Quote· సిక్కింలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని
Quote· సిక్కిం దేశానికి గర్వకారణం
Quote· గత దశాబ్ద కాలంలో మా ప్రభుత్వం భారత అభివృద్ధి ప్రస్థానంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్ర స్థానంలో నిలిపింది
Quote· ‘యాక్ట్ ఫాస్ట్’ స్ఫూర్తితో ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం
Quote· భారత పురోగతిలో సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు సువర్ణాధ్యాయంగా నిలుస్తున్నాయి
Quote· సిక్కింను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి
Quote· మున్ముందు అంతర్జాతీయ క్రీడా నిలయంగా ఆవిర్భవించనున్న భారత్.. ఈ స్వప్నాన్ని సాకారం చేయడంలో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం యువశక్తిది కీలక పాత్ర
Quote· భారత్‌కే కాదు, యావత్‌ప్రపంచానికీ పర్యావరణ హిత నమూనా రాష్ట్రంగా సిక్కిం నిలవాలన్నది మా స్వప్నం: ప్రధాని

సిక్కిం గవర్నరు శ్రీ ఒ.పి.ప్రకాశ్ మాథుర్ గారూ, ప్రియతమ ముఖ్యమంత్రీ నా మిత్రుడూ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారూ, నా పార్లమెంటు సహచరులు డోర్జీ షెరింగ్ లెప్చా గారూ, డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా గారూ.. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరూ, సోదరీ సోదరులారా!

(స్థానిక భాషలో శుభాకాంక్షలు)

ఈరోజు ప్రత్యేకమైనది. సిక్కిం ప్రజాస్వామిక ప్రస్థానంలో స్వర్ణోత్సవం నేడు. ఈ వేడుకను, ఈ స్ఫూర్తిని, అద్భుతమైన 50 ఏళ్ల ప్రస్థానాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని మీ అందరితో కలిసి వీక్షించాలని మనస్ఫూర్తిగా భావించాను. ఈ వేడుకలో మీతో భుజం భుజం కలిపి నిలవాలనుకున్నాను. ఈ రోజు ఉదయాన్నే ఢిల్లీ నుంచి బయలుదేరి బాగ్డోగ్రా చేరుకున్నాను. మీ గుమ్మం దాకా చేరుకున్నప్పటికీ, వాతావరణం నన్ను ఇంకా ముందుకు రానీయలేదు. దాంతో మీ అందరినీ నేరుగా కలవలేకపోయాను. ఏదేమైనా, ఇదో మహత్తరమైన సందర్భం – అద్భుత దృశ్యం నా ఎదుట ఆవిష్కృతమైంది. ఎటుచూసినా జనమే. నిజంగా ఇదో అద్భుతమైన సన్నివేశం. మీ అందరి నడుమా ఉంటే ఎంత బాగుండేదో! దురదృష్టవశాత్తూ నేను మీ వద్దకు చేరుకోలేకపోయాను. అందుకు నన్ను మన్నించమని కోరుతున్నాను.

ఏదేమైనా, గౌరవ ముఖ్యమంత్రి నన్ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసిన వెంటనే.. కచ్చితంగా సిక్కింను సందర్శిస్తానని మాటిస్తున్నాను. మీ అందరినీ కలవడానికి, ఈ 50 ఏళ్ల స్వర్ణోత్సవంలో పాల్గొనడం కోసం ఎదురుచూస్తున్నాను. గత అయిదు దశాబ్దాల విజయాలను చాటే రోజిది. ఈ సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు నిర్వహించారు. నేను నిశితంగా గమనిస్తూ, వింటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా నిలపడంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎంతో అంకితభావంతో వ్యవహరించారనే చెప్పాలి. వ్యక్తిగతంగా ఆహ్వానం అందించేందుకు రెండుసార్లు ఆయన ఢిల్లీ వరకూ ప్రయాణించారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

|

మిత్రులారా,

యాభై ఏళ్ల కిందట సిక్కిం తన భవిత కోసం ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నది. భారత్‌తో భౌగోళికంగా మాత్రమే కాదు, దేశ ఆత్మలోనూ అంతర్భాగమవ్వాలని సిక్కిం ప్రజలు కాంక్షించారు. ప్రతి ఒక్కరికీ తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండి, హక్కులను కాపాడితేనే అభివృద్ధి దిశగా సమానావకాశాలు లభిస్తాయన్న ప్రగాఢమైన విశ్వాసం నాడు అందరిలోనూ ఉంది. నేడు సిక్కింలోని ప్రతీ కుటుంబంలో ఆ విశ్వాసం మరింతగా బలపడిందని నేను నమ్మకంగా చెప్పగలను. ప్రజల విశ్వాసం ఫలితంగా సిక్కిం సాధించిన విశేష పురోగతిని దేశమంతా చూస్తోంది. నేడు సిక్కిం దేశానికి గర్వకారణం. ఈ యాభై ఏళ్లుగా సిక్కిం ప్రస్థానం.. ప్రకృతితో సామరస్యపూర్వకమైన అభివృద్ధికి నమూనాగా నిలిచింది. విస్తృత జీవవైవిధ్య ఉద్యానవనంగా సిక్కిం వికసించింది. 100 శాతం సేంద్రియ ఘనతను ఈ రాష్ట్రం సాధించింది. సాంస్కృతిక, వారసత్వ ఆధారిత అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఈ విజయాలన్నీ సిక్కిం ప్రజల కృషి, ఐక్యత ఫలితమే. భారత వినీలాకాశాన్ని దేదీప్యం చేసిన తారలెన్నో ఈ అయిదు దశాబ్దాల్లో సిక్కింలో పుట్టాయి. రాష్ట్ర సంస్కృతిని సుసంపన్నం చేసి, పెంపొందించడంలో ఇక్కడి ప్రతి సమూహమూ కీలక పాత్ర పోషించింది.

మిత్రులారా,

2014లో అధికారం చేపట్టగానే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అని ప్రకటించాను. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి దేశవ్యాప్తంగా అభివృద్ధిలో సమతౌల్యం కీలకమైనది. అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితమవుతూ.. మరో ప్రాంతం వెనుకబడకూడదు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి, ప్రాంతానికి తమవైన బలాలున్నాయి. ఈ దృక్పథమే మాకు మాకు మార్గనిర్దేశం చేస్తోంది. గత దశాబ్దకాలంలో మా ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో ముందంజలో నిలిపింది. ‘యాక్ట్ ఫాస్ట్’ స్ఫూర్తితో ‘యాక్ట్ ఈస్ట్’ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇటీవల ఢిల్లీలో ఈశాన్య ప్రాంత పెట్టుబడి సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇందులో పాల్గొన్నారు. సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాల్లో గణనీయంగా పెట్టుబడులను వారు ప్రకటించారు. ఇది మున్ముందు సిక్కింతోపాటు ఈశాన్య రాష్ట్రాల యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలను అందించనుంది.

మిత్రులారా,

సిక్కిం భవిష్యత్ ప్రస్థానాన్నీ నేటి కార్యక్రమం సంగ్రహంగా కళ్లెదుట నిలుపుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశాం. ఈ ప్రాజెక్టులు ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, సంస్కృతి, క్రీడా రంగాల్లో సౌకర్యాలను పెంచుతాయి. ఈ కీలక కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు.

మిత్రులారా,

నవ భారత అభివృద్ధి కథనంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటితోపాటు సిక్కిం ఓ సువర్ణాధ్యాయాన్ని వేగంగా లిఖిస్తోంది. భౌగోళికంగా ఢిల్లీకి దూరంగా ఉండడమే ఒకప్పుడు ఈ ప్రాంత పురోగతికి అవరోధంగా ఉండేది.. అలాంటిది ఇప్పుడు అవకాశాలకు కొత్త తోవలు పరచుకుంటున్నాయి. అనుసంధానం మెరుగుపడడమే ఈ విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్య ప్రేరణగా నిలిచింది. ఈ మార్పును మీరంతా నేరుగా చూస్తున్నారు.

ఒకప్పుడు విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రయాణాలు పెద్ద సవాలుగా ఉండేవి. అయితే గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో సిక్కింలో దాదాపు 400 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను నిర్మించాం. వందల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించాం. అటల్ సేతు ద్వారా సిక్కిం, డార్జిలింగ్ మధ్య అనుసంధానం మెరుగైంది. సిక్కిం నుంచి కాలింపాంగ్‌ను కలిపే రహదారిలో కూడా వేగంగా పురోగతి సాధిస్తున్నాం. అంతేకాకుండా బాగ్డోగ్రా – గ్యాంగ్‌టక్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి అభివృద్ధి వల్ల సిక్కిం ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. త్వరలోనే ఈ మార్గాన్ని గోరఖ్‌పూర్-సిలిగురి ఎక్స్‌ప్రెస్ రహదారితో అనుసంధానం చేస్తాం. 

 

|

మిత్రులారా,
నేడు, ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధాని నగరాన్ని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. సెవోక్-రాంగ్పో రైల్వే లైన్ త్వరలోనే సిక్కింను ఈ నెట్‌వర్క్‌తో కలపనుంది. రోడ్లు నిర్మించడం సాధ్యం కాని ప్రాంతాల్లో, రోప్‌వేలను ఏర్పాటు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. సిక్కిం ప్రజలకు సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరిచే అటువంటి ఒక రోప్‌వే ప్రాజెక్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించుకున్నాం.
మిత్రులారా,
గత దశాబ్ద కాలంగా, భారత్ నూతన సంకల్పం, కొత్త ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం మా అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంది. గత 10-11 ఏళ్లలో, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రధాన ఆసుపత్రులు నిర్మితమయ్యాయి. ఎయిమ్స్ సంస్థలు, వైద్య కళాశాలలు గణనీయంగా విస్తరించాయి. ఈ రోజు, మీ ప్రయోజనం కోసం ఇక్కడ 500 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఈ ఆసుపత్రి నిరుపేద కుటుంబాలకు కూడా నాణ్యమైన చికిత్సను అందుబాటులోకి తెస్తుంది.
మిత్రులారా,
ఒకవైపు, మా ప్రభుత్వం ఆసుపత్రులను నిర్మించడంపై దృష్టి సారించింది, మరోవైపు, సరసమైన, అత్యంత-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కట్టుబడి ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, సిక్కిం నుంచి 25 వేల మందికి పైగా ప్రజలు ఉచితంగా వైద్య చికిత్స పొందారు. ఇప్పుడు, దేశవ్యాప్తంగా 70 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వృద్ధులందరి కోసం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. ఇక నుంచి, సిక్కింలోని ఏ కుటుంబం కూడా తమకు ప్రియమైన తమ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ గురించి ఆందోళన చెందే అవసరం లేదు - వారి చికిత్స వ్యయం మా ప్రభుత్వమే భరిస్తుంది.
మిత్రులారా,
'వికసిత్ భారత్'.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం పేదలు, రైతులు, మహిళలు, యువత అను నాలుగు బలమైన స్తంభాలు ఆధారంగా జరుగుతుంది. నేడు, దేశం ఈ స్తంభాలను నిరంతరం బలోపేతం చేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో, సిక్కిం రైతులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారత్ వ్యవసాయంలో కొత్త ధోరణిని చూస్తోంది అయితే అందులో సిక్కిం ముందంజలో ఉంది. సిక్కిం నుంచి సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతి కూడా పెరుగుతోంది. ఇటీవలే, ప్రసిద్ధ 'డల్లె ఖుర్సాని' మిరపకాయలను మొదటిసారిగా ఎగుమతి చేయడం ప్రారంభించారు. మార్చి నెలలో, మొదటిసారిగా ఇక్కడి మిరపకాయలను విదేశాలకు పంపించారు. భవిష్యత్తులో, సిక్కిం నుంచి ఇటువంటి అనేక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కానున్నాయి. దీనిని సాధ్యం చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
సిక్కిం సేంద్రీయ ఉత్పత్తులను సుసంపన్నం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. దేశంలో మొట్టమొదటి సేంద్రీయ మత్స్యకార క్లస్టర్ ఇక్కడ సోరెంగ్ జిల్లాలో ఏర్పాటు కానుంది. ఇది సిక్కింకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును అందిస్తుంది. సేంద్రీయ వ్యవసాయంతో పాటు, సిక్కిం ఇప్పుడు సేంద్రీయ చేపల పెంపకం ద్వారా కూడా గుర్తింపు పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ చేపలు, చేపల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అభివృద్ధి సిక్కిం యువతకు ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
మిత్రులారా,
కొద్ది రోజుల క్రితం, నీతి ఆయోగ్ పాలక మండలి ఢిల్లీలో సమావేశమైంది. ప్రతి రాష్ట్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కనీసం ఒక పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని నేను ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాను. సిక్కిం కేవలం ఒక కొండ ప్రాంతంగా మాత్రమే కాకుండా, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా రూపాంతరం చెందాల్సిన సమయం ఆసన్నమైంది. సిక్కిం సామర్థ్యం సాటిలేనిది. ఇది పూర్తి పర్యాటక ప్యాకేజీని అందిస్తుంది. ఈ రాష్ట్రం ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా కలిగి ఉంది. సరస్సులు, జలపాతాలు, పర్వతాలు, ప్రశాంతమైన బౌద్ధారామాలతో, సిక్కిం నిజంగా పరిపూర్ణ అనుభవాన్ని అందిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాంచన్‌జంగా నేషనల్ పార్క్ భారత్ కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి గర్వకారణం.

|

నేడు, కొత్త స్కైవాక్ నిర్మాణం, గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, అటల్ జీ విగ్రహావిష్కరణ జరుగుతున్న ఈ సందర్భంలో.. ఈ పరిణామాలన్నీ నూతన అవకాశాల పట్ల సిక్కిం ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
మిత్రులారా,
సిక్కింలో సాహస, క్రీడా పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, హై-ఆల్టిట్యూడ్ శిక్షణ వంటి కార్యకలాపాల నిర్వహణను ఈ ప్రాంతం సులభతరం చేస్తుంది. కాన్ఫరెన్స్ టూరిజం, వెల్నెస్ టూరిజం, కన్సర్ట్ టూరిజంల కేంద్రంగా సిక్కిం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. గోల్డెన్ జూబ్లీ కన్వెన్షన్ సెంటర్ ఈ దిశలో ఒక గొప్ప ముందడుగు - భవిష్యత్తు కోసం మేం చేస్తున్న సన్నాహాల్లో ముఖ్యమైన భాగం.
ప్రపంచ నలుమూలల నుంచి ప్రఖ్యాత కళాకారులు గ్యాంగ్‌టక్‌లోని సుందరమైన లోయల్లో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చే రోజు త్వరలోనే సాకారం కానుంది, అప్పుడు, “ప్రకృతి, సంస్కృతి ఎక్కడైనా పరిపూర్ణ సామరస్యంతో ఉందంటే, అది మన సిక్కింలో మాత్రమే!” అని ప్రపంచమంతా ప్రకటిస్తుంది.
మిత్రులారా,
ఈశాన్య ప్రాంత సామర్థ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు, అలాగే ఈ ప్రాంత అపార సామర్థ్యాన్ని వారు అభినందించేందుకు వీలుగా జీ-20 శిఖరాగ్ర సమావేశాలను మేం ఈశాన్య భారతంలో నిర్వహించాం. సిక్కింలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ దార్శనికతను సాకారం చేసేందుకు వేగంగా చేస్తున్న ప్రయత్నాలను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను.

