· ఈ ఉదయం మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాద విషాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్, ఆయన సహచరులు కొందరిని కోల్పోయాం
· మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన అజిత్ దాదా: గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముందువరుసలో నిలిచిన నేత... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
· ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరులను ఎన్నటికీ మరువలేం... ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబాలకు దేశం సంఘీభావంగా నిలుస్తుంది
· భారత యువశక్తిని సాధికారులను చేసే ఉద్యమం ఎన్‌సీసీ
· ఎంతో నమ్మకంతో ప్రపంచం నేడు భారత యువతను చూస్తోంది
· ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఐరోపా యూనియన్‌తో ఒప్పందం: అన్ని ఒప్పందాలకూ ఇది తల్లి వంటిదనీ, ప్రపంచ గమనాన్ని మార్చే గేమ్ ఛేంజర్ అనీ ప్రపంచం భావిస్తోంది
· అనేక రంగాల్లో నేడు యుద్ధాలు... కోడ్‌లోనూ, క్లౌడ్‌లోనూ యుద్ధాలు
· సాంకేతికతలో వెనుకబడిన దేశాలు ఆర్థికంగానే కాదు.. భద్రత పరంగానూ బలహీనంగా ఉన్నాయి
· పౌరులుగా మనమెలా ప్రవర్తిస్తామన్నది కూడా వికసిత భారత్‌లో కీలక అంశం.. మనం మన విధులకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.

స్నేహితులారా,

ఈ రోజు మనకు తీవ్ర దుఖ్ఖాన్ని తీసుకొచ్చింది. మహారాష్ట్రలో ఈ ఉదయం జరిగిన విమాన ప్రమాదం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను, ఇతరులను మనకు దూరం చేసింది. మహారాష్ట్ర, దేశ అభివృద్ధికి అజిత్ దాదా విశేష కృషి చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో జీవనాన్ని మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేసేవారు. అజిత్ పవార్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం.

 

స్నేహితులారా,

ఇక్కడ ఉన్న క్యాడెట్లు, మిత్ర దేశాల నుంచి వచ్చిన క్యాడెట్లు, అధికారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి పెద్ద సంఖ్యలో బాలికా క్యాడెట్లు వచ్చారు. వారికి ప్రత్యేక అభినందనలు.

స్నేహితులారా,

భారత యువశక్తిలో ఆత్మవిశ్వాసం నింపే, క్రమశిక్షణ అలవాటు చేసే, ధైర్యాన్ని నింపే, దేశానికి అంకితమయ్యే పౌరులుగా మార్చే సంస్థ ఎన్‌సీసీ. ప్రతి ఏడాది మీరు పోషిస్తున్న పాత్రను బలోపేతం చేసుకుంటున్నారు. గడచిన కొన్నేళ్లలో ఎన్‌సీసీ క్యాడెట్ల సంఖ్య 14 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ఎన్‌సీసీ క్యాడెట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నా యువ మిత్రులారా,

యువతకు ఎన్‌సీసీ ఒక వేదిక. ఈ వేదికపై తమ వారసత్వాన్ని, గర్వాన్ని వ్యక్తం చేయగలుగుతారు. ఉదాహరణకు, ఈ ఏడాది వందేమాతరం 150 వసంతోత్సవాలను ఎన్‌సీసీ ఉత్సాహంగా నిర్వహిస్తోంది. దేశంలో ప్రతి మూల దీనికి సంబంధించిన కార్యక్రమాలను మీరు నిర్వహించారు. పరమ వీర్ సాగర్ యాత్ర దీనికి గొప్ప ఉదాహరణ. కొన్నేళ్ల కిందట 21 అండమాన్ నికోబార్ దీవులకు పరమ వీర చక్ర విజేతల పేర్లను మా ప్రభుత్వం పెట్టిందని మీ అందరికీ తెలుసు. మీ సాహస నౌకా యాత్ర ద్వారా జాతీయ వీరులను గౌరవించే బాధ్యతను మీరు ముందుకు తీసుకెళ్లారు. అదే విధంగా మహాసముద్రం, సంస్కృతి, ప్రకృతి వేడుకను ఐలాండ్ ఉత్సవాల రూపంలో లక్షద్వీప్‌లో నిర్వహించారు.

