భారత్‌లాగే ఈశాన్య ప్రాంతమూ వైవిధ్యభరితమే
మా దృష్టిలో ఈస్ట్ (ఈఏఎస్‌టీ) అంటే- సాధికారత, క్రియాశీలత, శక్తి, మార్పు
గతంలో కేవలం సరిహద్దుగా చూసే ఈశాన్య ప్రాంతం నేడు అభివృద్ధికి ఆనవాలు
ఈశాన్యమంటేనే పర్యాటకం
అలజడులను ప్రేరేపించే ఉగ్రవాదమైనా, మావోయిస్టు శక్తులయినా.. మా ప్రభుత్వం ఎంతమాత్రమూ సహించబోదు
ఇంధనం, సెమీకండక్టర్ల వంటి రంగాలకు ఈశాన్య రాష్ట్రాలు కీలక గమ్యస్థానం: ప్రధాని

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!

అరుణోదయ ఈశాన్యం పేరిట ఏర్పాటు చేసిన ఈ మహత్తర వేదికపై నుంచి ఇక్కడి ప్రతిష్ఠను, ఆప్యాయతను, ఆదరాన్ని, అన్నింటినీ మించి భవిష్యత్తుపై ఉప్పొంగే అపార ఆత్మవిశ్వాసాన్ని నేను ప్రత్యక్షంగా, సగర్వంగా అనుభూతి చెందుతున్నాను. కొన్ని నెలల కిందట మనం ఇక్కడి భారత్ మండపంలో అష్టలక్ష్మి ఉత్సవం నిర్వహించుకున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఈశాన్య భారతంలో పెట్టుబడి పండుగ చేసుకుంటున్నాం. చాలామంది పరిశ్రమాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈశాన్య ప్రాంతంపై ప్రతి ఒక్కరికీగల ఆసక్తి, ఉత్సాహం, కొత్త స్వప్నాలకు ఇది ప్రతిబింబం. ఈ సదస్సు విజయం దిశగా కృషిచేసిన అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ ప్రాంతంలో పెట్టుబడులకు అనువైన అద్భుత వాతావరణం సృష్టించాయి. ఇందుకుగాను వ్యక్తిగతంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున అరుణోదయ ఈశాన్య పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూ మీకందరికీ నా శుభాకాంక్షలు.
 

మిత్రులారా!

భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరిత దేశంగా పరిగణనలో ఉంది. అందులో మన ఈశాన్యం అత్యంత వైవిధ్యంతో అలరారే ప్రాంతం. వాణిజ్యం నుంచి సంప్రదాయాల దాకా, వస్త్రాల నుంచి పర్యాటకం వరకూ ఈశాన్యానికిగల వైవిధ్యమే దాని గొప్ప బలం. ఈశాన్యమంటే- జీవ ఆర్థిక వ్యవస్థ, వెదురుకు ప్రతీక.. ఈశాన్యమంటే- తేయాకు ఉత్పత్తి, పెట్రోలియం ప్రతిబింబం.. ఈశాన్యమంటే క్రీడలు-నైపుణ్యానికి నిదర్శనం.. ఈశాన్యమంటే- పర్యావరణ పర్యాటక కూడలిగా ఎదుగుతున్న ప్రాంతం. సేంద్రియ ఉత్పత్తుల సరికొత్త ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనం. ఈశాన్యం ఇంధన శక్తికి కేంద్రం... అందుకే, ఈ ప్రాంతం మన అష్టలక్ష్మి (ఎనిమిది రకాల సౌభాగ్యం). ఈ అష్టలక్ష్మి ఆశీస్సులతో- పెట్టుబడులు పెట్టడానికి, సారథ్యం వహించడానికి  సిద్ధమని ప్రతి రాష్ట్రం గళమెత్తి చాటుతోంది.

మిత్రులారా!