మిత్రులారా,

నేడు భారత్ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో క్రీడల్లో కూడా భారత్ ‌సూపర్ పవర్‌గా అవతరిస్తుంది. ఈ ఆకాంక్షను సాకారం చేసుకోవడంలో ఈశాన్య భారత యువత, ముఖ్యంగా సిక్కిం కీలక పాత్ర పోషిస్తుంది. బైచుంగ్ భూటియా వంటి ఫుట్‌బాల్ దిగ్గజాలు వచ్చిన నేల ఇది. తరుణ్‌దీప్ రాయ్ వంటి ఒలింపియన్లు కూడా వచ్చింది ఇక్కడి నుంచే. జస్లాల్ ప్రధాన్ వంటి అథ్లెట్లు భారత్‌కు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నుంచి ఛాంపియన్లు రావటమే మన లక్ష్యం. మనం క్రీడల్లో పాల్గొనాలి అనే ఆలోచనను దాటి విజయం కోసం దృఢనిశ్చయంతో ముందుకు సాగాలి. ప్రస్తుతం గ్యాంగ్‌టక్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త క్రీడా సముదాయం రాబోయే సంవత్సరాల్లో భవిష్యత్ ఛాంపియన్లకు నిలయంగా ఉంటుంది. 'ఖేలో ఇండియా' కింద సిక్కింకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతిభను గుర్తించడం నుంచి శిక్షణ, సాంకేతికత, పోటీ అవకాశాలను అందించడం వరకు ప్రతి స్థాయిలో మద్దతు అందుతోంది. సిక్కిం యువతలో ఈ ఉత్సాహం, శక్తి ఒలింపిక్ పోడియంలో భారత్ తన స్థానాన్ని సంపాదించుకోవడానికి సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

సిక్కింలోని మీ అందరికీ పర్యాటకానికి ఉన్న శక్తి గురించి పూర్తిగా తెలుసు. పర్యాటకం వినోదం కోసం మాత్రమే  కాదు. ఇది మన వైవిధ్యానికి సంబంధించిన ఒక వేడుక. అయితే, పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దారుణ కాండ కేవలం భారత పౌరులపై జరిగిన దాడి కాదు.. ఇది మానవాళి స్ఫూర్తిపై జరిగిన దాడి, ఐక్యత, సోదర స్ఫూర్తికి దెబ్బ.

 

|

ఉగ్రవాదులు అనేక కుటుంబాలను నాశనం చేయడమే కాకుండా, భారత ప్రజలను విభజించడానికి కూడా కుట్ర పన్నారు. కానీ నేడు, భారత్‌ గతంలో కంటే మరింత ఐక్యంగా ఉందని ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. మన ఐక్యత ద్వారా ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు మనం దృఢమైన, స్పష్టమైన సందేశాన్ని పంపించాం.

వారు మా కూతుళ్ల నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచి జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. కానీ మేం ఆపరేషన్ సిందూర్‌తో స్పందించాం. వారి క్రూరత్వానికి ఇది నిర్ణయాత్మకమైన, శక్తివంతమైన సమాధానం.

మిత్రులారా,

తన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంతో ఆగ్రహానికి గురైన పాకిస్తాన్ మన పౌరులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ దానిలో కూడా పాకిస్తాన్ నకిలీతనం బయటపడింది. ప్రతిస్పందనగా మనం వారి అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. భారత్‌ ఏం చేయగలదో, మనం ఎంత వేగంగా, ఎంత కచ్చితంగా, ఎంత నిర్ణయాత్మకంగా వ్యవహరించగలదో ప్రపంచానికి తెలియజేశాం.

మిత్రులారా,

సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 సంవత్సరాలు పూర్తైన ఈ సందర్భం మనందరికీ స్ఫూర్తిదాయకం. అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు వేగవంతం అవుతోంది. మన దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకునే 2047 సంవత్సరం మన ముందు ఉంది. 

అదే సమయంలో భారత్‌లో సిక్కిం రాష్ట్రంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అందువల్ల మన సమష్టి లక్ష్యాన్ని నిర్దేశించుకోవటానికి నేడే సరైన సమయం. 75 సంవత్సరాల పూర్తయ్యే సందర్భంగా సిక్కిం సాధించాల్సిన వాటి కోసం మనం ఏ దృక్పథాన్ని కలిగి ఉన్నాం? మనం ఎలాంటి సిక్కింను చూడాలనుకుంటున్నాం? రాబోయే 25 సంవత్సరాలకు మనం ఒక దశలవారీ రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. మనం కాలానుగుణంగా మన పురోగతిని అంచనా వేయాలి. ఇంకా ప్రయాణించాల్సిన దూరాన్ని అంచనా వేసుకోవాలి. మనం ముందుకు సాగాల్సిన వేగాన్ని నిర్ణయించుకోవాలి. మనం పునరుత్తేజం, తాజా ఉత్సాహం, అపరిమిత శక్తితో ముందుకు సాగాలి. సిక్కిం ఆర్థిక వృద్ధిని పెంచాలి. రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మార్చడానికి మనం కృషి చేయాలి. ఈ ప్రయత్నంలో మన యువతను కేంద్రంగా తీసుకోవాలి. వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. స్థానిక అవసరాలు, ప్రపంచ స్థాయి డిమాండ్లను తీర్చేందుకు సిక్కిం యువతను సిద్ధం చేయాలి. ఆ లక్ష్యంతో యువతకు అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న రంగాలలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు కృషి చేయాలి. 

మిత్రులారా,

రాబోయే 25 సంవత్సరాలలో సిక్కింను అభివృద్ధి, వారసత్వ సంపద, ప్రపంచ స్థాయి గుర్తింపులో పైకి తీసుకెళ్తామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. ఈ రాష్ట్రం భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి ఒక హరిత నమూనా రాష్ట్రంగా మారాలనేది మా ఆకాంక్ష. ప్రతి పౌరుడు దృఢమైన పైకప్పు కింద నివసించే, ప్రతి ఇల్లు సౌరశక్తితో నడిచే, వ్యవసాయ, పర్యాటక అంకురాలకు నాయకత్వం వహించే రాష్ట్రం.. సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందే, ప్రతి పౌరుడు డిజిటల్ లావాదేవీలు చేసే, వ్యర్థాలను సంపదగా మార్చడం ద్వారా దేశ గుర్తింపును కొంగొత్త శిఖరాలకు పెంచే రాష్ట్రం. రాబోయే 25 సంవత్సరాలు వీటితో పాటు సిక్కింను ప్రపంచ వేదికపై అపూర్వమైన స్థాయికి తీసుకెళ్లటం లాంటి మరిన్ని ఆశయాలను సాకారం చేసుకునే కాలం. ఈ సంకల్పంతో ముందుకు సాగి ఇదే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లటాన్ని కొనసాగిద్దాం.

సిక్కిం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడి వారందరికీ భారత ప్రజలందరి తరఫున మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers

Media Coverage

'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes: Prime Minister's State Visit to Trinidad & Tobago
July 04, 2025

A) MoUs / Agreement signed:

i. MoU on Indian Pharmacopoeia
ii. Agreement on Indian Grant Assistance for Implementation of Quick Impact Projects (QIPs)
iii. Programme of Cultural Exchanges for the period 2025-2028
iv. MoU on Cooperation in Sports
v. MoU on Co-operation in Diplomatic Training
vi. MoU on the re-establishment of two ICCR Chairs of Hindi and Indian Studies at the University of West Indies (UWI), Trinidad and Tobago.

B) Announcements made by Hon’ble PM:

i. Extension of OCI card facility upto 6th generation of Indian Diaspora members in Trinidad and Tobago (T&T): Earlier, this facility was available upto 4th generation of Indian Diaspora members in T&T
ii. Gifting of 2000 laptops to school students in T&T
iii. Formal handing over of agro-processing machinery (USD 1 million) to NAMDEVCO
iv. Holding of Artificial Limb Fitment Camp (poster-launch) in T&T for 50 days for 800 people
v. Under ‘Heal in India’ program specialized medical treatment will be offered in India
vi. Gift of twenty (20) Hemodialysis Units and two (02) Sea ambulances to T&T to assist in the provision of healthcare
vii. Solarisation of the headquarters of T&T’s Ministry of Foreign and Caricom Affairs by providing rooftop photovoltaic solar panels
viii. Celebration of Geeta Mahotsav at Mahatma Gandhi Institute for Cultural Cooperation in Port of Spain, coinciding with the Geeta Mahotsav celebrations in India
ix. Training of Pandits of T&T and Caribbean region in India

C) Other Outcomes:

T&T announced that it is joining India’s global initiatives: the Coalition of Disaster Resilient Infrastructure (CDRI) and Global Biofuel Alliance (GBA).