ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న, లోక్ కల్యాణ్ మార్గ్ లో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతల తో ముఖాముఖి సంభాషించారు.
ప్రధాన మంత్రి పురస్కార విజేతల ను వారు చేసిన అసామాన్యమైన కృషి కి గాను అభినందించారు. ప్రతి ఒక్క విద్యార్థి జీవనం లో పరివర్తన ను తీసుకు రావడం కోసం కఠోరం గా పాటు పడటాన్ని కొనసాగించవలసింది గా వారి కి ఆయన విజ్ఞప్తి చేశారు.

బోధన లో ఒక సహాయక సాధనం గా సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి గల ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి తన సంభాషణ క్రమం లో వివరించారు. వివిధ దైనందిన సమస్యల కు పరిష్కార మార్గాల ను అన్వేషించడం కోసం విద్యార్థుల లో మేధోమథనాన్ని ప్రోత్సహించవలసిందిగా ఉపాధ్యాయుల ను ఆయన కోరారు. విద్యార్థుల ను కట్టిపడవేయకూడదని, ప్రతి ఒక్క చిన్నారి కి ఒక అవకాశాన్ని ఇవ్వండని పురస్కారాల విజేతల కు ఆయన విన్నవించారు.
విద్యార్థుల లో సృజన శీలత ను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సృజనాత్మకత ను ప్రోత్సహించడం బాలల కు స్వీయ ప్రేరణ ను అందించగలదని, వారు తమ తో తాము పోటీ పడేటట్టు చేయగలుగుతుందని ఆయన తెలిపారు. వివిధ అంశాల పట్ల విద్యార్థి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అని కూడా ఆయన చెప్పారు. ఉపాధ్యాయులంతా వారి లోపలి విద్యార్థి ని సజీవం గా ఉంచుకోవాలని, నేర్చుకొంటూ ఉండటాన్ని కొనసాగించాలని ప్రధాన మంత్రి సూచించారు.

పురస్కార స్వీకర్త లు పాఠశాలల్లో సకారాత్మకమైనటువంటి మార్పు ను తీసుకొని రావడం లో వారు చేసిన పరివర్తనాత్మకమైన కృషి ని గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. నూతన ఆవిష్కారాలు చేయడం లో మరియు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లో విద్యార్థుల కు అటల్ టింకరింగ్ లేబ్స్ ఏ విధం గా దోహదపడిందీ కూడా వారు ప్రస్తావించారు.

ఈ కార్యక్రమం లో, మానవ వనరుల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ తో పాటు మానవ వనరుల వికాసం శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ శాంరావ్ ధోత్రే కూడా హాజరు అయ్యారు.


