  దాని నిర్వహణ జరుగుతుంది” అనే ప్రసిద్ధ సామెతను ప్రధానమంత్రి వివరించారు. అలాగే, “దేనికి ప్రాధాన్యం ఇస్తామో అది మెరుగుపడుతుంది. చివరికి అది మార్పు చెడుతుంది” ఆయన పేర్కొన్నారు. హైవేల నిర్మాణ వేగం రోజుకు 11–12 కిలోమీటర్ల నుంచి దాదాపు 30 కిలోమీటర్లకు పెరిగిందని, ఓడరేవుల వద్ద షిప్ టర్నరౌండ్ సమయం 5–6 రోజుల నుంచి  2 రోజుల కంటే తక్కువకు తగ్గిందని, రిజిస్టర్డ్ స్టార్టప్‌ల సంఖ్య 400–500 నుంచి 2 లక్షలకు పైగా పెరిగిందని, ఎంబీబీఎస్ సీట్లు 50–55 వేల నుంచి  1.25 లక్షలకు పైగా పెరిగాయని; బ్యాంక్ ఖాతాలు 25 కోట్ల నుంచి  80 కోట్లకు పైగా (55 కోట్ల జన్ ధన్ ఖాతాలతో సహా) విస్తరించాయని, విమానాశ్రయాల సంఖ్య 70 కంటే తక్కువ నుంచి 160 కి పైగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. నేడు భారత్ శరవేగంతో దూసుకుపోతోంది. నేడు సంకల్పాలు విజయాలుగా మారుతున్నాయి" అని శ్రీ మోదీ అన్నారు. 

 

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఒకప్పుడు తూటాల శబ్దాలతో దద్దరిల్లిన అస్సాం, ఇప్పుడు సెమీకండక్టర్ యూనిట్‌కు నిలయంగా మారిందని, ఒడిశా సెమీకండక్టర్ల నుంచి  పెట్రోకెమికల్స్ వరకు వివిధ రంగాలలో వృద్ధిని సాధిస్తోందని, బీహార్ లో గత దశాబ్ద కాలంలో ఐదుకి పైగా కొత్త వంతెనలు నిర్మించారని, ఉత్తరప్రదేశ్ మొబైల్ ఫోన్ల తయారీకి గ్లోబల్ హబ్‌గా మారిందని శ్రీ మోదీ వివరించారు. "గతంలో ఉన్న అభివృద్ధి అసమతుల్యతను భారత్ భవిష్యత్తు అవకాశాలుగా మారుస్తోంది" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, సంస్కృతి, విద్య, పరిశ్రమలు, వాణిజ్యానికి కేంద్రంగా ఆ రాష్ట్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత 11 ఏళ్లలో ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. "పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ఎందుకంటే రాజకీయాల కంటే దేశం,  దాని అభివృద్ధి మిన్న" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

 

షహీద్ భగత్ సింగ్, షహీద్ రాజ్‌గురు, షహీద్ సుఖ్‌దేవ్ అత్యున్నత త్యాగాలు చేసిన చారిత్రాత్మక దినమైన షహీద్ దివస్,  డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి వారికి నివాళులర్పించారు. ఈ మహనీయులు  ఎల్లప్పుడూ వ్యక్తిగత జీవితాల కంటే దేశానికే ప్రాధాన్యత ఇచ్చి స్ఫూర్తి ప్రదాతలయ్యారని అన్నారు.  టీవీ9 సదస్సు భారత్ ఆత్మవిశ్వాసాన్ని, భారతీయుల పట్ల ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, "అన్నిటికంటే జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలనే స్ఫూర్తి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, స్వయంసమృద్ధి గల దేశంగా మారుస్తుంది," అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India

Media Coverage

Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi