2017-18 నుండి 2019-20 వరకు పోలీసు బలగాల ఆధునికీకరణ (ఎమ్‌పిఎఫ్)కు ఉద్దేశించిన ఒక సమగ్ర పథకం అమలుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్ళ కాలానికి ఈ పథకానికి అయ్యే ఆర్థిక వ్యయం రూ. 25,060 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.18,636 కోట్లు గాను మరియు రాష్ట్రాల వాటా రూ. 6,424 కోట్లు గాను ఉంటుంది.
ప్రధాన అంశాలు:
• అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, మహిళల భద్రత, ఆధునిక ఆయుధాల లభ్యత, పోలీసు బలగాల చలనాలు, లాజిస్టిక్స్ సంబంధ మద్ధతు, హెలికాప్టర్లను కిరాయికి తీసుకోవడం, పోలీసు వైర్‌లెస్ వ్యవస్థ స్థాయిని పెంచడం, నేషనల్ శాటిలైట్ నెట్‌వర్క్, సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టు, ఇ- ప్రిజన్ ప్రాజెక్టు తదితర అంశాలకు గాను ఈ పథకంలో ప్రత్యేకంగా సర్దుబాటు చేయడం జరిగింది.
• ఈ సమగ్ర పథకంలో భాగంగా జమ్ము & కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు మరియు వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన రాష్ట్రాలలో అంతర్గత భద్రతకు సంబంధించిన వ్యయాలకు గాను రూ.10,132 కోట్ల కేంద్రీయ బడ్జెట్ ను కేటాయించడమైంది.
• వామపక్ష తీవ్రవాదం బారిన పడుతున్న 35 జిల్లాలలో వెనుకపట్టు పట్టిన అభివృద్ధికి ఊతమిచ్చేందుకు రూ. 3,000 కోట్ల ఖర్చుతో ప్రత్యేక కేంద్ర సహాయ (ఎస్‌సిఎ) పథకాన్ని ప్రారంభించ
డం జరిగింది.
• ఈశాన్య రాష్ట్రాలలో పోలీసు విభాగానికి అవసరమయ్యే ప్రాథమిక సదుపాయలను స్థాయిని పెంచడానికి, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సౌకర్యాల వంటి వాటికి రూ.100 కోట్ల నిధులను వెచ్చించనున్నారు.
• వామపక్ష తీవ్రవాదం కారణంగా సతమతమవుతున్న ప్రాంతాలు, జమ్ము & కశ్మీర్ మరియు ఈశాన్య ప్రాంతాలలోని సవాళ్ళను పరిష్కరించడంలో ప్రభుత్వ శక్తియుక్తులు ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడం వల్ల మరింత బలోపేతం కాగలవు. అంతేకాకుండా, ఆయా ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా చేపట్టేందుకు వీలు కూడా చిక్కుతుంది. ఇది ఆయా ప్రాంతాలలో ప్రజల జీవన నాణ్యతకు మెరుగులుదిద్దుతుంది.
• పోలీసు విభాగాల ప్రాథమిక సదుపాయాల యొక్క, ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీల యొక్క, సంస్థల యొక్క మరియు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోని కీలకమైన ఖాళీలను పూరించడానికి అందుబాటులో ఉన్నటువంటి వనరుల యొక్క ఉన్నతికి రాష్ట్రాలకు సహాయాన్ని సమకూర్చేందుకు కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నారు. నేరాలు మరియు నేరగాళ్ళ చరిత్రలతో కూడిన ఒక జాతీయ సమాచార రాశిని సిద్ధం చేయడానికి గాను, పోలీసు ఠాణాలలో నమోదైన వివరాలను ఏకీకృతం చేస్తారు. ఈ సమాచార రాశిని జైళ్ళు, ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసులలోని సమాచారానికి జోడిస్తారు.
• అంతేకాకుండా ఈ సమగ్ర పథకం ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతిలో ఒక అధునాతన ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ ఏర్పాటుకు మరియు జయ్‌పుర్ లో సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజమ్ అండ్ యాంటీ ఇన్‌సర్జెన్సీ, ఇంకా గాంధీనగర్ లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీల యొక్క స్థాయి పెంపునకు వీలు కల్పిస్తుంది.
కేంద్ర మరియు రాష్ట్ర పోలీసు బలగాలను ఆధునికీకరించడం ద్వారా ఆ రెండింటి సామర్ధ్యాన్ని, దక్షతను పెంపొందించేందుకు పోలీసు బలగాల ఆధునికీకరణ (ఎమ్‌పిఎఫ్)గా వ్యవహరించే సమగ్ర పథకం తోడ్పడనుంది.


