అన్నింటి కంటే ముందుగా ఈరోజు నన్ను స్వయంగా విమానాశ్రయానికి ఆహ్వానించడానికి వచ్చినందుకు అధ్యక్షుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాపార సంస్థల నాయకులతో ఇంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా గురించి, ఇరు దేశాల భాగస్వామ్యం గురించి ఆయన పంచుకున్న సానుకూల ఆలోచనల పట్ల కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. 

మిత్రులారా,

భారత ప్రధానమంత్రి 23 ఏళ్ల తర్వాత సైప్రస్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్శనలో మొట్టమొదటి కార్యక్రమం ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఆర్థిక భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. నేను మీరు చెప్పిన వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా విన్నాను. భారత్, సైప్రస్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మీ నిబద్ధతను నేను తెలుసుకున్నాను. మీరు పంచకున్న ఆలోచనల్లో సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, సంకల్పాన్ని కూడా నేను గుర్తించాను. మన సంబంధాలు మరింత పెరిగేందుకు అపారమైన అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. 

మిత్రులారా,

మీలో చాలామంది చెప్పినట్లుగా సైప్రస్ చాలా కాలంగా మాకు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. ఈ దేశం నుంచి భారత్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. అనేక భారతీయ కంపెనీలు కూడా సైప్రస్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఇవి సైప్రస్‌ను ఒక రకంగా ఐరోపాకు ప్రవేశ ద్వారంగా భావిస్తున్నాయి. నేడు ద్వైపాక్షిక వాణిజ్యం 150 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కానీ మన సంబంధాలకు ఉన్న నిజమైన సామర్థ్యం దీని కంటే చాలా ఎక్కువ. మీలో చాలా మంది భారత్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత్ వృద్ధి తీరుతెన్నులను మీరు చూస్తున్నారు. గత దశాబ్దంలోనే భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. సమీప భవిష్యత్తులో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా మందుకు సాగుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉంది.

 

మిత్రులారా,

మేం భారీగా పన్ను సంస్కరణలను చేపట్టామని మీకు బాగా తెలుసు. జీఎస్టీతో ఒకే దేశం- ఒకే పన్ను వ్యవస్థ అమలయింది. కార్పొరేట్ పన్నుల హేతుబద్దీకరణ చేపట్టాం. వేలాది చట్టాలు, నిబంధనలను నేరరహితం చేశాం. "వ్యాపార సౌలభ్యం"తో పాటుగానే  "వ్యాపారంలో నమ్మకంపై" కూడా సమానంగా దృష్టి సారించాం. నేడు భారత్‌కు స్పష్టమైన విధానం, స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉంది. ఆరు దశాబ్దాల్లో మొదటిసారిగా ఒకే ప్రభుత్వం మూడో సారి ఎన్నికైంది. భారత్‌‌తో ఉన్న ప్రతిభ, జనాభా విషయంలో దేశానికి ఉన్న ప్రయోజనాల గురించి మీకు తెలుసు. ఇది మీ చర్చల్లో కూడా వచ్చింది. గత 10 ఏళ్లలో భారత్ డిజిటల్ విప్లవాన్ని చూసింది. ఆర్థిక సమ్మిళిత్వం ప్రపంచ ప్రమాణంగా మారింది. ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీలలో 50 శాతం ఇప్పుడు భారత్‌లోనే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరుగుతున్నాయి. ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ వ్యవస్థలో చేరాయి. ఇందులో చేరేందుకు సైప్రస్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనిని నేను స్వాగతిస్తున్నాను.

భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా భారత్ వెచ్చిస్తోంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో మేం తయారీ రంగ మిషన్‌ను ప్రారంభించాం. వ్యాక్సిన్లు, జనరిక్ మందులు, వైద్య పరికరాల తయారీ విషయంలో ప్రపంచ దేశాల నాయకుల్లో భారత్ ఒకటి. మేం నౌకా వాణిజ్యం, ఓడరేవుల అభివృద్ధిపై కూడా దృష్టి పెడుతున్నాం. నౌకా నిర్మాణం, పాత నౌకలను విడగొట్టటానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నాం. దీని కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. పౌర విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. వెయ్యికి పైగా విమానాల కోసం భారత కంపెనీలు కొత్త ఆర్డర్లు ఇచ్చాయి. భారత ఆర్థిక సామర్థ్యానికి బలమైన స్తంభంగా ఆవిష్కరణలు మారాయి. దేశంలో ఉన్న లక్ష కంటే ఎక్కువ అంకుర సంస్థలు కేవలం కలలు కనటమే కాదు.. పరిష్కారాలను అందిస్తున్నాయి. వీటిలో 100 యునికార్న్‌లుగా మారాయి. ఆర్థిక వ్యవస్థను పర్యావరణంతో సమతుల్యం చేయటాన్ని భారత్ విశ్వసిస్తోంది. మేం ఈ విషయంలో కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛ హరిత భవిష్యత్తు నిర్మాణం జరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సాధించాలనే లక్ష్యం దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాం. మేం హరిత రవాణా విషయంలో పనిని వేగవంతంగా చేశాం. 2030 నాటికి భారతీయ రైల్వేలను 100 శాతం కర్బన తటస్థ స్థాయికి తీసుకెళ్తాం. 

 

భారత ఏఐ మిషన్, క్వాంటం మిషన్, సెమీకండక్టర్ మిషన్, కీలక ఖనిజాల మిషన్‌, అణు విద్యుత్ మిషన్ దేశ వృద్ధికి కొత్త చోదకాలుగా మారుతున్నాయి. సైప్రస్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, భారత్‌లోకి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్ఎస్ఈ)
నా స్వస్థలమైన గుజరాత్‌లోని గిఫ్టి సిటీలో కలిసి పనిచేసేందుకు అంగీకరించాయని తెలిసి నేను సంతోషిస్తున్నాను. సైప్రస్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. భారత్‌లో కూడా మేం వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వాటి నిర్వహణపై దృష్టి పెడుతున్నాం. ఇరు దేశాల టూర్ ఆపరేటర్ల మధ్య సన్నిహిత సహకారం చాలా రకాలు ఉండొచ్చు. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు, సామర్థ్యం ఉన్న అనేక రంగాలు ఉన్నాయి.

మిత్రులారా,

గత నెలలో భారత్, యూకే ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాలన్న దానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో చర్చలు వేగిరం అయ్యాయి. దీని నుంచి మీరందరూ ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. భారత్-సైప్రస్-గ్రీస్ వ్యాపార, పెట్టుబడి మండలి ఏర్పాటును నేను స్వాగతిస్తున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. అంతేకాకుండా ఇది ఆర్థిక సహకారానికి ఒక ముఖ్యమైన వేదికగా మారొచ్చు. మిత్రులారా.. మీరందరూ పంచుకున్న ఆలోచనలు, సూచనలను నా బృందం రాసుకుంది. మేం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి, వాటిని అమలు చేస్తాం. మీరంతా భారత్‌ను సందర్శించాలని నేను ఆహ్వానిస్తున్నాను. చివరగా.. ఈ సమావేశానికి హాజరు కావడానికి సమయం కేటాయించినందుకు అధ్యక్షుడికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రౌండ్‌ టేబుల్‌ను ఇంత సమన్వయంతో నిర్వహించినందుకు ‘సైప్రస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’, ‘ఇన్వెస్ట్‌మెంట్ సైప్రస్‌’కు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions