ప్రపంచ ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఉక్కుదే ప్రధాన పాత్ర, ఎన్నో విజయగాథలకు మూలం ఉక్కే: ప్రధాని
నేడుప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ అవతరించడం గర్వకారణం: ప్రధాని
జాతీయ ఉక్కు విధానం కింద 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: ప్రధాని
అనేక ఇతర భారతీయ పరిశ్రమలను అంతర్జాతీయంగా పోటీపడే స్థాయిలో నిలపడంలో ఉక్కు పరిశ్రమపై ప్రభుత్వ విధానాలు కీలకం: ప్రధాని
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటి లక్ష్యమూ ‘దిగుమతి రహితం’, ‘నికర ఎగుమతిదారు’గా ఉండాలి: ప్రధాని
కొత్త ప్రక్రియలు, కొత్త గ్రేడ్‌లు, కొత్త స్థాయిలను చేరడానికి మన ఉక్కు రంగం సిద్ధంగా ఉండాలి: ప్రధాని
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం విస్తరించాలి, స్థాయిని పెంచుకోవాలి, ఇప్పటి నుంచే మనం భవిష్యత్ సన్నద్ధులుగా ఉండాలి: ప్రధాని
గత పదేళ్లులో అనేక మైనింగ్ సంస్కరణలను అమలు చేశాం, ఇనుప ఖనిజం లభ్యత సులభతరమైంది: ప్రధాని
కేటాయించిన గనులను, దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. కొత్త ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయాల్సి ఉంది: ప్రధాని
ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

విశిష్ట అతిథులకు, మంత్రివర్గంలో నా సహచరులకు, పారిశ్రామికవేత్తలకు, అంతర్జాతీయ ప్రతినిధులకు, నా స్నేహితులకు నమస్కారం!

నేటి నుంచి రెండు రోజుల వరకు, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఉక్కు రంగ సామర్థ్యం, అవకాశాల గురించి విస్తృతమైన చర్చల్లో మనం పాల్గొనబోతున్నాం. దేశాభివృద్ధికి వెన్నెముకగా వికసిత్ భారత్ కు బలమైన పునాదిగా దేశాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ఈ రంగం లిఖిస్తుంది. ఇండియా స్టీల్ 2025కు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నూతన ఆలోచనలు పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఓ మంచి వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. స్టీలు రంగంలో నూతన అధ్యాయ ప్రారంభానికి ఇది పునాది వేస్తుంది.

 

స్నేహితులారా,

ప్రపంచ ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఉక్కు రంగం ప్రధాన భూమిక పోషించింది. అవి ఆకాశ హర్మ్యాలైనా లేదా నౌకావాణిజ్యం, జాతీయ రహదారులు, లేదా హైస్పీడు రైలు, స్మార్ట్ నగరాలు లేదా పారిశ్రామిక కారిడార్లయినా - ప్రతి విజయగాథ వెనక ఉక్కు బలం ఉంది. ప్రస్తుతం, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ శ్రమిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో స్టీలు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ ఎదిగింది. జాతీయ ఉక్కు విధానం ప్రకారం, 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీలు ఉత్పత్తి చేయాలని మనం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం మన తలసరి స్టీలు వినియోగం దాదాపుగా 98 కేజీలు. 2030 నాటికి ఇది 160 కేజీలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఉక్కు వినియోగం దేశ మౌలిక వసతుల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు అత్యున్నత ప్రమాణంగా పనిచేస్తుంది. అలాగే దేశం ప్రయాణిస్తున్న దిశకు, ప్రభుత్వ సామర్థ్యానికి, ప్రభావానికి ఇది కొలమానంగా నిలుస్తుంది.

స్నేహితులారా,

ఇప్పుడు స్టీలు రంగం భవిష్యత్తు గురించి తనలో నూతన విశ్వాసం నింపుకుంది - ఎందుకంటే, పీఎం గతి శక్తి జాతీయ ప్రణాళిక రూపంలో బలమైన పునాదిని దేశం సిద్ధం చేసుకుంది. పీఎం గతి శక్తి ద్వారా వివిధ రకాల వస్తు సేవలు, రవాణా వ్యవస్థలను ఏకీకృతం చేస్తున్నాం. దేశంలోని మైనింగ్ ప్రాంతాలు, స్టీలు పరిశ్రమల మధ్య అనుసంధాన్ని పెంపొందించేందుకు బహువిధ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. దేశంలో ఉక్కు రంగం ఎక్కువగా విస్తరించి ఉన్న తూర్పు ప్రాంతాల్లో.. కీలకమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. 1.3 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌలిక వసతుల వ్యవస్థగా మనం ముందుకు సాగుతున్నాం. మన నగరాలను స్మార్ట్ నగరాలుగా మార్చేందుకు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు, రైల్వేలు, విమానశ్రయాలు, నౌకాశ్రయాలు, పైప్‌లైన్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి ఉక్కు రంగానికి కొత్త అవకాశాలను తీసుకువస్తున్నాయి. పీఎం ఆవాస యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మాణమవుతున్నాయి. అదేవిధంగా, జలజీవన్ మిషన్ కూడా గ్రామాల్లో విస్తృత స్థాయిలో మౌలికవసతులను కల్పిస్తోంది. తరచూ, ఇలాంటి పథకాలను దేశ సంక్షేమమనే కోణంలోనే చూస్తారు. పేదలకు సాధికారత కల్పించడంతో పాటు దేశ ఉక్కు పరిశ్రమను సైతం మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సంక్షేమ పథకాలు రూపొందాయి. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ స్టీలునే ఉపయోగించాలని మేం నిర్ణయించాం. ఈ ప్రయత్నాల ఫలితంగా నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి స్టీలు వినియోగంలో గణనీయమైన వాటా ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచే వస్తోంది.

స్నేహితులారా,

ఎన్నో రంగాల వృద్ధిలో ఉక్కు ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాబట్టి, స్టీలు పరిశ్రమ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. వివిధ భారతీయ సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన తయారీ, నిర్మాణ, యంత్రాలు, ఆటోమోటివ్ రంగాలు - భారతీయ స్టీలు పరిశ్రమ ద్వారా శక్తిమంతమవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను వేగవంతం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్లో జాతీయ తయారీ మిషన్‌ను మా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమల కోసం రూపొందించాం. ఈ జాతీయ తయారీ మిషన్.. స్టీల్ రంగంలో సైతం నూతన అవకాశాలను సృష్టిస్తుంది.

 

స్నేహితులారా,

చాలా కాలం పాటు హై గ్రేడ్ స్టీల్ దిగుమతులపై భారత్ ఆధారపడింది. ముఖ్యంగా రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాల్లో ఈ పరిస్థితిని మార్చడం అవసరం. మొట్టమొదటి స్వదేశీ యుద్ద విమాన వాహక నౌకను రూపొందించడంలో భారత్‌లోనే తయారైన ఉక్కును ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. చంద్రయాన్ మిషన్ చారిత్రక విజయంలో సైతం భారతీయ స్టీలు తనదైన పాత్రను పోషించింది. ఇప్పుడు మనం సామర్థ్యం, విశ్వాసం రెండింటినీ కలిగి ఉన్నాం. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం) పథకం ద్వారా, అధిక నాణ్యత కలిగిన స్టీలు ఉత్పత్తులను పెంపొందించడానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అందిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే - మనం సాధించాల్సింది ఇంకా ఉంది. దేశంలో బృహత్ ప్రాజెక్టులు ఎన్నో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి అధిక నాణ్యత కలిగిన స్టీలుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ.. ఈ ఏడాది బడ్జెట్లో నౌకానిర్మాణానికి చోటు కల్పించాం. ఆధునిక ఓడలను భారత్‌లోనే తయారు చేయాలని, మన దగ్గర తయారైన ఓడలను ఇతర దేశాలు కొనుగోలు చేయాలనేది మా లక్ష్యం. అలాగే, పైప్‌లైన్ గ్రేడ్ స్టీల్, తుప్పు పట్టని మిశ్రమ లోహాలకు సైతం దేశంలో గిరాకీ పెరుగుతోంది.

దేశంలో రైల్వేల్లో మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ అవసరాల కోసం ‘సున్నా దిగుమతులు’, ‘నికర ఎగుమతులు’ మన ఆశయం కావాలి. ప్రస్తుతం మనం 25 మిలియన్ టన్నుల స్టీలును ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అలాగే 2047 నాటికి మన ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. ఇది జరగాలంటే.. కొత్త పద్ధతులు, ప్రమాణాలు, స్థాయులకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విస్తరణ, అభివృద్ధి జరగాలి. భవిష్యత్తు కోసం ఇప్పుడే మనం సిద్ధం కావాలి. స్టీలు పరిశ్రమకు ఉన్న వృద్ధి సామర్థ్యం లెక్కలేనన్ని అవకాశాలు, ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆలోచనలు పంచుకోవడానికి, అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఆహ్వానిస్తున్నాను. తయారీ, పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక నవీకరణల్లో మనం సమష్టిగా ముందుకు సాగుతూ దేశంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి.

స్నేహితులారా,

స్టీలు పరిశ్రమ అభివృద్ధి ప్రయాణంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగడం చాలా అవసరం. ముడి సరకుల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉంది. మనం నికెల్, కోకింగ్ బొగ్గు, మాంగనీస్ దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి, మనం అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, సరఫరా వ్యవస్థల రక్షణ, సాంకేతిక మెరుగుదలపై కూడా దృష్టి సారించాలి. ఇంధన సామర్థ్యం, స్వల్ప ఉద్గారాలు, అధునాతన డిజిటల్ సాంకేతికతల దిశగా మనం వేగంగా ప్రయాణం సాగించాలి. కృత్రిమ మేధ, యాంత్రీకరణ, పునర్వినియోగం, అనుబంధ ఉత్పత్తులే ఉక్కు పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో ఆవిష్కరణలకు మనం ప్రాధాన్యమివ్వాలి. ఈ దిశగా మన అంతర్జాతీయ భాగస్వాములు, భారతీయ సంస్థలు కలసి పనిచేస్తే.. తక్కువ సమయంలోనే ఈ సవాళ్లను మనం అధిగమించగలుగుతాం.

స్నేహితులారా,

బొగ్గు ముఖ్యంగా కోకింగ్ బొగ్గు దిగుమతులు వ్యయం, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తాయని మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించాలి. ప్రస్తుతం, డీఆర్ఐ (డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్) విధానం, ఇతర ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. వాటి వినియోగాన్ని ప్రోత్సహిచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. బొగ్గు గ్యాసిఫికేషన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. తద్వారా దేశంలో బొగ్గు వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. స్టీలు రంగంలోని వారందరినీ ఈ ప్రయత్నంలో భాగమవ్వాలని, ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

 

స్నేహితులారా,

మరో ముఖ్యమైన సమస్య గ్రీన్‌ఫీల్డ్ గనులను ఇప్పటికీ ఉపయోగించుకోకపోవడం. గత పదేళ్లుగా, మన దేశం ఎన్నో మైనింగ్ సంస్కరణలు చేపట్టింది. తద్వారా ఇనుప ఖనిజం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కేటాయించిన గనులను, జాతీయ వనరులను సకాలంలో సమర్థంగా ఉపయోగించుకోవడం అవసరం. ఈ అంశంలో మనం ఆలస్యం చేస్తే దేశానికి, ఉక్కు పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి గ్రీన్‌ఫీల్డ్ మైనింగ్ వేగవంతం చేయాలని కోరుతున్నాను.

స్నేహితులారా,

దేశీయంగా అభివృద్ధి చెందడంతో పాటు, అంతర్జాతీయంగా నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవడానికి భారత్ ప్రస్తుతం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మనల్ని నమ్మకమైన ఉక్కు సరఫరాదారుగా ప్రపంచం చూస్తోంది. నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగానే.. స్టీలు విషయంలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే మనల్ని మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, బహువిధ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వ్యయాన్ని తగ్గించడం లాంటి చర్యలు భారత్‌ను స్టీల్ హబ్ గా మార్చేందుకు దోహదపడతాయి.

స్నేహితులారా,

మన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, మన ఆలోచనలకు వాస్తవరూపం ఇవ్వడానికి భారతీయ స్టీలు రంగం మనకు ఓ అవకాశం. ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం కలసి స్థిరమైన, విప్లవాత్మకమైన, ఉక్కు శక్తి నిండిన భారత్‌ను నిర్మిద్దాం.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports

Media Coverage

Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister chairs the National Conference of Chief Secretaries
December 27, 2025

The Prime Minister, Shri Narendra Modi attended the National Conference of Chief Secretaries at New Delhi, today. "Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi", Shri Modi stated.

The Prime Minister posted on X:

"Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi."