సియావర్ రామచంద్రకీ జై!
సియావర్ రామచంద్రకీ జై!
జై సియారామ్!
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, అత్యంత గౌరవనీయులైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి శ్రీ ఆదిత్యనాథ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయ మహంత్ శ్రీ నృత్య గోపాల్ దాస్, గౌరవనీయ సాధు సమాజం, ఇక్కడ హాజరైన భక్తులు సహా ఈ చారిత్రక సందర్భంలో దేశవిదేశాల నుంచి పాలు పంచుకుంటున్న కోట్లాది రామ భక్తులు సహా సోదరీసోదరులారా!
భారత సాంస్కృతిక చైతన్యంలో మరో కీలక మలుపును అయోధ్య నగరం ఇవాళ చవిచూస్తోంది. యావద్భారతం... ఆ మాటకొస్టే ప్రపంచం మొత్తం నేడు రాముని దైవీకశక్తి సమన్వితం. ప్రతి రామ భక్తుడి హృదయం ఈ క్షణాన అనంత సంతృప్తి, అపార కృతజ్ఞత, అసమాన అతీంద్రియానందంతో నిండిపోయింది. శతాబ్దాల గాయాలు నయమవుతూ... ఆ బాధ నేడు అంతమవుతోంది... ఉక్కు సంకల్పం సాకారమవుతోంది. అర్ధ శతాబ్దంపాటు రగిలిన యజ్ఞజ్వాలలో పూర్ణాహుతి సమర్పణను ఈ రోజు సూచిస్తుంది. విశ్వాసం పరంగా క్షణమైనా చలించని ఈ యజ్ఞం, దాన్ని ఒక్క క్షణమైనా చెదరకుండా నిలిపింది. ఇవాళ శ్రీరాముని గర్భాలయ అనంత శక్తి, శ్రీరామ వంశ దివ్య వైభవం, ఈ ధర్మధ్వజం రూపాన ఈ అత్యంత దివ్య, భవ్య ఆలయంలో ఆవిష్కృతమైంది.
అంతేకాదు మిత్రులారా!
ఈ ధర్మధ్వజం కేవలం ఒక పతాకకు పరిమితం కాదు... ఇది భారతీయ నాగరికత పునరుజ్జీవన ధ్వజం. ఈ పతాక కాషాయ వర్ణం, దానిపై లిఖితమైన సూర్యవంశ కీర్తి, ఓంకారం, దానిపై చెక్కిన దేవకాంచన (కోవిదార్) వృక్షం... ఇవన్నీ రామరాజ్య వైభవాన్ని ఘనంగా చాటుతాయి. ఈ జెండా ఒక సంకల్పం.. ఈ జెండా ఒక విజయం.. ఈ జెండా పోరాటం ద్వారా రూపుదిద్దకున్న గాథ.. ఈ జెండా శతాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా భావించిన కలలకు ప్రతీక.. ఈ జెండా సాధు పుంగవుల ఆధ్యాత్మిక సాధనకు, అర్థవంతమైన సామాజిక భాగస్వామ్యానికి అత్యున్నత రూపం.

మిత్రులారా!
ఈ ధర్మధ్వజం రాబోయే శతాబ్దాల కాలం- కాదుకాదు... సహస్రాబ్దాల పాటు రాముడి ఆదర్శాలను, సూత్రాలను శాశ్వతంగా నిలుపుతుంది. “సత్యమేవ జయతే... నానృతం” అని ఈ ధర్మధ్వజం నినదిస్తుంది.. అంటే- “సత్యమే సదా జయిస్తుంది తప్ప అసత్యం కాదు” అని అర్థం. అలాగే “సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః” అని ఈ ధర్మధ్వజం పిలుపునిస్తుంది. అంటే- “సత్యమే బ్రహ్మ స్వరూపం.. సత్యంలోనే ధర్మం ప్రతిష్ఠితమైంది” అని అర్థం. అలాగే, “ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే”.. అంటే- “ప్రాణం పోయినా ఆడినమాట తప్పరాదు” అనే నైతికతకు ఈ ధర్మధ్వజం ఒక స్ఫూర్తిగా మారుతుంది. “కర్మ ప్రధాన విశ్వ రచి రాఖా!”... అంటే- ప్రపంచంలో కార్యాచరణ, కర్తవ్యాలకు ప్రాధాన్యం అవశ్యం” అని ఈ ధర్మధ్వజం సందేశమిస్తుంది. “బైర్ న బిగ్రహ్ ఆస న త్రాసా. సుఖమయ తాహి సదా సబ్ ఆసా”.. అంటే- సమాజం వివక్ష, బాధ, ఇక్కట్ల నుంచి విముక్తమై శాంతిసంతోషాలు నిండుగా ఉండాలి” అని ఈ ధర్మధ్వజం ఆకాంక్షిస్తుంది. అంతేకాదు... “నహీ దరిద్ర, కోవు దుఃఖీ న దీనా”.. అంటే పేదరికం లేని, ఎవరికీ దుఃఖం లేదా నిస్సహాయత కలగని సమాజాన్ని మనం సృష్టించాలి” అని దృఢ సంకల్పం పూనాల్సిందిగా ఈ ధర్మధ్వజం ఉపదేశిస్తుంది.
