మనకు ఉన్నది ఒకే లక్ష్యం ఒకే గమ్యం.. అది 'వికసిత భారత్' : ప్రధాని
అనేక ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తున్న ప్రపంచ నాయకులు, నిపుణులు: ప్రధాని
మీరు భవిష్యత్తులో భాగం కావాలనుకుంటే భారత్‌లో ఉండాలి: ప్రధాని
కేవలం పురోగతి సాధించడం మాత్రమే కాకుండా తదుపరి స్థాయికి చేరుకుంటున్న భారత్: ప్రధాని
ప్రపంచ సవాళ్ల భారం నుంచి సొంత రైతులు, పౌరులను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోన్న భారత్: ప్రధాని

ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.

మిత్రులారా,

21వ శతాబ్దంలోని ఈ సమయం 'న భూతో న భవిష్యతి' అన్నట్లుగా ఉంది. ఒకవైపు యుద్ధ భయాలు, మరోవైపు సరఫరా వ్యవస్థలకు అంతరాయం... ఇంకోవైపు ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల ప్రాముఖ్యతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ముందుకు సాగుతోంది. చరిత్రలో అత్యంత కీలకమైన ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కీలక నాయకుడు, ప్రతి నిపుణుడు భారతదేశంపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత్‌కు వచ్చారు. ప్రపంచానికి గ్లోబల్ సౌత్ దిశానిర్దేశం చేస్తుందని, గమనాన్ని నిర్దేశించే శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరిస్తుందని ఆయన అన్నారు. అంతకన్నా ముందు, రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా భారతదేశం అవుతుందని కెనడా పీఎం కార్నీ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సమస్యల పరిష్కారానికి భారత్ కీలక భాగస్వామిగా మారిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ బలంగా నమ్ముతున్నారు. సాంకేతిక, ఆర్థిక రంగాల ప్రపంచ నాయకుల మాటలు గమనిస్తే, ఇవాళ ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో మీరూ భాగం కావాలనుకుంటే, కచ్చితంగా భారతదేశంతో అనుబంధం ఉండాలి. మీరు భారత్‌లోనే ఉండాలి.

 

మిత్రులారా,

భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. మన దేశంలో క్రికెట్టును ఎంత ఆదరిస్తారంటే.. ఏదైనా ఆఫీసులో కోట్ల రూపాయల డీల్ గురించి చర్చ జరుగుతున్నా లేదా విదేశీ ప్రతినిధులు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇస్తున్నా... ఒక్క క్షణం పాటు అందరి కళ్లు స్కోరు వైపు మళ్లుతాయి. ఎవరో ఒకరు కచ్చితంగా అడుగుతారు 'భయ్యా, స్కోరెంత?' అని. ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. నేడు ప్రతి ఒక్కరూ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. గత నెలలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? నేడు పరిస్థితి ఏమిటో తెలుసుకోవటానికి దేశ ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. గతంలో దేశంలో ఇలాంటి ఆసక్తి ఎప్పుడైనా ఉందో లేదో నాకు గుర్తులేదు. ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండేది?... ఇది నేటి భారతీయుల ఆకాంక్షలను, వారి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది. ప్రపంచం భారతదేశంపై ఇంతగా నమ్మకం ఉంచటానికి ఇది కూడా ప్రధాన కారణం.

మిత్రులారా,

మన దేశంపై అంచనాలున్నప్పుడు, ప్రపంచమంతా మన వైపు చూస్తున్నప్పుడు, మనందరి బాధ్యత మరింతగా పెరుగుతుంది.

మిత్రులారా,

ఇవాళ్టి భారతదేశం కేవలం ముందుకు సాగటమే కాదు.. దేశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తోంది. నేడు దేశంలో భవిష్యత్ తరానికి భౌతిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతోంది. తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాల దిశగా మనం దూసుకెళ్తున్నాం. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు మరోస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులు జరిగే దేశంగా భారత్ అవతరించింది.

మిత్రులారా,

నేడు భవిష్యత్ తరం సంస్కరణలను అమలు చేస్తూ, సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగంతో భారత్ దూసుకుపోతోంది. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో పనులు, ఎన్నో నిర్ణయాలు అసాధ్యమని భావించేవారు. కానీ నేడు అలాంటి కఠిన నిర్ణయాలను కూడా భారత్ తీసుకుంటోంది. ఒకప్పుడు ఆర్టికల్ 370ని తొలగించటం అసాధ్యమనేవారు. కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 అడ్డు తొలగిపోయింది. ఒకప్పుడు ప్రతి ఒక్కరినీ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయటం అసాధ్యమనిపించేది. కానీ నేడు 50 కోట్లకుపైగా జన్ ధన్ ఖాతాలు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఒకప్పుడు త్రిపుల్ తలాఖ్‌ని రద్దు చేయడం అసాధ్యమనిపించింది. కానీ ఇవాళ ముస్లిం అక్కచెల్లెళ్లు దాన్నుంచి విముక్తి పొందారు. ఒకప్పుడు లోక్‌సభ, విధానసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించటం కూడా అసాధ్యంగానే కనిపించింది. ఈ రోజు దానికి సంబంధించిన చట్టం తీసుకువచ్చాం. గతంలో అంతరిక్షం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. కానీ ఈ రోజు మూన్ మిషన్, సెమీ కండక్టర్ మిషన్, క్వాంటం మిషన్ వంటివన్నీ భారతదేశాన్ని సాంకేతికతలో సరికొత్త మార్గంలో నడిపిస్తున్నాయి.

మిత్రులారా,

ఇవాళ భారత్ కేవలం కలలు కనటం మాత్రమే కాక, వాటిని నిజం చేసుకుంటుంది. అందువల్లే భారత్ అభివృద్ధి చెందటమే కాక, మరోస్థాయికి చేరుకుంటుందని యావత్ ప్రపంచం నమ్ముతుంది.

మిత్రులారా,

దేశాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన ప్రాతిపదిక మనం సవాళ్లను ఎలా ఎదుర్కొంటామని…. ప్రపంచ పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయని మనందరికీ తెలుసు. గతంలో మనం కరోనా విపత్తును చూశాం. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ప్రస్తుతం మనకు అతి సమీపంలో మరో పెద్ద యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం యావత్ ప్రపంచాన్ని అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి నెట్టింది.

 

మిత్రులారా,

ఇలాంటి కష్ట సమయాల్లో ఒక దేశంగా మనం ఎలా ఎదుర్కొంటామన్నది అత్యంత కీలకం. సంక్షోభ సమయం యావత్ దేశానికి ఒక పరీక్ష లాంటిది. ఈ పరిస్థితులను మనం శాంతియుతంగా, ఓపికతో ఎదుర్కోవాలి. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తూ, చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగాలి. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. రాజకీయ పార్టీలు, మీడియా, సామాజిక సంస్థలు, పరిశ్రమలు, యువత, గ్రామాలు, నగరాలు.. ఇలా ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమే. కరోనా సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి, సంక్షోభాలను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరగటం మనం చూశాం. నేడు దేశం ముందు మరో సవాలు ఉంది. దేశహితమే పరమావధిగా భావిస్తూ, బాధ్యతలను నెరవేరుస్తూ మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి.

మిత్రులారా,

ఈ రోజుల్లో ఎల్‌పీజీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై నేను రాజకీయ వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. కానీ, ఇలాంటి పనులు చేయటం ద్వారా ప్రజల ముందు తమ స్వరూపాన్ని బయటపెట్టుకోవటమే కాక, దేశానికి చాలా నష్టాన్ని కలిగిస్తున్నారని కచ్చితంగా చెబుతాను.