 

స్నేహితులారా,

స్మారక చిహ్నాల నుంచి చరిత్రను బయటకు తీసుకువచ్చి.. ప్రజల జీవితాల్లో వాటిని సజీవంగా ఎన్‌సీసీ ఉంచుతోంది. బాజీరావు పీష్వా పరాక్రమం గొప్ప యోధుడైన లచిత్ బోర్ఫుకన్ నైపుణ్యం, భగవాన్ బిర్సా ముండా నాయకత్వం గురించి సైకిల్ ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టిన మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ రోజు పురస్కారాలు స్వీకరించిన అందరికీ శుభాకాంక్షలు.

స్నేహితులారా,

దేశానికి ఇదే సరైన సమయమని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. ఇది మన దేశ యువతకు గరిష్ట అవకాశాలు లభించే సమయం. దీని నుంచి యువత వీలైనంత ప్రయోజనం పొందేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి ఉదాహరణను మీరు నిన్ననే చూశారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని కంటే ముందు ఒమన్, న్యూజిలాండ్, బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్‌లతో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ లక్షలాది మంది యువతకు లెక్కలేనన్ని అవకాశాలను కల్పిస్తాయి.

స్నేహితులారా,

ఇప్పుడు ప్రపంచమంతా భారతీయ యువత వైపు గొప్ప నమ్మకంతో చూస్తోంది. దీనికి కారణం.. నైపుణ్యాలు, విలువలే. ప్రజాస్వామ్య విలువలు భారతీయ యువతలో ఉన్నాయి. భిన్నత్వాన్ని గౌరవించే విలువలను మన యువతకు ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించే విలువలు కూడా భారతీయ యువతలో ఉన్నాయి. కాబట్టి.. మన యువత ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి ప్రజలతో ఇట్టే కలిసిపోగలుగుతారు. వారి హృదయాలను గెలుచుకోగలుగుతారు. మన సామర్థ్యంతో ఆ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాం. ఇవే మన విలువలు, ఇదే మన నైజం. పని ప్రదేశం (కర్మభూమి) పట్ల, మాతృభూమి పట్ల అమితమైన గౌరవం, అసమానమైన అంకితభావం, ఇదే మన వారసత్వం.

 

స్నేహితులారా,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో నేను మాట్లాడినప్పుడు, ఆ సంభాషణ ఆధారంగా నేను ఓ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. నిపుణులైన మన భారతీయ యువత కష్టపడి పని చేస్తారు. అందుకే వారికి గొప్ప డిమాండ్ ఉంది. ఉదాహరణకు, గల్ఫ్ దేశాల్లో చూడండి. అక్కడ లక్షలాది మంది ప్రజలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. చాలా దేశాల్లో అద్భుతమైన వైద్య వ్యవస్థలను, మౌలిక సదుపాయాలను మన వైద్యులు, ఇంజినీర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో దేశాల్లోని సమాజాలకు కొత్త విలువలను మన ఉపాధ్యాయులు జోడించారు.

స్నేహితులారా,

వారు అందిస్తున్న సహకారాన్ని, దేశ యువత సాధిస్తున్న విజయాలను ఈ ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. ఎందుకంటే.. ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ వెన్నెముకగా మారింది. ఇప్పుడు, అంకుర సంస్థలు, అంతరిక్షం, డిజిటల్ టెక్నాలజీతో సహా ప్రతి రంగంలోనూ ఈ యువ శక్తి నూతన విప్లవానికి నాంది పలుకుతోంది.

స్నేహితులారా,

యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఒప్పందాన్ని ఇప్పుడు ‘‘మదర్ ఆఫ్ డీల్స్’’గా, గేమ్-ఛేంజర్‌గా ఈ ప్రపంచం కొనియాడుతోంది. మీ ఆకాంక్షలకు స్వేచ్ఛను ఈ ఎఫ్‌టీఏ అందిస్తుంది. ప్రపంచ జీడీపీలో నాలుగో వంతును, అంతర్జాతీయ వాణిజ్యంలో మూడో వంతును ఈ ఒప్పందం సూచిస్తుంది.

స్నేహితులారా,

యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం అంటే ప్రపంచంలోని 27 దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందని అర్థం. ఇది భారతీయ అంకుర సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారత అంకుర సంస్థలకు పెట్టుబడులు, ఆవిష్కరణల వ్యవస్థను సులభతరం చేస్తోంది. ఈ ఒప్పందంతో చలనచిత్రాలు, గేమింగ్, ఫ్యాషన్, డిజిటల్ కంటెంట్, సంగీతం, డిజైన్ లాంటి మన సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో ప్రయోజనం లభిస్తుంది. దీనితో పాటుగా.. భారత దేశ పరిశోధన, విద్యా రంగాల్లో ఐటీ, ఇతర నైపుణ్య సేవలకు అనేక నూతన అవకాశాలు కూడా లభిస్తాయి.

 

స్నేహితులారా,

సమగ్రంగా, లోతుగా, కొత్త శిఖరాలను అధిరోహించేలా, అనేక ప్రయోజనాలు అందించేలా ఉండటం వల్లే ఈ ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’ అని పిలుస్తున్నారు. ఇది ఆత్మనిర్భర భారత్ కార్యక్రమానికి వేగాన్ని అందిస్తుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ సంకల్పానికి బలాన్నిస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా దాదాపు 99 శాతం భారతీయ ఎగుమతులపై సున్నా సుంకం లేదా చాలా తక్కువ పన్ను ఉంటుంది. దీని నుంచి జౌళి, తోలు, రత్నాలు, ఆభరణాలు, పాదరక్షలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఎంఎస్ఎంఈలు వంటి మన భారతీయ పరిశ్రమలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుంది. 27 యూరోపియన్ దేశాల మార్కెట్లకు మన చేనేత కార్మికులు, చేతివృత్తుల వారు, చిన్న పారిశ్రామికవేత్తలు నేరుగా చేరుకోగలుగుతారు.

స్నేహితులారా,

ఈ ఒప్పందంలో బలమైన మరో కోణం కూడా ఉంది. ఎన్నో పెట్టుబడులు భారతదేశానికి రానున్నాయి. దేశంలో నూతనంగా ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రసాయన, ఫార్మా, తదితర తయారీ ప్లాంట్లు ప్రారంభమవుతాయి. అలాగే, వ్యవసాయం, ఆహార శుద్ధి, మత్స్య రంగంలో కొత్త పెట్టుబడులకు హామీ ఇచ్చే మార్కెట్టును ఏర్పాటు చేస్తుంది. ఇది రైతులకు, మత్స్యకారులకు, గ్రామీణ యువతకు గొప్ప అవకాశం.

నా యువ మిత్రులారా,

ఐరోపాలోని ఉద్యోగ మార్కెట్టుకు భారతీయ యువతను ఈ ఎఫ్‌టీఏ నేరుగా అనుసంధానిస్తుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, గ్రీన్ టెక్, డిజైన్, లాజిస్టిక్స్, అధునాతన తయారీ రంగాల్లో అనేక అవకాశాల సృష్టి జరుగుతుంది. అంటే భారత యువతకు 27 దేశాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని అర్థం.

స్నేహితులారా,

సమగ్ర సంస్కరణల ద్వారా అంతర్జాతీయ అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. యువశక్తికి ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని.. ఈ సంస్కరణలు తొలగిస్తున్నాయి. దేశం ముందు ఉన్న పెరుగుతున్న ఈ అవకాశాలు, ఎన్‌‌సీసీ యువతలో ఉన్న విలువలు, క్రమశిక్షణ కలిస్తే బంగారానికి తావి అబ్బినట్టు ఉంటుంది.

 

స్నేహితులారా,

ఆపరేషన్ సిందూర్‌పై అద్భుతమైన శకటాన్ని మీరు ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. జాతీయ భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ఆ సమయంలో మన ఎన్‌సీసీ క్యాడెట్లు వారి బాధ్యతలను గొప్పగా నిర్వర్తించారు. కొందరు మన సైనిక సన్నాహానికి తోడ్పాటు అందించారు. కొందరు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మరికొందరు ప్రథమ చికిత్స శిబిరాల్లో పనిచేశారు. కవాతు శిక్షణతో పాటు.. దేశమే ప్రధానం అనే ఆలోచనా ప్రక్రియలో కూడా ఎన్‌సీసీలో శిక్షణ ఉంటుందని మీరు చూపించారు. ఎన్‌‌సీసీ బోధించిన దేశభక్తి, నాయకత్వమే క్లిష్ట సమయాల్లో దేశం కోసం మొత్తం శక్తితో పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది. నేను ఎన్‌సీసీలో ఉన్నప్పుడు, ‘‘దేశమే ప్రధానం’’ అనే భావన ఇలాగే బలోపేతమైంది. ఇప్పుడు అదే ఎన్‌సీసీలో మీరంతా నేర్చుకోవడం చూసి గర్వపడుతున్నాను.

స్నేహితులారా,

భారత దేశ సామర్థ్యాన్ని, మన సైనిక పరాక్రమాన్ని ఆపరేషన్ సిందూర్ మరోసారి చాటిచెప్పింది. దేశీయంగా తయారు చేసిన మన ఆయుధాలు ఎంత అధునాతనంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ తెలియజేసింది.

స్నేహితులారా,

ప్రస్తుత ఆధునిక యుద్ధ కాలంలో యువత నైపుణ్యాల పాత్ర బాగా పెరిగింది. ఇప్పుడు సరిహద్దుల్లో ట్యాంకులు, గన్నులు, ఫిరంగులకే యుద్ధం పరిమితం కాలేదు. అనేక రూపాల్లో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. కోడ్, క్లౌడ్ రూపంలోనూ యుద్ధం జరుగుతోంది. సాంకేతికంగా వెనకబడిన దేశాలు ఆర్థికంగానే కాకుండా భద్రతాపరంగానూ బలహీనంగా ఉంటాయి.

కాబట్టి స్నేహితులారా,

యువతగా.. ఈ దేశానికి మనం ఎలాంటి నూతన సాంకేతికతను అందించగలమనే ఆసక్తి దేశభక్తిని బలోపేతం చేస్తుంది. దేశ భద్రతకు గొప్ప సహకారాన్ని అందిస్తుంది. మీ అందరికీ తెలుసు. సాంకేతికత ద్వారా ఆవిష్కరణాత్మక ఆలోచనలున్న యువతకు సైన్యంలో కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతోందని మీ అందరికీ తెలుసు. నేడు మన యువత నిర్వహిస్తున్న రక్షణ అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లపై పని కొనసాగుతోంది. మన సైనిక దళాలను ఏఐ, రక్షణ ఆవిష్కరణలు ఆధునికంగా మారుస్తున్నాయి. అంటే.. మీకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత దీని నుంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను.

 

స్నేహితులారా,

మూడు రోజుల క్రితమే జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఆ రోజు నేను దేశ ప్రజలకు ఓ లేఖ రాశాను. దేశంలోని ప్రతి పౌరునికీ మన రాజ్యాంగం అందించిన హక్కు, బాధ్యతకు సంబంధించిన వేడుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవం. అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఓటు హక్కుతో దేశ తలరాతను మార్చే శక్తి యువతకు లభిస్తుంది. అందుకే మనం దేశంలో కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా జనవరి 25న ఓ బృహత్ కార్యక్రమాన్ని ఎన్‌సీసీ-ఎన్ఎస్ఎస్, మేరా యువ భారత్, మై భారత్ సంస్థలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. మొదటిసారి ఓటు వేసిన వారిని సత్కరించే కార్యక్రమం జరగాలి. ఇది మన యువతలో బాధ్యతను పెంపొందిస్తుందని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

