ఈ రోజు ప్రారంభమవుతున్న అభివృద్ధి పనులు కేరళలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి, అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి : ప్రధానమంత్రి
గత ఆరేళ్ళలో, భారతదేశ సౌర విద్యుత్తు సామర్థ్యం 13 రెట్లు పెరిగింది: ప్రధానమంత్రి
మన అన్న దాతలు, విద్యుత్తు దాతలుగా మారడానికి, రైతులు సౌర విద్యుత్తు రంగంతో అనుసంధానించబడుతున్నారు : ప్రధానమంత్రి
అభివృద్ధి మరియు సుపరిపాలనలకు - కులం, మతం, జాతి, లింగం, విశ్వాసం లేదా భాష తెలియవు : ప్రధానమంత్రి

వణక్కం! (నమస్కారం)

కేరళ గవర్నర్‌ శ్రీ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ ఆర్.కె.సింగ్, శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇతర ప్రముఖ అతిథులందరికీ అభివాదం.

మిత్రులారా!

నమస్కారం కేరళ!

కేరళలో కేవలం కొద్దిరోజుల కిందటే నేను పెట్రోలియం రంగంలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించాను. ఇవాళ మనం మరోసారి కలుసుకోవడానికి దోహదపడిన సాంకేతిక పరిజ్ఞానానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. కేరళ ప్రగతి పయనంలో మేము ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. భారతదేశ ప్రగతికి తమవంతుగా ఎనలేని తోడ్పాటునిచ్చే ప్రజలున్న ఈ అందమైన రాష్ట్రానికి అవి శక్తి, సాధికారత కల్పిస్తాయి. ఇందులో భాగంగా 2వేల మెగావాట్ల ‘పుగళూర్‌-త్రిస్సూర్‌ హైవోల్టేజ్‌ డైరెక్ట్‌ కరెంట్‌ వ్యవస్థ’ (హెచ్‌వీడీసీ) ఇవాళ ప్రారంభం కాబోతోంది. ఇది కేరళను జాతీయ గ్రిడ్‌తో అంతర-అనుసంధానం చేసే తొలి ‘హెచ్‌వీడీసీ’ ప్రాజెక్టు. కేరళకు త్రిస్సూర్‌ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రం. అదే తరహాలో ఇకపై ఈ రాష్ట్ర విద్యుత్‌ సదుపాయానికీ ఇది కేంద్రమవుతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యవస్థ భారీ పరిమాణంలో విద్యుత్తును బదిలీ చేయగలదు. విద్యుత్‌ సరఫరా కోసం దేశంలోని తొలిసారిగా ‘విఎస్‌సీ’ కన్వర్టర్‌ సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టబడింది. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం.

మిత్రులారా!

కేరళలో అంతర్గత విద్యుదుత్పాదక వనరులు సీజన్‌లపై ఆధారపడినవి. అందువల్ల జాతీయ గ్రిడ్‌ నుంచి విద్యుత్తు స్వీకరణపై కేరళ ఆధారపడాల్సి వస్తోంది. ఈ లోటును భర్తీ చేయాల్సిన నేపథ్యంలో ‘హెచ్‌వీడీసీ’ ఇందుకు తోడ్పడుతుంది. ఇకపై విశ్వసనీయ లభ్యతతో విద్యుత్‌ సరఫరా కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలోని వేలాది నివాసాలకు, పారిశ్రామిక సంస్థలకు ఈ విద్యుత్తు చేరాలంటే అంతర్రాష్ట్ర సరఫరా నెట్‌వ‌ర్క్‌ను బలోపేతం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేను సంతోషించే విషయం మరొకటేమిటంటే- ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన ‘హెచ్‌వీడీసీ’ సామగ్రి మొత్తం భారతదేశంలోనే తయారైంది. స్వయం సమృద్ధ భారతం దిశగా మన ఉద్యమాన్ని ఇది మరింత శక్తిమంతం చేస్తుంది.

మిత్రులారా!

మనమిప్పుడు సరఫరా ప్రాజెక్టును మాత్రమే దేశానికి అంకితం చేయడం లేదు... మనకో విద్యుదుత్పాన ప్రాజెక్టు కూడా ఉంది. ఆ మేరకు కాసరగోడ్ సౌరశక్తి ప్రాజెక్టు రూపంలో 50 మెగావాట్ల సామర్థ్యంగల పరిశుభ్ర ఇంధన సంపదను కూడా జాతికి అంకితం చేయనుండటం సంతోషదాయకం. పరిశుభ్ర-హరిత ఇంధనం దిశగా మన స్వప్నాన్ని సాకారం చేసుకోవడంలో ఇదొక ముందడుగు. భారతదేశం నేడు సౌరశక్తి అమిత ప్రాధాన్యమిస్తోంది. సౌరశక్తితో మనకు సిద్ధించే ప్రయోజనాల్లో- వాతావరణ మార్పుపై బలమైన పోరు, మన ఔత్సాహిక పారిశ్రామికులకు ఉత్తేజం ప్రధానమైనవి. అదేవిధంగా ఆరుగాలం శ్రమించే మన రైతన్నలను అన్నదాతలుగా మాత్రమేగాక విద్యుత్తు దాతలుగానూ మార్చేలా సౌరశక్తితో జోడించే కృషి కొనసాగుతోంది. ‘పీఎం-కుసుమ్‌’ పథకం కింద ఇప్పటిదాకా దేశంలోని 20 లక్షలమంది రైతులకు సౌర పంపుసెట్లు అందజేశాం. గత ఆరేళ్లలో సౌరశక్తి సామర్థ్యం 13 రెట్లు పెరిగింది. మరోవైపు భారతదేశం ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసింది.

మిత్రులారా!

మన నగరాలు వృద్ధి చోదకాలు మాత్రమేగాక శక్తిమంతమైన ఆవిష్కరణ కేంద్రాలు. ఇప్పుడు మన నగరాలు మూడు ఉత్సాహపూరిత ధోరణులు: సాంకేతిక అభివృద్ధి, సానుకూల జనశక్తి లబ్ధి, పెరుగుతున్న దేశీయ డిమాండ్‌లను గమనిస్తున్నాయి. ఈ రంగంలో వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో అత్యాధునిక నగరాల కార్యక్రమం కూడా మనకుంది. ఈ కార్యక్రమం కిందగల సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు మెరుగైన పట్టణ ప్రణాళికలు-నిర్వహణకు చక్కగా తోడ్పడుతున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం 54 కమాండ్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇటువంటివే మరో 30 వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కేంద్రాలు ముఖ్యంగా మహమ్మారి పీడించిన సమయంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేరళలోని రెండు అత్యాధునిక నగరాల్లోని కోచ్చి స్మార్ట్‌ సిటీ ఇప్పటికే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అలాగే తిరువనంతపురం స్మార్ట్‌ సిటీ కంట్రోల్‌ సెంటర్‌ కూడా సిద్ధమవుతోంది. ఆ మేరకు అత్యాధునిక నగరాల కార్యక్రమంలో భాగమైన కేరళలోని తిరువనంతపురం, కోచ్చి నగరాలు ప్రస్తుతం గణనీయ ప్రగతి సాధించాయి. తదనుగుణంగా రెండు నగరాల్లో ప్రస్తుతం రూ.773 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అలాగే రూ.2వేల కోట్ల విలువైన మరో 68 ప్రాజెక్టుల పనులు మొదలు కానున్నాయి.

మిత్రులారా!

పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచే మరో వినూత్న ప్రయత్నం ‘అమృత్‌’. ఈ కార్యక్రమం కింద నగరాల విస్తరణ, వ్యర్థ-జలశుద్ధి మౌలిక వసతుల ఉన్నతీకరణ సాగుతున్నాయి. అమృత్‌ కింద కేరళలో రూ.1,100 కోట్లకుపైగా విలువైన 175 నీటి సరఫరా పథకాలు చేపట్టబడ్డాయి. రాష్ట్రంలోని 9 ‘అమృత్‌’ నగరాలు సార్వత్రిక సరఫరా పరిధిలోకి చేర్చబడ్డాయి. ఇందులో భాగంగా రూ.70 కోట్లతో ‘అరువిక్కర’లో నిర్మించిన రోజుకు 75 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంగల జలశుద్ధి యంత్రాన్ని ఇవాళ మనం ప్రారంభించబోతున్నాం. తద్వారా సుమారు 13 లక్షల మంది ప్రజలకు జీవన సౌలభ్యం మెరుగవుతుంది. నా మంత్రివర్గ సహచరులు చెప్పిన మేరకు- ఈ ప్రాజెక్టువల్ల తిరువనంతపురంలో ఇంతకుముందు తలసరి నీటి సరఫరా పరిమాణం రోజుకు 100 లీటర్లు కాగా, ఇకపై 150 లీటర్లకు పెరుగుతుంది.

మిత్రులారా!

ఈ రోజున మహనీయుడైన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జీవితం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. సమాజంలోని అన్నివర్గలకూ ప్రగతి ఫలాలు అందించే స్వరాజ్యానికి ఆయనెంతో ప్రాధాన్యమిచ్చాడు. భారత రేవులతోనూ ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకవైపు బలమైన నావికా దళాన్ని నిర్మించిన ఆయన, మరోవైపు తీరప్రాంతాల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన దార్శనికతను మేం కొనసాగిస్తున్నాం. రక్షణ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధ మార్గంలో పయనిస్తోంది. రక్షణ, అంతరిక్ష రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టగా, ఈ కృషితో అనేకమంది యువభారత ప్రతిభావంతులకు అపార అవకాశాలు అందివస్తాయి. అదేవిధంగా అద్భుతమైన తీర మౌలిక వసతుల దిశగా మన దేశం ఓ పెద్ద ఉద్యమాన్నే ప్రారంభించింది. ఇందులో భాగంగా నీలి ఆర్థిక వ్యవస్థ వృద్ధివైపు తీవ్రంగా కృషి చేస్తోంది. మన మత్స్యకారుల కష్టాన్ని గౌరవిస్తున్నాం. ఆ మేరకు మరింత రుణ పరపతి, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలద్వారా వారికి ప్రయోజనం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. మత్స్యకారులకు ఇప్పుడు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. సముద్ర జలాల్లో ఇబ్బందిలేకుండా అత్యాధునిక మార్గదర్శక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం. వారు వాడే పడవల ఆధునికీకరణకూ కృషి కొనసాగుతోంది. భారతదేశం సముద్ర ఉత్పత్తుల కూడలిగా రూపొందడంలో ప్రభుత్వ విధానాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కోచ్చి తీరప్రాంతాన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రతిపాదన ప్రకటించబడింది.

ప్రసిద్ధ మలయాళ కవి కుమరన్ అశన్‌- “సోదరీ! నీ కులం ఏమిటని కాదు... నాకు చాలా దాహంగా ఉంది... నేను గుక్కెడు నీళ్లు మాత్రమే అడుగుతున్నాను” అన్నారు. ప్రగతికి, సుపరిపాలనకు కులం, మతం, జాతి, తెగ, లింగం, భాష వంటివేవీ ఉండవు. అభివృద్ధి ప్రతి ఒక్కరిదీ... “అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి... అందరి విశ్వాసం” మూల సూత్రం ఇదే. అభివృద్దే మన లక్ష్యం... అభివృద్ధే మన మతం... సమైక్యత, ప్రగతి ధ్యేయమైన ఈ భాగస్వామ్య దార్శనికత సాకారంవైపు మనం ముందడుగు వేయడంలో కేరళ ప్రజల అండదండలను నేను ఆకాంక్షిస్తున్నాను... నండ్రి! (కృతజ్ఞతలు)... నమస్కారం!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జనవరి 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision