· సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక సహకారం చోదకాలుగా వికసిత భారత్‌కు బాటలు వేసేలా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్
· ప్రక్రియల సరళీకరణ, మెరుగైన వాణిజ్య సౌలభ్యం, నిర్వహణపరంగా సాంకేతికత ప్రాతిపదికను విస్తరించడం, సంస్థాగత బలోపేతంపై విస్తృత కృషి... నేటికీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకుపోతున్న దేశం
· గత దశాబ్ద కాలంగా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
· మౌలిక సదుపాయాలపై దశాబ్ద కాలంగా చెక్కుచెదరని నిబద్ధత
· రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, డిజిటల్ నెట్‌వర్కులు, విద్యుత్ వ్యవస్థల వంటి దృఢమైన మౌలిక సదుపాయాల ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్న చేతనాత్మక కృత నిశ్చయం మాది
· వీటి ద్వారా దశాబ్దాల పాటు లాభదాయకమైన ఫలితాలు.. అందుకే నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ మూలధన వ్యయం
· ప్రభుత్వం, పరిశ్రమలు, వైజ్ఞానిక సంస్థలు కలిసి ముందుకు సాగితేనే సంస్కరణలతో సత్ఫలితాలు... అప్పుడే క్షేత్రస్థాయి విజయాలుగా ప్రకటనలు సాకారమవుతాయి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

 

అందరికీ శుభాభినందనలు!

ఈ ఏడాది తొలి బడ్జెట్ వెబినార్‌లో పాల్గొంటున్న మీకందరికీ స్వాగతం. బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఇలా వెబినార్‌ నిర్వహించడం కొన్నేళ్ల నుంచీ ఓ బలమైన ఆనవాయితీగా మారింది. సాధారణంగా వేర్వేరు పారామితుల ప్రాతిపదికన బడ్జెట్‌ అంచనాలు రూపొందుతాయి. కొన్ని సందర్భాల్లో స్టాక్ మార్కెట్ లావాదేవీలపై చర్చ సాగుతుంది. మరి కొన్నిసార్లు ఆదాయపు పన్ను ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వస్తాయి. వాస్తవానికి జాతీయ బడ్జెట్‌ అంటే- ఓ స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదు… ఇదొక విధానపరమైన భవిష్యత్‌ ప్రణాళిక. కాబట్టి, బడ్జెట్ ప్రభావంపై అంచనాలు కూడా నిర్దిష్ట పారామితులు, విధానాల ఆధారంగా వేయాల్సి ఉంటుంది. ఆ విధానాలు మౌలిక సదుపాయాల విస్తరణ, రుణ ప్రవాహ సౌలభ్యం, వాణిజ్య సౌలభ్య కల్పన, పాలనలో పారదర్శకత పెంపు, జన జీవన నాణ్యత మెరుగుదల, కొత్త అవకాశాలను సృష్టించడం వంటివిగా ఉంటాయి. బడ్జెట్‌లో సంబంధిత నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు శాశ్వత శక్తినిస్తాయి… అయితే, ఏ బడ్జెట్‌నైనా విడిగా లేదా స్వతంత్రమైనదిగా పరిగణించే వీలుండదు.

 

దేశ పురోగమనం ఓ నిరంతర ప్రక్రియ. ఈ క్రమంలో ప్రతి బడ్జెట్‌నూ ఓ భారీ లక్ష్యాన్ని చేరుకునే దశగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో నేడు మనముందున్న భారీ లక్ష్యం 2047 సంవత్సరం. అంటే- ఆ ఏడాదికల్లా ‘వికసిత భారత్‌’ సంకల్పాన్ని సాకారం చేయడం. కాబట్టి, ప్రతి సంస్కరణ, కేటాయింపు, మార్పు వంటి వాటిని ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంతర్భాగంగా చూడాలి. ఆ క్రమంలో ఏటా బడ్జెట్ అనంతరం నిర్వహించే ఈ వెబినార్లకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందువల్ల ఇవి ఆలోచనల ఆదానప్రదానానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రభావశీల, మేధా మథన కసరత్తుగా రూపొందాలన్నది నా ఆకాంక్ష. మీ అందరి అనుభవం, ఆచరణాత్మకంగా ఎదురయ్యే సవాళ్లను బట్టి ఈ సందర్భంగా అందే సూచనలు పరిష్కారాన్వేషణ దిశగా ఆర్థిక వ్యూహాలను మరింత మెరుగ్గా రూపొందించడంలో తోడ్పడతాయనడంలో సందేహం లేదు. పారిశ్రామిక, విద్యా సంస్థలతోపాటు విశ్లేషకులు, విధాన నిర్ణేతలు సమష్టిగా సమాలోచన చేస్తే, పథకాలు మెరుగ్గా అమలు కావడం ద్వార సత్ఫలితాలు కచ్చితంగా సిద్ధిస్తాయి. ఈ వెబినార్ల పరంపర నిర్వహణలో అంతరార్థమిదే!

మిత్రులారా!

ప్రస్తుత 21వ శతాబ్దంలో నాలుగో వంతు అప్పుడే గడిచిపోయింది. మీరు మీ జీవితం గురించి ఆలోచించినా.. అందులో అత్యంత కీలకమైన కాలం ఇప్పటికే కరిగిపోయింది. ఇక మన దేశం నేడు ప్రగతి పయనంలో కీలక మలుపును చేరింది. మన ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమిస్తున్న తరుణమిది. దీంతోపాటు గత దశాబ్దంలో భారత్‌ అసాధారణ పునరుత్థాన సామర్థ్యాన్ని చాటుకుంది. ఇదేమీ యాదృచ్ఛికంగా అబ్బిన సామర్థ్యం కాదు.. ఇది నిబద్ధతతో కూడిన సంస్కరణల అమలు ఫలితం. ఆ మేరకు మేం ప్రక్రియలను సరళీకరించాం.. వాణిజ్య సౌలభ్యం కల్పించాం. సాంకేతిక పరిజ్ఞాన సారథ్యంలో పాలనను విస్తరించాం.. సంస్థలను బలోపేతం చేశాం. కాబట్టే, ఇవాళ మన దేశం సంస్కరణల ఎక్స్‌ ప్రెస్‌లో అసాధారణ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ఉరవడిని ఇనుమడింపజేయడానికి మనం విధాన సంకల్పంపై మాత్రమేగాక ఫలితాల సాధన నైపుణ్యంపైనా దృష్టి సారించడం అవశ్యం. సంస్కరణలను ప్రకటనలతో సరిపెట్టకుండా క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావం ఆధారంగా వాటి ప్రయోజనాన్ని అంచనా వేయాలి. ఏఐ, బ్లాక్‌చెయిన్, డేటా అనలిటిక్స్‌ సాంకేతికతల విస్తృత వినియోగం ద్వారా వేగంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలి. అంతేగాక సమస్యల పరిష్కార వ్యవస్థల ద్వారా ఆ ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలి.

మిత్రులారా!

గడచిన దశాబ్ద కాలంలో మేం ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. ఆ మేరకు రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, డిజిటల్ నెట్‌వర్క్, విద్యుత్ వ్యవస్థలు వంటి భౌతిక ఆస్తులను రూపుదిద్దడం ద్వారానే అభివృద్ధి సాధ్యమనే సదాలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే దశాబ్దాల్లోల ఇవి ఉత్పాదకతకు ఇనుమడింపజేస్తూంటాయి. తదనుగుణంగా ప్రభుత్వం తరఫున మూలధన వ్యయం నిరంతరం పెరుగుతోంది. ఇప్పటికి పదకొండేళ్ల కిందట ప్రభుత్వ మూలధన వ్యయం నిమిత్తం బడ్జెట్‌లో సుమారు రూ.2 లక్షల కోట్ల మేర కేటాయింపులు ఉండేవి. అయితే, ప్రస్తుత బడ్జెట్‌లో ఇది దాదాపు రూ.12 లక్షల కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇంత భారీ ప్రభుత్వ పెట్టుబడి ద్వారా ప్రైవేట్ రంగానికీ విస్పష్ట సందేశం చేరుతోంది.

 

మిత్రులారా!

దేశంలో పారిశ్రామిక రంగం సహా ఆర్థిక సంస్థలు కూడా నేడు నవ్యోత్తేజంతో ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మౌలిక సదుపాయాల కల్పనలో మరింత భాగస్వామ్యంతోపాటు ఫైనాన్సింగ్ నమూనాలలో ఆవిష్కరణ ఇప్పుడు తప్పనిసరి. అలాగే అత్యాధునిక రంగాల్లో బలమైన సహకారం మరింతగా విస్తరించాలి. ఈ దిశగా నాదొక సూచన- ప్రాజెక్టుల మంజూరు పద్ధతితోపాటు అంచనా నాణ్యతను మరింత మెరుగుపరచాలి. ఆ మేరకు వ్యయం-ప్రయోజనం విశ్లేషణతోపాటు జీవిత కాల వ్యయానికీ అత్యంత ప్రాధాన్యమిస్తూ జాప్యంతోపాటు వృథాను మనం అరికట్టాలి.

మిత్రులారా!

విదేశీ పెట్టుబడుల చట్రాన్ని మేం మరింత సరళం చేస్తున్నాం… వ్యవస్థను మరింత ఊహించదగినదిగా, పెట్టుబడిదారు హితంగా మార్చడంపై మేం దృష్టి సారించాం. దీర్ఘకాలిక ద్రవ్య లభ్యత మెరుగుదల, బాండ్ల మార్కెట్లలో పరిణామశీలత పెంపు దిశగానూ మేం చర్యలు చేపట్టాం. బాండ్ల కొనుగోలు-విక్రయాల ప్రక్రియను సరళీకరిస్తున్నాం.

మిత్రులారా!

బాండ్ మార్కెట్ సంస్కరణలను దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడేవిగా మనం పరిగణించాలి. అంచనా వేయగల సామర్థ్యానికి భరోసా ఇస్తూ, ద్రవ్య లభ్యతను పెంచుకోవాలి. ఇందుకోసం కొత్త ఉపకరణాలను ప్రవేశపెడుతూ, నష్టాలను సమర్థంగా నిర్వహించాలి. అలా చేస్తేనే మనం సుస్థిర విదేశీ మూలధనాన్ని ఆకర్షించగలం. ఈ మేరకు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ విదేశీ పెట్టుబడి చట్రంతోపాటు బాండ్ మార్కెట్ల బలోపేతం దిశగా మీరందరూ విస్పష్ట, దృఢమైన సూచనలిస్తారని ఆశిస్తున్నాను.

 

మిత్రులారా!

విధాన చట్రం రూపకల్పన బ్రహ్మవిద్యేమీ కాదు.. ఎవరైనా దానికో రూపం ఇవ్వగలరు. కానీ, దాని విజయం మాత్రం మీ అందరి ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. తాజా పెట్టుబడులు, ఆవిష్కరణలతో పారిశ్రామిక లోకం ముందుకు రావాలి. ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు ఆచరణాత్మక పరిష్కారాలతో మార్కెట్ విశ్వాసాన్ని బలోపేతం చేసేలా తోడ్పాటునందించాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, విజ్ఞాన భాగస్వాములంతా సమష్టిగా ముందుకొస్తే, సంస్కరణలు ఫలితాలుగా రూపుదిద్దుకుంటాయి. క్షేత్రస్థాయిలో ప్రకటనలు విజయాలుగా మారాలంటే ఇదెంతో ముఖ్యం. ఇక్కడ నా సూచన ఏమిటంటే- విస్పష్ట సంస్కరణ భాగస్వామ్య పత్రాన్ని మనం రూపొందించాలి. ఇది ప్రభుత్వం, పరిశ్రమ, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థల సమష్టి సంకల్పమై ఉండాలి. వికసిత భారత్‌ ప్రస్థానానికి ఇది అత్యంత కీలక పత్రం కాగలదు.

మిత్రులారా!

ఈ నేపథ్యంలో అందరు భాగస్వాములకు, ఆర్థిక సంస్థలకు, మార్కెట్లకు, పరిశ్రమలకు, నిపుణులకు,  ఆవిష్కర్తలకు నేనొక మాట చెబుతున్నాను- ఈ బడ్జెట్ సృష్టించిన కొత్త అవకాశాలను మీరంతా సద్వినియోగం చేసుకోండి. కొత్త అవకాశాలకు బడ్జెట్ వేసిన మార్గంతో అనుసంధానం కండి. మీ భాగస్వామ్యం ద్వారా పథకాల మరింత మెరుగ్గా అమలవుతాయి. మీ అభిప్రాయాలు, సహకారంతో మెరుగైన ఫలితాలు తథ్యం. రండి… మనమంతా  భుజం కలిసి సంస్కరణలను అమలు చేద్దాం. సమష్టిగా పురోగమిద్దాం… వికసిత భారత్‌ స్వప్నాన్ని వీలైనంత త్వరగా సాకారం చేయగల భవిష్యత్తును సృష్టిద్దాం.

మీ ఆలోచనలతో నా సూచనలను జతచేసి, మీరందరూ ఇవాళ లోతుగా మేధా మథనం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మేరకు ప్రక్రియల సరళీకరణపై మీరు దృష్టి  కేంద్రీకరిస్తారని, ఈ క్రమంలో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ముందడుగు వేస్తామని నేను విశ్వసిస్తున్నాను. సాధారణంగా బడ్జెట్‌కు ముందు మీ అందరితో మేం సంప్రదింపులు నిర్వహిస్తాం. దాని ఉద్దేశ్యం భిన్నం… అంటే- బడ్జెట్ మరింత మెరుగ్గా రూపొందాలన్నదే ధ్యేయంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం బడ్జెట్‌కు ఒక రూపం సిద్ధమైపోయింది. కనుక, ఇప్పుడిది బడ్జెట్‌పై చర్చించే సమయం కాదు. చేయాల్సిందల్లా, ఇప్పుడున్న రూపంతోనే వీలైనంత త్వరగా, సరళ మార్గంలో సర్వజన ప్రయోజనం దిశగా భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే! ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆలోచించి, చర్చించినట్లయితే ఇలాంటి వెబినార్లు నిజంగా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయగలవు.

అనేకానేక ధన్యవాదాలు!

నమస్కారం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఆగష్టు 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi