భారత్‌లాగే ఈశాన్య ప్రాంతమూ వైవిధ్యభరితమే
మా దృష్టిలో ఈస్ట్ (ఈఏఎస్‌టీ) అంటే- సాధికారత, క్రియాశీలత, శక్తి, మార్పు
గతంలో కేవలం సరిహద్దుగా చూసే ఈశాన్య ప్రాంతం నేడు అభివృద్ధికి ఆనవాలు
ఈశాన్యమంటేనే పర్యాటకం
అలజడులను ప్రేరేపించే ఉగ్రవాదమైనా, మావోయిస్టు శక్తులయినా.. మా ప్రభుత్వం ఎంతమాత్రమూ సహించబోదు
ఇంధనం, సెమీకండక్టర్ల వంటి రంగాలకు ఈశాన్య రాష్ట్రాలు కీలక గమ్యస్థానం: ప్రధాని

రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరిత దేశమైన భారత్‌లో ఈశాన్య ప్రాంతం దానికి నెలవుగా ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, సంప్రదాయం, వస్త్ర పరిశ్రమ, పర్యాటక రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయని, ఈ ప్రాంత వైవిధ్యమే దీనికి గొప్ప బలమని ఆయన పేర్కొన్నారు. బయో ఎకానమీ - వెదురు పరిశ్రమ, తేయాకు ఉత్పత్తి - పెట్రోలియం, క్రీడలు - నైపుణ్యాల్లో అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు పర్యాయపదాలుగా ఉన్నాయనీ.. అలాగే పర్యావరణ హిత పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా నిలుస్తున్నాయనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం సేంద్రియ ఉత్పత్తులకు మార్గం సుగమం చేస్తోందని, ఇంధన కేంద్రంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు అష్టలక్ష్ములకు ప్రతీకలనీ, సౌభాగ్యాన్నీ అవకాశాలనూ అందిస్తాయనీ పునరుద్ఘాటించారు. ఈ శక్తితోనే ప్రతీ ఈశాన్య రాష్ట్రం పెట్టుబడులకు, నాయకత్వానికి సంసిద్ధతను ప్రకటిస్తోందన్నారు.

వికసిత భారత సాధనలో తూర్పు భారత్ పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి.. అందునా ఈశాన్య రాష్ట్రాలు ప్రముఖమైనవని స్పష్టం చేశారు. “మా దృష్టిలో తూర్పు కేవలం ఓ దిశ మాత్రమే కాదు.. సాధికారత, కార్యాచరణ, దృఢత్వం, పరివర్తన దిశగా అదొక దార్శనికత. ఈ ప్రాంతం కోసం విధాన రూపకల్పనను ఇది నిర్దేశిస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఈ విధానమే తూర్పు భారతాన్ని, ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని వృద్ధి పథంలో కేంద్ర స్థానంలో నిలిపిందని పేర్కొన్నారు.

 

గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ అభివృద్ధి కేవలం అంకెలకే పరిమితం కాదని, క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. విధానపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. ఈ ప్రాంతంతో ప్రభుత్వానికి ఆత్మీయ అనుబంధముందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు 700 పర్యాయాలకుపైగా పర్యటించారనీ, ఈ ప్రాంత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమనీ చెప్పారు. ప్రజల ఆకాంక్షలను గమనించి, వారి నమ్మకాన్ని అభివృద్ధి విధానాలుగా మలిచామని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులంటే ఇటుకలూ సిమెంటే కాదనీ, అవి భావోద్వేగాలతో ముడిపడిన అంశాలని అన్నారు. లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ దిశగా మార్పును వివరిస్తూ, ఈ క్రియాశీల విధానం స్పష్టమైన ఫలితాలనిస్తోందన్నారు.  “ఒకప్పుడు ఈశాన్య ప్రాంతాన్ని కేవలం ఓ సరిహద్దు ప్రాంతంగా మాత్రమే చూసేవారు. కానీ ఇదిప్పుడు దేశాభివృద్ధి గాథలో ముందంజలో ఉంది’’ అని అన్నారు.

పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా మార్చడంలో, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో బలమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఏ పరిశ్రమకైనా మంచి రహదారులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు వెన్నెముక వంటివన్నారు. అవి వాణిజ్యపరమైన అంతరాయాలను తొలగించి ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తాయన్నారు. మౌలిక సదుపాయాలే అభివృద్ధికి పునాది అని, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ దిశగా బలమైన చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడిది అవకాశాలకు నిలయంగా మారుతోందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలా సొరంగ మార్గం, అస్సాంలోని భూపేన్ హజారికా వంతెన వంటి ప్రాజెక్టులను ఉటంకిస్తూ.. అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈశాన్య భారతం గడచిన దశాబ్దంలో సాధించిన పురోగతిని శ్రీ మోదీ వివరించారు. 11,000 కి.మీ హైవేలు, కొత్త రైల్వే లైన్ల విస్తరణ, రెట్టింపైన ఎయిర్‌పోర్టుల సంఖ్య, బ్రహ్మపుత్ర, బరాక్ నదుల్లో జలమార్గాల అభివృద్ధి, వందల సంఖ్యలో మొబైల్ టవర్ల ఏర్పాటు తదితరమైన వాటి గురించి వివరించారు. పరిశ్రమలకు నమ్మకంగా ఇంధన సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన 1,600 కి.మీ పొడవైన ఈశాన్య గ్యాస్ గ్రిడ్ గురించి సైతం ప్రస్తావించారు. రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, డిటిజల్ అనుసంధానం.. ఇవన్నీ ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావారణాన్ని సృష్టిస్తున్నాయని తెలియజేశారు. వచ్చే దశాబ్దంలో ఈ ప్రాంత వాణిజ్య సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆసియాన్‌తో భారత వాణిజ్యం ప్రస్తుతం 125 బిలియన్ డాలర్లుగా ఉందని, రానున్న కాలంలో ఇది 200 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇది ఈశాన్య ప్రాంతాన్ని వ్యూహాత్మక వాణిజ్య వారధిగా, ఆసియాన్ మార్కెట్లకు ముఖద్వారంగా మారుస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయంగా రవాణా సౌకర్యాలను పెంపొందించే దిశగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాముఖ్యం గురించి తెలియజేశారు. ఇది మయన్మార్ నుంచి థాయ్‌లాండ్ వరకు ప్రత్యక్ష రవాణా సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. అలాగే థాయ్‌లాండ్, వియత్నాం, లావోస్‌తో భారత్‌కు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మిజోరాం మీదుగా కోల్‌కతా పోర్టును మయన్మార్‌లోని సిట్వే నౌకాశ్రయంతో కలిపే కీలక వాణిజ్య మార్గమైన కలదన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను వివరించారు. ఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, మిజోరాం మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించి వాణిజ్యం, పరిశ్రమల వృద్ధిని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

గువహాటి, ఇంఫాల్, అగర్తలా నగరాలను బహుళ విధ సరకు రవాణా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్న అంశాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మేఘాలయ, మిజోరాంలలో ఏర్పాటు చేసిన ల్యాండ్ కస్టమ్ స్టేషన్లు.. అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలను విస్తరింప చేస్తున్నాయన్నారు. ఈ ప్రగతి కార్యక్రమాలే ఇండో-పసిఫిక్ దేశాలతో కొనసాగుతున్న వాణిజ్యంలో నూతన శక్తిగా ఈశాన్య భారతాన్ని మారుస్తున్నాయని వెల్లడించారు. అలాగే పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ ఆరోగ్య, వెల్‌నెస్ పరిష్కారాలను అందించే శక్తిగా మారాలన్న భారత్ ఆకాంక్ష గురించి ప్రధానమంత్రి వివరించారు. హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయి ఉద్యమంగా చేపడుతున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గొప్ప జీవ వైవిధ్యం, పర్యావరణం, ఆర్గానిక్ జీవన విధానం గురించి ప్రస్తావిస్తూ... వెల్‌నెస్‌‌కు అనువైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. హీల్ ఇన్ ఇండియా మిషన్లో కీలకమైన ప్రాంతంగా ఈశాన్య భారతాన్ని అన్వేషించాలని పెట్టుబడిదారులను ప్రధాని కోరారు. ఇక్కడ ఉన్న వాతావరణ, పర్యావరణ వైవిధ్యం.. వెల్‌నెస్ ఆధారిత పరిశ్రమలకు అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు.