మిత్రులారా,

నేడు యుద్ధం వల్ల ప్రపంచ సంక్షోభ ప్రభావం పడని దేశం లేదు. అధికమో, అల్పమో అందరూ దీనికి బాధితులే. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం కూడా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మేం వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే, నేను పలు దేశాల అగ్రనేతలతో ఈ విషయంపై చర్చించాను. సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకులను అధిగమించటానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మిత్రులారా,

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వివిధ ఇంధన వనరులను ప్రోత్సహించటం అవసరం. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒకే సమయంలో మేం రెండు స్థాయుల్లో పనిచేశాం. మొదటిది, దేశంలో ఇంధన లభ్యత పెరిగేలా మౌలిక సదుపాయాలను కల్పించాం.

రెండోది, ఇంధనం కోసం మనం విదేశాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వావలంబన దిశగా మేం దృష్టి సారించాం. ఇప్పుడు గ్యాస్ రంగానికి సంబంధించిన కొన్ని గణాంకాలను చెబుతాను. 2014 నాటికి దేశంలో కేవలం 14 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. అంటే దేశంలోని సగం కుటుంబాలకు మాత్రమే గ్యాస్ సౌకర్యం ఉండేది. కానీ ఈరోజు ఆ సంఖ్య రెండింతలకు పైగా పెరిగి, దాదాపు 33 కోట్లకు చేరుకుంది. గత 11 ఏళ్లలో గ్యాస్ ఫిల్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. పంపిణీ కేంద్రాల సంఖ్య కూడా 13,000 నుంచి 25,000 పైగా పెరిగింది. 2014లో దేశంలో కేవలం 4 ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్ ఉండగా నేడు వాటి సంఖ్య రెట్టింపు అయింది. గతంలో సుమారు 3,500 కిలోమీటర్ల మేర ఉన్న గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థను ఇప్పుడు 10,000 కిలోమీటర్లకు విస్తరించాం. మనకు అవసరమైన ఎల్‌పీజీలో దాదాపు 60 శాతం విదేశాల నుంచే వస్తున్నందున, దేశంలోని ప్రధాన ఓడరేవుల వద్ద దిగుమతి టెర్మినల్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

మిత్రులారా,

2014కు ముందు దేశంలో కేవలం 25-26 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా చవకైన గ్యాస్ పీఎన్‌జీ సరఫరా అయ్యేది. ఇవాళ ఈ సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంది. 2014లో దేశవ్యాప్తంగా సీఎన్‌జీతో నడిచే వాహనాలు 10 లక్షలకు మించి ఉండేవి కాదు. ఇవాళ ఈ సంఖ్య 70 లక్షలకు పైగా ఉంది. దశాబ్ద కాలంలో దేశంలోని 600లకుపైగా జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయటం వల్ల ఇది సాధ్యమైంది.

మిత్రులారా,

ఏ దేశమైనా స్వయం సమృద్ధిగా ఉండాలని ఈ ప్రపంచ సంక్షోభం మరోసారి నిరూపించింది. అందువల్ల, కొన్నేళ్లుగా ఇంధన రంగాల్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించేందుకు మేం సమగ్రంగా కృషి చేశాం.

మిత్రులారా,

పెట్రోలియంపై ఆధారపడటాన్ని తగ్గించి.. ఇథనాల్, జీవ ఇంధనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. 2014 కన్నా ముందు దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ సామర్థ్యం కేవలం ఒకటి నుంచి ఒకటిన్నర శాతం మాత్రమే ఉండేది. కానీ నేడు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే సామర్థ్యానికి చేరుకున్నాం. ఇది జరగపోయుంటే 11 ఏళ్లలో మనం విదేశాల నుంచి అదనంగా సుమారు 18 బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇథనాల్ వాడకం వల్ల ఏడాదికి దాదాపు 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతిని తగ్గించుకోగలుగుతున్నాం. దీనిద్వారా దేశానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.

 

మిత్రులారా,

భారతదేశంలో పెట్రోలియాన్ని భారీగా వినియోగించే వాటిలో రైల్వే శాఖ ఒకటి. మన దేశంలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 60 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. కానీ 2014 వరకు కేవలం 20 శాతం రైల్వే మార్గాల్లో మాత్రమే విద్యుదీకరణ పూర్తయింది. మిగిలిన మార్గాల్లో వేల సంఖ్యలో డీజిల్ ఇంజిన్లు నడిచేవి. నేడు భారతదేశంలోని బ్రాడ్-గేజ్ వ్యవస్థలో దాదాపు 100 శాతం విద్యుదీకరణ పూర్తయింది. దీనివల్ల కేవలం 2024-25 ఏడాదిలో భారత రైల్వే సుమారు 180 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆదా చేసింది. విద్యుదీకరణ జరగకపోయి ఉంటే, ఇంత డీజిల్‌ను ఉత్పత్తి చేయటానికి ఏటా అదనంగా ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో మనం మెట్రో వ్యవస్థను విస్తరించాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టి సారించాం.

పునరుత్పాదక ఇంధన రంగంలో మనం మరో ఘనతను సాధించాం. నేడు భారతదేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం వాటా పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం నేడు 250 గిగావాట్లకు చేరుకుని, చరిత్రాత్మక కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఆలోచించండి.. 2014లో కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉన్న భారతదేశ సౌర విద్యుత్ సామర్థ్యం, ఇవాళ సుమారు 40 రెట్లు పెరిగి 130 గిగావాట్లకు చేరుకుంది. గృహ అవసరాల కోసం గ్యాస్‌కు బదులుగా విద్యుత్ వినియోగాన్ని పెంచటానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అమలు చేశాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 30 లక్షల కుటుంబాలు ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

మిత్రులారా,

దీనితో పాటు గోబర్ధన్ పథకాన్ని కూడా మేం తీసుకువచ్చాం. దీని ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీపై పనులు చేపట్టాం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 100కు పైగా ప్లాంట్లు ప్రారంభం కాగా.. మరో 600లకు పైగా ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయి.

మిత్రులారా,

పెట్రోల్-డీజిల్ రంగంలో సామర్థ్య పెంపు దిశగా ఎంతో కృషి చేశాం. 2014కు ముందు భారతదేశంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు దాదాపుగా లేవు. సంక్షోభ సమయాల్లో ముడి చమురును నిల్వ చేసుకునే సదుపాయం ఉండేది కాదు. కానీ నేడు 50 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ సామర్థ్యం ఉంది. దీని మరింతగా పెంచే పనిలో ఉన్నాం. దశాబ్ద కాలంలో రిఫైనింగ్ సామర్థ్యాన్ని కూడా ఏటా 40 మిలియన్ టన్నులకు పైగా పెంచుకోగలిగాం. అందువల్ల ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్స్ లో ఒకటిగా భారత్ అవతరించింది. దీనిద్వారా భారతదేశాన్ని స్వావలంబన దిశగా తీర్చిదిద్దేందుకు మనం ఎంతగా ప్రయత్నిస్తున్నామో మీరు అంచనా వేయవచ్చు. యుద్ధం వల్ల తలెత్తిన ఈ సంక్షోభాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. 140 కోట్ల మంది దేశ ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరం ఐక్యంగా కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించినట్లే ఈ ప్రపంచ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తాం. నేను మళ్లీ చెబుతున్నాను. ప్రభుత్వపరంగా ప్రయత్నంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తాం. ప్రతి నిర్ణయంలోనూ ప్రజాప్రయోజనమే పరమావధిగా ఉంటుంది.

మిత్రులారా,

ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు.. ప్రపంచ మార్కెట్ నుంచి సామాన్య ప్రజల వరకు దాని ప్రభావాన్ని చూస్తున్నారు. ఈ యుద్ధభారం భారత పౌరులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.3000 ఉన్న యూరియా బస్తాను, మన రైతులకు కేవలం రూ.300లకే అందించాం. ప్రపంచవ్యాప్తంగా రూ.3000 ధర ఉన్నప్పటికీ, మన దేశంలో మాత్రం రూ.300లకే ఇచ్చాం. ఈసారి కూడా యుద్ధ ప్రభావం దేశ రైతులపై, పౌరుల జీవనంపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాం.

