xసెప్టెంబర్ 22 నుంచి అమలులోకి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు
జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభానికి గుర్తుగా ఈ తేదీ నిలిచిపోతుంది
కొత్త జీఎస్టీ విధానంతో ప్రతి పౌరుడికీ చేరనున్న ప్రయోజనాలు
జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి వేగవంతం
కొత్త సంస్కరణలతో జీఎస్టీలో కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్‌లు
తక్కువ జీఎస్టీతో పౌరుల కలల సాకారం సులభతరం
నిస్వార్థ ప్రజా సేవను ప్రతిబింబిస్తున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు: ప్రధాని
దేశానికి అవసరమైనవీ.. మనం తయారు చేయగలవీ అన్నీ దేశంలోనే తయారు చేయాలి
స్వయం-సమృద్ధితోనే భారత శ్రేయస్సు బలోపేతం
మన దేశంలో తయారైన ఉత్పత్తులే కొనుగోలు చేద్దాం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. శక్తిని పూజించే పండుగ నవరాత్రి ప్రారంభం సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి మొదటి రోజు నుంచే దేశం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో కీలక ముందడుగు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 22న సూర్యోదయం నుంచే దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయన్నారు. ఇది భారత్ అంతటా జీఎస్టీ బచత్ ఉత్సవ ప్రారంభాన్ని సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండుగ పొదుపును పెంచుతుందనీ.. ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు పండుగ ప్రయోజనాలు పేదలు, మధ్యతరగతి, నవ మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమానంగా చేరుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్‌లో ప్రతి కుటుంబం రెట్టింపు ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ పొదుపు పండుగ కోసం దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్కరణలు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయని.. వ్యాపార కార్యకలాపాలనూ సులభతరం చేస్తాయని.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అభివృద్ధి పోటీలో ప్రతి రాష్ట్రం సమాన భాగస్వామిగా మారుతుందనీ ఆయన ఆకాంక్షించారు. 

2017లో భారత్ జీఎస్టీ సంస్కరణల దిశగా తొలి అడుగులు వేయడం ద్వారా పాత అధ్యాయానికి ముగింపు పలికి.. దేశ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని గుర్తుచేశారు. దశాబ్దాలుగా పౌరులు, వ్యాపారులు ఆక్టోయ్, ప్రవేశ పన్ను, సేల్స్ టాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సేవా పన్నుల వంటి సంక్లిష్టమైన పన్నుల వలయంలో చిక్కుకుని ఇబ్బదులు ఎదుర్కొన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువులను రవాణా చేయడానికి అనేక చెక్‌పోస్టులను దాటడం.. అనేక ఫారమ్‌లను పూరించడం.. ప్రతి చోటా వివిధ రకాల పన్నుల నిబంధనలను ఎదుర్కోవడం వంటి కష్టాలు ఉండేవన్నారు. 2014లో ప్రధానమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఒక విదేశీ వార్తాపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఉటంకిస్తూ తన వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులను పంపడం చాలా కష్టంగా భావించిన ఒక కంపెనీ ఎదుర్కొన్న సవాళ్లను ఆ వ్యాసంలో చక్కగా వివరించారన్నారు. కేవలం 570 కిలోమీటర్ల దూరం సరుకులను పంపడం కష్టమై ఆ సంస్థ ఏకంగా బెంగళూరు నుంచి సరుకులను యూరప్‌కు పంపి.. ఆపై వాటిని తిరిగి హైదరాబాద్‌కు రవాణా చేసుకునేందుకు మొగ్గుచూపడం గురించి ఆ వ్యాసం చక్కగా వివరించిందని తెలిపారు.

 

పన్నులు, టోల్‌ ఇబ్బందుల కారణంగా ఆ రోజుల్లో పరిస్థితులు దిగజారిపోయినట్లు ప్రధానమంత్రి తెలిపారు. అలాంటి లెక్కలేనన్ని సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఒకటని ఆయన పునరుద్ఘాటించారు. బహుళ పన్నుల సంక్లిష్ట వలయం కారణంగా లక్షలాది కంపెనీలు, కోట్లాది పౌరులు ప్రతిరోజూ ఇబ్బందులు పడేవారన్నారు. ఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తువులను రవాణా చేయడంలో పెరిగిన ఖర్చును చివరికి పేదలే భరించాల్సి వచ్చేదనీ.. ఎందుకంటే వినియోగదారుల నుంచే వారు ఆ మొత్తాన్ని తిరిగి పొందేవారని శ్రీ మోదీ తెలిపారు. 

