ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్‌ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్‌ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్‌ ఇప్పుడు పర్యటిస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో రైసినా చర్చల ప్రారంభానికి ముందు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఫిన్లాండ్‌ అధ్యక్షుడు స్టూబ్‌ను సాదరంగా స్వాగతించారు. అటుపైన ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు స్టూబ్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం వారిద్దరూ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్షుడు స్టూబ్‌ గౌరవార్థం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను భారత్‌ విజయవంతంగా నిర్వహించిందంటూ ఫిన్లాండ్ అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. కృత్రిమ మేధ సురక్షిత, విశ్వసనీయ, సార్వజనీన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి కోసం సంయుక్త కృషి అత్యంత కీలకమని వారిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌- ఫిన్లాండ్ మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్యం, చట్ట నిబంధనల విలువలు సహా ప్రపంచ శాంతి, భద్రత, అంతర్జాతీయ చట్టాలపై నిబద్ధతలు పునాదిగా ప్రగాఢ, నిరంతర స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని నాయకులిద్దరూ స్పష్టం చేశారు.

ఐక్యరాజ్య సమితి కేంద్రకంగా నిబంధనాధారిత అంతర్జాతీయ క్రమం, బహుపాక్షిక సహకారం ఆవశ్యతకపై తమ నిబద్ధతను భారత ప్రధాని, ఫిన్లాండ్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.

ఐక్యరాజ్య సమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన కృషిని మరింత ఇనుమడింపజేయాల్సిన అవసరం ఉందని వారిద్దరూ అంగీకరించారు. అలాగే, వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం సంబంధిత సమస్యల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారం ప్రాధాన్యాన్ని వారు గుర్తుచేశారు.

ఈ ఏడాది జనవరిలో భారత్‌-ఐరోపా సమాఖ్య శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉభయ పక్షాల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌-ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలుసహా వాణిజ్యం, పెట్టుబడుల పరంగా ఈ ఒప్పందం ఉభయతారకం కాగలదని, అపార-పరస్పర ప్రయోజనాలు సిద్ధిస్తాయని వారు పేర్కొన్నారు.

ఇంతకుముందు 2021 మార్చి 16న ‘ఇండియా-ఫిన్లాండ్ వర్చువల్ సమ్మిట్’ సహా 2018, 2022 సంవత్సరాల్లో స్టాక్‌హోమ్, కోపెన్‌హాగన్‌ నగరాల్లో ‘ఇండియా-నార్డిక్ సమ్మిట్’లను నిర్వహించారు. ఆయా సందర్భాల్లో భారత్‌-ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ సమయంలోనూ వారు కలుసుకున్నారు. ఈ ద్వైపాక్షిక సమావేశాల ఫలితాల ఆధారంగా రెండు దేశాల మధ్య సహకార విస్తృతితోపాటు మరింత బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను వారు స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితో, రెండు దేశాల మధ్య బంధం డిజిటలీకరణ, సుస్థిరతల ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని వారు నిర్ణయించారు. ఉభయ పక్షాల ఆసక్తులు, పరస్పర ప్రయోజనాల సాధనకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

వాణిజ్యం - పెట్టుబడులు

భారత-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అందివచ్చే అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భారత్‌, ఫిన్లాండ్‌ దేశాల వ్యాపారవేత్తలకు వారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 2030 నాటికి ఉభయ పక్షాల మధ్య ప్రస్తుత వాణిజ్యం విలువ ద్విగుణీకృతం కావాలన్నది లక్ష్యంగా ఉండాలని నాయకులిద్దరూ సూచించారు.

ఫిన్లాండ్ అధ్యక్షుడితో కలిసి భారత పర్యటనకు వచ్చిన భారీ పారిశ్రామిక ప్రతినిధి బృందంతోపాటు ఫిబ్రవరిలో న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఫిన్లాండ్‌ ప్రధానమంత్రితో వచ్చిన కంపెనీల ప్రతినిధులు సహా సంబంధిత వాణిజ్య సంఘాల మధ్య ఫలవంతమైన చర్చలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల్లో వాణిజ్యం, సాంకేతిక సహకారం-పెట్టుబడి సంబంధాల విస్తరణకు మార్చి 7న ముంబయిలో నిర్వహించే భారత్‌దేశం-ఫిన్లాండ్ వాణిజ్య సదస్సు, ‘సీఈవో’ల సమావేశాలు దోహదం చేయగలవని వారిద్దరూ విశ్వాసం వ్యక్తం చేశారు.

హెల్సింకిలోని స్లష్‌లో భారత వినూత్న అంకుర సంస్థలు, న్యూఢిల్లీలో అంకుర మహాకుంభ్‌ సందర్భంగా ఫిన్లాండ్‌ అంకుర సంస్థల మధ్య సహకారం సహా ఇండో-ఫిన్లాండ్ స్టార్టప్ కారిడార్ వంటి కార్యక్రమాల ద్వారా అంకుర సంస్థల స్థాయిలో సంయుక్త కృషిని నాయకులిద్దరూ స్వాగతించారు.

డిజిటలీకరణ

సామాజిక-ఆర్థిక ప్రగతిలో డిజిటలీకరణకుగల రూపాంతకరీణ సామర్థ్యాన్ని వారు గుర్తుచేశారు. ఈ మేరకు 5జి, 6జి, హై-పెర్ఫార్మెన్స్‌-క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ వగైరా సరికొత్త, అత్యాధునిక సాంకేతికతలు సహా డిజిటల్ రూపాంతరీకరణను ప్రాధాన్య రంగాలుగా వారు ప్రకటించారు. ఈ రంగాలన్నిటా పరస్పర విశ్వాసం, ప్రయోజనాల ప్రాతిపదికన సహకారాన్ని విస్తృతం చేసే అవకాశాలున్నాయి. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ, (యూపీఐ) వంటి డిజిటల్ చెల్లింపుల సాంకేతికత సహా సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో భారత్‌కుగల విశేష అనుభవాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా సహకారానికిగల అవకాశాలపై వారు చర్చించారు.

ఈ నేపథ్యంలో ప్రాధాన్యతలను నిర్వచించడం, డిజిటల్ రూపాంతరీకరణకు తోడ్పడే నిర్దిష్ట- గణనీయ చర్యల దిశగా కార్యకలాపాలను ప్రోత్సహించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఈ దిశగా డిజిటలీకరణపై రెండు దేశాల్లో రంగాలవారీ సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలను వారు ఆదేశించారు.

ఫిన్లాండ్‌ పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణ వ్యవస్థలకు సంబంధించి గణనీయ సంఖ్యలోగల  భారత నిపుణుల సానుకూల ప్రభావాన్ని అధ్యక్షుడు స్టూబ్‌ ప్రముఖంగా వివరించారు. అందరికీ ప్రయోజనం చేకూర్చే డిజిటల్ రూపాంతరీకరణ, స్థిరత్వం సాధించడంతోపాటు సామాజిక-ఆర్థిక ప్రగతికి కూడా ఈ సహకారం దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

సెమీకండక్టర్లు, 6జి, ఇంధన వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత-ఫిన్లాండ్‌ కంపెనీలతోపాటు పరిశోధన సంస్థల ఉమ్మడి కార్యక్రమాలకు ‘ఆర్డీఐ’ నిధుల సమీకరణ దిశగా భారత సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ ఫిన్లాండ్ విభాగాలు సంయుక్తంగా పిలుపునివ్వడంపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా 6జిపై ద్వైపాక్షిక సహకార విస్తృతికి అన్నివిధాలా కృషి కొనసాగడాన్ని హర్షిస్తూ, భారత్ 6జి అలయన్స్, ఫిన్లాండ్‌లోని ఔలు విశ్వవిద్యాలయాల మధ్య సహకార చట్రాన్ని స్వాగతించారు.

అంతేకాకుండా కృత్రిమ మేధపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ‘ఆర్డీఐ’ సహకారం దిశగా మార్గాన్వేషణకు భారత ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బిజినెస్ ఫిన్లాండ్ మధ్య కృషిని నాయకులు స్వాగతించారు. అలాగే, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌ సంబంధిత ఇండియన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, ఫిన్నిష్ ఐటీ సెంటర్ ఫర్ సైన్స్ మధ్య చర్చలపై హర్షం వ్యక్తం చేశారు.

అత్యాధునిక సాంకేతిక రంగానికి సంబంధించి అంతరిక్ష సాంకేతికతలలో భారత-ఫిన్లాండ్‌ భాగస్వాముల మధ్య గణనీయ భవిష్యత్ సామర్థ్యం, చురుకైన ప్రైవేట్ రంగ భాగస్వామ్య సహిత సహకారానికి అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

సుస్థిరత

సుస్థిరతకు సంబంధించి నాయకులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్వల్ప కర్బన్ రూపాంతరీకరణ, ఇంధన సామర్థ్యం, బయో ఇంధనాలు, స్మార్ట్ గ్రిడ్‌లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో కాలుష్య రహిత ఇంధన పరిష్కారాల దిశగా ఉభయ పక్షాలకూ గణనీయ సామర్థ్యం ఉందని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా వర్తుల ఆర్థిక వ్యవస్థ, సుస్థిర జల నిర్వహణ, వాతావరణ శాస్త్రంలో సహకారం ప్రాధాన్యాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ లక్ష్యంతో సుస్థిరత సంబంధిత అంశాలన్నిటిపై సహకారం పెంచుకునేలా రెండు దేశాల నుంచి  సంబంధిత రంగాల వారిని ఒకే వేదికపైకి తెచ్చి, సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం అమలు ప్రాధాన్యాన్ని నాయకులు స్పష్టం చేశారు. బయో ఇంధనం, వ్యర్థాల నుంచి ఇంధనోత్పత్తి మార్గాలు, విద్యుత్ నిల్వ, సరళ పునరుత్పాదక వ్యవస్థలు, గ్రీన్ హైడ్రోజన్ సహా పవన, సౌర, చిన్న జల విద్యుత్ తరహా సుస్థిరతకు దోహదం చేసే అనేక కీలక సహకార రంగాలు ఇందులో భాగంగా ఉంటాయి.

పర్యావరణ సహకారంపై అవగాహన ఒప్పందం, లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్‌ఐటి) కింద సహకార పునరుద్ధరణకు వారు అంగీకరించారు, వర్తుల ఆర్థిక వ్యవస్థ, వాతావరణ కార్యాచరణ, సుస్థిరత సాధనలో సహకార పరిధిని మరింత విస్తరించాలని ఆయా పక్షాలకు సూచించారు.

అడ్వాన్స్‌డ్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఏఎంఐ), ఇతర డిజిటల్ గ్రిడ్ టెక్నాలజీలు సహా స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ విస్తరణ వేగం పెంపుతో కీలక విద్యుత్ మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న సైబర్ భద్రత ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడటంపై ఉభయ పక్షాలూ సంతృప్తి వ్యక్తం చేశాయి. పునరుత్థాన, విశ్వసనీయ సుస్థిర స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థలను ప్రోత్సహించడంలో సహకారం దిశగా భవిష్యత్‌ అవకాశాల అన్వేషణపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.

ఈ ఏడాది చివరన తదుపరి ‘ప్రపంచ వర్తుల ఆర్థిక వ్యవస్థ వేదిక’ను భారత్‌ నిర్వహించనుండటంపై ఫిన్లాండ్‌ అధ్యక్షుడు స్టూబ్‌ అభినందనలు తెలిపారు. వర్తుల ఆర్థిక వ్యవస్థ పరిష్కారాల మెరుగుదల, కొత్త సహకార కార్యక్రమాల దిశగా అన్వేషణలో అగ్ర నైపుణ్యాన్ని ఏకీకృతం చేయడానికి ఒక వేదికగా ఫిన్లాండ్‌ ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్‌ శ్రీకారం చుట్టింది.

ఇండో-నార్డిక్ వాటర్ ఫోరమ్ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్, ఫిన్నిష్, ఇతర నార్డిక్ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఫిన్లాండ్ పోషిస్తున్న క్రియాశీల పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. నీటి వనరుల నిర్వహణ సర్క్యులర్ ఎకానమీ పరిష్కారాల కోసం మురుగునీటి నిర్వహణలో కొత్త భాగస్వామ్యాలను,  ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తున్నందుకు ఆయన అభినందించారు.  

వాతావరణ సహకారానికి సంబంధించి, ఫిన్నిష్ మెట్రోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఎంఐ), భారత వాతావరణ శాఖ (ఐఎండి) మధ్య గాలిలోని సూక్ష్మ కణాల పర్యవేక్షణ (ఏరోసోల్ మానిటరింగ్), గాలి నాణ్యత అంచనాలో కొనసాగుతున్న సహకారాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు. ఎఫ్ఎంఐ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) మధ్య వర్చువల్ రీసెర్చ్ సెంటర్‌ను స్థాపించే దిశగా జరుగుతున్న కృషిని వారు స్వాగతించారు. ఇప్పటికే ఎఫ్ఎంఐ-ఐఐటీఎం మధ్య కొనసాగుతున్న పరిశోధనల సహకారాన్ని కూడా వారు గుర్తించారు; ఈ బహుపాక్షిక ప్రాజెక్టుల మొత్తం విలువ 11 మిలియన్ యూరోల పైగా ఉంది.

భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,  ఫిన్లాండ్‌కు చెందిన నేషనల్ ల్యాండ్ సర్వే, ఫిన్నిష్ ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, వివిధ నగరాలు,  కంపెనీల మధ్య జరిగిన అనుభవాల మార్పిడిని కూడా ఇరువురు నాయకులు గుర్తించారు. ముఖ్యంగా భూమి,  ఆస్తి సమాచారానికి సంబంధించిన సమగ్ర జీఐఎస్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ -   ల్యాండ్ స్టాక్ గురించి వారు చర్చించారు.

అధికారిక గణాంకాల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తమ పద్ధతులు, గణాంక పద్ధతులు, సాంకేతిక నైపుణ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఒక బలమైన వేదిక ఏర్పడుతుంది.

చలనశీలత,  విద్య, ప్రజల మధ్య సంబంధాలు
అన్ని రంగాలలో, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికులు, నిపుణులు, యువ వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు సహా ప్రజల మధ్య సంబంధాల  ప్రాముఖ్యతను భారత ప్రధానమంత్రి,  ఫిన్లాండ్ అధ్యక్షుడు గుర్తించారు. ఇవి ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి, సామాజిక వ్యవస్థను బలోపేతం చేయడానికి,  పరస్పర అవగాహనను మెరుగుపరచడానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

వలసలు, చలనశీలతలో భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో సులభమైన, క్రమబద్ధమైన, పరస్పర ప్రయోజనకరమైన పర్యటనల కోసం ఇది ఒక బలమైన పునాదిని వేస్తుంది. భారత్, ఫిన్లాండ్ దేశాల ఆర్థికాభివృద్ధికి, అభివృద్ధికి తోడ్పడేలా ఈ ఒప్పందాన్ని సమగ్రంగా, సమన్వయంతో అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రెండు పక్షాలు అంగీకరించాయి.  కాన్సులర్ వ్యవహారాలపై ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తూ, ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య జరుగుతున్న సంప్రదింపులను కూడా నాయకులు గుర్తించారు.

విద్యా రంగంలో సహకారంపై 31 జనవరి 2024న జరిగిన ఉన్నత స్థాయి చర్చలలో ఆమోదించిన సంయుక్త ప్రకటనను ఇరువురు నాయకులు గుర్తించారు. అంగీకరించిన అంశాలైన మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల చలనశీలతపై దృష్టి సారిస్తూ, ఉమ్మడి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధిత పక్షాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలని వారు సూచించారు.

ఈ సందర్భంలో, ఫిన్నిష్ విద్యా విధానం పట్ల భారత్ లో పెరుగుతున్న ఆసక్తిని నాయకులు గుర్తించారు. ఉపాధ్యాయ శిక్షణలో పెరుగుతున్న సహకారం, అలాగే ఫిన్నిష్ నమూనా ప్రకారం ఏర్పాటవుతున్న బాల్యానికి ముందు దశ ప్రాథమిక విద్యా సంస్థలు పాఠశాలలు దీనికి నిదర్శనం. విద్యా రంగంలో సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సంబంధిత భాగస్వాముల ఉమ్మడి సంకల్పం, నిబద్ధతకు ఇవి స్పష్టమైన రూపాలని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా, చలనచిత్ర, గేమింగ్ పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక బలమైన ప్రాతిపదికను అందించే ద్వైపాక్షిక ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ ఒప్పందంపై జరుగుతున్న చర్చలను ఇరువురు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. 

భారత్ - ఈయూ సంబంధాలు

జనవరి 27, 2026న జరిగిన భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో ఆమోదించిన కొత్త సంయుక్త భారత్-ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఎజెండాను నాయకులు స్వాగతించారు. ఈ ఎజెండా ఉమ్మడి విలువలు, సూత్రాలు, పరస్పర విశ్వాసం, ఒకే రకమైన రాజకీయ సంకల్పంపై ఆధారపడి ఉంది. 

భారత్, ఐరోపా సమాఖ్య (ఈయూ) పరస్పరం స్థిరమైన, ఊహించదగిన,  నమ్మదగిన భాగస్వాములుగా ఉండగలవని ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇరుపక్షాలకు అనేక సానుకూల ఫలితాలను అందించేలా లోతైన, బహుముఖ దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించుకోవాలని వారు నిర్ణయించారు. భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం ఈ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని ఇరువురు నాయకులు అంగీకరించారు. మార్కెట్ లభ్యత అవకాశాలను పెంచడం,  వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా లభించే స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ ఒప్పందం కీలకమైన విలువ శ్రేణులను వైవిధ్యపరచడం,  కొత్త మార్కెట్లను తెరవడం ద్వారా ఆర్థిక భద్రతను, సుస్థిరతను బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.  

కీలకమైన వాణిజ్యం, సాంకేతికత, ఆర్థిక భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వేదికగా భారత-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటిసీ) పనితీరును మరింత మెరుగుపరచడానికి ఇరువురు నాయకులు తమ మద్దతును పునరుద్ఘాటించారు. భారత-ఈయూ సాంకేతిక భాగస్వామ్యానికి ఈ కౌన్సిల్ ఒక మూలస్తంభం అని వారు పేర్కొన్నారు.

భారత్-ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్యంపై సంతకం చేయడాన్ని ఒక మైలురాయిగా భారత ప్రధానమంత్రి,  ఫిన్లాండ్ అధ్యక్షుడు అభివర్ణించారు. ఇది భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో అర్థవంతమైన కోణాన్ని జోడించిందని వారు అంగీకరించారు. ఈ భాగస్వామ్యం ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న అనేక రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

చలనశీలతకు సంబంధించి సమగ్ర సహకార ముసాయిదాపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, భారతదేశంలో యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్‌వే ఆఫీస్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభాన్ని నాయకులు ప్రశంసించారు.

బహుపాక్షిక సహకారం

ఐక్యరాజ్యసమితి వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరాన్ని నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత సమర్థవంతంగా, ప్రాతినిధ్యంతో కూడినదిగా, సమ్మిళితంగా, ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా సమగ్రంగా సంస్కరించడం చాలా ముఖ్యమని వారు స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి  సంస్కరణల తర్వాత, అందులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం  లభించడానికి ఫిన్లాండ్ తన మద్దతును మరోసారి స్పష్టం చేసింది.

బహుపాక్షిక వాదాన్ని రక్షించడానికి, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని కాపాడటానికి, ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో పరస్పర సహకారం కీలకమని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ వేదికలపై ఒకరి అభ్యర్థిత్వాలకు,  నామినేషన్లకు మరొకరు మద్దతు ఇచ్చుకోవాలని వారు నిర్ణయించారు.

అంతర్జాతీయ వేదికలపై తమ నిర్మాణాత్మక సహకారాన్ని కొనసాగించాలని భారత్, ఫిన్లాండ్ దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా శాంతి, భద్రత, మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం వంటి ప్రపంచవ్యాప్త సవాళ్లపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.  

అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా సముద్ర చట్టానికి సంబంధించిన ఆ ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి (అన్క్లాస్)   లోబడి, స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన, శాంతియుతమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్  ప్రాంతాన్ని ప్రోత్సహించడం పట్ల వారు తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్  లో ఫిన్లాండ్ చేరడాన్ని భారత్ సాదరంగా స్వాగతించింది.

ఆర్కిటిక్ అంశాలపై సహకారాన్ని, చర్చలను మరింత బలోపేతం చేయాలనే తమ ఉమ్మడి నిబద్ధతను రెండు దేశాల నాయకులు పునరుద్ఘాటించారు. ఉమ్మడి పరిశోధనలు, విద్యాపరమైన మార్పిడి కార్యక్రమాలు, సామర్థ్య పెంపుదల ద్వారా ఈ సహకారాన్ని కొనసాగించాలని వారు నిర్ణయించారు.

జనవరి 2026లో ఫిన్లాండ్‌లోని రోవానిమి నగరంలో జరిగిన మొట్టమొదటి భారత-ఫిన్లాండ్ ఆర్కిటిక్ చర్చలను ఇరువురు నాయకులు గుర్తించారు. హిమాలయ, ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థలు: సుస్థిర భవిష్యత్తు కోసం భారత్-ఫిన్లాండ్ భాగస్వామ్యం" అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో పార్లమెంటేరియన్లు, ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు,నిపుణులు పాల్గొన్నారు. ఆర్కిటిక్ అంశాలపై సహకారాన్ని మరింత లోతుగా పెంచడానికి అవసరమైన వ్యూహాలు, మార్గాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఆర్కిటిక్ కౌన్సిల్ వేదికగా విస్తృతమైన భారత్-నార్డిక్ శిఖరాగ్ర సదస్సు పరిధిలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యమని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని అవి ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా,  నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని సమగ్రంగా, నిరంతరాయంగా, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు నిర్ణయాత్మకమైన ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. తీవ్రవాద భావజాలం వ్యాప్తిని, తీవ్రవాదాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదానికి అందుతున్న నిధులను నిలిపివేయడానికి తమ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఫిన్లాండ్ నాయకులు నిర్ణయించారు. అంతర్జాతీయంగా అంగీకరించిన మనీ లాండరింగ్ నిరోధక ప్రమాణాలను ప్రోత్సహించాలని, ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగాన్ని నివారించాలని, అలాగే ఉగ్రవాద నియామకాన్ని అరికట్టాలని వారు అంగీకరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అడ్డుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వంటి అంతర్జాతీయ వేదికలపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2025లో భారత్ లో జరిగిన రెండు భారీ ఉగ్రవాద దాడులను వారు అత్యంత కఠినమైన పదజాలంతో ఖండించారు:

ఐక్యరాజ్యసమితి చార్టర్,  అంతర్జాతీయ చట్ట సూత్రాల ఆధారంగా స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు తమ మద్దతును కొనసాగించాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.

ముగింపు
డిజిటలైజేషన్, సుస్థిరత రంగాలలో భారత-ఫిన్లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఇరువురు నాయకులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణలో ఏయే రంగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో స్పష్టంగా నిర్వచించడం, గుర్తించిన రంగాలలో అమలు చేయాల్సిన నిర్దిష్ట పనులు, ప్రాజెక్టులను ఖరారు చేయడం, ఈ ప్రణాళికలో సాధించిన పురోగతిని క్రమం తప్పకుండా ఫిన్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించడం సహా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధ్యయన బృందాలను వారు ఆదేశించారు.

తన పర్యటన సందర్భంగా భారత్ చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు గానూ ఫిన్లాండ్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు తమ మధ్య స్వేచ్చగా జరిగిన నిర్మాణాత్మక చర్చల  పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న ప్రగతిశీల సహకారాన్ని  వారు హర్షించారు. పరస్పర గౌరవం, సహకారంతో కూడిన బలమైన పునాదితో తమ సంబంధాలను కొనసాగించాలని వారు అంగీకరించారు. ఈ సందర్భంగా, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్...ప్రధాని శ్రీ మోదీని ఆహ్వానించారు. ఫిన్లాండును సందర్శించేందుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అంగీకరించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India remains among best-performing major economies: S&P Global

Media Coverage

India remains among best-performing major economies: S&P Global
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఏప్రిల్ 2026
April 19, 2026

Building a Stronger Bharat: Infrastructure Revolution, Economic Resilience & Inclusive Welfare Under PM Modi