స్నేహితులారా,

ఆర్థిక సంక్షేమానికి మాత్రమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన భారత్‌ సాధనలో పౌరునిగా మన ప్రవర్తన కూడా ముఖ్యమైనదే. పౌరునిగా మన బాధ్యతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు, స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి ఉండొచ్చు. కానీ దానిని దేశ ప్రజలు, యువత, చిన్నారులు ముందుకు తీసుకెళ్లారని గర్వంగా చెబుతాను. ఇంటి లోపలా, వెలుపలా కూడా పరిశుభ్రత ఓ అలవాటుగా, జీవనశైలిగా, విలువగా మారాలి. ఈ పౌర బాధ్యతను మన జీవితాల్లో భాగం చేసుకోవాలి. మన వాకిలి ఎలా అందంగా ఉండాలనుకుంటామో.. అదే భావనతో మన నగరాన్ని కూడా అందంగా ఉంచాలి. వారంలో ఏదో ఒక రోజు గంట పాటు స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాలని ఇక్కడ ఉన్న ప్రతి యువ స్నేహితుడిని నేను కోరుతున్నాను. ఎన్‌సీసీ-ఎన్ఎస్ఎస్ దీన్ని సమర్థంగా చేయగలుగుతాయి. మీ ప్రాంతాల్లో ఏదైనా కార్యక్రమాన్ని కచ్చితంగా చేపట్టండి.

స్నేహితులారా,

‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం ద్వారా 8 లక్షల మొక్కలను ఎన్‌సీసీ నాటిందని తెలిసి చాలా సంతోషించాను. మనం నాటిన మొక్కలు బాగా పెరిగేలా చూడటం కూడా మన బాధ్యత.

 

స్నేహితులారా,

భవిష్యత్తులో ఎంత ఆరోగ్యంగా ఉంటామనేదే యువతకు పెద్ద పరీక్ష. శారీరక దారుఢ్యం అంటే.. కొన్ని నిమిషాలు చేసే వ్యాయామాలకి మాత్రమే పరిమితమైన అంశం కాదు. అది మన జీవన విధానంగా మారాలి. మన ఆహారపు అలవాట్ల నుంచి దైనందిన జీవితం వరకు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళుతున్నారని తెలిసి చాలా సంతోషించాను. క్రీడల్లో కూడా ఎన్‌సీసీ క్యాడెట్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.

స్నేహితులారా,

ఊబకాయం సమస్య గురించి నేను మరోసారి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధులు కూడా దేశంలో పెరిగిపోతాయి. దీనివల్ల ఎక్కువ ప్రభావితమయ్యేది యువతే. అందుకే ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. నూనెల వినియోగాన్ని తగ్గించాలి. కొంత కాలం క్రితం ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని విజ్ఞప్తి చేశాను. ఈ రోజు అదే విషయాన్ని యువతకు మరోసారి గుర్తు చేస్తున్నాను.

స్నేహితులారా,

కేవలం కదమ్‌తాల్ మాత్రమే మీకు ఎన్‌సీసీ నేర్పించడం లేదు. బాధ్యతాయుతమైన పౌరునిగా ఎలా జీవించాలో కూడా మీకు నేర్పిస్తుంది. ఇక్కడ మీరు నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలు మంచి పౌరునిగా ఎదిగేందుకు తోడ్పడతాయి. గణతంత్ర దినోత్సవాల్లో మీకు దొరికే అనుభవాలు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ మీరు విజయం సాధించాలని, అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) నిర్మాణంలో మీ సహకారం పెరగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు.

భారత్ మాతాకీ జై! 

భారత్ మాతాకీ జై!

వందేమాతరం 150 వసంతోత్సవాలను దేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో - నాతో కలసి చెప్పండి

వందేమాతరం! వందేమాతరం!

వందేమాతరం! వందేమాతరం!

వందేమాతరం! వందేమాతరం!

వందేమాతరం! వందేమాతరం!

వందేమాతరం! వందేమాతరం!

వందేమాతరం! వందేమాతరం!

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold

Media Coverage

India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning Bronze at Commonwealth Games 2026
July 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning the Bronze medal in the women’s 58 kg weightlifting event at the Commonwealth Games 2026.

The Prime Minister said that her success is the result of her hard work and determination.

Shri Modi extended his best wishes to her for her future endeavours.

The Prime Minister wrote on X;

“Yet another medal for India in Weightlifting! Proud of Bindyarani Devi Sorokhaibam for winning a Bronze in the Women's 58kg event at the Glasgow Commonwealth Games. Her success is due to her hard work and determination. Wishing her the very best for the endeavours ahead.

#CWG2026”