దేశాన్ని పన్ను సంక్లిష్టతల నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో 2014లో తమ ప్రభుత్వం ప్రజల, దేశ ప్రయోజనాల కోసం జీఎస్టీకి ప్రాధాన్యమిచ్చిందని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులతో విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడంతో పాటు రాష్ట్రాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించామని ప్రధానమంత్రి తెలిపారు. అన్ని రాష్ట్రాల ఐక్యతతోనే స్వతంత్ర భారతంలో ఇంతటి గొప్ప పన్ను సంస్కరణ సాధ్యమైందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితంగా దేశం బహుళ పన్నుల ఇబ్బందుల నుంచి విముక్తి పొందిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకరీతి వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను కల సాకారమైందని ఆయన ధ్రువీకరించారు.

సంస్కరణలను నిరంతర ప్రక్రియగా పేర్కొన్న ప్రధానమంత్రి.. కాలం మారుతున్న కొద్దీ.. జాతీయ అవసరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తదుపరి తరం సంస్కరణలు కూడా అంతే కీలకం అవుతాయన్నారు. దేశ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి వెల్లడించారు. కొత్త విధానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అంటే రోజువారీ ఉపయోగించే అనేక వస్తువులు మరింత సరసమైనవిగా మారుతాయన్నారు. ఆహార పదార్థాలు, మందులు, సబ్బులు, టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్, ఆరోగ్య, జీవిత బీమా వంటి అనేక వస్తువులు, సేవలు పన్ను లేకుండా లేదా 5 శాతం పన్ను జాబితాలో ఉన్నాయన్నారు. గతంలో 12 శాతం పన్ను విధించిన వస్తువుల్లో దాదాపుగా 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి తెచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.

గత పదకొండు సంవత్సరాల్లో, 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడి ఒక ముఖ్య మధ్యతరగతి వర్గంగా ఎదిగారనీ, వీరు దేశ ప్రగతిలో కీలక పాత్రను పోషిస్తున్నారనీ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మధ్యతరగతి ప్రజలకు వారివంటూ ఆకాంక్షలూ, కలలూ ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును కానుకగా ప్రకటించి, మధ్యతరగతి ప్రజల జీవనంలో ఎంతో సౌలభ్యంతో పాటు అనుకూలతను కూడా అందించిందన్నారు. ఇప్పుడు ప్రయోజనాలను పొందాల్సిన వంతు పేదలదీ, మధ్య తరగతి ప్రజలదీ అని ఆయన అన్నారు. వారు .. మొదట ఆదాయపు పన్నులో ఉపశమనాన్నీ, ఇప్పుడు జీఎస్టీలో తగ్గింపునూ.. ఇలా రెండు విధాలుగానూ లాభాన్ని అందుకొంటున్నారని ఆయన వివరించారు. జీఎస్టీ రేట్లను తగ్గించడంతో, దేశ పౌరులు వారి వ్యక్తిగత కలలను నెరవేర్చుకోవడం సులభతరమవుతుందన్నారు. ఇంటిని నిర్మించుకోవడం కావచ్చు, ఒక టీవీని గాని లేదా రిఫ్రిజిరేటరును గాని , లేదా ఒక స్కూటరునో, మోటర్‌సైకిల్‌నో, లేదా కారునో కొనడం కావచ్చు.. ఇక అన్నీ చౌకగా లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రయాణం చేయాలన్నా, అందుకు కూడా తక్కువ ఖర్చే అవుతుందనీ, దీనికి కారణం చాలా వరకు హోటల్ గదులపై జీఎస్టీని తగ్గించడమేననీ ఆయన చెప్పారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో దుకాణదారుల ఉత్సాహభరిత స్పందన చూసి తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. వారు జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి చురుగ్గా ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. చాలా చోట్ల సంస్కరణలకు ముందు, సంస్కరణల తరువాత.. ఇలా ధరల్లో పోలికలను తెలిపే బోర్డులను అందరికీ కనిపించేటట్లు ప్రదర్శిస్తున్నారని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  

 

‘నాగరిక్ దేవోభవ’ (పౌరులు దేవుళ్లతో సమానం) అనే స్ఫూర్తి కొత్త తరం జీఎస్టీ సంస్కరణల్లో సూటిగా వ్యక్తం అవుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ఆదాయపు పన్నులో ఊరటకు జీఎస్టీ తగ్గింపులను కూడా కలుపుకొంటే, గత ఏడాది కాలంగా తీసుకున్న నిర్ణయాలతో దేశ ప్రజలకు రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తమే ఆదా అవుతుందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అందుకే దీనిని తాను ‘బచత్ ఉత్సవ్’ (పొదుపు ఉత్సవం)గా అభివర్ణిస్తున్నానని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
 
‘అభివృద్ధి చెందిన భారత్‌’ లక్ష్యాన్ని సాధించాలంటే స్వయంసమృద్ధి బాటలో ముందుకు సాగడానికి తిరుగులేని నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారత్‌ను స్వయంసమృద్ధి మార్గంలో దూసుకుపోయేటట్లు చేయడంలో ప్రధాన బాధ్యత ఎంఎస్ఎంఈల.. మన దేశ సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమలపై.. ఉందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలను గమనించి వాటినన్నింటినీ తీర్చేందుకు, ఆ వస్తువులు, సేవలను దేశంలోనే తయారు చేసేందుకు వీలు ఉన్నప్పుడు వాటిని మన దగ్గరే ఉత్పత్తి చేసి తీరాలని ఆయన ఉద్ఘాటించారు.  
 
