యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు గౌరవనీయ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవనీయ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఉభయులతోనూ మాట్లాడారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులుగా భారత్-ఈయూలు నమ్మకం, ఉమ్మడి విలువలు, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం ఆధారంగా ఏర్పడిన బలమైన, సన్నిహిత సంబంధాన్ని పంచుకుంటున్నాయి. ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడంలో, సుస్థిరతను పెంపొందించడంలో, పరస్పర శ్రేయస్సు కోసం నియమాల ఆధారిత క్రమాన్ని ప్రోత్సహించడంలో భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్య పాత్రను నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.
వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, సుస్థిరత, రక్షణ, భద్రత, సమర్థ సరఫరా వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని నేతలు స్వాగతించారు. భారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చలను త్వరగా ముగించడం, ఐఎమ్ఈఈసీ కారిడార్ అమలు పట్ల ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ చారిత్రాత్మక భారత పర్యటన ఆధారంగా.. పరస్పర సౌలభ్యం కోసం వీలైనంత త్వరగా భారత్‌లో తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం గురించి నేతలు చర్చించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరువురు నేతలను ఈ సమావేశంలో పాల్గొనడం కోసం భారత్‌కు ఆహ్వానించారు.
ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నాలు సహా పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రపంచస్థాయి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడం, శాంతి-సుస్థిరతలను త్వరగా పునరుద్ధరించడం కోసం భారత్ స్థిరమైన మద్దతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
సంప్రదింపులు కొనసాగించడానికి నేతలు అంగీకరించారు.


