వికసిత భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణ సంకల్పం చాలా స్పష్టంగా ఉంది: ప్రధాని
రైతులు సుభిక్షంగా, సాధికారత కలిగి ఉండే దేశాన్ని నిర్మించేందుకు మనమంతా కలిసి కృషి చేస్తున్నాం: ప్రధానమంత్రి
వ్యవసాయాన్ని అభివృద్ధికి తొలి చోదకశక్తిగా గుర్తించి రైతులకు గర్వించే స్థానం కల్పించాం: ప్రధాని
వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామాల సుభిక్షం అనే రెండు పెద్ద లక్ష్యాల సాధన దిశగా ఒకేసారి కృషి చేస్తున్నాం: ప్రధాని
బడ్జెట్ లో 'పీఎం ధన్ ధాన్య కృషి యోజన' ను ప్రకటించాం, దీని కింద దేశంలోనే అత్యల్ప వ్యవసాయ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెడతాం: ప్రధానమంత్రి
ఈ రోజు ప్రజలు పోషకాహారం గురించి చాలా అవగాహన పెంచుకున్నారు; అందువల్ల, ఉద్యాన, పాడి, మత్స్య ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఈ రంగాలలో పెట్టుబడులు పెరిగాయి; పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం: మోదీ
బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తాం: ప్రధాని
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని

నమస్కారం!

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.

 

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో భారత్ సంకల్పం సుస్పష్టంగా ఉంది. రైతులు సంపన్నులై, సాధికారత సాధించిన భారత్‌ కోసం మనమంతా రైతులందరినీ సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇచ్చి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామాల శ్రేయస్సు అనే రెండు మహోన్నత లక్ష్యాల సాధనకు మనమంతా ముందుకుసాగుతున్నాం.
 

మిత్రులారా,

ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన ద్వారా దాదాపుగా 11 కోట్ల మంది రైతులు ఇప్పటివరకు సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు అందుకున్నారు. ప్రతియేటా రైతులకు అందిస్తున్న6 వేల రూపాయల ఆర్థిక సాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. ఈ పథకం ప్రయోజనాలు దేశంలోని రైతులందిరికీ చేరేలా రూపొందించిన రైతు కేంద్రిత డిజిటల్ మౌలిక సదుపాయాలు గల నో-కట్ కంపెనీతో మధ్యవర్తుల ప్రమేయం, దోపిడీకి అవకాశమే లేకుండా నివారించాం. మీవంటి నిపుణులు, దార్శనికుల సహకారంతో ఈ పథకం విజయవంతమై, మెరుగైన ఫలితాలను ఇస్తుందనడానికి ఇది నిదర్శనం. మీ సహకారంతో ఏ పథకాన్నైనా పూర్తి బలం, పారదర్శకతతో అమలు చేయగలం, ఇందుకు సహకరిస్తున్న మీ అందరికీ నా అభినందనలు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన పథకాల అమలు కోసం మనమంతా ఐక్యంగా, మరింత వేగంగా కృషి చేయాల్సి ఉంది. ఇలాగే ప్రతి రంగంలో మీ విలువైన సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.

మిత్రులారా,

నేడు భారత వ్యవసాయ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. 10-11 ఏళ్ల క్రితం దాదాపు 265 మిలియన్ టన్నులుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ప్రస్తుతం 330 మిలియన్ టన్నులకు పెరిగాయి. అదేవిధంగా, ఉద్యానవన పంటల ఉత్పత్తులు సైతం 350 మిలియన్ టన్నులకు పెరిగాయి. విత్తనం నుంచి మార్కెట్ వరకు రైతులకు అండగా ఉండేలా రూపొందించిన ప్రభుత్వ పథకాల ఫలితంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. వ్యవసాయ సంస్కరణలు, రైతుల సాధికారత, బలమైన వాల్యూ చెయిన్ దీనిని సుసాధ్యం చేశాయి. ఇప్పుడు మనం దేశంలోని వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మరింత పెద్ద లక్ష్యాలను చేరుకోవాలి. బడ్జెట్‌లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రకటించిన కారణం ఇదే, ఇది నా దృష్టిలో చాలా ముఖ్యమైన పథకం. దీని ద్వారా దేశంలో అత్యల్ప వ్యవసాయ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల్లో దిగుబడులను పెంచడానికి కృషి జరుగుతోంది. అభివృద్ధికి సంబంధించిన అనేక పారామితులపై ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం సాధించిన ఫలితాలను మీరంతా చూశారు. ఈ జిల్లాలు సహకారం, పాలన, ఆరోగ్యకరమైన పోటీ, సమ్మిళితత్వ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఈ ఫలితాలను మీరంతా అధ్యయనం చేసి, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఈ 100 జిల్లాల్లో చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. 

మిత్రులారా,

గత కొన్నేళ్లలో, మా ప్రయత్నాల కారణంగా దేశంలో పప్పుదినుసుల ఉత్పత్తి పెరిగింది, ఇందుకు నేను రైతులను కూడా అభినందిస్తున్నాను. అయితే ఇంకా మనం దేశీయ వినియోగంలో 20 శాతం విదేశాలపై, దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. అంటే మనం పప్పుదినుసుల ఉత్పత్తిని మరింత పెంచాలి. శనగలు, పెసర్ల సాగులో స్వయం సమృద్ధిని సాధించాం. కానీ కంది, మినుములు, మసూర్ ఉత్పత్తిని పెంచడానికి మనం మరింత వేగంగా పని చేయాలి. ఇందుకోసం మెరుగైన విత్తనాల సరఫరా, హైబ్రిడ్ రకాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. మీరంతా వాతావరణ మార్పులు, మార్కెట్ అనిశ్చితి, ధరల హెచ్చుతగ్గులు వంటి సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలి.

మిత్రులారా,

గత దశాబ్దంలో, బ్రీడింగ్‌లో ఆధునిక సాధనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఐసీఏఆర్ ఉపయోగించింది. దీని కారణంగా 2014 - 2024 మధ్య కాలంలో తృణధాన్యాలు, నూనెగింజలు, పప్పుదినుసులు, పశుగ్రాసం, చెరకు వంటి వివిధ పంటల్లో 2900లకు పైగా నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. మన రైతులకు వీటిని సరసమైన ధరలకు అందించడంతో పాటు, దిగుబడిపై వాతావరణ మార్పుల ప్రభావం లేకుండా చర్యలు చేపట్టాలి. అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం జాతీయ మిషన్‌ను ఈ బడ్జెట్‌లో ప్రకటించాం. ఈ విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉంచి, రైతులు వీటిని విరివిగా ఉపయోగించేలా కృషి చేయాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైవేట్ రంగ వ్యక్తులకు ప్రత్యేకించి నేను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు ప్రజల్లో పోషకాహారం గురించి అవగాహన పెరిగిన నేపథ్యంలో, ఉద్యానవన, పాడి, మత్స్యరంగ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచడానికి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటును కూడా బడ్జెట్‌లో ప్రకటించాం. విభిన్న పోషకాహారాలను వ్యాప్తి చేసే కొత్త మార్గాలను అన్వేషించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఇటువంటి పోషకాహారాలు దేశమంతటికీ అలాగే ప్రపంచ మార్కెట్‌కూ చేరాలి.

 

మిత్రులారా,

మత్స్య రంగ విలువను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ కోసం 2019లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించడంతో ఉత్పత్తి, ఉత్పాదకత, పోస్ట్-హార్వెస్టింగ్ నిర్వహణ మెరుగైంది. గత కొన్నేళ్లలో ప్రవేశపెట్టిన అనేక పథకాల ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు కూడా పెరిగిన క్రమంలో వాటి ఫలితాలను నేడు మనం చూస్తున్నాం. నేడు చేపల ఉత్పత్తి, ఎగుమతులు కూడా రెట్టింపయ్యాయి. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఓపెన్ సీ ద్వారా మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నాం. ఈ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే ఆలోచనల రూపకల్పనకు వీలైనంత త్వరగా మీరు పని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు మన సంప్రదాయిక మత్స్యకారుల ప్రయోజనాలను సైతం మనం పరిరక్షించుకోవాల్సి ఉంది.

మిత్రులారా,

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ ద్వారా కోట్లాది మంది పేదలకు ఇళ్ళను అందించాం, స్వామిత్వ యోజన ద్వారా ఆస్తి యజమానులకు 'రికార్డ్ ఆఫ్ రైట్స్ (హక్కు పత్రాలు)' అందించాం. స్వయం సహాయక బృందాల ఆర్థిక సాయాన్ని పెంచి వారి సంపద పెరిగేలా చర్యలు తీసుకున్నాం. చిన్న రైతులు, వ్యాపారులు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ప్రయోజనం పొందారు. 3 కోట్ల మంది లక్‌పతీ దీదీలను తయారుచేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్న క్రమంలో ఇప్పటికే 1.25 కోట్లకు పైగా సోదరీమణులు లక్షాధికారులయ్యారు. ఈ బడ్జెట్‌లో గ్రామీణ శ్రేయస్సు, అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనతో అలాగే నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులతో అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో మీ సూచనలు, సహకారంతో కచ్చితంగా సానుకూల ఫలితాలను సాధ్యమవుతాయి. మనం ఐక్యంగా కృషి చేసినప్పుడు మాత్రమే గ్రామాలు, గ్రామీణ కుటుంబాలు సాధికారత పొందుతాయి. బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలను సాధ్యమైనంత తక్కువ సమయంలో, ఉత్తమ పద్ధతిలో అమలు చేయడంలో ఈ వెబినార్ అత్యంత సహాయకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మనం కార్యాచరణపైనే పూర్తిగా దృష్టిసారించి. దానిలో గల ఇబ్బందులు, లోపాలు, అవసరమైన మార్పులను గుర్తించగలిగితే ఈ వెబ్‌నార్ ఫలవంతమవుతుంది. అలాకాకుండా మరో ఏడాది తర్వాతి బడ్జెట్ గురించి చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం మనకు లభించదు. అందుకే ప్రస్తుత బడ్జెట్‌ లక్ష్యాలను ఒక సంవత్సరంలో సాధించడం కోసం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఈ రంగానికి సంబంధించిన వారంతా ఒకే దిశలో, ఒకే అభిప్రాయంతో, ఒకే లక్ష్యంతో, ఒకే అంచనాతో ముందుకు సాగాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack

Media Coverage

'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఏప్రిల్ 2025
April 22, 2025

The Nation Celebrates PM Modi’s Vision for a Self-Reliant, Future-Ready India