తగ్గించిన జీఎస్టీ, సులభతరంగా మార్చిన ప్రక్రియలు దేశ ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమలతో పాటు కుటీర వాణిజ్య సంస్థలకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనాలను అందిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ సంస్కరణలు ఆయా సంస్థల అమ్మకాలకు ఊతాన్నివ్వడమే కాకుండా పన్నుల భారాన్ని కూడా తగ్గిస్తూ, రెండు విధాల ప్రయోజనాలను సమకూరుస్తాయని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈలపైన పెద్ద ఆశలు పెట్టుకొన్నామనీ, భారతదేశ సమృద్ధి శిఖర స్థాయిలో ఉన్న వేళ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఎంఎస్ఎంఈలు చరిత్రాత్మక పాత్రను పోషించాలనీ ప్రధానమంత్రి చెప్పారు. భారత్‌లో తయారీ, ఉత్పాదనల నాణ్యత ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయనీ, మన ఉత్పాదనలు శ్రేష్ఠమైనవిగా ఉన్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ఆ గౌరవాన్ని మళ్లీ దక్కించుకోవాల్సిన అవసరం ఉందనీ, చిన్న పరిశ్రమలు రూపొందించే ఉత్పాదనలు అత్యున్నత స్థాయి ప్రపంచ ప్రమాణాలకు తప్పకుండా సాటి రావాలనీ విజ్ఞప్తి చేశారు. భారత తయారీ ప్రక్రియ గౌరవంతో, శ్రేష్ఠత్వంతో అన్ని ప్రమాణాలనూ అధిగమించాలనీ, భారతీయ ఉత్పాదనల నాణ్యత మన దేశానికి ప్రపంచంలో గుర్తింపుతో పాటు ప్రతిష్టను తప్పక పెంచాలనీ ఆయన సూచించారు. ఆసక్తిదారులంతా ఇదే ధ్యేయంతో పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  
 
స్వదేశీ మంత్రం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శక్తిమంతం చేసినట్లుగానే, సమృద్ధి దిశగా  త్వరత్వరగా అడుగులు వేసేలా దేశానికి ఉత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. విదేశీ వస్తువులు అనేకం మనకు తెలియకుండానే మన నిత్య జీవనంలో భాగం అయిపోయాయనీ, ప్రజలు వారి జేబులోని దువ్వెన విదేశంలో తయారైందా, లేక స్వదేశంలో తయారైందా అనే సంగతినైనా గ్రహించని సందర్బాలే ఎక్కువని ఆయన అన్నారు. ఇలా ప్రతిదానికీ ఆధారపడిపోవడాన్నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. మన దేశ యువత కష్టపడి, చెమటోడ్చి ఇండియాలోనే తయారు చేసిన ఉత్పాదనలను కొనండి అంటూ ప్రజలను ప్రధానమంత్రి కోరారు. ప్రతి కుటుంబం స్వదేశీకి ప్రతీకగా నిలవాలి, ప్రతి దుకాణమూ దేశీయంగా తయారు చేసిన వస్తువులతోనే కళకళలాడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేను స్వదేశీ వస్తువులనే కొంటాను’’, ‘‘నేను స్వదేశీ వస్తువులనే అమ్ముతాను’’.. ఇలా చెబుతూ స్వదేశీ విషయంలో నిబద్ధతను సగర్వంగా చాటుకోండి అంటూ ప్రజలను ప్రధానమంత్రి ప్రోత్సహించారు. ఈ మనస్తత్వం దేశంలో ప్రతి ఒక్కరిలో ఇమిడిపోయి తీరాలని ఆయన అన్నారు. ఈ విధమైన మార్పు భారత్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌తో పాటు స్వదేశీ ప్రచార ఉద్యమాలను క్రియాశీలంగా సమర్థించడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ ప్రాంతాల్లో తయారీకి పూర్తి శక్తితోనూ, ఉత్సాహంతోనూ ఉత్తేజాన్ని నింపాలనీ, పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా ముందడుగు వేసినప్పుడు స్వయంసమృద్ధ భారత్ కల నెరవేరుతుందనీ, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనీ, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనీ ఆయన స్పష్టం చేశారు.  ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించే ముందు, దేశ ప్రజలకు జీఎస్టీ బచత్ ఉత్సవ్‌తో పాటు నవరాత్రి శుభ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.‌‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions