మానవ చరిత్రలో పరివర్తనాత్మక అధ్యాయానికి నాంది పలుకుతున్న కృత్రిమ మేధ: పీఎం
ఏఐ అందరికీ అందుబాటులోకి రావాలి, గ్లోబల్‌సౌత్‌లో సమ్మిళిత్వానికి, సాధికారతకు సాధనం కావాలి: పీఎం
ఏఐ కోసం ‘ఎంఏఎన్ఏవీ’ దార్శనికతను వివరించిన పీఎం: నైతికమైన-విలువలతో కూడిన వ్యవస్థలు, నిర్వహణలో జవాబుదారీతనం, జాతీయ సార్వభౌమత్వం, అందుబాటులో ఉండటం-సమ్మిళిత్వం, ధ్రువీకరణ-చట్టబద్ధత
మానవులు, మేధో వ్యవస్థలు కలసి రూపొందించే, కలసి పనిచేసే, కలసి వృద్ధి చెందే యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం
మన పనిని ఏఐ వేగవంతంగా, మరింత సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది: పీఎం
ప్రపంచ సంక్షేమం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉమ్మడి సంకల్పం తీసుకోవాలి: పీఎం

ప్రముఖులు,, గౌరవ మంత్రులు, పరిశ్రమల అధినేతలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు, విశిష్ట అతిథులు, అందరికీ - నమస్తే!

ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరికీ సాదర స్వాగతం. మానవాళిలో ఆరో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌లో ఈ సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అపారమైన సాంకేతిక ప్రతిభ, విస్తృతమైన సాంకేతిక అనుసంధాన వ్యవస్థలకు భారత్ పుట్టినిల్లు. భారత్ కొత్త సాంకేతికతలను సృష్టించడమే కాకుండా, వాటిని మునుపెన్నడూ లేని వేగంతో స్వీకరిస్తుంది. ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఇక్కడ ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాధినేతలకు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులకు, ఆవిష్కర్తలకు నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు ఇక్కడకు విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

భారత్‌లో ఈ సదస్సు జరగడం కేవలం భారతీయులకే కాకుండా, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాలన్నింటికీ గర్వకారణం. ఏఐ ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. 100 పైగా దేశాల ప్రాతినిధ్యంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట వ్యక్తుల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా కొత్త శిఖరాలను చేరుతోంది. యువత అధిక సంఖ్యలో హాజరుకావడం సరికొత్త విశ్వాసాన్ని కలిగిస్తోంది. సాధారణంగా, కొత్త సాంకేతికతలు ప్రారంభ దశల్లో సందేహాలను ఎదుర్కొంటాయి. అయితే, ప్రపంచ యువత ఏఐని స్వీకరిస్తున్న వేగం, దానిపై చూపుతున్న నమ్మకం, దానిని సొంతం చేసుకుని ఉపయోగిస్తున్న తీరు నిజంగా అసాధారణం. ఈ సదస్సులోని ప్రదర్శన కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువ ప్రతిభావంతుల్లో ఇది కనిపిస్తోంది. ఇక్కడ ప్రదర్శించిన పరిష్కారాలు - వ్యవసాయం, భద్రత, దివ్యాంగులకు సహాయం,  బహుభాషా జనాభా అవసరాలను తీర్చడం వంటివి - మేడ్ ఇన్ ఇండియా శక్తికి, భారత ఆవిష్కరణా సామర్థ్యాలకు శక్తిమంతమైన ఉదాహరణలు.

మిత్రులారా,

మానవ చరిత్రలో ప్రతి కొన్ని శతాబ్దాలకు ఒక మలుపు వస్తుంది. అది నాగరికత దిశను మారుస్తుంది. అభివృద్ధి వేగాన్ని మారుస్తుంది మన ఆలోచన, అవగాహన, పనితీరును కూడా పూర్తిగా మార్చివేస్తుంది. విశేషమేమిటంటే, అటువంటి మార్పులతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, వాటి నిజమైన ప్రభావాన్ని మనం అరుదుగా గుర్తిస్తాం.  రాళ్లతో నిప్పును రగిల్చినప్పుడు, అది నాగరికతకు పునాది అవుతుందని ఎవరూ ఊహించలేదు. మాటలు రాతగా మారినప్పుడు, ఆ లిఖిత జ్ఞానం భవిష్యత్తు వ్యవస్థలకు వెన్నెముక అవుతుందని ఎవరూ అనుకోలేదు. సంకేతాలను మొదటిసారి వైర్‌లెస్‌గా పంపినప్పుడు, ఒకరోజు ప్రపంచమంతా ఇలా క్షణాల్లో అనుసంధానం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

మిత్రులారా,

కృత్రిమ మేధ (ఏఐ) మానవ చరిత్రలో అటువంటి ఒక గొప్ప మార్పు. ఈరోజు మనం చూస్తున్నవి, అంచనా వేస్తున్నవి దాని ప్రభావానికి కేవలం ప్రారంభ సంకేతాలు మాత్రమే. ఏఐ యంత్రాలకు తెలివితేటలను ఇస్తోంది.  కానీ అంతకంటే ముఖ్యంగా ఇది మానవ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతోంది. మునుపెన్నడూ లేని వేగం, విస్తృతి ఇప్పుడు కనిపిస్తున్న ప్రధాన వ్యత్యాసం. ఈసారి ఉన్న తేడా ఏమిటంటే, దీని వేగం, విస్తృతి రెండూ అసాధారణమైనవి. గతంలో, ఒక సాంకేతికత తన ప్రభావాన్ని చూపడానికి దశాబ్దాల సమయం పట్టేది. నేడు, మెషీన్ లెర్నింగ్ నుంచి  లెర్నింగ్ మెషీన్స్ వరకు సాగుతున్న ఈ ప్రయాణం మరింత వేగంగా, లోతుగా, విస్తృతంగా ఉంది. అందువల్ల, మన దార్శనికత కూడా అంతే విస్తృతంగా ఉండాలి. మన బాధ్యత కూడా అంతే లోతైనదిగా ఉండాలి. ప్రస్తుత తరంతో పాటు, భవిష్యత్ తరాలకు మనం ఎటువంటి ఏఐని అందిస్తామో కూడా ఆలోచించాలి. కృత్రిమ మేధ భవిష్యత్తులో ఏమి చేయగలదు అనేది అసలైన ప్రశ్న  కాదు, దానితో నేడు మనం ఏమి చేయాలనుకుంటున్నామనేది ముఖ్యం. మానవాళి గతంలోనూ ఇటువంటి ప్రశ్నలను ఎదుర్కొంది. దీనికి అత్యంత శక్తిమంతమైన ఉదాహరణ అణుశక్తి.  దాని వినాశకరమైన ప్రభావాన్ని  మనం చూశాం. అలాగే దాని సానుకూల సహకారాన్ని కూడా చూశాం. ఏఐ కూడా ఒక పరివర్తనా శక్తి. దీనికి సరైన దిశ లేకపోతే అది విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. సరైన మార్గంలో నడిపిస్తే అది ఒక పరిష్కారంగా మారుతుంది. ఏఐని యంత్ర కేంద్రితంగా కాకుండా మానవ కేంద్రితంగా, బాధ్యతారహితంగా కాకుండా సున్నితంగా బాధ్యతాయుతంగా ఎలా తీర్చిదిద్దాలి అనేదే ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశ్యం. 

మిత్రులారా,

ఈ సదస్సు ఇతివృత్తం సర్వజన హితాయ, సర్వజన సుఖాయ - అందరి సంక్షేమం, అందరి సంతోషం - ఇందులో ఏఐ పట్ల భారత్ దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే మన గీటురాయి. ఏఐ మనుషులను కేవలం డేటా పాయింట్లుగా లేదా ముడి సరుకుగా మార్చకూడదు. అందుకే, ఏఐ ప్రజాస్వామ్యీకరణ జరగాలి. ఇది ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో అందరినీ కలుపుకుపోయే, సాధికారతనిచ్చే సాధనంగా మారాలి.  

 

మిత్రులారా,

మనం ఏఐకి విశాలమైన ఆకాశాన్ని ఇవ్వాలి, కానీ జిపిఎస్  లాగే -  దాని నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అది మార్గాన్ని సూచిస్తుంది.  కానీ దిశ గురించి తుది నిర్ణయం మనదే. ఈరోజు మనం ఏఐ కోసం ఎంచుకునే మార్గమే రేపు మనం నిర్మించే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

మిత్రులారా,

న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో, నేను ఏఐ కోసం భారత దృక్పథాన్ని - ఎంఏఎన్ఏవీ (మానవ్) అంటే 'మనిషి' అనే అర్థంతో సమర్పిస్తున్నాను. ఈ మానవ్  దృక్పథంలో ఎం - నైతిక వ్యవస్థలను సూచిస్తుంది.  అంటే ఏఐని నైతిక మార్గదర్శకాలపై నిర్మించాలి. ఏ -  జవాబుదారీ పాలనకు సంకేతం. అంటే పారదర్శకమైన నిబంధనలు, బలమైన పర్యవేక్షణ ఉండాలి. ఎన్  అంటే జాతీయ సార్వభౌమాధికారం. డేటా ఎవరైతే సృష్టిస్తారో వారికే చెందుతుంది. ఏ -  అందరికీ అందుబాటులో, సమ్మిళితంగా ఉండడం. ఏఐ అనేది ఎవరికో ఒకరికే పరిమితమైన గుత్తాధిపత్యం కాకూడదు. అది అందరి సామర్థ్యాన్ని పెంచేదిగా ఉండాలి.  ఇక వీ అంటే చట్టబద్ధమైనది, సరైనది.  ఏఐ చట్టాలకు లోబడి, ధ్రువీకరించదగినదిగా ఉండాలి. 21వ శతాబ్దపు ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సంక్షేమానికి భారత ‘మానవ్’ దృక్పథం ఒక కీలకమైన వారధిగా నిలుస్తుంది.

మిత్రులారా,

దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ప్రారంభమైనప్పుడు, అది ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదు. ఏఐ విషయంలోనూ ఇదే నిజం. ఈ రంగంలో భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు వస్తాయో ఈరోజు అంచనా వేయడం కష్టం. పని భవిష్యత్తు ను ముందే నిర్ణయించలేం. అది మనం తీసుకునే నిర్ణయాలు,  మనం అనుసరించే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. పని భవిష్యత్తు అనేది ఒక కొత్త అవకాశమని నేను నమ్ముతున్నాను. ఇది మానవులు, మేధో వ్యవస్థలు  కలిసి పనిచేసే యుగం. " మానవులు, మేధో వ్యవస్థలు కలిసి సృష్టించే, కలిసి పనిచేసే, కలిసి మార్పు చెందే యుగంలోకి మనం ప్రవేశిస్తు న్నాం.” ఏఐ మన పనిని మరింత తెలివైనదిగా, సమర్థవంతమైనదిగా, మరింత ప్రభావవంతమైనదిగా మారుస్తుంది. మనం మరింత మెరుగ్గా రూపకల్పన చేస్తాం. వేగంగా నిర్మిస్తాం. బలమైన నిర్ణయాలు తీసు కుంటాం. ఎక్కువ మంది ప్రజలు ఉన్నత విలువ కలిగిన, సృజనాత్మకమైన, అర్థవంతమైన పాత్రలను పొందుతారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, కొత్త పరిశ్రమలకు ఇది ఒక గొప్ప అవకాశం. అందువల్ల, నైపుణ్యాల అభివృద్ధి,  నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం,   నిరంతర అభ్యాసం ఒక ప్రజా ఉద్యమంగా మారాలి.

మిత్రులారా,

పని భవిష్యత్తు అందరినీ కలుపుకుపోయేదిగా నమ్మకమైనదిగా, మానవ కేంద్రితంగా ఉంటుంది. మనం అందరం కలిసి ముందుకు సాగితే, కృత్రిమ మేధ మానవాళి సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుంది.

 

మిత్రులారా,

"సూర్యరశ్మి అత్యుత్తమ క్రిమిసంహారిణి" అని ఒక మాట ఉంది. అంటే పారదర్శకత అనేది అన్నిటికంటే గొప్ప రక్షణ కవచం అని అర్థం. కొన్ని దేశాలు, కంపెనీలు కృత్రిమ మేధను  ఒక "వ్యూహాత్మక ఆస్తి"గా భావిస్తాయి.  దానిని అత్యంత రహస్యంగా అభివృద్ధి చేయాలని నమ్ముతాయి. కానీ భారత్ అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. ఏఐని అందరితో పంచుకున్నప్పుడు మాత్రమే అది ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని మేం నమ్ముతాం. కోడ్ లు బహిర్గతంగా,  అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు లక్షలాది మంది యువ మేధావులు వాటిని మరింత సురక్షితంగా, మెరుగ్గా తీర్చిదిద్దగలరు. అందుకే, కృత్రిమ మేధను ఒక ప్రపంచ ఉమ్మడి సంపద గా అభివృద్ధి చేయాలని మనం సంకల్పించుకుందాం.

మిత్రులారా,

నేడు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం మరొక అత్యవసరం. డీప్‌ఫేక్‌లు, సృష్టించిన సమాచారం స్వేచ్ఛాయుత సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో, మనం ఏం తింటున్నామో తెలుసుకోవడానికి ఆహార పదార్థాలపై పోషక విలువల లేబుళ్లను చూస్తాం. అదేవిధంగా, డిజిటల్ ప్రపంచంలో కూడా, ఏది నిజమో, ఏది ఏఐ ద్వారా సృష్టించిందో ప్రజలకు తెలియజేయడానికి కంటెంట్‌పై ప్రామాణికత లేబుళ్లు ఉండాలి. ఏఐ ద్వారా మరింత సమాచారం, చిత్రాలు, వీడియోలు తయారవుతున్న కొద్దీ, వాటర్‌మార్కింగ్ స్పష్టమైన మూల ప్రమాణాల  అవసరం పెరుగుతోంది. అందుకే, సాంకేతికతలో నమ్మకాన్ని మొదటి నుంచీ అంతర్భాగం చేయాలి.

మిత్రులారా,

పిల్లల భద్రత విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల పాఠ్యప్రణాళికను ఎంత జాగ్రత్తగా రూపొందిస్తామో, ఏఐ ప్రపంచం కూడా అలాగే పిల్లలకు సురక్షితంగా,  కుటుంబ మార్గదర్శకత్వంతో కూడినదిగా ఉండాలి.

మిత్రులారా,

నేడు, ప్రపంచం రెండు రకాల వ్యక్తులుగా విభజితమైంది.  కృత్రిమ మేధలో కేవలం భయాన్ని చూస్తూ,  ఆ భయం గురించి మాత్రమే మాట్లాడేవారు ఒకరైతే, ఏఐలో అదృష్టాన్ని లేదా ఉజ్వల భవిష్యత్తును చూసేవారు మరొకరు.

 

మిత్రులారా,

నేను ఎంతో బాధ్యతతో, గర్వంతో చెబుతున్నా. భారత్ ఏఐ లో భయాన్ని చూడటం లేదు. ఏఐలో అదృష్టాన్ని చూస్తోంది. ఏఐలో భవిష్యత్తును చూస్తోంది. మా దగ్గర ప్రతిభ ఉంది. శక్తి, సామర్థ్యం ఉన్నాయి. అలాగే స్పష్టమైన విధానాలు కూడా ఉన్నాయి. ఈ సదస్సు సందర్భంగా మూడు భారతీయ కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్స్ యాప్‌లను ప్రారంభించాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ మోడల్స్ మన యువత ప్రతిభను చాటిచెప్పడమే కాకుండా, భారత్ అందిస్తున్న పరిష్కారాల లోతును,  వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

 

మిత్రులారా,

భారతదేశం సెమీకండక్టర్లు, చిప్ తయారీ నుంచి  క్వాంటం కంప్యూటింగ్ వరకు ఒక దృఢమైన సానుకూల వ్యవస్థను నిర్మిస్తోంది. సురక్షితమైన డేటా సెంటర్లు, బలమైన ఐటీ పునాది,  చైతన్యవంతమైన స్టార్టప్ వ్యవస్థలు భారత్ ను తక్కువ ఖర్చుతో గణించదగిన, సురక్షితమైన ఏఐ  పరిష్కారాలకు సహజమైన కేంద్రంగా మారుస్తున్నాయి. భారతదేశంలో వైవిధ్యం, జనాభా బలం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. భారత్ లో విజయవంతమయ్యే ఏ ఏఐ మోడల్ ను అయినా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయవచ్చు. అందువల్ల, నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. భారతదేశంలో రూపకల్పన చేయండి. అభివృద్ధి చేయండి. ( ప్రపంచానికి అందించండి. మానవాళికి అందించండి. మరోసారి, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26

Media Coverage

India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 ఏప్రిల్ 2026
April 05, 2026

From Aatmanirbhar to Viksit Bharat: PM Modi’s Leadership Powers India’s Multi-Sector Triumph