కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని (సీఎస్‌పీఓసీ) న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన సముదాయంలో గల సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 2026 జనవరి 15న ఉదయం 10:30కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
కామన్‌వెల్త్‌కు చెందిన 42 దేశాలతో పాటు ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 4 అర్థ స్వయంప్రతిపత్తి కల చట్టసభల స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తారు.
పార్లమెంట్లకు సంబంధించిన వర్తమాన అంశాలనేకం ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ప్రజాస్వామిక సంస్థల్ని సమర్థంగా నిర్వహించడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల పాత్ర, పార్లమెంటులలో కృత్రిమ మేధను ఉపయోగించడం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంటు పనితీరును ప్రజలు ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా అర్థం చేసుకొనేటట్లుగానూ, కేవలం ఓటు వేయడానికే కాకుండా ఇతర విధాలుగా కూడా పౌరులు బాధ్యతగా నడుచుకోవడాన్ని పెంపొందించేటట్లుగానూ అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.


