గౌరవ క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రేజ్ ప్లెన్కోవిచ్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 18న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. క్రొయేషియాలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో పురోగతిని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుంది.

ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, బహుపాక్షిక వేదికల్లో సహకారంపై క్రొయేషియా ప్రధానమంత్రి ప్లెన్కోవిచ్‌, భారత ప్రధానమంత్రి మోదీ సమగ్రంగా చర్చించారు. ప్రజాస్వామ్యం, న్యాయబద్ధమైన పాలన, బహుళత్వం, సమానత్వం అనే ఉమ్మడి విలువలతో భారత్, క్రొయేషియా సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు ముడిపడి ఉన్నాయని వారిద్దరూ అంగీకరించారు.

ప్రధానమంత్రి మోదీ పర్యటన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చింది. ముఖ్యంగా పర్యాటకం, వాణిజ్యం, సాంకేతికతల్లో రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ప్రాధాన్యం పెరిగింది. ప్రధానమంత్రులిద్దరూ వివిధ ఒప్పందాలపై సంతకాలు చేశారు: (i) వ్యవసాయ సహకారంపై అవగాహన ఒప్పందం; (ii) శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకార కార్యక్రమం; (iii) సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ); (iv) జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో హిందీ పీఠం ఏర్పాటుకు అవగాహన ఒప్పందం.
 

భారత్- మధ్య ప్రాచ్యం- ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ) సహా అనుసంధానాన్ని మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతపై వారిద్దరూ చర్చించారు. ఇరుదేశాల సుదీర్ఘ సముద్ర సంప్రదాయాల దృష్ట్యా ఓడరేవులు, షిప్పింగ్ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి వారు అంగీకరించారు. మధ్య ఐరోపాకు మధ్యధరా ముఖద్వారంగా సేవలందించగల క్రొయేషియా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఈ నేపథ్యంలో యూఎన్‌సీఎల్ఓఎస్‌లో పేర్కొన్న విధంగా అంతర్జాతీయ సముద్ర చట్టంపైనా.. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలతోపాటు నౌకాయాన స్వేచ్ఛపైనా పూర్తి గౌరవాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రతతోపాటు అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాల కోసం ఇవి ఆవశ్యకమైనవి.

శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి కోసం ఇరుదేశాల్లోని వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల అనుసంధానం ఆవశ్యకతను ప్రధానులిద్దరూ ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశోధనపరంగా దీర్ఘకాలిక సహకారం కోసం ఇరుదేశాల మధ్య యువ పరిశోధకుల వినిమయాన్ని సులభతరం చేయడానికి, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడానికి, అనువర్తిత సాంకేతికతల అభివృద్ధి దిశగానూ శాస్త్రీయ సమాజంలో అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

2023లో రక్షణ సహకారం కోసం కుదిరిన అవగాహన ఒప్పందంపై చర్చించిన ఇరుదేశాల ప్రధానమంత్రులు.. రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారు. జాతీయ రక్షణ పరిశ్రమల మధ్య సహకారం కోసం అవకాశాల అన్వేషణకు మరింత ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ దిశగా సమన్వయంతోపాటు క్రమం తప్పకుండా చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

డిజిటల్ సాంకేతికతలోనూ సహకారం కీలకమైనదిగా గుర్తించారు. ఆరోగ్య రక్షణ, వ్యవసాయం, పర్యావరణ హిత సాంకేతికతతోపాటు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలు, అంకుర సంస్థల మధ్య వ్యూహాత్మక సహకారం వల్ల క్రొయేషియా, భారతీయ శాస్త్రీయ రంగాలకు విశేషంగా ప్రయోజనం చేకూరుతుంది. అంకుర సంస్థల మధ్య ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించడం కోసం భారత్ - క్రొయేషియా అంకుర సంస్థల అనుసంధానాన్ని (ఇండియా-క్రొయేషియా స్టార్టప్ బ్రిడ్జి) బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.
 

బలమైన సాంస్కృతిక వినిమయం ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, 2026-2030 సమయంలో సాంస్కృతిక రంగంలో భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడం అత్యావశ్యకమని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. రెండు దేశాల్లో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సంస్కృతిని ఒక శక్తిమంతమైన సాధనంగా వారు గుర్తించారు.

ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి వివిధ రంగాల్లో విస్తృత భాగస్వామ్యానికి దోహదపడేలా నైపుణ్యాభివృద్ధి, దేశాల మధ్య సిబ్బంది రాకపోకల ప్రాధాన్యాన్ని వారు గుర్తించారు. ఇరుదేశాల మధ్య కార్మికుల ప్రయాణం కోసం ఓ అవగాహన ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయడానికి అంగీకరించారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత మద్దతిచ్చి సంఘీభావం తెలిపిన ప్రధానమంత్రి ప్లెన్కోవిచ్‌కు, క్రొయేషియాకు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ, సీమాంతర ఉగ్రవాదం సహా ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా వ్యక్తమైనా ఉగ్రవాదమూ హింసాత్మక తీవ్రవాదాలను ఇరుపక్షాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమని వారు పునరుద్ఘాటించారు. ఆ దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమన్నారు. దాడులకు బాధ్యులను జవాబుదారీగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఎగదోయడాన్ని ఖండించారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం, ఈ అంశంపై కీలకమైన అంతర్జాతీయ ఒడంబడికలు, నిబంధనలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన సంబంధిత తీర్మానాల సంపూర్ణమైన అమలుకు ఎల్లప్పుడూ మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి, ఎఫ్ఏటీఎఫ్, అన్ని ప్రాంతీయ వ్యవస్థలతోసహా ఉగ్రవాదుల ఆర్థిక మార్గాలను అడ్డుకోవాలని, ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను ఏరిపారేయాలని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని, ఉగ్రవాద సూత్రధారులను సత్వరమే న్యాయ వ్యవస్థ ఎదుట నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి, ఈయూ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధంగా ఉన్న పరోక్ష బృందాలు, ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారు, ప్రోత్సహిస్తున్న వారందరిపైనా, అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపైనా సమష్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఉక్రెయిన్ యుద్ధం సహా ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధానులిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ చట్టాలపట్ల గౌరవం, ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం ఆధారంగా ఉక్రెయిన్‌లో అలజడులు సద్దుమణిగి శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితి క్షీణించడంపై వారిద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారం పట్ల పరస్పర గౌరవం, ప్రభావవంతమైన ప్రాంతీయ సంస్థల ద్వారా శాంతియుతంగా వివాదాల పరిష్కారం ప్రాతిపదికలుగా స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను సాకారం చేసే దిశగా తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు.
 

బహుపాక్షిక అంశాల పట్ల, నియమాల ప్రాతిపదికన అంతర్జాతీయ క్రమానికి చేయూతనివ్వడం పట్ల దృఢమైన నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో, ముఖ్యంగా భద్రతా మండలి శాశ్వత, ఇతర విభాగాల విస్తరణ సహా సంస్కరణల తక్షణ ఆవశ్యకతను వారు స్పష్టం చేశారు. తద్వారా అది మరింత సమ్మిళితంగా, పారదర్శకంగా, ప్రభావవంతంగా, జవాబుదారీగా, సమర్థంగా, సమకాలీన భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు.

రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలు, బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, వైవిధ్యభరిత సమాజాలు కలిగిన భారత్ - ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో వేగం పెరగడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ చారిత్రక భారత పర్యటన సమయంలో కుదిరిన అంగీకారం మేరకు.. ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాదిలోనే ఖరారు చేయడం అత్యంత ప్రాధాన్యం గల అంశమని వారు గుర్తించారు.

క్రొయేషియా ఆత్మీయ ఆతిథ్యానికి భారత పక్షం కృతజ్ఞతలు తెలిపింది. పర్యటన ఫలితాల పట్ల ప్రధానులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, క్రొయేషియా మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడంపట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Diplomatic Advisor to President of France meets the Prime Minister
January 13, 2026

Diplomatic Advisor to President of France, Mr. Emmanuel Bonne met the Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

In a post on X, Shri Modi wrote:

“Delighted to meet Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron.

Reaffirmed the strong and trusted India–France Strategic Partnership, marked by close cooperation across multiple domains. Encouraging to see our collaboration expanding into innovation, technology and education, especially as we mark the India–France Year of Innovation. Also exchanged perspectives on key regional and global issues. Look forward to welcoming President Macron to India soon.

@EmmanuelMacron”