ఈరోజు గొప్ప వాణిజ్య, పర్యాటక కేంద్రంగా మారిన కచ్ రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద పాత్ర పోషించబోతోంది: ప్రధాని
సముద్ర ఉత్పత్తుల నుంచి పర్యాటకం, వాణిజ్యం వరకు తీరప్రాంతాలలో భారత్ కొత్త సానుకూల వ్యవస్థను నిర్మిస్తోంది: ప్రధాని
ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడమే మా విధానం: ప్రధానమంత్రి
మానవతను కాపాడటం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ ఆపరేషన్ సిందూర్: ప్రధాని
ఉగ్రవాద కేంద్రాలు ఎక్కడున్నదీ భారత్ కు ముందే తెలుసు
గురి చూసి కొట్టేశాం... ఇది మన సాయుధ దళాల శక్తికీ, క్రమశిక్షణకీ సూచిక: ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కచ్  ప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విప్లవకారులను, వీరమరణం పొందిన యోధులను ప్రత్యేకించి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మను ప్రధాని స్మరించుకున్నారు. కచ్ కు చెందిన పుత్రులు, పుత్రికల ధైర్యం, సంకల్పం సేవలను ప్రధాని ప్రశంసించారు. వారికి అభివాదం తెలియజేశారు.

పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూ, శ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.

 

కచ్ తో తమ ప్రగాఢ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఈ జిల్లాను ఎన్నోసార్లు సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ భూమి తన జీవన దిశను రూపుదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఇప్పుడు జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. నర్మదా నదీ జలాలు కచ్ ప్రాంతానికి చేరినప్పుడు తన అదృష్టంగా భావించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు నుంచే తాను తరచూ కచ్ కి వచ్చేవాడినని, జిల్లా కార్యాలయంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడినని తెలిపారు. కచ్ రైతుల ధృఢ సంకల్పాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వారి స్ఫూర్తి ఎప్పుడూ గొప్పదిగా ఉండేదని ప్రశంసించారు. ఈ ప్రాంతంలో గడిపిన అనేక సంవత్సరాల అనుభవం కచ్ అభివృద్ధికి తాను చేసిన కృషికి ఎంతో తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు. 

అద్భుతమైన విజయాన్ని సాధించడంలోనమ్మకం, నిరంతర శ్రమ శక్తిని కచ్ రుజువు చేసిందని ప్రధాని అన్నారు. ఒక భయానక భూకంపం అనంతరం ఈ ప్రాంత భవిష్యత్తుపై చాలామందిలో అనిశ్చితి సందేహాలు తలెత్తాయని, అయితే, కచ్  మళ్లీ నిలబడుతుందనే నమ్మకం తనకు ఎప్పుడూ ఉందని, ఆ విశ్వాసాన్ని ప్రజలే సాకారం చేసారని ఆయన అన్నారు. “ఈరోజు  కచ్ వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకానికి ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది” అని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంత పాత్ర మరింత విస్తరించబోతోందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. కచ్ వేగవంతమైన అభివృద్ధిని చుస్తున్నందుకు, దానికి తోడ్పాటుగా ఉండగలిగినందుకు ఆయన సంతోషాన్ని  వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధికి  ఉద్దేశించిన రూ. 50,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు భారత్‌ ప్రముఖ నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ) గా, హరిత ఇంధనానికి అంతర్జాతీయ కేంద్రంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు గానూ కచ్  ప్రజలను ప్రధాని హృదయపూర్వకంగా అభినందించారు.

“కచ్  ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా ఎదుగుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా అభివర్ణిస్తూ, దాని విప్లవాత్మక సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు. కార్లు, బస్సులు, వీధిదీపాలు వంటి వాటిని త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా నడపబోతున్నామని, ఇది భారత ఇంధన రంగాన్ని సంపూర్ణంగా మార్చివేసే మార్గంలో ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లలో కాండ్లా ఒకటిగా ఉన్నదని ఆయన తెలిపారు. కచ్ లో కొత్త గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, ఈ కేంద్రంలో ఉపయోగించే సాంకేతికత పూర్తిగా “మేడ్ ఇన్ ఇండియా” అని ఆయన తెలిపారు. భారతదేశ సౌర విప్లవంలో కూడా కచ్ కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొంటూ, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉందని ఆయన తెలిపారు. ఖావ్డా కాంప్లెక్స్ ఏర్పాటుతో కచ్ ప్రపంచ ఇంధన పటంలో తన స్థానం సుస్థిర పరుచుకుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ప్రజలపై విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గిస్తూ సరిపడా విద్యుత్ అందేలా చూసుకోవటంలో ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించిన ప్రధాని.. గుజరాత్‌లో ఇప్పటికే లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన పీఎం సూర్య గర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానంగా ప్రస్తావించారు. సముద్రతీర ప్రాంతాల ఆర్థిక ప్రాముఖ్యతపై మాట్లాడుతూ.. సముద్ర రంగ అభివృద్ధి అనేక దేశాల వృద్ధిలో కీలకమైనదిగా ఉందని అన్నారు. భారతదేశ సుసంపన్న వారసత్వం, చారిత్రక వాణిజ్యం, అభివృద్ధికి ధోల వీరా, లోథాల్ వంటి ప్రాచీన ఓడరేవు నగరాలను ప్రధాన ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని ప్రేరణగా తీసుకొని ఓడరేవుల కేంద్రంగా నగరాలను విస్తరించాలన్న దార్శనికతపై ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. సముద్ర ఆహరం, పర్యాటకం, వాణిజ్యం కలగలిసిన కొత్త సముద్ర వ్యవస్థను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఓడరేవులను ఆధునికీకరించడం, విస్తరించడంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని.. ఇప్పటికే ఇది మంచి ఫలితాలకు దారితీసిందని అన్నారు. మొదటిసారిగా ప్రధాన ఓడరేవులు ఒక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 15 కోట్ల టన్నుల సరుకును సరఫరా చేశాయని, ఇందులో కాండ్లా ఓడరేవు కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భారత సముద్ర వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు కచ్ ఓడరేవు ద్వారా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను గుర్తించామని.. కాండ్లా, ముంద్రా ఓడరేవులలో సామర్థ్యం, అనుసంధాతను నిరంతరం మెరుగుపరుస్తున్నట్లు తెలియజేశారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కొత్త జెట్టీ, మెరుగుపరిచిన కార్గో నిల్వ సదుపాయంతో సహా పలు సరుకు రవాణా సంబంధిత సౌకర్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. సముద్ర రంగంపై పెరిగిన ప్రభుత్వ దృష్టిని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. ఈ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. నౌకానిర్మాణ ప్రాముఖ్యతపై కూడా ప్రధానంగా మాట్లాడారు. భారత్ దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల కోసం కూడా పెద్ద నౌకలను తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు సముద్ర రంగంలో దేశ యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు.

కచ్‌కు తన వారసత్వ సంపద పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రస్తావించిన మోదీ.. అదే ఇప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో చోదక శక్తిగా మారిందని అన్నారు. భుజ్‌లో వస్త్రాలు, ఆహార శుద్ధి, సిరామిక్స్, ఉప్పు తయారీ వంటి వివిధ పరిశ్రమలలో గత రెండు దశాబ్దాల్లో కనిపించిన అద్భుతమైన వృద్ధిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కచ్ ఎంబ్రాయిడరీ, బ్లాక్ ప్రింటింగ్, బంధాని వస్త్రం, తోలు పని వంటి కచ్ సంప్రదాయ చేతిపనులకు విస్తృత గుర్తింపు వచ్చిందని అన్నారు. భుజోడి గ్రామాన్ని చేనేత కళకు సంబంధించిన సజీవ మ్యూజియంగా వర్ణించారు. అజ్రాఖ్ ప్రింటింగ్ సంప్రదాయం ప్రత్యేకతను ప్రశంసించారు. దీనికి ఇప్పుడు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ వచ్చిందని, దీనితో ఈ కళకు సంబంధించిన అధికారిక మూలంగా కచ్‌కు గుర్తింపు లభించిందని అన్నారు.
ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. గిరిజన కుటుంబాలు, చేతివృత్తులవారికి ఇది చాలా ముఖ్యమని.. ఇది వారి సాంస్కృతిక గుర్తింపు, హస్తకళలను బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.

