పశ్చిమ బెంగాల్ గవర్నరు సీవీ ఆనంద్ బోస్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శాంతను ఠాకుర్ గారు, రవ్‌నీత్ సింగ్ గారు, సుకాంత మజుమ్దార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరుడు షోమిక్ భట్టాచార్య గారు, ఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు, సజ్జనులారా,
అభివృద్ధి పథంలో పశ్చిమ బెంగాల్ శరవేగంగా దూసుకుపోయేలా చేసే మరో అవకాశం ఈ రోజు నాకు లభించింది. కాసేపటి కిందటే నేను నౌపారా నుంచి జై హింద్ బిమాన్ బందర్ వరకు కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన అనుభూతిని పొంది వచ్చానిక్కడికి. ఈ ప్రయాణంలో, చాలా మంది మిత్రులతో ముచ్చటించే అవకాశం నాకు దక్కింది. కోల్‌కతాలో ప్రజా రవాణా నిజంగా కొత్త రూపాన్ని సంతరించుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ రోజే, ఇక్కడ ఆరు మార్గాల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన పూర్తయింది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులన్నింటికి కోల్‌కతా వాసులతో పాటు పూర్తి పశ్చిమ బెంగాల్ ప్రజానీకానికి అనేకానేక అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,
కోల్‌కతా వంటి మన నగరాలు భారత్ చరిత్రతో పాటు మన భవిష్యత్తు.. ఈ రెండింటి ఘనమైన గుర్తింపునకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ఈ రోజు మన దేశం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్దదైన ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందంటే ఇందులో ఢమ్‌ఢమ్, కోల్‌కతా వంటి నగరాల పాత్ర ఎంతో ఉంది. అందువల్ల, ఈ నాటి ఈ కార్యక్రమం అందిస్తున్న సందేశం మెట్రో ప్రారంభోత్సవంతో పాటు హైవేకు శంకుస్థాపనే కాక అంతకు మించింది కూడా. ఈ కార్యక్రమం భారత్ తన నగరాల రూపురేఖల్ని ఎలా తీర్చిదిద్దుకుంటోందో అనే దానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఇవాళ, భారతీయ నగరాల్లో కాలుష్య రహిత రాకపోకల నిర్వహణకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యుత్తు బస్సులతో పాటు విద్యుత్తు చార్జింగ్ కేంద్రాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చెత్తను సంపదగా మార్చేందుకూ, నగరం నుంచే కాక మెట్రో సదుపాయాల నుంచి వస్తున్న చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకూ కృషి చేస్తున్నారు. మెట్రో పరిధిని నానాటికీ విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతి పెద్ద మెట్రో వ్యవస్థ భారత్‌లో ఏర్పాటైందని తెలుసుకొంటే ప్రతి ఒక్కరు సంతోషపడతారు. 2014కు ముందు, దేశంలో మెట్రో రూట్ 250 కిలోమీటర్లే ఉంది. ఇవాళ దేశంలో మెట్రో రూట్ ఒక వేయి కి.మీ. కంటే పొడవైందిగా మారిపోయింది. కోల్‌కతాలోనూ మెట్రో కూడా విస్తరిస్తోంది. ఈ రోజున కూడా, దాదాపు 14 కి.మీ మేర కొత్త లైన్లను కోల్‌కతా మెట్రో రైల్ వ్యవస్థకు జోడిస్తున్నారు. 7 కొత్త స్టేషన్లను కోల్‌కతా మెట్రోకు కలుపుతున్నారు. ఈ పనులన్నీ కోల్‌కతా ప్రజల ప్రయాణ సౌలభ్యంతో పాటు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచబోతున్నాయి.
మిత్రులారా,
ఇరవై ఒకటో శతాబ్ది భారతదేశానికి ఇరవై ఒకటో శతాబ్దానికి తగిన రవాణా వ్యవస్థ అవసరం. ఈ కారణంగానే మేం దేశంలో రైలుమార్గం మొదలు రోడ్డు మార్గం వరకు, మెట్రో మొదలు విమానాశ్రయం వరకు.. ఆధునిక రవాణా సదుపాయాల్ని అభివృద్ధి చేస్తున్నాం. అంతేకాక, వాటిని ఒకదానితో మరోదానిని కలుపుతున్నాం కూడా. ప్రజలను ఒక నగరం నుంచి మరో నగరానికి చేరవేయడంతో పాటు, వారి ఇళ్ల వరకు ఎలాంటి అసౌకర్యం లేకండా రవాణాను సమకూర్చాలన్నది మా ప్రయత్నం. మరి మనం ఇక్కడ.. కోల్‌కతాలో.. బహుళ విధ సంధానం తాలూకు ఛాయలను కూడా చూడొచ్చు. ఎలాగంటే ఇవాళ హావ్‌డా, సియాల్దహ్ వంటి దేశంలోని అన్నింటి కన్నా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ ఇప్పుడు మెట్రోతో కలిసిపోయాయి. దీనర్థం.. ఇంతకు ముందు ఏ స్టేషన్ల మధ్య ప్రయాణానికి గంటన్నర పట్టేదో, దానికి ఇప్పుడు మెట్రో ద్వారా కేవలం కొన్ని నిమిషాలయితే సరిపోతుంది. ఇదే విధంగా, హావ్‌డా స్టేషన్ సబ్‌వే కూడా బహుళ విధ సంధానానికి అనుకూలంగా మారింది. ఇదివరకు, ఒక వ్యక్తికి ఈశాన్య రైల్వేకు చెందిన ఒక రైలును అందుకోవాలంటే చాలా చుట్టు ప్రయాణం చేయాల్సివచ్చేది. ఈ రోజు నుంచీ, కోల్‌కతా విమానాశ్రయాన్ని కూడా మెట్రోకు జోడించారు. అంటే... నగరంలో సుదూర ప్రాంతాల నుంచీ విమానాశ్రయానికి చేరుకోవాలంటే చాలా సులభం.

మిత్రులారా,
పశ్చిమ బెంగాల్ పురోగతికి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ఈ రోజున, పూర్తి విద్యుదీకరణ సమకూరిన రాష్ట్రాల సరసన పశ్చిమ బెంగాల్ నిలిచింది. పురులియాకు, హావ్‌డాకు మధ్య ‘మెమూ’ రైలు కావాలని ప్రజలు చాలా కాలం నుంచీ కోరుతున్నారు. ప్రజల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఈ రోజున, పశ్చిమ బెంగాల్‌లో వేర్వేరు మార్గాల్లో 9 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దీనికి తోడు, మీ అందరి కోసం 2 అమృత్ భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి.
మిత్రులారా,
గత 11 సంవత్సరాల్లో, ఇక్కడ అనేక హైవే ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మరెన్నో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఆరు లైన్ల కోనా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయితే, దాంతో రేవుకు సంధాన సదుపాయం మెరుగుపడుతుంది. ఈ సంధానం కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తుకు సంబంధించిన పునాదిని పటిష్ఠపరుస్తుంది. ఇప్పటికి ఇంతే.

మిత్రులారా,
మరి కాసేపట్లో, దగ్గర్లోనే ఒక బహిరంగ సభ జరగబోతోంది. ఆ సమావేశంలో, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి, పశ్చిమ బెంగాల్ భవిష్యత్తు అనే అంశాలపై మీ అందరితో చర్చిస్తాను. ఇంకా అనేకం కూడా చోటుచేసుకోబోతున్నాయి. కాబట్టి అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు. నేను నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను.
మీకందరికీ శుభాకాంక్షలు. మీకు ధన్యవాదాలు


