గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చరిత్రను రాయడంలో సమయం వృధా చేయకుడా... చరిత్ర సృష్టించేందుకు కృషి చేయాలని సర్దార్ పటేల్ నమ్మేవారని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు. సర్దార్ పటేల్ జీవిత కథ అంతటా ఈ నమ్మకం స్పష్టంగా కనిపిస్తుందనీ... ఆయన అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తర్వాత 550కి పైగా సంస్థానాలను ఏకం చేయడం ద్వారా సర్దార్ పటేల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' దార్శనికత సర్దార్ పటేల్‌కు అత్యంత ముఖ్యమైందనీ... అందుకే ఆయన జయంతి సహజంగానే జాతీయ ఐక్యతకు ఒక గొప్ప పండగగా మారిందని ప్రధానమంత్రి తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నట్లుగానే నేడు ఏక్తా దివస్‌నూ జరుపుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు ఈ రోజు ఐక్యతా ప్రతిజ్ఞ చేసి, దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహించాలని సంకల్పించారని ఆయన తెలియజేశారు. ఏక్తా నగర్‌లోని ఏక్తా మాల్, ఏక్తా గార్డెన్ ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే చిహ్నాలుగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

"దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రతి చర్యనూ ప్రతి పౌరుడూ నివారించాలి" అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇది దేశ ప్రస్తుత అవసరం... ప్రతి భారతీయుడికి ఏక్తా దివస్ అందించే ప్రధాన సందేశం అని ఆయన స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ దేశ సార్వభౌమత్వానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ మరణం తరువాతి కాలంలో వరుసగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జాతీయ సార్వభౌమాధికారం పట్ల అదే తీవ్రతను ప్రదర్శించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో జరిగిన తప్పులు, ఈశాన్యంలోని సవాళ్లు, దేశవ్యాప్తంగా నక్సల్-మావోయిస్ట్ తీవ్రవాదం వ్యాప్తి భారత సార్వభౌమత్వానికి ప్రత్యక్ష ముప్పుగా మారాయన్నారు. సర్దార్ పటేల్ విధానాలను అనుసరించడానికి బదులుగా... నాటి ప్రభుత్వాలు వెన్నెముక లేని విధానాన్ని ఎంచుకున్నాయనీ, దాని పర్యవసానాలను హింస, రక్తపాతం రూపంలో దేశం భరించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సర్దార్ పటేల్ ఇతర సంస్థానాలను విజయవంతంగా విలీనం చేసినట్లుగానే... కాశ్మీర్ మొత్తాన్నీ భారత్‌లో కలపాలని ఆకాంక్షించిన విషయం నేటి యువతరంలో చాలా మందికి తెలియకపోవచ్చన్న శ్రీ మోదీ... అప్పటి ప్రధానమంత్రి దీనికి అనుమతించలేదని తెలిపారు. కాశ్మీర్‌ను ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక చిహ్నం కేటాయించి మరీ విభజించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. కాశ్మీర్ విషయంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేసిన తప్పు కారణంగా దశాబ్దాలుగా దేశంలో అశాంతి కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వారి బలహీనమైన విధానాల కారణంగానే కాశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిందనీ... ఆ దేశం ఉగ్రవాదాన్ని మరింత పెంచిపోషించిందని తెలిపారు. ఈ తప్పుడు చర్యలకు కాశ్మీర్‌తో పాటు యావత్ దేశం భారీ మూల్యం చెల్లించాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఉగ్రవాదం ముందు తలొగ్గడం కొనసాగించిందని ఆయన విమర్శించారు.

సర్దార్ పటేల్‌లా గొప్ప పనులు చేయలేని ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఆయన దార్శనికతనూ మరచిపోయిందని శ్రీ మోదీ విమర్శించారు. 2014 తర్వాత దేశం మరోసారి సర్దార్ పటేల్ స్ఫూర్తితో ఉక్కులాంటి సంకల్పాన్ని చూసిందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 సంకెళ్ల నుంచి కాశ్మీర్ విముక్తి పొంది ప్రధాన స్రవంతిలో పూర్తిగా కలిసిపోయిందని ప్రధానమంత్రి తెలిపారు. పాకిస్తాన్‌తో పాటు, ఉగ్రవాదులకూ ఇప్పుడు భారత్ నిజమైన బలం తెలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ... ఎవరైనా భారతదేశాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేస్తే, మన దేశం శత్రు భూభాగంపై నేరుగా దాడి చేయడం ద్వారా తన స్పందనను తెలియజేస్తుందని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధానమంత్రి అన్నారు. భారత్ ప్రతిస్పందన ఎల్లప్పుడూ బలంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది భారత శత్రువులకు ఒక సందేశం - "ఇది ఉక్కు మనిషి సర్దార్ పటేల్ దేశం... ఇది తన భద్రత, ఆత్మగౌరవం విషయంలో ఎప్పటికీ రాజీపడదు" అని ఆయన అన్నారు.
"నక్సల్-మావోయిస్ట్ తీవ్రవాదం వెన్ను విరిచేయడం గత పదకొండు సంవత్సరాల కాలంలో జాతీయ భద్రతా రంగంలో భారత్ సాధించిన అత్యంత గొప్ప విజయం" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. 2014కి ముందు దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో ఆయన గుర్తు చేసుకున్నారు. నక్సల్-మావోయిస్ట్ గ్రూపులు దేశం నడిబొడ్డున నుంచే తమ సొంత పాలనను నిర్వహించాయన్నారు. ఈ ప్రాంతాల్లో భారత రాజ్యాంగం అమలు కాలేదు... పోలీసు, పరిపాలనా వ్యవస్థలు పనిచేయలేకపోయాయి... నక్సల్స్ బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు.. రహదారుల నిర్మాణాలను అడ్డుకున్నారు... పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులపైనా బాంబు దాడులు చేశారు... అయినా నాటి పరిపాలన వారి ముందు నిస్సహాయంగా కనిపించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
"2014 తర్వాత మా ప్రభుత్వం నక్సల్-మావోయిస్ట్ తీవ్రవాదులపై నిర్ణయాత్మక దాడిని ప్రారంభించింది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నక్సల్స్ మద్దతుదారులు-అర్బన్ నక్సల్స్‌ను కూడా పూర్తిగా నిర్మూలించామని స్పష్టం చేశారు. సైద్ధాంతిక యుద్ధంలో విజయం సాధించామనీ... నక్సల్ బలంగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యక్ష ఘర్షణ ప్రారంభమైందని ఆయన తెలిపారు. దాని ఫలితాలు ఇప్పుడు మొత్తం దేశానికి కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 2014కి ముందు దేశంలోని దాదాపు 125 జిల్లాలు మావోయిస్టు తీవ్రవాదం ప్రభావంలో ఉండగా ఈ రోజు వాటి సంఖ్య 11కి తగ్గిందనీ... కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే తీవ్రమైన నక్సల్ ప్రభావం ఉందని ప్రధానమంత్రి తెలిపారు. నక్సల్-మావోయిస్ట్ ముప్పుల నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందే వరకు ప్రభుత్వం ఈ యుద్ధం ఆపదని ఏక్తా నగర్ భూమి నుంచి... సర్దార్ పటేల్ సమక్షంలో... ప్రధానమంత్రి దేశానికి హామీ ఇచ్చారు.

దేశ ఐక్యత, అంతర్గత భద్రత ప్రస్తుతం చొరబాటుదారుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. దశాబ్దాలుగా విదేశీ చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి... మన పౌరులకు ఉద్దేశించిన వనరులను స్వాధీనం చేసుకున్నారని, జనాభా సమతుల్యతను దెబ్బతీశారని, జాతీయ ఐక్యతను ప్రమాదంలో పడేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీవ్రమైన సమస్యను పట్టించుకోకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆయన విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రత విషయంలో మునుపటి ప్రభుత్వాలు రాజీ పడ్డాయని శ్రీ మోదీ ఆరోపించారు. ఈ ప్రధాన ముప్పును నిర్ణయాత్మకంగా ఎదుర్కోవడానికి మొదటిసారిగా దేశం సంకల్పించిందని ఆయన ధ్రువీకరించారు. ఈ సవాలును పరిష్కరించడానికి ఎర్రకోట నుంచి డెమోగ్రఫీ మిషన్‌ను ప్రకటించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యను తీవ్రంగా లేవనెత్తుతున్నప్పటికీ... కొంతమంది వ్యక్తులు జాతీయ సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులకు హక్కులు కల్పించడానికి ఈ వ్యక్తులు రాజకీయ పోరాటాల్లో నిమగ్నమై ఉన్నారనీ, దేశాన్ని విభజించే పరిణామాల పట్ల వారు ఉదాసీనంగా ఉన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశ భద్రత, గుర్తింపు ప్రమాదంలో పడితే... ప్రతి పౌరుడు ప్రమాదంలో పడతారని ఆయన హెచ్చరించారు. అందుకే దేశంలో నివసిస్తున్న ప్రతి చొరబాటుదారుడిని తరిమికొట్టాలనే సంకల్పాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున యావత్ దేశం పునరుద్ఘాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో విభిన్న ఆలోచన దృక్పథాలను గౌరవించడం కూడా జాతీయ ఐక్యతలో భాగమేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలు ఆమోదయోగ్యమే అయినా, వ్యక్తిగత విభేదాలు ఉండరాదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని నడిపించే బాధ్యత స్వీకరించిన వారు, ‘భారత ప్రజలమైన మేము’ అనే రాజ్యాంగ పీఠిక స్ఫూర్తిని బలహీనపరచే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. విభిన్న భావజాలాలు గల వ్యక్తులు, సంస్థలను చిన్నచూపు చూస్తూ రాజకీయ అంటరానితనాన్ని సంస్థాగతం చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గత ప్రభుత్వాలు సర్దార్ పటేల్‌ను, ఆయన వారసత్వాన్ని తక్కువ చేశాయని, బాబా సాహెబ్ అంబేడ్కర్ భావజాలాన్ని ఆయన జీవితకాలంలోనే కాకుండా మరణానంతరం కూడా అణగదొక్కాయని పేర్కొన్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల విషయంలోనూ అదే తరహాలో వ్యవహరించాయని చెప్పారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ- ఈ శతాబ్ద కాలంలో ఆ సంస్థ ఎన్నో దాడులు, కుట్రలను ఎదుర్కొన్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఒక పార్టీ, ఓ కుటుంబానికి వెలుపల భిన్నమైన వ్యక్తులను, భావజాలాన్ని ఏకాకిని చేసే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు లోగడ సాగాయని పేర్కొన్నారు.
దేశాన్ని విభజించే ఒకనాటి రాజకీయ అంటరానితనాన్ని అంతం చేయడంపై జాతి నేడు గర్విస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సర్దార్ పటేల్ గౌరవార్థం ఐక్యతా విగ్రహం నిర్మాణం, బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును చిరస్మరణీయం చేస్తూ ‘పంచతీర్థం’ ఏర్పాటును ఆయన ప్రస్తావించారు. ఢిల్లీలోని బాబా సాహెబ్ నివాసంతోపాటు ఆయన సమాధి ప్రదేశం గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా, ఇప్పుడు అదొక చరిత్రాత్మక స్మారక చిహ్నంగా మారిందని గుర్తుచేశారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఒక మాజీ ప్రధానమంత్రికి మాత్రమే ప్రత్యేక మ్యూజియం ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చాక మాజీ ప్రధానులందరి కృషిని గౌరవిస్తూ ‘ప్రధానమంత్రి మ్యూజియం’ ఏర్పాటు చేశామని తెలిపారు. బీహార్ ప్రజా నాయకుడు కర్పూరీ ఠాకూర్ సహా ఆజన్మాంతం ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి అంకితమైన శ్రీ ప్రణబ్ ముఖర్జీని కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించామని తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ వంటి భిన్న భావజాలంగల నాయకులను కూడా ‘పద్మ’ పురస్కారంతో గౌరవించామని చెప్పారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ఎదగడం, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత బహుళ పార్టీ బృందాన్ని విదేశాలకు పంపడంలోనూ ఈ సార్వజనీన విధానాన్నే అనుసరించామని తెలిపారు.

“రాజకీయ లబ్ధి కోసం జాతీయ ఐక్యతపై దాడిచేసే మనస్తత్వం వలసవాద ధోరణికి ప్రతిబింబం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఆనాడు బ్రిటిష్ వారి నుంచి అధికారంతోపాటు పార్టీ నిర్మాణాన్ని, అణచివేత వైఖరిని కూడా పుణికి పుచ్చుకున్నదని ఆరోపించారు. మన జాతీయ గీతం ‘వందేమాతరం’ త్వరలో 150 ఏళ్లు పూర్తి చేసుకోనున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. బ్రిటిష్ పాలకులు 1905లో బెంగాల్‌ను విభజించిన సందర్భంగా ‘వందేమాతరం’ నినాదం ప్రతి భారతీయుడికీ ఒక సమష్టి ప్రతిఘటన స్వరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. అలాగే ఐక్యత, సంఘీభావాలకు ఒక సంకేతంగా మారిందని గుర్తుచేశారు. దీంతో ‘వందేమాతరం’ అని నినదించడాన్ని బ్రిటిష్ సర్కారు నిషేధించడానికి యత్నించినా, భంగపాటు తప్పలేదని వివరించారు. అయితే, పరాయి పాలకులు చేయలేని ఈ పని, గత ప్రభుత్వం చేసిందని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన వందేమాతరంలోని ఒక భాగాన్ని దేశీయ పాలకులు తొలగించారని పేర్కొన్నారు. తద్వారా సమాజాన్ని చీల్చి, వలసవాద భావనను కొనసాగించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వందేమాతరం గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించుకున్న రోజునే, దేశ విభజనకు పునాది వేసిందని ప్రధానమంత్రి నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఆనాడు వారు ఈ ఘోర తప్పిదానికి పాల్పడి ఉండకపోతే నేటి భారత్ స్వరూపం విభిన్నంగా ఉండేదని విమర్శించారు.
నాడు అధికారం చలాయించిన వారి వైఖరి ఫలితంగా దేశం దశాబ్దాల నుంచీ వలసరాజ్య చిహ్నాలను కొనసాగిస్తూ వచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాతే భారత నావికాదళ పతాకంలో వలస పాలన చిహ్నాన్ని తొలగించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రగతిశీల మార్పులో భాగంగానే ‘రాజ్‌పథ్’ పేరును ‘కర్తవ్య పథ్’గా మార్చామని తెలిపారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలకు నిలయమైన అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ హయాంలో జాతీయ స్మారక చిహ్నం హోదా ప్రకటించినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయినా, ఇటీవలిదాకా అండమాన్‌లోని అనేక దీవులకు బ్రిటిష్ వ్యక్తుల పేర్లు కొనసాగాయని ఆయన పేర్కొన్నారు. వీటికి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం పేరు మార్చడమే కాకుండా అనేక దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టామని చెప్పారు. అలాగే న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు.
మునుపటి పాలకుల వలసవాద వైఖరి వల్ల దేశం కోసం అమరులైన వీర సైనికులకూ సముచిత గౌరవం దక్కలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అందుకే, తాము జాతీయ యుద్ధ స్మారకం నిర్మించి, వారి జ్ఞాపకాలను చిరస్మరణీయం చేశామని ఆయన వివరించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు లేకుండా చూడటంలో పోలీసు, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సహా ఇతర పారామిలిటరీ దళాల సభ్యులు సహా 36,000 మంది సిబ్బంది ఆత్మార్పణం చేశారని గుర్తుచేశారు. వారి అసమాన సాహసానికి, త్యాగానికి చాలాకాలం తగిన గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు. అటువంటి అమరవీరులను గౌరవిస్తూ ‘పోలీసు స్మారక చిహ్నం’ నిర్మించింది తమ ప్రభుత్వమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “దేశం నేడు వలసవాద ఆలోచన ధోరణికి స్వస్తి చెబుతూ ఆనాటి ప్రతి చిహ్నాన్నీ తొలగించి, దేశం కోసం త్యాగం చేసిన వీరులను గౌరవించడం ద్వారా ‘దేశమే ప్రధానం’ అనే స్ఫూర్తిని బలోపేతం చేస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఒక దేశం, సమాజం మనుగడకు ఐక్యతే పునాది అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సమాజం ఐక్యంగా ఉన్నంత వరకూ దేశ సమగ్రత సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి, జాతీయ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రతి కుట్రను భగ్నం చేస్తేనే వికసిత భారత్ లక్ష్యం సాధించగలమని సూచించారు. తదనుగుణంగా ప్రతి రంగంలోనూ జాతీయ ఐక్యత సాధన కోసం చురుగ్గా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
దేశ ఐక్యత ప్రధానంగా నాలుగు మూల స్తంభాలపై ఆధారపడి ఉందని ప్రధానమంత్రి వివరించారు. వీటిలో మొదటిది సాంస్కృతిక ఐక్యత కాగా, రాజకీయ స్థితుగతులతో నిమిత్తం లేకుండా అనాదిగా భారతీయ సంస్కృతి దేశాన్ని ఏకీకృత వ్యవస్థగా నిత్య చైతన్యంతో నడిపిందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం 12 జ్యోతిర్లింగాలు, 7 పవిత్ర నగరాలు, 4 పుణ్యక్షేత్రాలు, 50కి పైగా శక్తిపీఠాలు, యాత్రాస్థలాల సంప్రదాయం భారత్‌ను నిత్యచైతన్య, సజీవ శక్తిగా నిలిపినట్లు ఆయన వివరించారు. ఈ సంప్రదాయాన్ని తాము సౌరాష్ట్ర-తమిళ సంగమం, కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారతీయ విశిష్ట యోగ శాస్త్రం నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచంలో సరికొత్త గుర్తింపును పొందిందని, దేశదేశాల మానవాళిని అనుసంధానించే సూత్రంగా యోగా రూపొందిందని ఆయన అన్నారు.
రెండో మూలస్తంభం 'భాషా ఐక్యత' గురించి వివరిస్తూ- దేశంలోని వందలాది భాషలు, మాండలికాలు మన సార్వత్రిక, సృజనాత్మక ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశంలోని ఏ సమాజం, పాలకమండలి లేదా వర్గం భాషను ఎన్నడూ ఆయుధంగా ప్రయోగించలేదని, ఒక భాషను ఇతరులపై రుద్దడానికి యత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే, భాషా వైవిధ్యం పరంగా భారత్ అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటిగా పరిగణనలో ఉందని తెలిపారు. భారతీయ భాషలను దేశ గుర్తింపును బలోపేతం చేసే సప్త సంగీత స్వరాలతో పోల్చారు. ప్రతి భాషను జాతీయ భాషగానే చూస్తామంటూ- ప్రపంచ ప్రాచీన భాషలలో ఒకటైన తమిళంతోపాటు సంస్కృతాన్ని కూడా జ్ఞాననిధి భాండాగారంగా ఆయన సగర్వంగా ప్రకటించారు. ప్రతి భారతీయ భాషకూ తనదైన విశిష్ట సాహిత్య-సాంస్కృతిక సంపద ఉందని, ప్రభుత్వం వీటన్నింటినీ చురుగ్గా ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలోని బాలలు మాతృభాషలో చదువుకుంటూ వృద్ధిలోకి రావాలని, పౌరులు కూడా ఇతర భారతీయ భాషలను గౌరవిస్తూ, నేర్చుకోవడానికి యత్నించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. భాషలు ఐక్యతకు సూత్రాలుగా మారాలని, ఇది ఒక రోజుతో పూర్తయ్యే కృషి కాదని పేర్కొంటూ ఇందుకు నిరంతర సమష్టి ప్రయత్నాలు అవశ్యమని స్పష్టం చేశారు.
మూడో మూలస్తంభమైన ‘వివక్షరహిత అభివృద్ధి’ గురించి మాట్లాడుతూ- సామాజిక చట్రానికి పేదరికం, అసమానతలు అతిపెద్ద దౌర్బల్యాలని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశ ప్రత్యర్థులు తరచూ వీటిని తమ ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. అందుకే, పేదరిక నిర్మూలన దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని సర్దార్ పటేల్ గట్టిగా చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా- ‘మనకు పదేళ్లు ముందుగానే స్వాతంత్ర్యం సిద్ధించి ఉంటే 1947 నాటికి దేశం ఆహార కొరత సంక్షోభాన్ని అధిగమించి ఉండేది” అని సర్దార్ పటేల్ వ్యాఖ్యానించడాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. ఆనాడు రాజ సంస్థానాలను విలీనం చేయడంలో విజయం సాధించిన తరహాలోనే ఆహార కొరతను కూడా అంతే దృఢ సంకల్పంతో పరిష్కరించి ఉండేవాడినని సర్దార్ పటేల్ విశ్వసించినట్లు పేర్కొన్నారు. సర్దార్ పటేల్ సంకల్పం అంత పటిష్ఠమైనదని, నేటి ప్రధాన సమస్యల పరిష్కారానికీ అదే స్ఫూర్తి అవశ్యమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆయన కాలంలో తీరని ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేడు ప్రభుత్వం కృషి చేస్తుండటం తమకు గర్వకారణమని హర్షం వ్య్తం చేశారు. గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులయ్యారని, లక్షలాది పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతున్నదని, ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరాతోపాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రతి పౌరుడికీ గౌరవప్రద జీవన స్థితిగతులు కల్పించడమన్నది తమ దార్శనికత మాత్రమేగాక లక్ష్యం కూడానని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు వివక్ష, అవినీతికి తావులేని విధానాలు జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తున్నాయని చెప్పారు.

జాతీయ ఐక్యతకు నాలుగో మూలస్తంభం- అనుసంధానం ద్వారా ప్రజల మధ్య హృదయగత అనుబంధం ఏర్పరచడమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ‘హైవే, ఎక్స్‌ప్రెస్ వే’లు నిర్మితమవుతున్నాయని శ్రీ మోదీ చెప్పారు. అలాగే వందే భారత్, నమో భారత్ వంటి రైళ్లతో భారతీయ రైల్వేల్లో పరిణామశీల మార్పులు వచ్చాయన్నారు. చిన్న నగరాలకూ నేడు విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు దేశంపై ప్రపంచ దృక్కోణాన్ని మార్చడమేగాక ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు వారధిగా నిలిచి, దూరాన్ని తగ్గించాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పర్యాటకం, వ్యాపారం కోసం ప్రజలు ఇవాళ రాష్ట్రాల మధ్య సులువుగా ప్రయాణిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల మధ్య అనుసంధానం, సాంస్కృతిక ఆదానప్రదాన నవశకాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని చెప్పారు. దీంతో జాతీయ ఐక్యత బలం పుంజుకోవడమేగాక డిజిటల్ అనుసంధానంతో ప్రజల మధ్య అనుబంధం మరింత బలపడుతోందని తెలిపారు.
దేశ సేవలోనే తనకు అత్యంత ఆనందం కలిగిస్తుందన్న సర్దార్ పటేల్ వ్యాఖ్యను ఉటంకిస్తూ- ఈ భావనను ప్రతి పౌరుడూ తప్పక అనుసరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశం కోసం శ్రమించడాన్ని మించిన సంతోషం మరొకటి ఉండదని, భరతమాతను ఆరాధించడం ప్రతి భారతీయుడి భక్తికి అత్యున్నత నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఏకమై ముందడుగు వేస్తే, పర్వతాలు కూడా పక్కకు తొలగి, దారి ఇస్తాయన్నారు. వారంతా ఒక్కటై గళమెత్తితే దేశం సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటినట్లు కాగలదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశ ఐక్యతను ఒక పవిత్ర సంకల్పంగా స్వీకరించి అవిభక్త, అవిచ్ఛిన్న శక్తితో నిలవాలని ఆయన పౌరులకు సూచించారు. సర్దార్ పటేల్‌కు మనమివ్వగల నిజమైన నివాళి ఇదేనని స్పష్టం చేశారు. యావద్దేశం సమష్టిగా ‘ఒకే భారత్ - శ్రేష్ఠ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తూ, వికసిత-స్వయంసమృద్ధ దేశంగా రూపొందాలన్న భారత్ ఆకాంక్షను నెరవేర్చగలదని ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ స్ఫూర్తితో మరోసారి సర్దార్ పటేల్ పాదాల వద్ద ఆయన నివాళి అర్పించారు.

నేపథ్యం
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ప్రధానమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడంతోపాటు సాయుధ బలగాల కవాతును వీక్షించారు. వివిధ రాష్ట్రాల పోలీసులు సహా ‘బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ’ బలగాల సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు. ఈసారి అస్సాం సాహస పోలీసు సిబ్బంది ‘డేర్‌డెవిల్’ మోటార్ సైకిల్ ప్రదర్శన, రామ్‌పూర్ హౌండ్స్-ముధోల్ హౌండ్స్ వంటి జాతి శునక దళాలు, గుజరాత్ పోలీసు అశ్వికదళం, బీఎస్‌ఎఫ్ ఒంటెల దళం, వాటిపై బ్యాండ్‌తో కవాతు బృందం ప్రత్యేక ఆకర్షణలుగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కవాతులో భాగంగా సీఆర్‌పీఎఫ్ నుంచి ఐదుగురు శౌర్యచక్ర అవార్డు గ్రహీతలను, జార్ఖండ్‌లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది బీఎస్‌ఎఫ్ శౌర్య పతక విజేతలను సత్కరించారు. అలాగే ఆపరేషన్ సిందూర్ సందర్భంగా శౌర్యపరాక్రమాలు ప్రదర్శించిన బీఎస్‌ఎఫ్ సిబ్బందికీ సముచిత గౌరవం లభించింది.
ఈ ఏడాది జాతీయ ఐక్యతా దినోత్సవం ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహా గుజరాత్, జమ్మూకాశ్మీర్, అండమాన్-నికోబార్ దీవులు, మణిపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల నుంచి ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తూ పది శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. మరోవైపు 900 మంది కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు భారతీయ సంస్కృతి వైభవాన్ని, వైవిధ్యాన్ని కళ్లకు కట్టాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి కావడంతో ఈసారి జాతీయ ఐక్యత దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది.

“ఆరంభ్ 7.0” ముగింపు సందర్భంగా 100వ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. “పరిపాలనకు కొత్త రూపు” ఇతివృత్తంగా ‘ఆరంభ్’ 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దీనికింద 100వ ఫౌండేషన్ కోర్సు ద్వారా దేశంలోని 16, భూటాన్‌లోని 3 సివిల్ సర్వీసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 660 మంది శిక్షణార్థి అధికారులు శిక్షణ పొందారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
After Independence, Sardar Patel accomplished the seemingly impossible task of uniting over 550 princely states.
— PMO India (@PMOIndia) October 31, 2025
For him, the vision of 'Ek Bharat, Shreshtha Bharat' was paramount. pic.twitter.com/XtVc21rO68
Every thought or action that weakens the unity of our nation must be shunned by every citizen.
— PMO India (@PMOIndia) October 31, 2025
This is the need of the hour for our country. pic.twitter.com/S7UZcrFOQb
This is Iron Man Sardar Patel's India.
— PMO India (@PMOIndia) October 31, 2025
It will never compromise on its security or its self-respect. pic.twitter.com/duZFVrI4gJ
Since 2014, our government has dealt a decisive and powerful blow to Naxalism and Maoist terrorism. pic.twitter.com/g2jE7k7pRI
— PMO India (@PMOIndia) October 31, 2025
On Rashtriya Ekta Diwas, our resolve is to remove every infiltrator living in India. pic.twitter.com/W1xYHD9yS9
— PMO India (@PMOIndia) October 31, 2025
Today, the nation is removing every trace of a colonial mindset. pic.twitter.com/zxKL9avri6
— PMO India (@PMOIndia) October 31, 2025
By honouring those who sacrificed their lives for the nation, we are strengthening the spirit of 'Nation First'. pic.twitter.com/CsUFSiiU5l
— PMO India (@PMOIndia) October 31, 2025
To achieve the goal of a Viksit Bharat, we must thwart every conspiracy that seeks to undermine the unity of the nation. pic.twitter.com/fkAB15B8Cu
— PMO India (@PMOIndia) October 31, 2025
The four pillars of India's unity:
— PMO India (@PMOIndia) October 31, 2025
Cultural unity
Linguistic unity
Inclusive development
Connection of hearts through connectivity pic.twitter.com/Yaunu2NBvM
The devotion to Maa Bharti is the highest form of worship for every Indian. pic.twitter.com/FprujcDtIl
— PMO India (@PMOIndia) October 31, 2025


