· “అకుంఠిత విశ్వాసం.. దైవత్వాల వెలుగు దివ్వె మాత్రమేగాక భారతీయ పవిత్రాత్మకు శాశ్వత ప్రతీక ఈ ఆలయం”
· “సరిగ్గా 75 ఏళ్ల కిందట ఇదే రోజున ఆలయ పునరుద్ధరణ ఓ అసాధారణ ఘట్టం.. దేశం 1947లో స్వేచ్ఛా వాయువులు పీల్చగా నాటి స్వతంత్ర స్ఫూర్తిని చాటుతూ 1951లో సోమనాథ ప్రతిష్ఠాపన పూర్తియింది”
· “నేటి ఈ అమృత మహోత్సవం రాబోయే వెయ్యేళ్లపాటు దేశానికి మార్గదర్శనం చేస్తుంది”
· “ఈ ఆలయ వైభవ నాశనానికి యత్నించిన దోపిడీదారులు దీన్నొక భౌతిక కట్టడంగా మాత్రమే పరిగణించి దాడులు కొనసాగించినా... పదేపదే ధ్వంసం చేసినా... పలుమార్లు పునర్నిర్మితమవుతూ మరింత సమున్నతంగా నిలిచింది”
· “ప్రతిష్ఠాత్మక సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ద్వారా దేశం కూడా శతాబ్దాల నాటి కళంకాన్ని తుడిచిపెట్టింది”
· “ఏ దేశమైనా మూలాలతో సంధానితమైతేనే కాలగమనంలో తన బలాన్ని చాటగలదనడానికి సోమనాథ్ ఒక సగర్వ నిదర్శనం”

జై సోమనాథ్!

జై సోమనాథ్!

హర హర మహాదేవ్!

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, విచ్చేసిన విశిష్ట అతిథులూ... ఇక్కడికి విచ్చేసిన వారందరూ…

నేడు ప్రభాస్ పటన్ పుణ్యభూమి దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుతోంది. సాక్షాత్తూ ఆ మహాదేవుని దర్శనం, ఈ నయనానందకరమైన సౌందర్యం, భూమ్యాకాశాల నుంచి కురుస్తున్న పుష్పాల జల్లు, రెపరెపలాడుతున్న కాషాయ జెండాల కాంతి.. కళలు, సంగీతం, నృత్యం... అద్భుత ప్రదర్శనలు.. వేద మంత్రోచ్చారణలు, గర్భాలయంలో నిరంతరాయంగా మారుమోగుతున్న శివ పంచాక్షరీ మంత్రం.. వీటితో పాటు సముద్ర కెరటాల గంభీర ఘోష.. ఇవన్నీ చూస్తుంటే సృష్టి అంతా ఏకకంఠంతో ఇలా పలుకుతున్నట్లు అనిపిస్తోంది- జై సోమనాథ్ ! జై జై సోమనాథ్!

మిత్రులారా, 

ఎవరి సంకల్పం వల్ల కాలమే ఆవిర్భవిస్తుందో, ఎవరు నిత్యుడో, ఎవరు సాక్షాత్తూ కాలస్వరూపుడో... ఆ మహాదేవుని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు మనం ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారో, చివరికి ఎవరిలో లీనమవుతుందో ఆ సర్వేశ్వరుని గురించి ఇలా అంటారు:

“యతో జాయతే పాల్యతే యేన విశ్వం, తమీశం భజే లీయతే యత్ర విశ్వం”

నేడు మనం ఆ మహాదేవుని పవిత్ర నివాస పునర్నిర్మాణ వేడుకలను చేసుకుంటున్నాం. ఎవరైతే హాలాహలాన్ని సేవించి 'నీలకంఠుడి'గా మారారో ఆ స్వామి చరణాల చెంతనే నేడు ఈ 'సోమనాథ్ అమృత్ మహోత్సవం' ఘనంగా జరుగుతోంది. ఇదంతా ఆ సదాశివుని దివ్య లీలావిలాసం మాత్రమే.

మిత్రులారా, 

సోమనాథ్ పరమ భక్తుడిగా నేను ఇక్కడికి లెక్కలేనన్ని సార్లు వచ్చాను.. ఎన్నోసార్లు ఆయన ముందు శిరస్సు వంచాను. కానీ ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ 'కాల ప్రయాణం' నాకు ఒక విశిష్టమైన, ఆనందదాయకమైన అనుభూతిని కలిగించింది. కేవలం కొన్ని నెలల క్రితమే మనం 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'ను నిర్వహించినపుడు నేను ఇక్కడికి వచ్చాను. సోమనాథ్ ఆలయం మొదటిసారి ధ్వంసమైన వెయ్యి ఏళ్ల తర్వాత కూడా ఈ క్షేత్రం అమరత్వం, ఆత్మగౌరవాన్ని మనం చాటి చెప్పాం. ఈ రోజు ఈ ఆధునిక రూపంలోని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. మనం కేవలం రెండు ఉత్సవాల్లో పాల్గొనడం లేదు. ఆ పరమశివుడు మనకు వెయ్యేళ్ల అమరత్వ ప్రయాణాన్ని అనుభూతి చెందే అదృష్టాన్ని ప్రసాదించాడు.

మిత్రులారా, 

డెబ్బై ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరగటం ఒక సామాన్యమైన ఘట్టం కాదు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1951లో జరిగిన ఈ సోమనాథ్ ప్రతిష్ఠాపన భారతదేశ స్వతంత్ర స్ఫూర్తిని మేల్కొల్పింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతావనికి రూపునిచ్చారు. అదే సమయంలో సోమనాథ్ పునర్నిర్మాణం ద్వారా ఆయన ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు.. భారతదేశానికి కేవలం స్వేచ్ఛ మాత్రమే రాలేదు... భారత్ ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించే దిశగా కూడా అడుగులు వేసిందని ఆయన చెప్పారు. 

మిత్రులారా, 

అందుకే ఇప్పుడు నేను కేవలం 75 ఏళ్ల కాలాన్ని మాత్రమే చూడటం లేదు. ఇక్కడ నేను విధ్వంసం మధ్య కూడా సృష్టికి ఉన్న సంకల్పాన్ని చూస్తున్నాను. దీనికి సోమనాథ్ క్షేత్రమే నిదర్శనం. ఇక్కడ నేను అసత్యంపై సత్యం సాధించిన విజయాన్ని చూస్తున్నాను. దీనిని ప్రభాస్ పటన్ పదేపదే చూసింది. ఇక్కడ వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేను చూస్తున్నాను. ఇది ప్రపంచానికి సర్వ మానవాళి సంక్షేమాన్ని బోధించింది. శతాబ్దాల పాటు దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చెరిపివేయలేని, ఓడించలేని భారతదేశ అమర స్ఫూర్తిని నేను ఇక్కడ చూస్తున్నాను. ఈ 'సోమనాథ్ అమృత్ మహోత్సవం' కేవలం గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. ఇది రాబోయే వెయ్యేళ్ల భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తి ఉత్సవం అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ, సోమనాథునికి ఉన్న కోట్లమంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, 

మరొక కారణం వల్ల కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. సరిగ్గా ఇదే రోజున 1998 మే 11న  భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించింది. మే 11వ తేదీన దేశం మొదటి మూడు అణు పరీక్షలను చేపట్టింది. మన శాస్త్రవేత్తలు భారతదేశ శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ప్రతిస్పందించాయి. భారత్ అణు పరీక్షలు నిర్వహించే ధైర్యం ఎలా చేస్తుందని ప్రశ్నించాయి. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నీ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు వచ్చాయి.. రకరకాల ఆంక్షలు విధించాయి. మన ఆర్థిక స్థిరత్వపు మార్గాలన్నింటినీ అడ్డుకున్నాయి. అటువంటి తీవ్రమైన ఒత్తిడికి ఎవరైనా సరే వణికిపోయే వారు. కానీ మనం వేరే మట్టితో తయారయ్యాం. మే 11 తర్వాత ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా మారింది. మే 11న శాస్త్రవేత్తలు తమ పనిని పూర్తి చేశారు. కానీ మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించి భారత రాజకీయ సంకల్పం ఎంత దృఢమైనదో ప్రపంచానికి నిరూపించాం. ప్రపంచ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ అటల్ గారి నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం మనకు 'దేశమే ప్రథమం' అని నిరూపించింది. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని లేదా తలవంచేలా చేయలేదని మేం చాటిచెప్పాం.

మిత్రులారా, 

పోఖ్రాన్ అణు పరీక్షలను 'ఆపరేషన్ శక్తి' అని పేరుతో నిర్వహించాం. ఎందుకంటే శివుడితో పాటు శక్తిని ఆరాధించడం మన సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. స్వయంగా ఆ అర్ధనారీశ్వరుడు కూడా శక్తితో కలిసినప్పుడే సంపూర్ణమవుతాడు. భారతదేశపు చంద్రయాన్ మిషన్ విజయవంతమైనప్పుడు.. చంద్రునిపై రోవర్ దిగిన ప్రదేశానికి మనం 'శివ శక్తి పాయింట్' అని పేరు పెట్టిన విషయం మీకు గుర్తుండి ఉంటుంది. మన విశ్వాసంలో చంద్రుడు శివుడితో అనుసంధానమై ఉంటే, శివుడు శక్తితో ముడిపడి ఉన్నాడు. ఈ జ్యోతిర్లింగాన్ని స్వయంగా 'సోమనాథ్' అని పిలవడం ఎంత అద్భుతమైనదో కదా!. సోమ అంటే చంద్రుడు.. ఆ చంద్రునితో ముడిపడి ఉన్నవాడు సోమనాథుడు.

మిత్రులారా, 

శివ-శక్తి ఆరాధనలోని మన తత్త్వం ఇప్పుడు దేశ శాస్త్ర సాంకేతిక పురోగతికి కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా మారింది. ఈ పవిత్రమైన సందర్భంలో సోమనాథుని పాద పద్మాల సాక్షిగా 'ఆపరేషన్ శక్తి' వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, 

నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను.. తన పేరులోనే 'సోమ' అంటే అమృతాన్ని, అమరత్వాన్ని ధరించిన క్షేత్రం ఎప్పుడైనా ఎలా అంతమవుతుంది? చరిత్ర మొత్తంగా ఈ ఆలయం ఎన్నో దాడులను ఎదుర్కొంది. మహమ్మద్ గజనీ, అలావుద్దీన్ ఖిల్జీ వంటి దురాక్రమణదారులు సోమనాథుని వైభవాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు. వారు సోమనాథుడిని కేవలం ఒక భౌతిక కట్టడంగా మాత్రమే చూసి పదేపదే దాడులు చేశారు. ప్రతిసారీ ఆలయం ధ్వంసం అయింది కానీ ప్రతిసారీ అది తిరిగి సగర్వంగా నిలబడింది. దీనిని నాశనం చేయాలని చూసిన వారు మన నాగరికత సైద్ధాంతిక బలాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మనం భౌతిక దేహాన్ని నశించిపోయేదిగా భావిస్తాం కానీ లోపల ఉన్న ఆత్మ అమరమని మనకు తెలుసు. ఆ శివుడు సాక్షాత్తూ విశ్వానికే ఆత్మ. అందుకే వివిధ యుగాలలో వేర్వేరు వ్యక్తుల సంకల్పంలో శివుడు ఆవిర్భవించాడు. భోజరాజు మొదటి భీమ్ దేవ్, కుమారపాల, మొదటి మహిపాల, రావు ఖంగార్ వంటి రాజులు సోమనాథ్ ఆలయాన్ని పదేపదే పునర్నిర్మించారు. లకులీశ, సోమ శర్మ వంటి గొప్ప చింతనాపరులు ప్రభాస్ పటన్ వారసత్వాన్ని కాపాడటమే కాకుండా దీనిని శైవ తత్త్వానికి, ఆధ్యాత్మిక సాధనకు గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దారు. భావ బృహస్పతి, పాశుపత ఆచార్యులు, అనేకమంది పండితులు ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక సంప్రదాయాలను సజీవంగా ఉంచారు. విశాల్ దేవ్, త్రిపురాంతక వంటి వ్యక్తులు ఈ ప్రాంత మేధో చైతన్యాన్ని రక్షించారు.

మిత్రులారా,

వీర హమీర్ జీ గోహిల్, వీర వేగడ్ జీ భిల్, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్, బరోడా గైక్వాడ్లు జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జీ  వంటి ఎందరో మహానుభావులు సోమనాథుని సేవలో సర్వస్వాన్ని అర్పించారు. నేడు నేను సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ కె.ఎం. మున్షీలతో పాటు తెలిసిన, తెలియని పుణ్యాత్ములందరికీ భక్తితో ప్రణమిల్లుతున్నాను. వారి స్మృతి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చేయడమే కాకుండా, ఆ బాధ్యతను రాబోయే తరాలకు అందించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది.

మిత్రులారా

వేల ఏళ్లుగా మన సాంస్కృతిక ప్రదేశాలే భారతీయతకు గుర్తింపుగా నిలిచాయి. మనకు ఎంతో గొప్ప వారసత్వం లభించినప్పటికీ, దశాబ్దాల తరబడి దాని ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా విదేశీ దురాక్రమణదారులు జాతీయ అస్తిత్వంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయా దేశాల ప్రజలకు అవకాశం లభించినప్పుడు, వారు ఏకమై ఆ చిహ్నాలను పునరుద్ధరించి మళ్ళీ గౌరవించుకున్నారు. మన దేశంలో మాత్రం జాతీయ గౌరవానికి సంబంధించిన అంశాలు కూడా రాజకీయాలకు వేదికలుగా మారాయి. దీనికి సోమనాథ్ అతిపెద్ద ఉదాహరణ. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే చేపట్టాల్సిన మొదటి బాధ్యతల్లో సోమనాథ దేవాలయ పునరుద్ధరణ ఒకటి. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీని కోసం ఎంతో దృఢ నిశ్చయంతో కృషి చేశారు. కానీ నెహ్రూ నుంచి వారు ఎంతటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను గానీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సర్దార్ పటేల్ తన పట్టుదలను వీడలేదు. సోమనాథ ఆలయం పునర్నిర్మితమైంది.  దేశం శతాబ్దాల అవమానాన్ని చెరిపివేసింది.

మిత్రులారా,

దురదృష్టవశాత్తు, నేటికీ దేశంలో జాతీయ గౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యమని భావించే శక్తులు ఉన్నాయి. రామమందిర నిర్మాణ సమయంలో కూడా దీనిని చూశాం.  అప్పుడు కూడా వ్యతిరేకత ఎదురైంది. ఇలాంటి మనస్తత్వాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఇటువంటి సంకుచిత రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలి. అభివృద్ధిని, వారసత్వాన్ని రెండింటినీ కలిపి తీసుకుంటూ మనం పురోగమించాలి.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షునిగా సోమనాథునికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ ఆలయం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం జరిగిన చారిత్రాత్మక పనులు నేడు మనందరికీ కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఈ సేవ వల్ల నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో మేలు జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసే అవకాశం నాకు లభించడమే ఆ సోమనాథుని అనుగ్రహం.

మిత్రులారా,

శతాబ్దాల తర్వాత నేడు కాశీ విశ్వనాథ ధామం ఒక అద్భుతమైన విస్తరణకు సాక్ష్యంగా నిలిచింది. ఉజ్జయినిలో అత్యంత వైభవంగా వెలుగొందుతున్న మహాకాల్ మహాలోక్‌ను నేడు మనం చూస్తున్నాం. కేదార్‌నాథ్ ధామం కూడా పునర్నిర్మితమైంది. నేను ముందే చెప్పినట్లుగా, అయోధ్యలో ఐదువందల ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఇప్పుడు రామ్ లల్లా అక్కడ ఒక భవ్యమైన మందిరంలో కొలువై ఉన్నాడు.

మిత్రులారా,

మన పురాణాల్లో కేవలం కథలుగా విన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు, మఠాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల వైభవాన్ని నేడు మనం కళ్లారా చూస్తున్నాం. ఈ గొప్ప సంప్రదాయ పునరుద్ధరణ కేవలం పది పన్నెండేళ్ల కాలంలోనే సాధ్యమైంది.

మిత్రులారా,

మన సాంస్కృతిక కేంద్రాల పట్ల నిర్లక్ష్యం దేశాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. మన పుణ్యక్షేత్రాలు భారత ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థకే కాకుండా ఆర్థిక పురోగతికి కూడా మూలాధారాలు. నేడు చార్ ధామ్ హైవే ప్రాజెక్టు, గోవింద్‌ఘాట్ నుంచి నహేమకుండ్ సాహిబ్ వరకు రోప్‌వే, కర్తార్‌పూర్ కారిడార్, బుద్ధ సర్క్యూట్ అభివృద్ధి వంటి పనులు పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచాయి. సోమనాథ్ క్షేత్రమే దీనికి ఒక బలమైన నిదర్శనం. నేడు వందలాది కుటుంబాలు సోమనాథ్ ఆలయ ట్రస్టుతో ముడిపడి ఉన్నాయి. వేలాది మంది జీవనోపాధి ఈ ప్రాంతంతో అనుసంధానమై ఉంది. భారతదేశం నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే ప్రజలు గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. ఇది రాష్ట్రానికి, దేశానికి పురోగతికి సంబంధించిన కొత్త అవకాశాలను అందిస్తోంది. 

మిత్రులారా,

మన విశ్వాసం మనకు జీవన విధానాన్ని కూడా నేర్పింది.

“సర్వం ఖల్విదం బ్రహ్మ” అని మనం నమ్ముతాం.

అంటే, సృష్టిలోని ప్రతి అణువు, ప్రకృతి అంతా దైవస్వరూపమే. అందుకే మనకు నదుల పట్ల, చెట్ల పట్ల భక్తి ఉంటుంది. మనం అడవులను గౌరవంగా చూస్తాం. పర్వతాలలో కూడా పవిత్రతను దర్శిస్తాం. నేడు ప్రపంచం మళ్ళీ ప్రకృతిసిద్ధమైన జీవనశైలి వైపు మళ్లుతున్న వేళ, మనం కూడా మన ఈ బలాన్ని గుర్తించాలి. మన పుణ్యక్షేత్రాలను, ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, వాటి గౌరవాన్ని కాపాడటంపై కూడా మనం స్పృహతో ఉండాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే జీవనశైలిని మనం అలవర్చుకోవాలి. అదే సమయంలో, మన పవిత్ర స్థలాలను ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. మనం ఈ సంకల్పాలను మన విశ్వాసంతో ముడిపెట్టి ఆచరించాలి.

మిత్రులారా,

కొత్త తరాలు తమ చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక విలువలతో అనుసంధానమైనప్పుడు దేశ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. భారత్ నేడు ఏ నమ్మకంతో ముందుకు సాగుతోందో అది ఈ సాంస్కృతిక నిరంతరాయతతోనే పెనవేసుకుని ఉంది. మన దేశంలో ఆధునికత, వారసత్వం పరస్పర విరుద్ధమైనవి కావు.  అవి రెండూ కలిసే పయనిస్తాయి. ఒకదానికొకటి బలాన్ని ఇస్తాయి. ఒక దేశం తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడు, తన వారసత్వాన్ని అదే విశ్వాసంతో, భక్తితో రాబోయే తరాలకు అందించినప్పుడే ఎక్కువ కాలం దృఢంగా ఉంటుందని సోమనాథుడు మనకు గుర్తుచేస్తారు. డెబ్బై ఐదు ఏళ్ల క్రితం పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు, భారత్ ఒక కొత్త చైతన్య యాత్రను ప్రారంభించింది. నేడు 75 ఏళ్ల తర్వాత, అదే ప్రయాణం మన ముందు మరింత విస్తృత రూపంలో నిలిచి ఉంది. మనం దీనిని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. మన సంకల్పాల సిద్ధీకరణలో ఆ సోమనాథుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉండాలి. మరొకసారి పౌరులందరికీ, వారసత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

నాతో కలిసి పలకండి - 

సోమనాథునికి జై!

సోమనాథునికి జై!

హర హర మహాదేవ్!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees

Media Coverage

Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Eminent industry leader Shri Ravi Kant meets the Prime Minister
July 18, 2026

Eminent industry leader Shri Ravi Kant met Prime Minister, Shri Narendra Modi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'.

The Prime Minister posted on X;

Eminent industry leader Shri Ravi Kant met PM @narendramodi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'.