మిత్రులారా!
మన ఇతిహాసాలు “ఆరోపితం ధ్వజం దష్టా, యే అభినందిన్తి ధార్మికాః తే అపి సర్వే ప్రస్త్యున్తే, మహా పతాక కోటిభిః” అని ప్రబోధిస్తున్నాయి. అంటే- “ఏ కారణం వల్లనైనా ఆలయానికి రాలేని భక్తులు ధ్వజస్తంభంపై పతాకానికి దూరం నుంచి ప్రణామం ఆచరించినా, దైవదర్శనంతో సమానమైన ఫలితం దక్కుతుంది” అని అర్థం.
మిత్రులారా!
ఆలయ నిర్మాణ లక్ష్యాన్ని కూడా ఈ ధర్మధ్వజం ప్రతిబింబిస్తుంది. బాలరాముడు జన్మించిన పవిత్ర భూమి సందర్శన భాగ్యాన్ని ఈ పతాకం దూరానగల భక్తుల మనోఫలకంపై ఆవిష్కరిస్తుంది. యావత్ మానవాళికి తరతరాలపాటు శ్రీరామ భగవానుని ఉపదేశాలను, స్ఫూర్తిదాయక వచనాలను ఇది చేరవేస్తుంది.
మిత్రులారా!
ఇది మరపురాని మధుర క్షణం... ఈ అద్వితీయ సందర్భంగా కోట్లాది ప్రపంచవ్యాప్త రామభక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు... ప్రతి ఒక్కరికీ వందనం. రామాలయ నిర్మాణానికి తమవంతు తోడ్పాటునిచ్చిన దాతలందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ మహా క్రతువులో పాలుపంచుకున్న ప్రణాళిక రూపకర్తలు, వాస్తుశిల్పులు, కళాకారులు, కార్మికులు సహా ప్రతి ఒక్కరికీ నా మనఃపూర్వక అభినందనలు.
మిత్రులారా!
ఉత్తమాదర్శాలు సత్ప్రవర్తనగా రూపాంతరం చెందే పవిత్ర భూమి ఈ అయోధ్య. శ్రీరాముడు తన జీవన ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన నగరమిది. సామాజిక శక్తి, దాని విలువలతో ఒక వ్యక్తి ఎలా ఉత్తమ పురుషుడు కాగలడో ఈ నగరం ప్రపంచానికి చాటింది. శ్రీరాముడు అయోధ్య నుంచి వనవాసానికి వెడలిన సమయాన ఆయన యువరాజు. కానీ, మర్యాద పురుషోత్తముడైన మరలి వచ్చాడు. వశిష్ఠ మహర్షి జ్ఞానం, విశ్వామిత్ర మహర్షి దీక్ష, అగస్త్య మహర్షి మార్గనిర్దేశం, నిషాదరాజుతో మైత్రి, శబరి మాత ప్రేమ, భక్త హనుమాన్ అంకితభావం సహా అసంఖ్యాక సమూహంతో మెలగడమే ఆయనలో రూపాంతరీకరణకు దోహదం చేసిన అంశాలు.
మిత్రులారా!