 

 

మిత్రులారా,

ఈ కీలక సమయంలో ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. బ్లాక్-మార్కెట్ కార్యకలాపాలు జరగకుండా, పుకార్లు వ్యాపించకుండా చర్యలు తీసుకోవటం అవసరం. ఇందుకోసం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలి. బ్లాక్-మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మిత్రులారా,

గత దశాబ్దం సున్నితమైన పాలనను అందించటంతో పాటు స్వావలంబన సాధించింది. మన దేశంలోని చాలా ప్రాంతాలు, అక్కడ నివసించే ప్రజలు, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి దూరంగా ఉండిపోయారు. కానీ మా ప్రభుత్వం.. అభివృద్ధి రేసులో వెనుకబడిపోయిన వారిని ప్రభుత్వ ప్రాధాన్యతలతో అనుసంధానించింది. నేడు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, రహదారులు, పాఠశాలలు-ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఆకాంక్షిత జిల్లాల పథకం, ఆకాంక్షిత బ్లాకుల పథకం, పీఎం జన్‌మన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పెద్ద తప్పు.. దేశంలోని చాలా భాగాన్ని మావోయిస్టు ఉగ్రవాదుల చేతుల్లోకి వదిలేయటం. అప్పట్లో దాదాపు ప్రతి పెద్ద రాష్ట్రంలోని అధిక భాగం మావోయిస్టుల గుప్పిట్లో ఉండేది. కానీ మిత్రులారా, గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిని మార్చాలని దేశం దృఢ సంకల్పం తీసుకుంది. ఇందుకోసం నిండైన ఆత్మవిశ్వాసంతో మేం ముందడుగు వేశాం. ఆ ఫలితాన్ని దేశం ఈరోజు కళ్లారా చూస్తోంది. 2013లో దేశవ్యాప్తంగా 180కి పైగా జిల్లాలు మావోయిస్టు ఉగ్రవాదంతో ప్రభావితమయ్యాయి. కానీ ఇవాళ అలాంటి జిల్లాల సంఖ్య సింగిల్ డిజిట్‌కు చేరుకుంది.

మిత్రులారా,

గత ఏడాదిగా 2,100 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారు. 900 మందికి పైగా అరెస్టయ్యారు. ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవటానికి తిరస్కరించిన కరుడుగట్టిన 300లకు పైగా నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. దీని ఫలితంగా ఒకప్పుడు భయం నీడలో బతికిన ప్రాంతాల్లో ఇవాళ అభివృద్ధి వెల్లివిరుస్తోంది.

మిత్రులారా,

భారత అభివృద్ధి వేగాన్ని అడ్డుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నేడు మరో స్థాయికి చేరుకున్నాయి. ఒక కల సాకారమైనప్పుడు మరో నూతన కల, నూతన ఆకాంక్ష పుట్టుకొస్తుందని నాకు తెలుసు. వీటిని నేను భారంగా భావించటానికి బదులుగా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిరూపంగా భావిస్తాను. ఈ దేశంలో నాపైన అమితమైన ప్రేమ చూపే కొందరున్నారు. ఈ అంచనాల భారంతో మోదీ నలిగిపోతారని, అణచివేతకు గురవుతారని వాళ్లు ఆశిస్తుంటారు. వాళ్ల దుర్మార్గమైన కోరికలు ఎప్పటికీ నెరవేరవు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వారి ఉద్దేశాలు నెరవేరవు కూడా. ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు మాత్రమే నెరవేరుతాయి. ప్రతి రంగంలోనూ భారత్ స్వావలంబన సాధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది.

ఈ నమ్మకంతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event

Media Coverage

‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”