 

తోలు, వస్త్ర పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రకటించిన పలు కీలక విషయాలను ప్రధానంగా తెలిపిన ఆయన.. ఈ రంగాలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

కచ్‌లోని కష్టపడి పనిచేసే రైతులను ప్రశంసించిన ఆయన.. సవాళ్లను అధిగమించడంలో వారి పట్టుదలను ప్రస్తావించారు. గుజరాత్‌లో భూగర్భ జలాలు తీవ్రంగా క్షీణించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సమయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నర్మదా ఆశీస్సులు, ప్రభుత్వం అంకితభావంతో చేపట్టిన పనులతో  పరిస్థితి మారిపోయిందన్నారు. కచ్ గమనాన్ని మార్చటంలో కెవాడియా నుంచి మోడ్కుబా వరకు కాలువ విస్తరణ పోషించిన కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. నేడు కచ్ నుంచి మామిడి, ఖర్జూరం, దానిమ్మ, జీలకర్ర, డ్రాగన్ ఫ్రూట్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత గతాన్ని గుర్తుచేసుకుంటూ.. పరిమిత అవకాశాల కారణంగా కచ్ ఒకప్పుడు వలసలను ఎదుర్కొందని, అయితే సాధించిన అద్భుతమైన పురోగతితో స్థానిక యువత ఇప్పుడు కచ్‌లోనే ఉపాధిని పొందుతున్నారని అన్నారు. ఇది ఈ ప్రాంతంలో జరుగుతోన్న అభివృద్ధిని తెలియజేస్తుందన్నారు. 

 

భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం తమ ప్రభుత్వానికి కీలకమైన ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పర్యాటకం పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించగల రంగమని అన్నారు. కచ్ దాని గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యంతో ఈ రంగంలో విస్తరించేందుకు అనుకూల స్థితిలో ఉందని ప్రధానంగా ప్రస్తావించారు. కచ్‌లో జరిగే రణ్ ఉత్సవ్‌‌కు సంబంధించి పెరుగుతోన్న ప్రజాదరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకుంటుందని అన్నారు. స్మృతి వాన్ స్మారక చిహ్నాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. యునెస్కో దీనిని ప్రపంచంలోని అత్యంత అందమైన మ్యూజియంలలో ఒకటిగా గుర్తించిందని గుర్తు చేశారు. కచ్ పర్యాటక పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో మరింత వృద్ధిని సాధిస్తుందని.. ధోర్డో గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని వ్యాఖ్యానించారు. మాండ్వి సముద్ర తీరం సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా అభివృద్ధి చెందుతోందని.. పర్యాటక సామర్థ్యాన్ని మరింత పెంచడానికి రణ్ ఉత్సవ్ సందర్భంగా మాండ్విలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని గుజరాత్ ముఖ్యమంత్రిని కోరారు. అహ్మదాబాద్, భుజ్ మధ్య నమో భారత్ రాపిడ్ రైలు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత పెంచుతుందని అన్నారు. 

2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుగా మే 26 తనకు ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. పర్యాటక రంగాన్ని ప్రజలను అనుసంధానించే మార్గంగా భారత్ బలంగా విశ్వసిస్తుందని పునరుద్ఘాటించారు, అయితే పాకిస్తాన్ వంటి దేశాలు పర్యాటకానికి బదులుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. "ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింది.. భారత్ దానిని ఏమాత్రం ఉపేక్షించని విధానంతో ముందుకు సాగుతోంది" అని ఆయన పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రస్తావిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న దృఢ వైఖరిని ఈ మిషన్ స్పష్టం చేసిందని ప్రధానమంత్రి తెలిపారు. భారత పౌరులకు హాని కలిగించే ఏ ప్రయత్నానికైనా అదే భాషలో అంతే గట్టిగా ప్రతిస్పందన ఉంటుందన్న ఆయన, భారతదేశాన్ని సవాలు చేసే ధైర్యం చేసే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు.

 

"ఆపరేషన్ సిందూర్ మానవత్వాన్ని రక్షించే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించే ఒక లక్ష్యం" అని ప్రధానమంత్రి వివరించారు. ఏప్రిల్ 22 ఘటన తర్వాత బీహార్‌లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలను, వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని చేసిన ప్రతిజ్ఞను ఆయన గుర్తు చేసుకున్నారు. పహల్గామ్ దాడులు జరిగి పక్షం రోజులు గడిచినా కూడా ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకోని సందర్భంలో, వారికి గట్టి జవాబు ఇచ్చేందుకు భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన తెలిపారు. భారత్ తన సాయుధ దళాల సామర్థ్యాన్ని, క్రమశిక్షణను ప్రదర్శిస్తూ కచ్చితత్వంతో ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు. ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో నిర్మూలించ గల భారత సత్తాను ప్రపంచానికి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ చేపట్టిన నిర్ణయాత్మక చర్యల తర్వాత పాకిస్తాన్ భయాందోళనకు గురైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  భారతీయ పౌరులపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిందని, అయితే రెట్టింపు బలంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంటూ, వారి సైనిక స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేసిందని ఆయన తెలిపారు. "పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలను భారత్ నాశనం చేయడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది" అని ఆయన అన్నారు. సాయుధ దళాల అసాధారణ నైపుణ్యం, ధైర్యం, కచ్చితత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

పాకిస్తాన్ సైన్యం భుజ్ వైమానిక స్థావరంపై దాడి చేసిన 1971 చారిత్రాత్మక యుద్ధాన్ని గుర్తుచేసుకుంటూ, నాటి విపత్కర పరిస్థితుల్లో వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించిన భుజ్ మహిళల అసాధారణ ధైర్యసాహసాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిరంతరం పాకిస్తాన్ బాంబు దాడుల మధ్య, భుజ్ మహిళలు 72 గంటల్లో వైమానిక స్థావరాన్ని పునర్నిర్మించి, దాని కార్యాచరణ పునరుద్ధరణకు వీలు కల్పించారని ఆయన వివరించారు. ఈ ధైర్యవంతులైన మహిళలను కలిసే అవకాశం గతంలో తనకు లభించిందన్న ప్రధానమంత్రి, కఠినమైన పరిస్థితుల్లో వారు చూపిన తెగువ, అందించిన సహకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

 

"సీమాంతర ఉగ్రవాదానికి, దానిని ప్రోత్సహించే వారికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతోంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ శతృత్వం... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులతోనే కొనసాగుతోంది. ఏ దేశానికి చెందిన ప్రజలతోనూ కాదని ఆయన వివరించారు. కచ్ నుంచి పాకిస్తాన్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆ దేశ ప్రజలు వారి వాస్తవిక పరిస్థితిని గుర్తించాలని ప్రధానమంత్రి కోరారు. వారి ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని సంపాదనకు మార్గంగా ఉపయోగిస్తూ వారికి మద్దతు ఇస్తున్నాయన్నారు. ఈ మార్గం నిజంగా వారికి ప్రయోజనం కలిగిస్తుందా అని ఆలోచించాలని పాకిస్తాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అధికార ఆధారిత ఎజెండాలు పాకిస్తాన్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయని, వారి పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద మహమ్మారిని వదిలించుకోవాలంటే, ఆ దేశ ప్రజలు ఒక వైఖరి తీసుకొని, ఉగ్రవాద నిర్మూలన కోసం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.

భారత్ స్పష్టమైన దిశలో ముందుకుసాగుతోందని.. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సుల మార్గాన్ని ఎంచుకుందని ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన దేశంగా మారే భారత ప్రయాణంలో కచ్ స్ఫూర్తి ఎంతో ప్రేరణనిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే, కచ్ నూతన సంవత్సరాన్ని జరుపుకోనున్న సందర్భంగా అక్కడి ప్రజలకు ఆషాఢీ బీజ్‌ కోసం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కచ్ ప్రజల అద్భుతమైన పురోగతి, కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం వారికి అభినందనలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

గుజరాత్‌లోని భుజ్‌లో రూ.53,400 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ఖావ్డా పునరుత్పాదక ఇంధన పార్కులో ఉత్పత్తి చేసే విద్యుత్తును తరలించే ప్రసార ప్రాజెక్టులు, ప్రసార నెట్‌వర్క్ విస్తరణ, తాపి వద్ద అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ వంటి విద్యుత్ రంగ ప్రాజెక్టులు, అలాగే కాండ్లా ఓడరేవు ప్రాజెక్టులు, గుజరాత్ ప్రభుత్వ బహుళ రహదారులు, జల, సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event

Media Coverage

‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”