వికసిత భారత్‌ను రూపుదిద్దడంలో ప్రస్తుత సమాజానికి కావాల్సింది ఈ సమష్టి శక్తే. ఈ నేపథ్యంలో రామాలయ దివ్య ప్రాంగణం భారత సామూహిక శక్తికి చైతన్య వేదికగా మారుతుండటం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఇక్కడ 7 ఆలయాలు నిర్మితమయ్యాయి. ఈ మేరకు గిరిజన సమాజ ప్రేమాదరాలు, ఆతిథ్య సంప్రదాయానికి ప్రతిరూపమైన శబరి మాత ఆలయంతోపాటు మైత్రికి చిహ్నమైన.. ఉపకరణాలనుగాక లక్ష్యాన్ని, దాని ఆత్మను ఆరాధించే నిషాద రాజు ఆలయం కూడా వెలసింది. అలాగే అహల్య మాత, వాల్మీకి, వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులు సహా సంత్ తులసీదాస్ ఒకేచోట ప్రతిష్ఠితులయ్యారు. రామ్ లల్లాతోపాటు ఈ మహా మునులందర్నీ ఇక్కడ దర్శించుకోవచ్చు. అంతేకాదు... శ్రీరాముని సేవలో తరించిన జటాయు పక్షి, ఉడుత విగ్రహాలు కూడా ఏర్పాటయ్యాయి. మహా కార్యసాధనలో ప్రతి చిన్న ప్రయత్నం ప్రాధాన్యాన్ని ఈ ప్రతిమలు చాటుతాయి. రామాలయాన్ని దర్శించే దేశ పౌరులలో ప్రతి ఒక్కరూ ఈ సప్త మహానీయుల మందిరాన్ని కూడా సందర్శించాలని నా మనవి. మన విశ్వాసం, స్నేహం, కర్తవ్య నిష్ఠ, సామాజిక సామరస్యం సహా విలువలను కూడా ఈ దేవాలయాలు బలోపేతం చేస్తాయి.
మిత్రులారా!
రాముడితో మన బంధం భావాత్మకమే తప్ప విలక్షణాధారితం కాదన్న వాస్తవం మనందరికీ తెలిసిందే. వ్యక్తి భక్తిభావన మినహా వారి వంశ వారసత్వం ఆయనకెన్నడూ ప్రధానం కాదు. ఆయన విలువలను ప్రేమిస్తాడు... సహకారానికి విలువనిస్తాడు తప్ప అధికారానికి కానేకాదు. ఆ మహా పురుషుని స్ఫూర్తితోనే ఇవాళ మేమూ ముందడుగు వేస్తున్నాం. గడచిన 11 సంవత్సరాల్లో మహిళలు, దళితులు, వెనుకబడిన-అత్యంత వెనుకబడిన ప్రజలు, గిరిజనులు, అణగారినవారు, రైతులు, కార్మికులు, యువతరం... ఒక్కరనేమిటి- సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రగతి కేంద్రకంగా పరిగణించాం. దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతానికి సాధికారత సిద్ధిస్తేనే సంకల్ప సాధనలో అందరి కృషి ఫలిస్తుంది. అందరి సహకారం, కర్తవ్యంతో 2047లో దేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి వికసిత భారత్‌ను మనం సాకారం చేయాలి.
మిత్రులారా!
రామ్ లల్లా చారిత్రక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశ సంకల్పం గురించి నేను రాముడితో చర్చించాను. రాబోయే వెయ్యేళ్లపాటు నిలిచే భారతదేశానికి పునాదిని బలోపేతం చేయాలని ఆయనకు నేను విన్నవించాను. వర్తమానం గురించి మాత్రమే ఆలోచించడం భవిష్యత్తరాలకు అన్యాయం చేయడమేనని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి, నేటి తరంతోపాటు భావితరంపైనా మనం దృష్టి సారించాలి. ఎందుకంటే- మన మనుగడతో నిమిత్తం దేశం ముందుకు వెళ్తూనే ఉంటుంది. మరణం మానవులకేగానీ, ఈ పవిత్ర భూమాతకు కాదు. మనదో శక్తిమంతమైన సమాజం గనుక రాబోయే దశాబ్దాలు, శతాబ్దాలను గమనంలో ఉంచుకుంటూ దార్శనికతతో వ్యవహరించాలి.

అంతేకాదు మిత్రులారా!
రాముడి నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలుత ఆయన వ్యక్తిత్వాన్ని అవగతం చేసుకుని, ఆ ప్రవర్తనను అనుసరించాలి. ‘రాముడంటే ఆదర్శం.. రాముడంటే గౌరవం.. రాముడంటే జీవితంలో అత్యున్నత పాత్ర’ అని మనం గుర్తుంచుకోవాలి. “దివ్యగుణే శక్రసమో రామః సత్యపరాక్రమః”... రాముడంటే సత్యం, ధైర్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం. “రామః సత్పురుషే లోకే సత్యః సత్యపరాయణః”.. రాముడంటే సత్యం, ధర్మాలను ఆచరించే సత్యపరాయణుడు. “ప్రజా సుఖత్వే చంద్రస్య”.. రాముడంటే ప్రజల సౌఖ్యానికి ప్రాధాన్యమిచ్చే ప్రభువు. “వసుధాయః క్షమాగుణైః”.. రాముడంటే క్షమ, సహనాలకు ప్రతీక. “బుధ్యా బృహస్పతే తుల్యః” రాముడంటే జ్ఞానం, వివేకాల శిఖర సమానుడు. “మృదుపూర్వం చ భాషతే”.. రాముడంటే- మృదుత్వంలో దృఢత్వం. “కదాచన నోపకారేణ, కృతినైకేన్ తుష్యతి” రాముడంటే కృతజ్ఞతకు అత్యున్నత ప్రతీక. “శీల వృద్ధే: జ్ఞాన వృద్ధే: వయో వృద్ధే: చ సజ్జనే”.. రాముడంటే ఉత్తమ మైత్రికి చిహ్నం. “వీర్యవాన్ చ వీరేణ, మహతా స్వేన్ విస్మితః”.. రాముడంటే వినయంలోనే అసమాన శక్తి సంపన్నుడు. “న చ అనృత కథో విద్వాన్”.. రాముడంటే అచంచలమైన సత్య సంకల్ప ప్రతీక. “నిస్తన్ద్రిః అప్రమత్తః చ, స్వ దోష పర దోష విత్”.. రాముడంటే చైతన్యం, క్రమశిక్షణ, నిజాయితీ నిండిన హృదయం.
మిత్రులారా!
రాముడంటే కేవలం వ్యక్తి కాదు... ఒక విలువ, గౌరవం, ఒక దిశ. అందుకే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నా, సమాజం శక్తిమంతం కావాలన్నా మనలోని “రాముడి”ని మేల్కొల్పాలి... రాముడిని మనలో ఆవాహన చేసుకోవాలి. ఈ దిశగా సంకల్పం పూనడానికి ఇవాళ్టికన్నా మంచి రోజు మరేదైనా ఉంటుందా?
మిత్రులారా!
మన వారసత్వానికి గర్వకారణమైన మరో అద్భుత క్షణాన్ని ఈ చారిత్రక నవంబరు 25వ తేదీ మనకు చేరువ చేసింది. ధర్మధ్వజంపై చెక్కిన దేవకాంచన వృక్షమే ఇందుకు నిదర్శనం. మనం మూలాల నుండి వేరుపడితే, మన వైభవం చరిత్ర పుటల్లో సమాధి కాగలదనే వాస్తవానికి ఈ వృక్షమే ఒక నిదర్శనం.
మిత్రులారా!
రాముడు చిత్రకూటంలో ఉండగా భరతుడు అయోధ్య నుంచి సైన్య సమేతుడై అక్కడికి వస్తున్నపుడు లక్ష్మణుడు ఎంతో దూరం నుంచే పసిగట్టాడు. దీనిగురించి వాల్మీకి మహర్షి- “విరాజితి ఉద్రత్ స్కంధం, కోవిదార్ ధ్వజః రథే” అని లక్ష్మణుడితో చెప్పించాడు. అంటే- “ఓ రామా ఉజ్వల ప్రకాశంతో మహావృక్షంలా కనిపించే పతాకం కనిపిస్తోంది. అది అయోధ్య సైన్యం జెండా... దానిపై కోవిదార్ శుభ చిహ్నం కనిపిస్తోంది” అని అర్థం.
మిత్రులారా!
అలాంటి కోవిదార్ వృక్షాన్ని నేడు రామాలయ ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించడం అంటే.. కేవలం ఒక వృక్షాన్ని తిరిగి ప్రత్యక్షం చేయడం కాదు... అది మన జ్ఞాపకశక్తిని, మన గుర్తింపును పునరుజ్జీవింపజేయడమే. మన ఆత్మగౌరవ నాగరికతను తిరిగి చాటుకోవడమే... మనం మన గుర్తింపును విస్మరిస్తే కోవిదార్ వృక్షం మనకు గుర్తుచేస్తుంది. మనల్ని మనం కోల్పోయినపుడు, మన గుర్తింపు తిరిగి వచ్చిందంటే, దేశం ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వచ్చినట్టే కాగలదు. కాబట్టి, దేశం అభివృద్ధి చెందాలంటే, అది తన సుసంపన్న వారసత్వంపై గర్వించాలి.

మిత్రులారా!
మన వారసత్వంపై గర్వించడమే కాకుండా మనమంతా బానిస మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తులం కావడం మరొక కీలకాంశం. ఎన్నడో 190 ఏళ్ల కిందట... 1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు భారత మూలాలను పెకలించేందుకు బీజం వేశాడు. అంటే మన దేశంలో... మనందరి మానసిక బానిసత్వానికి పునాది వేశాడు. ఇప్పుడు మరో పదేళ్లు గడిస్తే... అంటే- 2035 నాటికి సదరు అపవిత్ర సంఘటనకు 200 ఏళ్లు పూర్తవుతాయి. అయితే, కొన్ని రోజుల కిందట నేనొక కార్యక్రమంలో మాట్లాడుతూ- రాబోయే పదేళ్లలో దేశాన్ని బానిస మనస్తత్వం నుంచి విముక్తం చేసే లక్ష్యంతో మనమంతా ముందడుగు వేయాలని పిలుపునిచ్చాను.
మిత్రులారా!
మెకాలే దార్శనికత ప్రభావం చాలా విస్తృతం కావడం అత్యంత దురదృష్టకర అంశం. ఎందుకంటే- మనకు స్వాతంత్ర్యం వచ్చిందిగానీ, న్యూనతాభావన నుంచి స్వేచ్ఛ లభించలేదు. ముఖ్యంగా విదేశాలలో ప్రతి అంశం, వ్యవస్థ మంచివి... మన దేశీయ వస్తువులు లోపభూయిష్ఠం అనే వక్రధోరణి దేశంలో ప్రబలింది.
మిత్రులారా!
మనం ప్రజాస్వామ్య భావనను విదేశాల నుంచి స్వీకరించామని, మన రాజ్యాంగం కూడా విదేశాల ప్రేరణతో రూపొందినదనే బానిస ధోరణి పదేపదే వెల్లడవుతోంది. కానీ, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశమే అన్నది వాస్తవం... ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉంది.
మిత్రులారా!
తమిళనాడుకు రాష్ట్రం ఉత్తర ప్రాంతంలో ‘ఉత్తిరమేరూర్’ అనే గ్రామం ఉంది. అక్కడ వేల ఏళ్ల కిందటి ఒక శాసనం మనకు కనిపిస్తుంది. దాన్నిబట్టి, ఆ కాలంలో ప్రజాస్వామ్యబద్ధ పాలనా వ్యవస్థ పనిచేసిన తీరును, ప్రజలు తమ పాలకులను ఎన్నుకున్న విధానాన్ని ఆ శాసనం వివరిస్తుంది. కానీ, మనం మాత్రం ఎప్పుడు చూసినా, మొండిగా మాగ్నా కార్టాను ప్రశంసిస్తున్నాం. అలాగే బసవేశ్వరుడు, ఆయన రూపొందించిన అనుభవ మంటపం సంబంధిత సమాచారం మనకు పరిమితంగానే లభ్యం. ఈ అనుభవ మంటపంలో సామాజిక, ధార్మిక, ఆర్థికాంశాలపై బహిరంగ చర్చలు సాగేవి. అటుపైన ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, బానిస మనస్తత్వం కారణంగా తరతరాల నుంచి భారతీయులు ఈ జ్ఞానానికి దూరమయ్యారు.
మిత్రులారా!
మన వ్యవస్థలో ఆమూలాగ్రం బానిస మనస్తత్వం పాతుకుపోయంది. మీకు గుర్తుందా... మన నావికాదళ పతాకంపై శతాబ్దాలుగా మన నాగరికతకు, మన సామర్థ్యానికి, వారసత్వానికి సంబంధంలేని చిహ్నాలు కొనసాగాయి. అయితే, మేమీ జెండా నుంచి బానిసత్వ చిహ్నాలన్నిటినీ తొలగించాం. ఆ స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వానికి స్థానమిచ్చాం. దీన్ని కేవలం డిజైన్ మార్పుగా కాకుండా మనస్తత్వంలో మార్పు తెచ్చిన క్షణం. ఆ మేరకు భారతదేశానికి నిర్వచనం దాని సొంత బలం, చిహ్నాలతో కూడినదై ఉండాలి తప్ప పరాయి వారసత్వంతో కాదని ఈ మార్పు చాటుతుంది.
ఆ మేరకు మిత్రులారా!
అయోధ్య నగరంలో కూడా ఆ మార్పు ఈ రోజున మన కళ్లముందు కనిపిస్తోంది!
మిత్రులారా!
ఈ బానిస మనస్తత్వమే అనేక సంవత్సరాలుగా రామత్వ భావనను తోసిపుచ్చింది. రాముడు మూర్తీభవించిన విలువలకు నిదర్శనం. ఓర్చా రాజైన రాముడి నుంచి రామేశ్వరంలో భక్త రాముడి దాకా... శబరి రాముడి నుంచి మిథిలలో అతిథి రాముడి వరకూ... దేశంలో ప్రతి ఇంటా, ప్రతి భారతీయుడి హృదయంలోనేగాక భారత్‌లో అణువణువునా శ్రీరామ భగవానుడు నిండి ఉన్నాడు. కానీ బానిస మనస్తత్వం ఎంతగా ప్రబలిందంటే- అంతటా తానైన రాముడిని కూడా కల్పిత పాత్రగా పరిగణించే ధోరణి తలెత్తింది.

మిత్రులారా!
ఈ నేపథ్యంలో మరో పదేళ్లకల్లా ఇటువంటి మానసిక బానిసత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ సాధించాలని మనం సంకల్పం పూనితే, ఆ జ్వాల రగుల్కొని... విశ్వాసం ఇనుమడిస్తుంది. దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందాలన్న స్వప్నం సాకారం కాకుండా ఆపే శక్తి ఏదీ లేదు. కాబట్టి, పదేళ్లలో మెకాలే బానిసత్వ ప్రాజెక్టును మనం పూర్తిస్థాయిలో ధ్వంసం చేస్తేనే రాబోయే వెయ్యేళ్ల దాకా భారత పునాది పటిష్ఠంగా ఉంటుంది.
మిత్రులారా!
అయోధ్య క్షేత్రంలో రామ్ లల్లా ఆలయ సముదాయం మరింత వైభవం సంతరించుకుంటోంది. అదే సమయంలో ఈ నగరాన్ని సుందరంగా ముస్తాబు చేసే పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అయోధ్య ఇప్పుడు మరోసారి ప్రపంచానికి ఉదాహరణగా రూపొందుతోంది. త్రేతాయుగం నాటి అయోధ్య నగరం మానవాళికి నీతిని నేర్పితే, ప్రస్తుత 21వ శతాబ్దపు అయోధ్య సరికొత్త ప్రగతి నమూనాను చూపుతోంది. ఆనాటి అయోధ్య గౌరవానికి కేంద్రమైతే, ఈనాటి అయోధ్య వికసిత భారత్ వెన్నెముకగా రూపుదిద్దుకుంటోంది.
మిత్రులారా!
భవిష్యత్ అయోధ్య ఇతిహాస, ఆధునిక కాలాల సంగమంగా విరాజిల్లుతుంది. సరయూ నదీ అమృత జలాలు, అభివృద్ధి ఏకమై ప్రవహిస్తాయి. ఆధ్యాత్మికత, కృత్రిమ మేధ రెండింటి సమ్మేళనం మనకు కనిపిస్తుంది. అలాగే రామ-భక్తి-జన్మభూమి మార్గాలు కొత్త అయోధ్యను సంగ్రహ రూపాన్ని దృగ్గోచరం చేస్తాయి. అయోధ్యలో ఇప్పుడు ఓ పెద్ద విమానాశ్రయం, అద్భుతమైన రైల్వే స్టేషన్ ఉన్నాయి. అయోధ్యను దేశంలోని ఇతర ప్రాంతాలతో వందే భారత్, అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అనుసంధానిస్తున్నాయి. ఈ నగర ప్రజలకు సకల సౌకర్యాలు సమకూరేలా, వారి జీవితాల్లో సౌభాగ్యం పొంగిపొరలేలా చేసే కృషి కొనసాగుతోంది.
మిత్రులారా!
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ నాటినుంచి ఇప్పటిదాకా సుమారు 45 కోట్ల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆ భక్తులందరి పాదముద్రలు పడిన ఈ పవిత్ర భూమితోపాటు పరిసర ప్రాంతాల ప్రజల జీవనంలో ఆర్థికంగా పెనుమార్పులు రాగా, ఆదాయం పెరిగింది. వివిధ అభివృద్ధి కొలమానాల రీత్యా ఒకనాడు వెనుకబడిన అయోధ్య ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
మిత్రులారా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో రాబోయే రోజులు మనకెంతో కీలకం. వి. స్వాతంత్ర్యం వచ్చాక గడచిన 70 ఏళ్లలో భారత్ ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. అయితే, కేవలం గత 11 సంవత్సరాల్లోనే 5వ స్థానానికి దూసుకెళ్లిన మన దేశం... 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే సమయం మరెంతో దూరంలో లేదు. రాబోయేది కొత్త ఆశలు, అవకాశాలు నిండిన కాలం... ఈ కీలక వ్యవధిలోనూ రాముడి ఆదర్శాలు మనకు ప్రేరణనిస్తాయి. రావణాసురుని ఓడించే ప్రధాన లక్ష్యంతో నిలిచిన క్షణంలో శ్రీరాముడు- “సౌరజ ధీరజ తేహి రథ చాకా. సత్య శీలల దృఢ్ ధ్వజ పతాకా.. బల్ బిబేక్ దమ్ పరహిత్ ధేరే. క్షమ కృప, సమతా రజు జేరే” అని పలికాడు. అంటే- “రావణుని జయించేందుకు అవసరమైన రథానికి సహనం, ధైర్యమే చక్రాలు.. సత్యం, సత్ప్రవర్తనలే పతాకం. శక్తి, జ్ఞానం, నిగ్రహం, దాతృత్వాలే రథాశ్వాలు. క్షమ, దయ, సమానత్వాలే అశ్వాలను నడిపించే పగ్గాలు” అని అర్థం.
మిత్రులారా!
వికసిత భారత్ దిశగా భారత్ పయనం మరింత వేగం పుంజుకోవాలంటే అలాంటి రథమే మనకూ అవసరం. సహనం, ధైర్యం చక్రాలుగా గల రథమంటే- సాహసంతో ఎదుర్కొని, ఓర్పుతో ఫలితాలు సాధించేది. సత్యం, సత్ప్రవర్తనలే ధ్వజంగా నిలిచే రథమంటే- విధానం, సంకల్పం, నైతికతలతో ఎన్నడూ రాజీపడనిది. బలం, వివేకం, నిగ్రహం, దాతృత్వమనే అశ్వాలు పూన్చిన రథమంటే- శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, క్రమశిక్షణ, ప్రజా సంక్షేమంపై శ్రద్ధ కలిగి ఉండటం. క్షమ, కరుణ, సమదృష్టి పగ్గాలు కలిగిన రథమంటే- విజయంతో విర్రవీగని, వైఫల్యంలోనూ కుంగిపోకుండా పరులను గౌరవించే తత్వం. కాబట్టి, నేను సవినయంగా చెబుతున్నాను- ఇది మనమంతా భుజంభుజం కలిపి నడవాల్సిన తరుణం... మన కృషిని వేగిరపరచాల్సిన క్షణం... రామరాజ్యం స్ఫూర్తిగా నవ భారత్‌ను మనం సృష్టించాలి. స్వప్రయోజనం కన్నా దేశ ప్రయోజనమే ముఖ్యమైనదిగా ఉంటేనే ఇది సాధ్యం. అంటే- జాతీయ ప్రయోజనమే అత్యంత ప్రధానం కావాలి! మరోసారి మీకందరికీ నా శుభాకాంక్షలు.
జై సియారామ్!
జై సియారామ్!
జై సియారామ్!