ఈశాన్య ప్రాంత ఘనమైన సాంస్కృతిక వారసత్వం గురించి శ్రీ మోదీ వివరించారు. సంగీతం, నృత్యం, వేడుకలతో ఈ ప్రాంతానికి ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇది అనుకూలమైన గమ్యస్థానమని, పూర్తిగా పర్యాటక ప్రాంతమని పేర్కొన్నారు. ఈశాన్య భారతంలోని ప్రతి మూలకు చేరుకుంటున్న అభివృద్ధి ప్రభావం పర్యాటకంపై కనిపిస్తోందని, తద్వారా పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు. ఇవి గణాంకాలు మాత్రమే కాదని... ఈ వృద్ధి ప్రభావం గ్రామాల్లో హోం స్టేలు పెరగడానికి, గైడ్లుగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవడానికి, ప్రయాణ, పర్యాటక రంగం విస్తరణకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈశాన్య పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని మాట్లాడారు. ఎకో టూరిజం, సాంస్కృతిక పర్యాటకంలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా శాంతిభద్రతలు అత్యంత కీలకమైన అంశాలని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని విధానాన్ని మా ప్రభుత్వం అనుసరిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈశాన్య ప్రాంతం ఉద్రిక్తతలు, సంఘర్షణలతో సతమతమైందని, ఇవి ఇక్కడి యువత అవకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. శాంతి ఒప్పందాల దిశగా ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల గురించి వివరిస్తూ.. గడచిన 10-11 ఏళ్లలో 10,000 మందికి పైగా యువత ఆయుధాలు విడిచిపెట్టి శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని వెల్లడించారు. ఈ మార్పే ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలను తీసుకొచ్చిందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన ముద్ర పథకం ప్రభావం గురించి సైతం మోదీ వివరించారు. భవిష్యత్తుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు సహకరించేలా ఈ ప్రాంతంలో పెరిగిన విద్యాసంస్థల సంఖ్య గురించి సైతం ఆయన వెల్లడించారు. ఈశాన్య ప్రాంత యువత ఇంటర్నెట్ వినియోగదారులుగా మాత్రమే పరిమితం కాలేదని, వారు డిజిటల్ ఆవిష్కర్తలుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. 13,000 కి.మీ.కుపైగా ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, 4జీ, 5జీ కవరేజీ, టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న అవకాశాలు వంటి పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో అంకురసంస్థలను ప్రారంభిస్తున్నారు. భారత దేశ డిజిటల్ ముఖద్వారంగా ఈశాన్య ప్రాంతం పోషిస్తున్న పాత్రను బలోపేతం చేస్తున్నారు’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు.

 

వృద్ధిని వేగవంతం చేయడంలో, భవిష్యత్తుకు భద్రత కల్పించడంతో నైపుణ్యాభివృద్ధి పోషించే కీలకప్రాత్ర గురించి ప్రధాని వివరించారు. ఈ విషయంలో ఈశాన్య ప్రాంతం అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తోందన్నారు. ఇక్కడ విద్య, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. గడచిన దశాబ్దంలో ఈశాన్య ప్రాంత విద్యారంగంలో రూ. 21,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని ప్రధానమంత్రి వెల్లడించారు. 800 కొత్త పాఠశాలలు, ఈ ప్రాంతంలోనే మొదటి ఎయిమ్స్, తొమ్మిది కొత్త వైద్య కళాశాలలు, రెండు కొత్త ఐఐఐటీలతో సహా ఇతర కీలక అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వీటికి అదనంగా, మిజోరాంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ క్యాంపస్, దాదాపుగా 200 నూతన నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో మొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఈశాన్య భారతంలోనే అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి ఎనిమిది ఖేలో ఇండియా ఎక్సలెన్స్ సెంటర్లు, 250కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని ఈశాన్య ప్రాంతం దేశానికి అందిస్తోందని, ఇక్కడ ఉన్న అపారమైన సామర్థ్యాన్ని వినియోగించుకొనేలా పరిశ్రమలు, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

సేంద్రియ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుదోందని శ్రీ మోదీ స్పష్టం చేస్తూ, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రతి డైనింగ్ టేబుల్ మీదా భారతీయ బ్రాండ్ ఆహారం ఉండాలన్నది తన కల అనీ, ఈ కలను నెరవేర్చడంలో ఈశాన్య ప్రాంతానిదే ముఖ్యపాత్ర అని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం పరిధి రెండింతలు అయిందనీ, ఈ ప్రాంతం అధిక నాణ్యమైన తేయాకు, అనాస, నారింజ, నిమ్మ, పసుపు, అల్లం వంటివాటిని పండిస్తోందనీ ఆయన వివరించారు. స్థానిక ఉత్పత్తులకు మంచి నాణ్యత, గొప్ప రుచి ఉండటం వల్ల వీటికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంటుందని ఆయన చెప్పారు. భారత సేంద్రియ ఆహార పదార్థాల ఎగుమతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని అందరూ గమనించి అంతకంతకూ విస్తరిస్తున్న ఈ మార్కెటును సొమ్ము చేసుకోవాలంటూ వారిని ఆయన ప్రోత్సహించారు.

ఈశాన్య ప్రాంతంలో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మెరుగైన అనుసంధానం ఇప్పటికే ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందిస్తోందనీ, మెగా ఫుడ్ పార్కులను అభివృద్ధి చేయడానికీ, చలువ గిడ్డంగి సదుపాయాలను విస్తరించడానికీ, పరీక్షలు చేసే ప్రయోగశాలల సదుపాయాలను సమకూర్చడానికీ అదనపు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో నేల, వాతావరణం పామ్ ఆయిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని గుర్తించి ఆయిల్ పామ్ మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. వంట నూనెల కోసం భారత్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూనే, మరో వైపు రైతులకు మంచి ఆదాయాన్ని సంపాదించుకొనే అవకాశాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. ఆయిల్ పామ్ సాగు.. పరిశ్రమలకు ఒక పెద్ద అవకాశాన్ని అందిస్తోందనీ, ఇది ఈ ప్రాంత వ్యావసాయిక సామర్ధ్యాన్ని సద్వినియోగపరుచుకోవడానికి రైతులను ప్రోత్సహించేదేనని ప్రధాని అన్నారు.

 

‘‘వ్యూహాత్మక రంగాలైన ఇంధనం, సెమీకండక్టర్లకు కీలక గమ్యస్థానంగా ఈశాన్య ప్రాంతం ఎదుగుతోంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో జల విద్యుత్తు, సౌర విద్యుత్తులలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సంగతిని ఆయన ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులు ఇప్పటికే ఆమోదం పొందాయని చెప్పారు. ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులకు మించి, సోలార్ మాడ్యూళ్లు, సెల్స్, స్టోరేజి సొల్యూషన్లు, పరిశోధన సహా తయారీలో అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ రంగాల్లో గరిష్ఠ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతూ, ప్రస్తుతం స్వయంసమృద్ధిని ఎంత ఎక్కువగా సాధిస్తే రాబోయే కాలంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని అది అంతగా తగ్గించనూ గలుగుతుందన్నారు. భారత్ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థను బలపరచడంలో అసోం పాత్ర అంతకంతకు పెరుగుతోందని కూడా శ్రీ మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంతంలో నెలకొల్పిన సెమీకండక్టర్ ప్లాంటు నుంచి మొదటిగా భారత్‌లో తయారు చేసిన చిప్‌ను త్వరలోనే పరిచయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఈ ప్రాంతానికి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందంటూ ఆయన అభివర్ణించారు. ఈ అభివృద్ధి అత్యాధునిక సాంకేతిక సంబంధిత అవకాశాలను అందిస్తోందనీ, భారత హై-టెక్ పారిశ్రామిక అభివృద్ధిలో ఈశాన్య ప్రాంత స్థితిని బలోపేతం చేస్తోందనీ ప్రధాని అన్నారు.  

 ‘‘రైజింగ్ నార్త్‌ఈస్ట్... పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు కన్నా మిన్న... ఇది ఒక ఉద్యమం... ఇది కార్యాచరణకు నడుంబిగించాలని ఇస్తున్న పిలుపు’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ప్రగతి, సమృద్ధిలతో భారత్ భవిత నూతన శిఖరాలకు చేరుకొంటుందని ఆయన అన్నారు. సదస్సుకు హాజరైన వ్యాపార రంగ ప్రముఖులపై ప్రధానమంత్రి సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, వృద్ధికి ఊతాన్నివ్వడానికి ఏకంకావాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈశాన్య ప్రాంత సామర్థ్యానికి ప్రతీకగా ఉంటున్న ‘అష్టలక్ష్మి’లో సమూల మార్పును తీసుకురావడానికీ, అభివృద్ధి చెందిన భారత్‌కు మార్గదర్శక శక్తిగా ఈ ప్రాంతాన్ని మలచడానికీ కలిసికట్టుగా పనిచేయాలని ఆసక్తిదారులకు పిలుపునిచ్చారు.   

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా, మణిపుర్ గవర్నరు శ్రీ అజయ్ కుమార్ భల్లా, అసోమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్‌రాడ్ సంగ్మా, మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దుహోమా, నాగాల్యాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ  ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజూమ్‌దార్ తదితర ప్రముఖులు ఉన్నారు.

నేపథ్యం

రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సదస్సును న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతాన్ని అవకాశాలకు నిలయమని ప్రధానంగా చాటిచెబుతూ, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం, కీలక ఆసక్తిదారులు,పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం ఈ శిఖరాగ్ర సదస్సు ఉద్దేశం. 

 

మే 23, 24 లలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందుగా వేర్వేరు కార్యకలాపాలను నిర్వహించారు. వాటిలో అనేక రోడ్ షోలు, కేంద్ర సహకారంతో ఈశాన్య రాష్ట్రాలు నిర్వహించిన రాయబారుల సమావేశాలు, ద్వైపాక్షిక మండళ్ల సమావేశాలు, రాష్ట్రాల రౌండ్‌టేబుల్ సమావేశాలు ఉన్నాయి. శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంత్రిత్వ స్థాయి కార్యక్రమాలు, బిజినెస్-టు-గవర్నమెంట్ సెషన్లు, బిజినెస్-టు-బిజినెస్ సమావేశాలు కూడా నిర్వహించారు. అంకుర సంస్థలతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలుచేస్తున్న వివిధ విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రదర్శనలు కూడా శిఖరాగ్ర సదస్సులో చోటుచేసుకున్నాయి. 

పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధానంగా దృష్టిని సారించిన రంగాలలో పర్యాటకం, ఆతిథ్యం, ఆగ్రో-ఫుడ్ ప్రాసెసింగ్ తత్సంబంధిత రంగాలు, జౌళి, చేనేత, హస్తకళలు, ఆరోగ్యసంరక్షణ, విద్య-నైపుణ్యాల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ, ఇంధనం, వినోదంతోపాటు క్రీడల రంగాలున్నాయి.‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to inaugurate 28th Conference of Speakers and Presiding Officers of the Commonwealth on 15th January
January 14, 2026

Prime Minister Shri Narendra Modi will inaugurate the 28th Conference of Speakers and Presiding Officers of the Commonwealth (CSPOC) on 15th January 2026 at 10:30 AM at the Central Hall of Samvidhan Sadan, Parliament House Complex, New Delhi. Prime Minister will also address the gathering on the occasion.

The Conference will be chaired by the Speaker of the Lok Sabha, Shri Om Birla and will be attended by 61 Speakers and Presiding Officers of 42 Commonwealth countries and 4 semi-autonomous parliaments from different parts of the world.

The Conference will deliberate on a wide range of contemporary parliamentary issues, including the role of Speakers and Presiding Officers in maintaining strong democratic institutions, the use of artificial intelligence in parliamentary functioning, the impact of social media on Members of Parliament, innovative strategies to enhance public understanding of Parliament and citizen participation beyond voting, among others.