అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు: ప్రధానమంత్రి
విజ్ఞానం,ఆధ్యాత్మికత రెండూ మన దేశానికి బలం: ప్రధాన మంత్రి
చంద్రయాన్ మిషన్ విజయంతో దేశంలోని బాలలు, యువతలో సైన్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే తపన ఉంది. ఇప్పుడు మీ చారిత్రాత్మక ప్రయాణం ఈ సంకల్పానికి మరింత శక్తిని ఇస్తుంది: ప్రధానమంత్రి
మనం గగన్‌యాన్ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలి. మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి. భారతీయ వ్యోమగాములను చంద్రునిపైకి దించాలి: ప్రధానమంత్రి
నేడు నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను - ఇది భారతదేశ గగన్‌యాన్ మిషన్ విజయానికి మొదటి అధ్యాయం. మీ ఈ చారిత్రాత్మక ప్రయాణం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదు, ఇది వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి వేగాన్నీ కొత్త ఉత్తేజాన్నీ ఇస్తుంది: ప్రధానమంత్రి
అంతరిక్షంలో భారత్ ప్రపంచానికి కొత్త అవకాశాల ద్వారాలను తెరవబోతోంది: ప్రధానమంత్రి

ప్రధానమంత్రి: నమస్కారం శుభాంశ్!

శుభాంశు శుక్లా: నమస్కారం!

ప్రధానమంత్రి: ఈ రోజు మీరు మీ మాతృభూమి భారత్‌కు దూరంలో ఉన్నా.. భారతీయులందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల మీ ఈ ప్రయాణం శుభప్రదమైన నవ శకానికి నాంది పలికింది. ఈ సమయంలో మనిద్దరమే ఇలా మాట్లాడుకుంటున్నప్పటికీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలూ నాతో ఉన్నాయి. నా గొంతు భారతీయులందరి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసినందుకు మీకు నా అభినందనలు. అక్కడ అంతా బాగానే ఉందా? మీరు బాగానే ఉన్నారా?

శుభాంశు శుక్లా: అవును ప్రధానమంత్రి గారూ! మీ శుభాశీస్సులకు.. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. ఇక్కడ నేను చాలా బాగున్నాను.. సురక్షితంగానే ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు.. ప్రేమ కారణంగా ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. ఇది చాలా కొత్త అనుభవం. ఇలాంటి అనేక ఘనతలు దేశంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇవి నేను.. మన దేశంలోని నాలాంటి చాలా మంది.. మన దేశం.. పురోగమిస్తున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తాయి. భూమి నుంచి కక్ష్య వరకు సాగిన ఈ నా ప్రయాణం.. నాది మాత్రమే కాదు.. ఈ ప్రయాణం దేశమంతటిదీ. నేను నా చిన్నతనంలో వ్యోమగామిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ మీ నాయకత్వంలోని నేటి భారత్ ఈ అవకాశాన్ని నాకు అందించింది. ఎంతోమంది భారతీయులు వారి కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశాలు వారికి అందుబాటులో ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది నాకు లభించిన గొప్ప విజయం. ఇక్కడ నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు!
 

ప్రధానమంత్రి: శుభ్.. మీరు అంతరిక్షంలో, ఎలాంటి గురుత్వాకర్షణ లేని చోట ఉన్నారు. అయితే మీరు ఎంత ఎదిగినా.. ఒదిగి ఉన్న తీరును ప్రతీ భారతీయుడు గమనిస్తున్నారు. మీరు మీ వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను మీ మిత్రులకు రుచి చూపించారా?

శుభాంశు శుక్లా: అవును, ప్రధానమంత్రి గారూ! నేను మన మాతృభూమి నుంచి క్యారెట్ హల్వా, పెసరపప్పు హల్వా, మామిడిపండ్ల రసం వంటి కొన్ని ఆహార పదార్థాలు నా వెంట తెచ్చుకున్నాను. నేను వాటిని వివిధ దేశాల నుంచి నాతో పాటు అంతరిక్ష యాత్రకు వచ్చిన నా మిత్రులకు రుచి చూపించాలనుకున్నాను. వారంతా ఈ పదార్థాలను రుచి చూసి సుసంపన్నమైన భారతీయ పాకశాస్త్ర వారసత్వ అనుభవాన్ని పొందాలని నా కోరిక. మేమంతా కలిసి కూర్చుని వీటిని రుచి చూశాం. అందరికీ ఇవి చాలా నచ్చాయి. కొంతమంది అయితే.. ఎప్పుడు మన దేశాన్ని సందర్శించి మనతో కలిసి ఈ పదార్థాలను రుచి చూస్తామని అడిగారు.

ప్రధానమంత్రి: శుభ్.. పరిక్రమ అనేది శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయం. మాతృభూమి కోసం పరిక్రమ చేసే గొప్ప అదృష్టం మీకు కలిగింది. ప్రస్తుతం మీకు భూమిపై ఏ భాగం కనిపిస్తోంది?

శుభాంశు శుక్లా: అవును, ప్రధానమంత్రి గారూ! ఇప్పుడు మేం భూమిపై ఏ భాగానికి ఎదురుగా ఉన్నామనే సమాచారం ప్రస్తుతం నా వద్ద లేదు.. అయితే కొంతసేపటి కిందట నేను కిటికీ నుంచి చూసినప్పుడు మేం హవాయి మీదుగా వెళ్తున్నాం.. మేం రోజుకు 16 సార్లు భూమిని చుట్టివస్తున్నాం. ఈ కక్ష్య నుంచి మేం రోజుకు 16 సూర్యోదయాలు.. 16 సూర్యాస్తమాయలను చూస్తున్నాం.. ఇదంతా అత్యద్భుతంగా ఉంది. మీతో మాట్లాడుతూ మేం ఈ కక్ష్యలో గంటకు 28000 కిలోమీటర్ల అధిక వేగంతో తిరుగుతూ ఉన్నాం. అయితే మేం లోపల ఉన్నందున ఈ వేగం అనుభూతి మాకు కలగదు. అయితే ఈ వేగం కచ్చితంగా మన దేశం పురోగమిస్తున్న వేగాన్ని సూచిస్తుంది.

ప్రధానమంత్రి: బాగా చెప్పారు!

శుభాంశు శుక్లా: ప్రస్తుతానికి మనం ఇంత దాకా వచ్చాం.. అయితే ఇప్పుడు మనం మరింత ముందుకు సాగాల్సి ఉంది.

ప్రధానమంత్రి: విశాలమైన అంతరిక్షాన్ని చూడగానే మొదట మీకు ఏమనిపించింది?

శుభాంశు శుక్లా: ప్రధానమంత్రి గారూ, నిజం చెప్పాలంటే మేం మొదటిసారి కక్ష్యకు చేరుకుని.. అంతరిక్షంలో అడుగుపెట్టగానే కనిపించిన మొదటి దృశ్యం భూమి.. బయటి నుంచి భూమిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే.. భూమి ఇక్కడ నుంచి చూస్తే ఎలాంటి హద్దులు.. సరిహద్దులు లేకుండా ఏకరీతిగా కనిపించింది. ఇక నేను గమనించిన రెండో విషయం.. మేం మొదటిసారి ఇక్కడ నుంచి భారతదేశాన్ని చూసినప్పుడు మన దేశం ఎంతో భవ్యంగా కనిపించింది. మనం పటాల్లో భారత్ గురించి చదువుకునేటప్పుడు ఇతర దేశాల పరిమాణం కంటే మన దేశ పరిమాణం ఎంత పెద్దది అని చూస్తాం. కానీ అది సరైనది కాదు.. ఎందుకంటే మనం 2డీలో అంటే కాగితంపై 3డీ పటాలను గీస్తాం. ఇక్కడ నుంచి నిజంగా మన దేశం చాలా భవ్యంగా కనిపిస్తోంది, చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఇది మనం పటంలో చూసే దానికంటే.. ఏకత్వం అనే భావన కంటే.. వసుధైక  కుటుంబం అనే భావన కంటే చాలా పెద్దది. భిన్నత్వంలో ఏకత్వం ప్రాముఖ్యాన్ని బయటి నుంచి చూసినప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే సరిహద్దు లేదు.. రాష్ట్రం లేదు.. దేశాలూ లేవు.. చివరకు మనమంతా మానవత్వంలో భాగమని.. భూమి మన ఇల్లు అని.. మనమంతా ఆ ఇంట్లో నివసిస్తున్న పౌరులమనే భావనే కలుగుతుంది.
 

ప్రధానమంత్రి: శుభాంశూ.. అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయులు మీరు. దీనికోసం మీరెంతో కష్టపడ్డారు. మీరు చాలా కాలం శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మీ కల సాకారమైంది. మీరు నిజమైన అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయి? మీరు వాటికి ఎలా అలవాటుపడుతున్నారు?

శుభాంశు శుక్లా: ఇక్కడ అంతా భిన్నంగా ఉంది ప్రధానమంత్రి గారూ. ఒక సంవత్సరం పాటు మేం శిక్షణ పొందాం. మాకు అన్ని వ్యవస్థల గురించి తెలుసు. అన్ని ప్రక్రియల గురించీ తెలుసు. మాకు ప్రయోగాల గురించీ తెలుసు. అయితే నేను ఇక్కడికి రాగానే అకస్మాత్తుగా అంతా మారిపోయింది. ఎందుకంటే మన శరీరం గురుత్వాకర్షణలో జీవించడానికి అలవాటుపడింది. ప్రతిదీ దానితోనే ముడిపడి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణ లేకపోవడంతో చిన్న విషయాలు కూడా చాలా కష్టంగా మారతాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను నా కాళ్ళను కట్టుకున్నాను. లేకపోతే నేను పైకి వెళ్లిపోతాను. నేను దేనిని వదిలేసినా అది అలాగే తేలుతూనే ఉంటుంది. నీళ్లు తాగాలన్నా, నడవాలన్నా, నిద్రపోవాలన్నా కష్టంగానే ఉంటుంది. సీలింగ్ పైన.. గోడలపైన.. నేలపైనా పడుకోవచ్చు.

ప్రధానమంత్రి గారూ.. ఇక్కడ శిక్షణ బాగుంది. మారిన వాతావారణానికి అలవాటు పడడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఆ తరువాత అంతా బాగుంటుంది.. అంతా మామూలుగానే అనిపిస్తుంది.

ప్రధానమంత్రి: శుభ్.. సైన్స్, ఆధ్యాత్మికం భారత్ ప్రత్యేకతలు. మీరు అంతరిక్ష ప్రయాణంలో ఉన్నారు.. అయినప్పటికీ భారత ప్రయాణం అక్కడా కొనసాగాలి. మీలో భారత్ కొనసాగుతూ ఉండాలి. అక్కడ మనశ్శాంతి కోసం ధ్యానం ఏమైనా ఉపయోగపడుతోందా?

శుభాంశు శుక్లా: అవును ప్రధానమంత్రి గారూ, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భారత్ ఇప్పటికే వేగంగా దూసుకెళ్తోంది.. ఆ పెద్ద రేసులో ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమేనని నేను నమ్ముతున్నాను. మనం కచ్చితంగా పురోగతి సాధిస్తూనే ఉన్నాం.. త్వరలోనే అంతరిక్షంలో మనకు సొంత స్టేషన్లు ఉంటాయి.. చాలా మంది అక్కడికి చేరుకుంటారు.. ధ్యానం ప్రభావమూ చాలా ఉంటుంది. సాధారణ శిక్షణ సమయంలో, రాకెట్ లాంచ్ సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యా. ప్రతికూల పరిస్థితుల్లో ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయడం ద్వారా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటే.. మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పరిగెడుతున్నప్పుడు తినడం ఎవరికీ సాధ్యం కాదన్నట్లుగా, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే.. మీరు అంత బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి, ఈ విషయాల్లో ధ్యానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నాను, కాబట్టి ధ్యానం.. యోగా సాధన చేస్తే ఎటువంటి సవాలుతో కూడిన వాతావరణంలోనైనా అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం చాలా త్వరగా ఆ వాతావరణానికి అలవాటుపడేందుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను.

ప్రధానమంత్రి: రోదసిలో మీరెన్నో పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయం, ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోగం ఏదైనా ఉందా?

శుభాంశు శుక్లా: అవును ప్రధానమంత్రి గారూ! గర్వంగా చెప్పగలను. మొదటిసారిగా భారతీయ శాస్త్రవేత్తలు ఏడు వినూత్న పరిశోధనలకు రూపకల్పన చేశారు. వాటిని ఐఎస్ఎస్‌కు తీసుకువచ్చాం. మొదటి పరిశోధనను మూలకణాలపై చేపట్టాల్సి ఉంది. అది ఈరోజు చేయాల్సి ఉంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఫలితంగా కండరాల క్షీణత చోటు చేసుకుంటుంది. ప్రత్యేక పదార్థం తీసుకోవడం ద్వారా కండరాల క్షీణతను నిలువరించటం లేదా దానిని జాప్యం చేయడంపై నా పరిశోధన దృష్టి సారిస్తుంది. భూమిపైన కండరాల క్షీణతతో బాధపడే వృద్ధులకు ఈ ప్రత్యేక పదార్థం ఉపయోగపడుతుందేమో పరీక్షిస్తాం. రెండోది.. సూక్ష్మఆల్గే వృద్ధి ప్రయోగం. సూక్ష్మఆల్గే చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇక్కడ దాని వృద్ధిని చూస్తే.. ఆ ప్రక్రియను అనుసరిస్తే.. పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసి పోషకాలను అందించవచ్చు. ఇది ఆహార భద్రతకు కూడా ఉపకరిస్తుంది. అంతరిక్షంలోని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇక్కడ ప్రక్రియ చాలా త్వరగా జరుగుతుంది. అందువల్ల మనం నెలలూ.. సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ పొందే ఫలితాలను మనం ఉపయోగించుకోవచ్చు...
 

ప్రధానమంత్రి: శుభాంశూ.. చంద్రయాన్ విజయం తర్వాత మన దేశంలోని పిల్లలు, యువతలో సైన్స్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే మక్కువా పెరిగింది. ఇప్పుడు మీ ఈ చారిత్రాత్మక ప్రయాణం ఆ సంకల్పాన్ని మరింత బలపరుస్తోంది. నేడు పిల్లలు ఆకాశం వైపు చూడటం మాత్రమే కాదు, నేనూ అక్కడికి చేరుకోగలనని భావిస్తున్నారు. ఈ ఆలోచన, ఈ భావన మన భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు నిజమైన పునాది. భారత యువతరానికి మీరిచ్చే సందేశం ఏమిటి?

శుభాంశు శుక్లా: ప్రధానమంత్రి గారూ.. నేటి యువతరానికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటే ముందుగా నేను చెప్పేది ఒక్కటే. భారత్ పురోగమిస్తున్న సమయంలో మనం చాలా ధైర్యమైన, ఉన్నతమైన కలలను చూశాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మీరంతా మాకు అవసరం. ఆ కలల సాకారం కోసం కొన్నిసార్లు మీరు ఒక మార్గాన్ని ఎంచుకుంటారు.. కొన్నిసార్లు వేరొకరు మరో మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ప్రతి మార్గంలోనూ సాధారణమైన విషయం ఏమిటంటే, మీరు ప్రయత్నించడం ఎప్పుడూ ఆపవద్దు. మీరు ఏ మార్గంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎప్పటికీ ప్రయత్నం మానవద్దు అనే ఈ ప్రాథమిక సూత్రాన్ని మీరు అవలంబిస్తే.. విజయం ఈరోజే రావచ్చు.. రేపు రావచ్చు.. కానీ అది కచ్చితంగా లభిస్తుంది.

ప్రధానమంత్రి: మీరు చెప్పిన ఈ మాటలు దేశ యువతకు ఎంతగానో నచ్చుతాయని నేను కచ్చితంగా చెప్పగలను. నా గురించి కూడా మీకు బాగా తెలుసు. నేను ఎవరితోనైనా మాట్లాడినప్పుడల్లా, నేను వారికి హోంవర్క్ ఇస్తాను. మనం గగన్‌యాన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలి, మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి, చందమామపై భారత వ్యోమగామి దిగాలి. మీరు నేర్చుకున్న అంశాలు ఈ మిషన్స్ అన్నింటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ ప్రతీ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటున్నారని అనుకుంటున్నా.

శుభాంశు శుక్లా: అవును ప్రధానమంత్రి గారూ.. కచ్చితంగా.. శిక్షణ పొందుతున్న సమయంలో, ఈ మొత్తం మిషన్‌ను అనుభూతి చెందుతున్న సందర్భాల్లో నేను పొందిన అనుభవాలు, నేను తెలుసుకున్న విషయాలు సహా అన్ని విషయాలను ఒక స్పాంజీలా ఒడిసిపడుతున్నాను. నేను తిరిగి వచ్చిన తరువాత ఈ విషయాలన్నీ చాలా విలువైనవిగా, చాలా ముఖ్యమైనవిగా ఉంటాయని నేను కచ్చితంగా భావిస్తున్నాను. మనం ఈ పాఠాలను మన మిషన్‌ల కోసం సమర్థంగా అన్వయించుకోగలం.. అందువల్ల వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయగలం. నాతో వచ్చిన నా స్నేహితులు కూడా ఒక సందర్భంలో.. మనం గగన్‌యాన్‌కు ఎప్పుడు వెళ్లగలమని నన్ను అడిగారు. అది వినడానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. త్వరలోనే వెళ్లగలమని నేను వారితో చెప్పాను. ఈ కల అతి త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. నేను ఇక్కడ నేర్చుకుంటున్న పాఠాలను.. నేను తిరిగి వచ్చిన తర్వాత మన మిషన్‌ల కోసం 100 శాతం అన్వయించి, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్రధానమంత్రి: శుభాంశూ.. మీ ఈ సందేశం స్ఫూర్తిదాయకం. మీరు వెళ్ళే ముందు మనం కలిసినప్పుడు, మీ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కూడా నాకు లభించింది. మీ కుటుంబ సభ్యులందరూ ఒకేవిధమైన భావోద్వేగంతో, ఉత్సాహంతో ఉండడం నేను గమనించాను. శుభాంశూ.. ఈ రోజు నేను మీతో మాట్లాడటం నిజంగా సంతోషంగా ఉంది. మీకు చాలా పని ఉంటుందని.. మీరు 28000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ పని చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇక నేను మీ సమయం ఎక్కువగా తీసుకోను. ఈ రోజు భారత గగన్‌యాన్ మిషన్ విజయానికి మొదటి అధ్యాయమని నేను నమ్మకంగా చెప్పగలను. మీ ఈ చారిత్రాత్మక ప్రయాణం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదు, ఇది అభివృద్ధి చెందిన భారత్ దిశగా మన ప్రయాణానికి వేగాన్ని, కొత్త బలాన్నీ ఇస్తుంది. ప్రపంచానికి అంతరిక్ష రంగంలో గల కొత్త అవకాశాలను భారత్ ఆవిష్కరించనుంది. ఇప్పుడు భారత్ కేవలం ఎగరడం మాత్రమే కాదు.. భవిష్యత్తులో సరికొత్త విమానాలకు వేదికనూ సిద్ధం చేస్తుంది. మీ మనస్సులో ఇంకా ఏముందో నేను వినాలనుకుంటున్నాను. అందుకే ఇక నేను ప్రశ్నలు అడగాలనుకోవడం లేదు. మీ మనసులో ఉన్న భావాలన్నీ చెబితే.. భారతీయులందరూ వింటారు, దేశంలోని యువతా వింటారు. నేను కూడా మీ నుంచి మరిన్ని విషయాలు వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను.

శుభాంశు శుక్లా: ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ! అంతరిక్షంలోకి వచ్చి.. ఇక్కడ శిక్షణ పొంది.. ఇక్కడికి చేరుకునే ఈ మొత్తం ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇది నాకు వ్యక్తిగత విజయం.. అయితే అంతకన్నా ఇది మన దేశానికి అతి పెద్ద సమష్టి విజయమని నేను భావిస్తున్నాను. దీన్ని చూస్తున్న పిల్లలకు, యువతకూ నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ప్రయత్నిస్తే.. మీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే.. మీ భవిష్యత్తు కచ్చితంగా బాగుంటుంది.. అప్పుడు మన దేశ భవిష్యత్తూ బాగుంటుంది. మీ మనస్సులో ఒకే ఒక విషయాన్ని ఉంచుకోండి. ఆ ఆకాశం మీకూ, నాకూ, దేశానికీ ఎప్పుడూ హద్దులు లేనిదే. మీరు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మీ మనస్సులో ఉంచుకుంటే, మీరు ముందుకు సాగుతారు. మీరు మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకుంటారు.. తద్వారా మీరు మన దేశ భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తారు. ఇదే నా సందేశం. ప్రధానమంత్రి గారూ.. నేను చాలా, చాలా భావోద్వేగానికి గురవుతున్నాను. ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం.. మీ ద్వారా 140 కోట్ల మంది దేశ ప్రజలతో మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా వెనుక చూస్తున్న ఈ త్రివర్ణ పతాకం నిన్న నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ లేదు.. ఇక్కడకు రాగానే మేం దానిని మొదటిసారి ఇక్కడ ఎగురవేశాం. కాబట్టి ఇది నన్ను చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది. భారత్ ఈ రోజు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది.

ప్రధానమంత్రి: శుభాంశూ.. మీ మిషన్ విజయవంతం కావాలని ఆశిస్తూ.. మీకూ, మీ సహచరులందరికీ నా శుభాకాంక్షలు. శుభాంశూ.. మీరు క్షేమంగా తిరిగి వచ్చే రోజు కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. భరతమాత గౌరవాన్ని పెంపొందిస్తూ ఉండండి. 140 కోట్ల మంది దేశప్రజల తరపున మీకు శుభాకాంక్షలు. ఎంతో కష్టపడి ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు మీకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై!

శుభాంశు శుక్లా: ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ.. 140 కోట్ల భారతీయులందరికీ ధన్యవాదాలు.. ఈ అంతరిక్షం నుంచి అందరికీ.. భారత్ మాతా కీ జై!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Pays Tribute to the Martyrs of the 2001 Parliament Attack
December 13, 2025

Prime Minister Shri Narendra Modi today paid solemn tribute to the brave security personnel who sacrificed their lives while defending the Parliament of India during the heinous terrorist attack on 13 December 2001.

The Prime Minister stated that the nation remembers with deep respect those who laid down their lives in the line of duty. He noted that their courage, alertness, and unwavering sense of responsibility in the face of grave danger remain an enduring inspiration for every citizen.

In a post on X, Shri Modi wrote:

“On this day, our nation remembers those who laid down their lives during the heinous attack on our Parliament in 2001. In the face of grave danger, their courage, alertness and unwavering sense of duty were remarkable. India will forever remain grateful for their supreme sacrifice.”