‘వికసిత భారత్’ సంకల్ప సాకారానికి తూర్పు భారతంలో సమగ్రాభివృద్ధి అత్యంత అవశ్యం. ఈ తూర్పు భారతంలో ఈశాన్యం అత్యంత కీలక భాగం. తూర్పు అంటే మా దృష్టిలో కేవలం దిక్కులలో ఒకటి కాదు. ఇది సాధికారతకు, కార్యాచరణకు, బలోపేతానికి, ప్రగతిశీల మార్పునకు సూచిక. తూర్పు భారతం కోసం ఇది మా ప్రభుత్వ విధానం. ఈ విధానంతోపాటు మేమిస్తున్న ప్రాధాన్యం మన తూర్పు, ఈశాన్య ప్రాంతాల ప్రగతిని కీలక దశకు చేర్చింది.

మిత్రులారా!

ఈశాన్యంలో గత 11 సంవత్సరాల ప్రగతిశీల మార్పు కేవలం అంకెలకు పరిమితం కాదు. ఇది క్షేత్రస్థాయిలో మన అనుభవంలో కనిపించే ప్రగతి. ఈశాన్యంతో మా సంధానం ప్రభుత్వ పథకాలతో ఏర్పరచుకున్నది కాదు... అది హృదయానుగత అనుంబంధం. ఈ మాట విని మీరు ఆశ్చర్యపోవచ్చుగానీ, కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతాన్ని 700 దఫాలకుపైగా సందర్శించడం ఇందుకు నిదర్శనం. అయితే, ఈ సందర్శన కేవలం రాకపోకలకు సంబంధించినది కాదు... రాత్రివేళ ఇక్కడ బసచేసి మరీ అన్నిటినీ సమీక్షించడానికి చెందినది. ఈ పర్యటనలలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను వారు ప్రత్యక్షంగా గమనించారు. ప్రభుత్వంపై వారి నమ్మకానికి అనుగుణంగా తమ పర్యటనలను ప్రగతి ఆధారిత విధానంగా రూపుదిద్దారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనను మేం ఇటుకలు-సిమెంటుతో కూడిన నిర్మాణాలు పరిగణించడం లేదు. ఈ ప్రాంతంతో భావోద్వేగ అనుసంధానానికి వాటినొక మాధ్యమంగా తీర్చిదిద్దాం. ‘లుక్ ఈస్ట్’ విధానానికి మించి ‘యాక్ట్ ఈస్ట్’ మంత్రాన్ని అనుసరించాం. ఈ కృషి ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాం. ఒకనాడు ఈశాన్యాన్ని సరిహద్దు ప్రాంతంగా సూచించే పరిస్థితి ఉండగా, నేడు ఇది వృద్ధికి పర్యాయపదంగా మారుతోంది.
 

మిత్రులారా!

అత్యుత్తమ మౌలిక సదుపాయాలు పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయం చేస్తాయి. బలమైన మౌలిక సదుపాయాలున్న ప్రదేశంపై పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మెరుగైన రహదారులు, బలమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, సమర్థ రవాణా-ప్రయాణ  నెట్‌వర్క్ తదితరాలకు ఏ పరిశ్రమకైనా వెన్నెముక వంటివి అనుసంధనం సజావుగా ఉన్నచోట వాణిజ్యం వృద్ధి చెందుతుంది. ఒక్క మాటలో చెబితే... ఎలాంటి ప్రగతికైనా నాణ్యమైన మౌలిక సదుపాయాలే తొలి అవసరం, పునాది కూడా. అందుకే, ఈశాన్యంలో మౌలిక సదుపాయాల విప్లవానికి మేం శ్రీకారం చుట్టాం. లోగడ చిరకాలం నిర్లక్ష్యానికి గురైన ఈశాన్యం అపార అవకాశాలకు నెలవుగా మారుతోంది. ఈ ప్రాంతంలో అనుసంధాన మౌలిక సదుపాయాల కల్పనకు మేం రూ.లక్షల కోట్లలో పెట్టుబడి పెట్టాం. మీరు అరుణాచల్ ప్రదేశ్‌ వెళ్తే ‘సెలా టన్నెల్’ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూడగలరు. అస్సాంలో భూపేన్ హజారికా వంతెన వంటి మెగా ప్రాజెక్టులు మీకు దర్శనమిస్తాయి. కేవలం ఒక దశాబ్దం వ్యవధిలో ఈ ప్రాంతమంతటా 11,000 కిలోమీటర్ల కొత్త రహదారులను మేం నిర్మించాం. వందల కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు నిర్మించాం. ఇక విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కాగా- బ్రహ్మపుత్ర, బరాక్ నదులపై జలమార్గాలు సిద్ధమవుతున్నాయి. వందలాది మొబైల్ టవర్లు ఏర్పాటు కావటమే కాకుండా 1,600 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్, ఈశాన్య గ్యాస్ గ్రిడ్ కూడా సాకారమయ్యాయి. ఇది పరిశ్రమలకు అవసరమైన గ్యాస్ సరఫరాపై భరోసా ఇస్తుంది. సంక్షిప్తంగా- జాతీయ రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, ‘ఐ’వేలు- ఇలా ఈశాన్యంలో అనుసంధానం ప్రతి రూపంలో బలోపేతం అవుతోంది. తద్వారా అన్నివిధాలా అనువైన భూమిక సిద్ధమైంది. ఇక మన పరిశ్రమలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే తరువాయి. ఆ మేరకు తొలి స్పందకులుగా లభించే సానుకూలతను మీరు కోల్పోకూడదని నేను ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా!

ఈశాన్య ప్రాంత వాణిజ్య సామర్థ్యం రాబోయే దశాబ్దంలో అనేక రెట్లు ఇనుమడిస్తుంది. ప్రస్తుతం భారత్-ఆసియాన్ మధ్య వాణిజ్య పరిమాణం దాదాపు 125 బిలియన్‌ డాలర్లు కాగా- త్వరలోనే ఇది 200 బిలియన్ల స్థాయిని అధిగమించగలదు. తద్వారా ఈశాన్య ప్రాంతం ఈ వాణిజ్యానికి బలమైన వారధిగా రూపొందుతుంది. ఇది ఆసియాన్‌కు ప్రవేశ ద్వారం... ఈ దృక్కోణానికి మద్దతుగా అవసరమైన మౌలిక సదుపాయాలను మేం వేగంగా కల్పిస్తున్నాం. భారత్-మయన్మార్-థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి మయన్మార్ ద్వారా థాయిలాండ్‌కు ప్రత్యక్ష అనుసంధానం కల్పిస్తుంది. థాయిలాండ్, వియత్నాం, లావోస్ వంటి దేశాలతో భారత్‌కు సంధాన సౌలభ్యం కలుగుతుంది. కోల్‌కతా ఓడరేవును మయన్మార్‌లోని సిట్వే రేవుతో అనుసంధానించడంతోపాటు మిజోరం మీదుగా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలను మరింతగా కలిపే కలడాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. పశ్చిమ బెంగాల్, మిజోరం మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించే ఈ మార్గం పరిశ్రమలకు, వాణిజ్యానికి ఒక గొప్ప వరం కాగలదు.
 

మిత్రులారా!

గువహటి, ఇంఫాల్, అగర్తల వంటి నగరాలు నేడు బహుళ రవాణా సాధన కూడళ్లుగా రూపొందుతున్నాయి. మేఘాలయ, మిజోరంలలో ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి సరికొత్త ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఈ కృషితో ఇండో-పసిఫిక్ దేశాలతో వాణిజ్యంలో ఈశాన్య ప్రాంతం కొత్త పేరుగా మారుమోగనుంది. అంటే- ఈశాన్య ప్రాంతంలో ఆకాశమే హద్దుగా అపార అవకాశాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. 


 

మిత్రులారా,

భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ అంశాల పరిష్కార ప్రదాతగా నిలిపేందుకు మేము కృషి చేస్తున్నాం. “హీల్ ఇన్ ఇండియా” అన్న మంత్రాన్ని ప్రపంచ మంత్రంగా మార్చడమే మా లక్ష్యం. ఈశాన్య భారతం ప్రకృతి సంపదతో మాత్రమేకాదు -  సేంద్రియ జీవనశైలికి అనువైన గమ్యస్థానంగా కూడా నిలుస్తోంది. అక్కడి జీవవైవిధ్యం, వాతావరణం ఇవన్నీ ఆరోగ్యానికి సహజ వైద్యంలా పనిచేస్తాయి. అందుకే “హీల్ ఇన్ ఇండియా” మిషన్‌లో పెట్టుబడుల అవకాశాల కోసం ఈశాన్యాన్ని అన్వేషించమని నేను కోరుతున్నాను. 

మిత్రులారా,

సంగీతం, నాట్యం, సంబరాలు ఇవన్నీ ఈశాన్య భారత సాంస్కృతిక జీవనవిధానంలో అల్లుకుపోయాయి. అందుకే ఈశాన్యం అంతర్జాతీయ సదస్సులు, సంగీత ప్రదర్శనలు, శుభకార్యాల నిర్వహణకు అద్భుతమైన గమ్యస్థానంగా మారుతోంది. ఏ కోణంలో చూసినప్పటికీ ఈశాన్య భారతం పర్యాటకానికి ఒక సంపూర్ణ ప్యాకేజ్‌లా ఉంది. ఇప్పుడు అభివృద్ధి ఫలితాలు ఈశాన్యానికి ప్రతి మూలకు చేరుతున్నందున, పర్యాటక రంగంపై కూడా సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయింది. ఇది కేవలం గణాంకాల విషయం మాత్రమే కాదు... గ్రామాల్లో విలాసవంతమైన ఇళ్లు వస్తున్నాయి. యువత గైడ్‌లుగా కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. పూర్తిస్థాయి టూర్ అండ్ ట్రావెల్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు మనం ఈ అభివృద్ధిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. పర్యావరణ పర్యాటకం, సాంస్కృతిక పర్యాటక రంగాల్లో మీ అందరి కోసం అనేక పెట్టుబడి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. 

 

మిత్రులారా,

ఏ ప్రాంత అభివృద్ధికయినా శాంతి, శాంతిభద్రతలు ఎంతో అవసరం. దాడులు, మావోయిస్టు దుశ్చర్యలు వంటి సవాళ్లకు సంబంధించి, ఎంతమాత్రం ఉపేక్షించని ‘జీరో  టాలరెన్స్’ విధానాన్ని మా ప్రభుత్వం అనుసరిస్తోంది. ఒకప్పుడు ఈశాన్య ప్రాంతం పేలుళ్లు, ఆయుధాలు, బ్లాక్‌ డౌన్లతోనే గుర్తింపు కలిగి ఉండేది. ఈశాన్య ప్రాంతం ప్రస్తావన వస్తే చాలు - ఈ దృశ్యాలు మనసులో మెదిలేవి. ఇది ఆ ప్రాంత యువతకు అపార నష్టాన్ని కలిగించింది. అనేక అవకాశాలు వారి చేతుల నుంచి జారిపోయాయి. ఇప్పుడు మా దృష్టి ఈశాన్య ప్రాంత యువత భవిష్యత్తుపైనే ఉంది. అందుకే మేము వరస శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాం. యువతకు ప్రధాన అభివృద్ధి స్రవంతిలో చేరే అవకాశాన్ని అందిస్తున్నాం. గత 10-11 సంవత్సరాలలో 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలి శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. నేడు, ఈశాన్య ప్రాంత యువత తమ సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోసం కొత్త అవకాశాలు పొందుతున్నారు. ముద్రా యోజన ద్వారా, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షలాది యువతకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందింది. వృద్ధిచెందుతున్న విద్యాసంస్థలు ఈ యువతకు నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతున్నాయి. ఇప్పుడు ఈశాన్య ప్రాంత యువత కేవలం ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రమే కాకుండా, డిజిటల్ ఇన్నోవేటర్లుగా కూడా మారుతున్నారు. 13,000 కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్, 4జి,  5జి కవరేజ్ వల్ల పెరుగుతున్న సాంకేతిక అవకాశాలతో, యువత ఇప్పుడు తమ సొంత పట్టణాల నుంచే పెద్ద ఎత్తున అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారు. ఈశాన్యం భారతదేశ డిజిటల్ ముఖద్వారంగా మారుతోంది.

మిత్రులారా,

అభివృద్ధి, మెరుగైన భవిష్యత్తు కోసం నైపుణ్యాలు ఎంతగా అవసరమో మనందరికీ తెలుసు. ఈ విషయంలో కూడా ఈశాన్య ప్రాంతం అనుకూల వాతావరణాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతంలోని విద్యా, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత దశాబ్దంలో ఈశాన్య ప్రాంతంలో విద్యారంగంపై  రూ. 21,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 850 కొత్త పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఈశాన్య భారతదేశంలో మొదటి ఎయిమ్స్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.. రెండు కొత్త ఐఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లను కూడా నెలకొల్పారు. మిజోరాంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ( ఐఐఎంసి)  క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతమంతటా సుమారు 200 కొత్త నైపుణ్యాభివృద్ధి సంస్థలను నెలకొల్పారు. దేశంలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయం కూడా అక్కడ నిర్మాణంలో ఉంది. ఖేలో ఇండియా కార్యక్రమం కింద, ఈశాన్య ప్రాంతంలో వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే 8 ఖేలో ఇండియా ప్రతిభా కేంద్రాలు, 250కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు ఉన్నాయి. అంటే అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ ఈశాన్య ప్రాంతంలో అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.

 

మిత్రులారా,

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. నాకు ఒక కల ఉంది. ప్రపంచంలోని ప్రతి భోజన టేబుల్‌పై కనీసం ఒక్క భారతీయ ఆహార బ్రాండ్ అయినా ఉండాలి. ఈ కలను నెరవేర్చడంలో ఈశాన్య ప్రాంతానికి కీలక పాత్ర ఉంది. గత దశాబ్దంలో ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయానికి అవకాశాలు రెట్టింపు అయ్యాయి. మన ప్రాంతం టీ, అనాస, నారింజ, నిమ్మ, పసుపు, అల్లం వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. వీటి రుచి, నాణ్యత నిజంగా అపూర్వమైనవే. ఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్ మీ అందరికీ గొప్ప అవకాశాలను అందిస్తుంది. .

మిత్రులారా,

ఈశాన్య ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును సులభతరం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మెరుగైన కనెక్టివిటీ ఈ దిశగా ఇప్పటికే దోహదపడుతోంది. ఇంకా, మెగా  ఫుడ్ పార్కుల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నెట్‌వర్క్ విస్తరణ, టెస్టింగ్ ప్రయోగశాలల ఏర్పాటు కూడా జరుగుతోంది. ప్రభుత్వం ఆయిల్ పామ్ మిషన్‌ను కూడా ప్రారంభించింది. ఈశాన్య ప్రాంతంలోని నేల, వాతావరణం ఆయిల్ పామ్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఇది మన రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారవచ్చు. అంతేకాకుండా, భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలపై ఆధారాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆయిల్ పామ్ సాగు మన పరిశ్రమలకు కూడా ఒక పెద్ద అవకాశంగా నిలవనుంది.

 

మిత్రులారా,

మన ఈశాన్య ప్రాంతం ఇంకా రెండు కీలక రంగాలలో ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోంది. అవి ఇంధనం, సెమీకండక్టర్ రంగాలు. హైడ్రోపవర్ అయినా, సోలార్ పవర్ అయినా, ఈశాన్యం లోని ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇప్పటికే ఆమోదం లభించింది. ప్లాంట్లు, మౌలిక సదుపాయాల్లోనే కాదు, తయారీ రంగంలో కూడా మీకు ఒక గొప్ప పెట్టుబడి అవకాశం లభించింది. సోలార్ మాడ్యూళ్లు అయినా, సెల్స్ అయినా, స్టోరేజ్ అయినా, లేదా పరిశోధన అయినా ఈ రంగాల్లో మనకు మరిన్ని పెట్టుబడులు అవసరం. ఇదే మన భవిష్యత్. మనం ఇవాళ్టి నుంచి తగినంత ఎక్కువగా ఇందులో పెట్టుబడి పెడితే, మనం విదేశాలపై ఆధారపడవలసిరావడం అంత తక్కువ అవుతుంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం ముఖ్యంగా అస్సాం, దేశంలోని సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతం లోని సెమీకండక్టర్ ప్లాంట్ నుంచి తయారైన మొదటి ‘మేడ్-ఇన్-ఇండియా’ చిప్ దేశానికి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాంట్ ఈ ప్రాంతంలో సెమీకండక్టర్ రంగానికి, ఇతర ఆధునిక సాంకేతికతలకు అవకాశాల ద్వారాలు తెరిచింది.

మిత్రులారా,

రైజింగ్ నార్త్ ఈస్ట్ - అనేది కేవలం పెట్టుబడిదారుల సమావేశం మాత్రమే కాదు... ఇది ఒక ఉద్యమం. ఇది కార్యాచరణకు పిలుపు.. ఈశాన్య ప్రాంత ప్రకాశవంతమైన భవిష్యత్తు మొత్తం భారత్ భవిష్యత్తు కొత్త శిఖరాలను చేరుకుంటుంది. నేను వాణిజ్యవేత్తలపై పూర్తి నమ్మకం కలిగి ఉన్నాను. రండి. మన అష్టలక్ష్మిని ‘వికసిత భారత్’ కోసం ఒక ప్రేరణగా మార్చుకుందాం. ఈ రోజు మన సమష్టి ప్రయత్నాలు, మీ ఉత్సాహం, మీ అంకితభావం ఆశలను నమ్మకంగా మారుస్తున్నాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇంకా మనం రెండో రైజింగ్ నార్త్ ఈస్ట్  సదస్సు నిర్వహించే నాటికి మనం మరింత అద్భుతమైన పురోగతిని సాధించగలమని నాకు పూర్తి విశ్వాసం ఉంది. 

అందరికీ ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry

Media Coverage

Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
First Deputy PM of Russia Denis Manturov calls on PM Modi
April 02, 2026
First Deputy PM Manturov briefs PM on progress in trade, fertilizers, connectivity and people-to-people ties
PM recalls the successful visit of President Putin to India in December 2025
PM expresses satisfaction at the sustained efforts towards implementation of the Summit outcomes
PM extends warm greetings to President Putin

The First Deputy Prime Minister of the Russian Federation, H.E. Denis Manturov, called on Prime Minister Shri Narendra Modi today.

First Deputy PM Manturov briefed PM on the progress in various areas of mutually beneficial cooperation, including trade and economic partnership, fertilizers, connectivity and people-to-people ties.

PM recalled the successful visit of President Putin to India in December 2025 for the 23rd India-Russia Annual Summit.

He expressed satisfaction at the sustained efforts being made by both sides towards implementation of the outcomes from the Annual Summit, aimed at further strengthening the India- Russia Special and Privileged Strategic Partnership.

PM extended warm greetings to President Putin and said that he looked forward to their continued exchanges.