· ఈ ఉదయం మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాద విషాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్, ఆయన సహచరులు కొందరిని కోల్పోయాం
· మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన అజిత్ దాదా: గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముందువరుసలో నిలిచిన నేత... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
· ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరులను ఎన్నటికీ మరువలేం... ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబాలకు దేశం సంఘీభావంగా నిలుస్తుంది
· భారత యువశక్తిని సాధికారులను చేసే ఉద్యమం ఎన్‌సీసీ
· ఎంతో నమ్మకంతో ప్రపంచం నేడు భారత యువతను చూస్తోంది
· ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఐరోపా యూనియన్‌తో ఒప్పందం: అన్ని ఒప్పందాలకూ ఇది తల్లి వంటిదనీ, ప్రపంచ గమనాన్ని మార్చే గేమ్ ఛేంజర్ అనీ ప్రపంచం భావిస్తోంది
· అనేక రంగాల్లో నేడు యుద్ధాలు... కోడ్‌లోనూ, క్లౌడ్‌లోనూ యుద్ధాలు
· సాంకేతికతలో వెనుకబడిన దేశాలు ఆర్థికంగానే కాదు.. భద్రత పరంగానూ బలహీనంగా ఉన్నాయి
· పౌరులుగా మనమెలా ప్రవర్తిస్తామన్నది కూడా వికసిత భారత్‌లో కీలక అంశం.. మనం మన విధులకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి

ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

‘‘భారతీయ యువతను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సునిశితత్వం, అంకితభావం గల పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప ఉద్యమం ఎన్‌సీసీ’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో క్యాడెట్ల పాత్ర ఏటా బలోపేతమవుతోందన్నారు. గత కొన్నేళ్లలో ఎన్‌సీసీ కేడెట్ల సంఖ్య 14 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ముఖ్యంగా సరిహద్దులు, తీర ప్రాంతాల్లో ఈ భాగస్వామ్యం గణనీయంగా పెరగడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

యువత తమ వారసత్వాన్ని ఘనంగా చాటే గొప్ప వేదిక ఎన్‌సీసీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడం దీనికి నిదర్శనమన్నారు. పరమవీర సాగర యాత్రను ఒక అద్భుత ఉదాహరణగా పేర్కొన్నారు. కొన్నేళ్ల కిందట అండమాన్ నికోబార్‌లోని 21 దీవులకు పరమవీర చక్ర పురస్కార గ్రహీతల పేర్లను ప్రభుత్వం పెట్టిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. క్యాడెట్లు తమ నౌకాయాత్రతో దేశ వీరులను గౌరవించే ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారని శ్రీ మోదీ ప్రశంసించారు. క్యాడెట్లు సముద్రాన్నీ, స్థానిక సంస్కృతినీ, ప్రకృతి రమణీయతనూ మేళవించి.. లక్షద్వీప్‌లో ఘనంగా ద్వీపోత్సవాన్ని నిర్వహించారని ప్రధానమంత్రి చెప్పారు.

 

స్మారకాల్లోని చరిత్రకు జీవం పోసి ఈ వీధిలో ప్రదర్శించారని శ్రీ మోదీ ఎన్‌సీసీని ప్రశంసించారు. బాజీరావు పీష్వా పరాక్రమమూ, గొప్ప వీరుడు లచిత్ బోర్ఫుకాన్ నైపుణ్యమూ, భగవాన్ బిర్సా ముండా నాయకత్వ పటిమనూ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపారని కొనియాడారు. కేడెట్లందరి కృషినీ అభినందించిన ఆయన.. నేడు పురస్కారాలు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు.

ఇది సరైన సమయం, ఇది అత్యుత్తమ సమయమంటూ ఎర్రకోట సాక్షిగా దేశ యువతకు తాను చెప్పిన మాటలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సమయంలో దేశ యువతకు అపారమైన అవకాశాలున్నాయని పునరుద్ఘాటించారు. ఈ ప్రయోజనాలను యువతకు పూర్తిస్థాయిలో చేరవేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్, ఐరోపా యూనియన్ మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. దీనికి ముందు ఒమన్, న్యూజిలాండ్, బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్‌ దేశాలతోనూ భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ ఒప్పందాలన్నీ కోట్లాది యువతకు అసంఖ్యాకమైన అవకాశాలను అందిస్తాయన్నారు.

నేడు ప్రపంచమంతా భారతీయ యువతను ఎంతో నమ్మకంతో చూస్తోందనీ, వారిలోని నైపుణ్యాలూ, విలువలే ఈ నమ్మకానికి పునాదులనీ ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతీయ యువత ప్రజాస్వామ్య విలువలనూ, వైవిధ్యాన్నీ గౌరవిస్తారనీ, వసుధైక కుటుంబ భావనను విశ్వసిస్తారనీ వ్యాఖ్యానించారు. ఈ విలువల వల్లే వారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అందరితో సులభంగా కలిసిపోయి, ఆయా దేశాల అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతున్నారన్నారు. ఇదే భారతీయ సంస్కృతి, స్వభావం అని స్పష్టం చేశారు.

 

భారతీయ యువత కేవలం కష్టపడే తత్వమున్న వారే కాకుండా, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన వారని.. పలు సందర్భాల్లో ప్రపంచ దేశాల నేతలు చెప్పారని శ్రీ మోదీ పేర్కొన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువతకు భారీగా డిమాండ్ ఉందన్నారు. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు దశాబ్దాలుగా పనిచేస్తున్నారనీ, అలాగే భారతీయ వైద్యులూ ఇంజినీర్లూ అనేక దేశాల్లో అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థలను, మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. గతంలో విదేశాలకు వెళ్లిన భారతీయ ఉపాధ్యాయులు అక్కడి సమాజాల్లో కొత్త విలువలను పెంపొందించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భారతీయ యువత ప్రపంచానికి అందిస్తున్న సేవలతోపాటు.. దేశీయంగానూ వారి విజయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. నేడు మన యువత వల్లే భారత్ ప్రపంచ సమాచార సాంకేతిక రంగానికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు. అంతేకాకుండా వారి శక్తిసామర్థ్యాలే నేడు అంకుర సంస్థలు, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ సాంకేతికత వంటి ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు చోదకశక్తిగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఐరోపా యూనియన్‌తో ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లి వంటిదని ప్రపంచమంతా ప్రశంసిస్తోందనీ, ఇది ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చే ఒక గేమ్ చేంజర్ అనీ ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ జీడీపీలో నాలుగో వంతుకూ, ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుకూ ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన తెలిపారు. ఇది దేశ యువత ‘ఆశయాలకు రెక్కలు’ తొడిగిందని వ్యాఖ్యానించారు.

27 దేశాలతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా భారతీయ అంకుర సంస్థలకు నిధుల సమీకరణ, వినూత్న ఆవిష్కరణ వ్యవస్థలు సులభతరమవుతాయని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే దేశ సృజనాధార ఆర్థిక వ్యవస్థలో భాగమైన సినిమా, గేమింగ్, ఫ్యాషన్, డిజిటల్ కంటెంట్, సంగీతం, డిజైన్ రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతీయ యువతకు పరిశోధన, విద్య, ఐటీ, వృత్తిపరమైన సేవల్లో కొత్త అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

అపారమైన ప్రయోజనాల వల్లే ఈ ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లి వంటిదని పిలుస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. ఈ చరిత్రాత్మక ఒప్పందం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను మరింత వేగవంతం చేస్తుందనీ, అలాగే ‘దేశంలో సృష్టిద్దాం – ప్రపంచానికి అందిద్దాం’ (మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫర్ ది వరల్డ్) అనే మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందం వల్ల భారత్ నుంచి జరిగే ఎగుమతులలో 99 శాతానికి పైగా వస్తువులపై సుంకాలు ఉండబోవనీ, లేదా చాలా తక్కువగా ఉంటాయని ప్రధానమంత్రి వివరించారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమ, తోలు పరిశ్రమ, రత్నాలు – ఆభరణాలు, పాదరక్షలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా చేనేత కార్మికులు, కళాకారులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు 27 ఐరోపా దేశాల విస్తృత మార్కెట్లలోకి నేరుగా ప్రవేశం లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెప్పారు. 

ఈ ఒప్పందం వల్ల భారత్‌లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, రసాయన, ఔషధ, ఇతర తయారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల వ్యవసాయం, ఆహార శుద్ధి, మత్స్య రంగాలకు సుస్థిరమైన మార్కెట్లు లభిస్తాయని, ఇది రైతులు, మత్స్యకారులు, గ్రామీణ యువతకు గొప్ప అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయ యువతను నేరుగా యూరప్ ఉపాధి మార్కెట్‌తో అనుసంధానిస్తుందని అన్నారు. ప్రత్యేకించి ఇంజనీరింగ్, హరిత సాంకేతికత, డిజైన్, సరఫరా, ఆధునిక తయారీ రంగాల్లో అవకాశాలను కల్పిస్తుందని, 27 దేశాలలో భారతీయ యువతకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయని  శ్రీ మోదీ వివరించారు.

సమగ్ర సంస్కరణల ద్వారా ప్రభుత్వం ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. నేడు దేశంలో సాగుతున్న సంస్కరణల వేగం యువత ముందున్న ప్రతి అడ్డంకిని తొలగిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఈ అవకాశాలకు తోడు ఎన్‌సీసీ క్యాడెట్లలో పెంపొందే క్రమశిక్షణ, విలువలు వారికి అదనపు బలంగా మారుతున్నాయని చెప్పారు.

 

ఆపరేషన్ సింధూర్‌పై ప్రదర్శించిన అద్భుతమైన శకటాన్ని అభినందిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమయంలో ఎన్‌సీసీ క్యాడెట్లు చేసిన సేవలను శ్రీ మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడంలో, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంలో, ప్రథమ చికిత్స సేవలను అందించడంలో వారు అందించిన సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్‌సీసీ శిక్షణ కేవలం పరేడ్ మైదానానికే పరిమితం కాదని.. అది ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. కష్టకాలంలో దేశం కోసం పూర్తి శక్తితో పనిచేసేలా క్యాడెట్‌లను ప్రేరేపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తాను ఎన్సీసీలో ఉన్న సమయంలోనే తనలో ‘దేశమే ప్రథమం’ అనే భావన మరింత బలపడిందని గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి.. నేటి క్యాడెట్లు కూడా అదే విలువలను నేర్చుకుంటున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని, మన సాయుధ దళాల పరాక్రమాన్ని చాటిచెప్పిందని తెలిపారు. స్వదేశీ ఆయుధాల పురోగతిని కూడా ఇది నిరూపించిందని అన్నారు. ఆధునిక యుద్ధాల్లో యువత నైపుణ్యాల పాత్ర గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు యుద్ధాలు కేవలం ట్యాంకులు, తుపాకులతోనే కాకుండా కోడ్ , క్లౌడ్‌లలో కూడా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతలో వెనుకబడిన దేశాలు ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా భద్రతలోనూ బలహీనంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. యువత చేసే ఆవిష్కరణలు దేశభక్తిని బలోపేతం చేయడమే కాకుండా జాతీయ భద్రతకు తోడ్పడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత కలిగిన యువతకు సాయుధ దళాల్లో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, రక్షణ రంగ అంకుర సంస్థలు ప్రతిభ చూపుతున్నాయని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్‌లు అభివృద్ధి చెందుతున్నాయని, కృత్రిమ మేధ, రక్షణరంగ ఆవిష్కరణలు వంటివి దళాలను ఆధునీకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాలను యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇటీవల జనవరి 25న దేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నట్లు ప్రధానమంత్రి పేర్కొంటూ.. ఈ సందర్భంగా తాను పౌరులకు లేఖ రాశానని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది రాజ్యాంగం ప్రసాదించిన బాధ్యతలు, హక్కుల వేడుకగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్న దేశం భారత్‌ అని స్పష్టం చేశారు. పౌరులకు 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లభించినప్పుడు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి వారికి లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిస్తూ.. ప్రతి ఏటా జనవరి 25న మొదటిసారి ఓటు హక్కు పొందిన వారిని గౌరవించేలా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, మై యంగ్ ఇండియా సంస్థలు కలిసి ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీ మోదీ కోరారు. ఈ ప్రయత్నం యువతలో బాధ్యతాయుత భావాన్ని పెంపొందిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

‘‘వికసిత్‌ భారత్ అనేది కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే పరిమితం కాదు.అది పౌరుల ప్రవర్తన, వారి విధులకు ఇచ్చే ప్రాధాన్యతపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ఉదాహరణగా పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ పౌరులు, యువత, పిల్లలు దానిని ముందుకు తీసుకెళ్లారని ఆయన గుర్తుచేశారు. పరిశుభ్రత అనేది ఒక అలవాటు, జీవనశైలి, విలువ అని ఆయన స్పష్టం చేశారు. పౌర బాధ్యత అనేది రోజువారీ జీవితంలో భాగం కావాలని అన్నారు. ప్రజలు తమ ఇంటి ఆవరణం అందంగా ఉండాలని ఎలా కోరుకుంటారో, అదే స్ఫూర్తితో తమ నగరాలను కూడా అందంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి యువకుడు,యువతి వారానికి కనీసం ఒక గంట సమయాన్ని పరిశుభ్రతకు సంబంధించిన ప్రచారానికి కేటాయించాలని, తాము ఎంచుకున్న ప్రదేశంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (అమ్మ పేరుతో ఒక మొక్క) ప్రచారంలో భాగంగా ఎన్‌సీసీ దాదాపు 8 లక్షల మొక్కలను నాటినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఆ మొక్కలు చక్కగా పెరిగేలా చూడటం కూడా మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే కాలంలో మనం ఎంత దృఢంగా ఉంటామనేదే యువశక్తికి అత్యంత పెద్ద పరీక్ష అని ప్రధానమంత్రి తెలిపారు. ఫిట్‌నెస్ అనేది కేవలం కొన్ని నిమిషాల వ్యాయామానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఆహారం నుంచి రోజువారీ చర్యల వరకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మన స్వభావంలో భాగం కావాలని ప్రధాని సూచించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు ‘ఫిట్ ఇండియా’ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండటం, క్రీడల్లో రాణిస్తుండటంపై ప్రధానమంత్రి శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

యువతలో పెరుగుతున్న ఊబకాయం సమస్యను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భవిష్యత్తులో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయని, దీనివల్ల మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధుల ముప్పు పెరుగుతుందని, ముఖ్యంగా యువత దీని బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నూనె వాడకాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న తన మునుపటి విజ్ఞప్తిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఎన్‌సీసీ కేవలం కవాతు మాత్రమే నేర్పించదని, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతూ.. క్యాడెట్లు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలు, విలువలను అందిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్యాడెట్లు పొందే అనుభవాలు వారి వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. క్యాడెట్లు జీవితంలోని ప్రతి పరీక్షలోనూ విజయం సాధిస్తారని, వికసిత్‌ భారత నిర్మాణంలో తమ వంతు కృషిని కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి శుభాకాంక్షలతో తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్‌ మన్సుఖ్ మండవీయ, శ్రీ సంజయ్ సేథ్‌లతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ సంవత్సరం వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీకి ‘‘రాష్ట్ర ప్రథమ్‌-కర్తవ్య నిష్ఠ యువ’’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ఇది భారత యువతలో కర్తవ్య భావన, క్రమశిక్షణ, జాతీయ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

 

ఈ ర్యాలీ నెలరోజుల పాటు జరిగిన ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరానికి ఘన ముగింపుగా నిలిచింది. ఈ శిబిరంలో 898 మంది బాలికలు సహా దేశం నలుమూలల నుంచి 2,406 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. అలాగే 21 విదేశాల నుంచి 207 మంది యువత, అధికారులు కూడా ఈ ర్యాలీలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, రాష్ట్రీయ రంగశాల, నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్‌ఎస్‌ఎస్‌) సభ్యులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇవి దేశ నిర్మాణం, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసంలో వారి పాత్రను చాటిచెప్పాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold

Media Coverage

India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning Bronze at Commonwealth Games 2026
July 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning the Bronze medal in the women’s 58 kg weightlifting event at the Commonwealth Games 2026.

The Prime Minister said that her success is the result of her hard work and determination.

Shri Modi extended his best wishes to her for her future endeavours.

The Prime Minister wrote on X;

“Yet another medal for India in Weightlifting! Proud of Bindyarani Devi Sorokhaibam for winning a Bronze in the Women's 58kg event at the Glasgow Commonwealth Games. Her success is due to her hard work and determination. Wishing her the very best for the endeavours ahead.

#CWG2026”