ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం ఏ ఒక్క సమూహానికో, వర్గానికో చెందిన ఘట్టం కాదు..
ఇది దేశ వైదిక అస్తిత్వంతో బలంగా ముడిపడి ఉన్న వేడుక
నిస్సంకోచంగా భారతీయతా సారాన్ని చాటి.. ప్రాచుర్యం కల్పించిన ఆర్య సమాజం
స్వామి దయానందుడు గొప్ప దార్శనికుడు, మహనీయుడు

మహారాష్ట్ర, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు, జ్ఞాన జ్యోతి మహోత్సవ్ నిర్వహణా కమిటీ ఛైర్మన్ సురేంద్ర కుమార్ ఆర్య గారు, డీఏవీ కళాశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు పూనం సూరి గారు, ప్రముఖ ఆర్య సాధువు స్వామి దేవవ్రత్ సరస్వతి గారు, ఆర్య ప్రతినిధి సభల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు, దేశవిదేశాలకు చెందిన ఆర్యసమాజ్ సభ్యులకు, సోదరీసోదరులారా!

ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.

 

స్నేహితులారా,

గతేడాది, దయానంద సరస్వతి స్వామి జన్మస్థలమైన గుజరాత్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దానిలో వీడియో లింక్ ద్వారా నేను ప్రసంగించాను. అంతకంటే ముందే.. మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాలను ఢిల్లీలో ప్రారంభించే భాగ్యం నాకు లభించింది. ఆ సమయంలో వినిపించిన వేద మంత్రాల శక్తి, పవిత్ర యాగం నిన్నే జరిగినట్లుగా అనిపిస్తున్నాయి.

స్నేహితులారా,

ఆ కార్యక్రమంలో, 200వ జయంతి ఉత్సవాలను ‘విచార్ యజ్ఞ’గా రెండేళ్ల పాటు నిర్వహించుకోవాలని మనం సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి అంతరాయం లేకుండా.. ఈ ‘అఖండ విచార యజ్ఞ’ రెండేళ్ల పాటు కొనసాగడం నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు, కార్యక్రమాల గురించి నాకు సమాచారం అందుతూనే ఉంది. మరోసారి... ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. స్వామి దయానంద సరస్వతి పాదపద్మాలకు నమస్కరిస్తూ.. నా నివాళులు అర్పిస్తున్నాను. ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసే అదృష్టం మనకు లభించింది.

స్నేహితులారా,

ఆర్యసమాజ్ ప్రారంభించి 150 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భం.. ఏ సమాజానికో లేదా వర్గానికో పరిమితం కాదు. ఇది భారతీయ వేద గుర్తింపుతో ముడిపడిన కార్యక్రమం. ఇది తనను తాను శుద్ధి చేసుకోగలిగే పవిత్ర గంగా ప్రవాహం లాంటి భారతీయ భావనను ప్రతిబింబించే కార్యక్రమం. ఇది సామాజిక సంస్కరణ అనే గొప్ప కార్యక్రమాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లిన, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులకు మేధోశక్తిని అందించిన గొప్ప సంప్రదాయానికి సంబంధించిన ఉత్సవం. లాలా లజపతి రాయ్, అమరవీరుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి దేశభక్తులు, ఇతర విప్లవ వీరులు ఆర్య సమాజ్ నుంచి స్ఫూర్తి పొంది.. తమ జీవితాలను స్వతంత్ర సాధనకు అంకితం చేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్య సమాజ్‌కు రాజకీయ కారణాల వల్ల తగినంత గుర్తింపు లభించకపోవడం దురదృష్టకరం.

 

స్నేహితులారా,

ప్రారంభమైన నాటి నుంచే.. ఆర్య సమాజ్ దేశ భక్తుల సంస్థగా కొనసాగుతోంది. భారతీయత గురించి ఆర్యసమాజ్ ఎల్లప్పుడూ ధైర్యంగా, నిర్భయంగా మాట్లాడింది. విదేశీ భావజాలమైనా, విభజన ఆలోచనలనైనా లేదా సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నాలనైనా భారత్‌ను వ్యతిరేకించే ప్రతి ఆలోచనను ఆర్యసమాజ్ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. ఆర్యసమాజ్ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రోజున.. స్వామి దయానంద సరస్వతి ఆదర్శాలకు దేశం, సమాజం కలసి ఘనంగా నివాళులు అర్పించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది.

స్నేహితులారా,

ఆధ్యాత్మిక మేలుకొలుపు, సంస్కరణోద్యమాల ద్వారా చరిత్రకు సరికొత్త దిశను అందించిన స్వామి శ్రద్ధానంద లాంటి మహానుభావుల శక్తి, ఆశీస్సులు ఈ చారిత్రక క్షణంలో మనతో ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తులకు ఈ పవిత్ర వేదిక నుంచి నమస్కరిస్తూ.. నివాళులు అర్పిస్తున్నాను.

స్నేహితులారా,

అనేక విధాలుగా భారత దేశం చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్ర భూమి, ఈ నాగరికత, ఈ వేద సంప్రదాయం తరతరాలుగా అజరామరంగా ఉన్నాయి. ఎందుకంటే.. కష్ట సమయాలు ఎదురైనప్పడు, కాలం అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఓ గొప్ప వ్యక్తి, ఓ మహర్షి, ఓ దార్శనికుడు, ఈ నేలపై జన్మించి మన సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తారు. దయానంద సరస్వతి కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తే. శతాబ్దాల తరబడి బానిసత్వంలో దేశాన్ని మగ్గిపోయేలా చేసిన వలస పాలన సమయంలో ఆయన జన్మించారు. ఆలోచనల స్థానంలో మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు వచ్చి చేరాయి. మన సంప్రదాయాలు, నమ్మకాలను బ్రిటిష్ వారు చిన్నచూపు చూశారు. మనల్ని తక్కువ చేసి చూపించి దేశంలో వారి దురాక్రమణను సమర్థించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో సమాజం కొత్తగా, సొంతంగా ఆలోచించే ధైర్యాన్ని కోల్పోతుంది. అలాంటి కష్ట సమయంలోనే ఓ యోగి ఉద్భవించారు. నిర్జన హిమాలయాల్లో.. అత్యంత కఠిన పరిస్థితుల్లో తపస్సు, ధ్యానం చేసి తనను తాను పరీక్షించుకున్నారు. తాను తిరిగి వచ్చిన తర్వాత ఆత్మన్యూనతా భావంలో చిక్కుకున్న సమాజాన్ని మేల్కొలిపారు. భారత్ గుర్తింపును మరింత కించపరిచే పనిలో మొత్తం వలస పాలన వ్యవస్థ నిమగ్నమై ఉన్న, క్షీణిస్తున్న నైతిక, సామాజిక విలువలను ఆధునికతగా పాశ్చాత్యీకరిస్తున్న సమయంలో.. ఈ యోగి ‘‘వేదాలను తిరిగి అనుసరించండి! వేదాలను తిరగి అనుసరించండి!’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ మహనీయుడే స్వామి దయానంద. బానిసత్వంతో మగ్గిన ఆ చీకటి యుగంలో అణచివేతకు గురయిన.. జాతీయ చైతన్యాన్ని తిరిగి మేల్కొలిపారు.

 

స్నేహితులారా,

భారత్ అభివృద్ధి చెందాలంటే... రాజకీయ బానిస సంకెళ్లను మాత్రమే తెంచుకుంటే సరిపోదని స్వామి దయానంద సరస్వతి అర్థం చేసుకున్నారు. సమాజాన్ని విభజిస్తున్న సామాజిక బంధనాలను సైతం తెంచుకోవాలి. అందుకే వివక్ష, అంటరానితనం, పేద, ధనిక అనే భావనలను స్వామి దయానంద సరస్వతి వ్యతిరేకించారు. అంటరానితనాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. వేదాలను, గ్రంథాలను తప్పుగా ప్రచారం చేసే వారిని ప్రశ్నించారు. ‘శాస్త్రార్థ’ (మేధావుల చర్చ) అనే పురాతన భారతీయ సంప్రదాయం ద్వారా విదేశీ కట్టుకథలను ఎదుర్కొని.. వాస్తవాలను నిరూపించారు.

స్నేహితులారా,

ఆ కాలంలో స్వామి దయానంద సరస్వతి ఓ దార్శనికుడు. వ్యక్తి నిర్మాణంలోనూ, సామాజిక నిర్మాణంలోనూ ‘నారీశక్తి’ (మహిళా సాధికారత) అత్యంత కీలకపాత్ర పోసిస్తుందని ఆయనకు తెలుసు. అందుకే.. నాలుగ్గోడల మధ్య మహిళల్ని బంధించి ఉంచే ఆలోచనను ధైర్యంగా ప్రశ్నించారు. ఆర్యసమాజ పాఠశాలల్లో బాలికలను అక్షరాస్యులను చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో జలంధర్లో బాలికల కోసం ప్రారంభించిన పాఠశాల.. తర్వాత కన్యా మహా విద్యాలయ (మహిళా కళాశాల)గా మారింది. ఆర్య సమాజ్ నెలకొల్పిన ఇలాంటి పాఠశాలల నుంచి లక్షలాది మంది అమ్మాయిలు విద్యను అభ్యసించారు. ఇప్పుడు వారు ఈ దేశ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నారు.

స్నేహితులారా,

ఈ వేదిక మీద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నారు. రెండు రోజుల క్రితం.. స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలసి మన రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ రోజు మన అమ్మాయిలు.. యుద్ధ విమానాలు నడుపుతున్నారు. డ్రోన్ దీదీలుగా మారి ఆధునిక వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది మహిళా స్టెమ్ గ్రాడ్యుయేట్లు భారత్‌లోనే ఉన్నారని మనం గర్వంగా చెప్పగలం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు నాయకత్వ పాత్రను పోషిస్తున్నారు. మన అగ్రశ్రేణి సైన్స్ సంస్థల్లో మహిళా శాస్త్రవేత్తలు.. మంగళయాన్, చంద్రయాన్, గగన్‌యాన్ లాంటి మిషన్లలో కీలకపాత్ర పోషించారు. దేశం సరైన మార్గంలో నడుస్తుందని, స్వామి దయానంద ఆశయాలు నెరవేరుతున్నాయని ఈ మార్పు తెలియజేస్తుంది.

స్నేహితులారా,

స్వామి దయానంద ఆశయాల్లో ఒకదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. దానిని చాలా మందితో కూడా పంచుకున్నాను. ‘‘ఎవరు తక్కువ తీసుకుని.. ఎక్కువ తోడ్పాటును అందిస్తారో.. వారే నిజమైన పరిణతి చెందినవారు’’ అని స్వామీజీ అన్నారు. ఈ అలతి పదాల్లో దాగున్న గొప్ప ఆలోచనను పూర్తిగా వివరించడానికి అనేక పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. ఒక ఆలోచనకున్న అసలైన శక్తి దాని అర్థంలో ఉండదు. అది ఎంత కాలం కొనసాగింది.. ఎంత మంది జీవితాలను మార్చిందన్న దానిలోనే ఉంటుంది. దీని ఆధారంగా మహర్షి దయానంద ఆశయాలను పరీక్షించినప్పుడు, ఆర్య సమాజ్‌ను అనుసరించే వారిని చూసినప్పుడు.. ఆ ఆలోచనలు కాలంతో మరింత శక్తిమంతమవుతున్నాయని మనం గుర్తించగలుగుతాం.

సోదరీసోదరులారా,

పరోపకారిణి సభను స్వామి దయానంద సరస్వతి ప్రారంభించారు. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద వృక్షంగా మారి అనేక శాఖలతో విస్తరించింది. గురుకుల్ కాంగ్రి, గురుకుల్ కురుక్షేత్ర, డీఏవీ సంస్థలు, ఇతర విద్యాసంస్థలు అన్నీ తమ రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తున్నాయి. దేశం సమస్యలను ఎదుర్కొన్న ప్రతి సారి ఆర్యసమాజ్ సభ్యులు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించారు. దేశ విభజన సమయంలో సర్వం కోల్పోయిన శరణార్థులకు సహాయం, పునరావాసం, విద్యను అందించడంలో ఆర్య సమాజ్ కీలకపాత్ర పోషించింది. ఇప్పటికీ.. ప్రకృతి వైపరీత్యాలను సంభవించినప్పుడు సేవలందించడంలో ఆర్య సమాజ్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.

సోదరీసోదరులారా,

ఆర్య సమాజ్ చేసిన అన్ని పనులకు దేశం రుణపడి ఉంది. వాటిలో అతి ముఖ్యమైనది.. పురాతన సంప్రదాయమైన గురుకుల సంప్రదాయాన్ని పరిరక్షించడం. ఒకానొకప్పుడు గురుకుల విధానం ద్వారానే విజ్ఞానం, శాస్త్రంలో దేశం అగ్రభాగాన ఉండేది. వలస పాలన సమయంలో ఈ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగింది. ఫలితంగా.. మన విజ్ఞానం నాశనమైంది. మన విలువలు బలహీనమయ్యాయి. మన యువ తరాలు దిశను కోల్పోయాయి. అంతరించిపోతున్న గురుకుల సంప్రదాయాన్ని పునరుద్ధరించి, పరిరక్షించేందుకు ఆర్య సమాజ్ ముందుకు వచ్చింది. కాలానుగుణంగా గురుకులాలను నవీకరించి, పురాతన విలువలను పరిరక్షిస్తూనే ఆధునిక విద్యను అందిస్తోంది. ఇప్పుడు మరోసారి, మన దేశం జాతీయ విద్యా విధానం ద్వారా విలువలు, వ్యక్తిత్వ నిర్మాణంతో విద్యను ఏకీకరిస్తోంది. ఈ పవిత్ర భారతీయ విద్యా సంప్రదాయాన్ని పరిరక్షించిన ఆర్య సమాజ్‌కు కృతజ్ఞతలు.

 

స్నేహితులారా,

మన వేదవాక్కు: ‘‘కృణ్వంతో విశ్వమార్యం’’ అంటే.. ఈ ప్రపంచాన్ని గొప్పగా మారుద్దాం, ఉన్నతమైన ఆలోచనలు, పనుల ద్వారా ఈ మానవాళిని ఉద్ధరిద్దాం. ఈ వేద సారాంశాన్నే ఆర్య సమాజ్ లక్ష్యంగా స్వామి దయానంద స్వీకరించారు.

ఈ వేద సూత్రమే.. భారత అభివృద్ధికి మార్గదర్శక సూత్రమైన భారత ప్రగతి ద్వారా ప్రపంచ సంక్షేమం, భారత శ్రేయస్సు ద్వారా మానవాళికి సేవగా మారింది. ప్రస్తుతం సుస్థిరాభివృద్ధికి ప్రపంచ గొంతుకగా భారత్ మారింది. ‘‘వేదాలను తిరిగి స్వీకరించాలి’’ అని ఒకప్పుడు స్వామి పిలుపు ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు వేద జీవన విధానం వైపు రావాలని భారత్ ప్రపంచానికి పిలుపునిస్తోంది. మేం మిషన్ లైఫ్ (పర్యావరణహిత జీవన విధానం) ప్రారంభించాం. దీనికి ప్రపంచ మద్దతు లభిస్తోంది. ‘‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’’ లక్ష్యం ద్వారా స్వచ్ఛ విద్యుత్‌ను అంతర్జాతీయ ఉద్యమంగా మార్చుతున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా ఇప్పుడు 190 దేశాలకు చేరుకుంది. అంతర్జాతీయంగా యోగాను స్వీకరించడం, సమతుల్యమైన, నిర్మాణాత్మకమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన, లైఫ్ లాంటి పర్యావరణ కార్యక్రమాల పట్ల ప్రపంచం చూపిస్తున్న ఆసక్తి.. ఇవన్నీ ఆర్య సమాజ సభ్యులు తమ దైనందిన జీవితంలో చాలాకాలంగా అనుసరిస్తున్న విలువలే. ఆర్య సమాజ ప్రజలు సరళమైన జీవనశైలి, సేవా స్ఫూర్తి, భారతీయ ఆహార్యం, సంస్కృతి, పర్యావరణం పట్ల ప్రేమ, భారతీయ విలువలను పెంపొందించడం కొనసాగిస్తారు.

సోదరీసోదరులా,

అందుకే.. ‘‘సర్వే భవంతు సుఖిన:’’ (అందరూ సంతోషంగా ఉండాలి) అనే ప్రాచీన విధానాన్ని భారత్ ముందుకు తీసుకెళుతోంది. మానవాళి సంక్షేమానికి చేపడుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది. ‘విశ్వ బంధు’ (ప్రపంచానికి నిజమైన స్నేహితుడు)గా తన పాత్రను బలోపేతం చేసుకుంటోంది. ఆర్యసమాజ్‌లోని ప్రతి సభ్యుడు ఈ లక్ష్యాన్ని తమదిగానే భావిస్తారు. దీనికి మీ అందరినీ అభినందిస్తున్నాను.

 

స్నేహితులారా,

150 ఏళ్ల క్రితం స్వామి దయానంద సరస్వతి వెలిగించిన జ్ఞాన జ్యోతి ఇప్పటికీ ఆర్య సమాజ్ ద్వారా సమాజానికి వెలుగు పంచుతూనే ఉంది. మనందరిలోనూ స్వామీజీ ఓ బాధ్యతాయుమైన భావనను మేల్కొలిపారని నేను భావిస్తున్నాను. అదే కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం, మూస ధోరణులను విచ్ఛిన్నం చేయడం, అవసరమైన చోట సంస్కరణలను తీసుకురావడం. మీరెప్పుడూ నా మీద అభిమానాన్ని కురిపిస్తూనే ఉన్నారు. అందుకే నేను మీకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఇస్తారని నాకు తెలుసు! మీరందరూ దేశ నిర్మాణమనే మహా యజ్ఞంలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రస్తుత దేశ ప్రాధాన్యాల్లో కొన్నింటిని మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఉదాహరణకు. స్వదేశీ ఉద్యమంతో ఆర్య సమాజ్‌కు దీర్ఘ అనుబంధం ఉంది. ఈ రోజు.. మరోసారి స్వదేశీ ఉద్యమానికి దేశం పిలుపునిచ్చి, ‘ఓకల్ ఫర్ లోకల్’ గా మారుతోంది. దీనిలో మీ పాత్ర కీలకం కానుంది.

స్నేహితులారా,

కొన్ని రోజుల క్రితం జ్ఞాన భారతం కార్యక్రమాన్ని ప్రారంభించామని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. భారతీయ పురాతన రాతప్రతులను భద్రపరిచి, డిజిటలీకరణ చేయడమే దీని లక్ష్యం. మన భవిష్యత్తు తరాలు వాటితో అనుసంధానమై.. వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే అపారమైన విజ్ఞానాన్ని అందించే ఈ అమూల్యమైన సంపదకు నిజమైన రక్షణ లభిస్తుంది. కాబట్టి నేను ఆర్య సమాజానికి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గత 150 ఏళ్లుగా భారత పవిత్ర పురాతన రాతప్రతులను గుర్తించి భద్రపరిచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. తరాలుగా, మన పురాతన గ్రంథాలను వాటి అసలు రూపంలోనే పరిరక్షించడంలో ఆర్య సమాజ్ సభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని జ్ఞాన భారతం మిషన్ జాతీయ స్థాయికి తీసుకెళుతుంది. దీన్ని మీ కార్యక్రమంగానే భావించండి. మీ తోడ్పాటును అందించండి. మీ గురుకులాలు, విద్యాసంస్థల్లో యువతను ఈ తాళపత్రాలను అధ్యయనం చేసేలా ప్రోత్సహించండి.

స్నేహితులారా,

మహర్షి దయానంద్ 200వ జయంతి సందర్భంగా, ‘యజ్ఞాల్లో’ ఉపయోగించే ధాన్యాల గురించి నేను మాట్లాడాను. మనందరికీ యజ్ఞంలో శ్రీ అన్న ప్రాధాన్యం గురించి తెలుసు. ఇలాంటి పూజల్లో ఉపయోగించే ధాన్యాలను పవిత్రమైనవిగా భావిస్తారు. వీటితో పాటుగా.. భారతీయ సంప్రదాయంలోని మన చిరుధాన్యాలను, శ్రీ అన్న వారసత్వాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. సహజంగా పెరగడమే ఈ చిరుధాన్యాల ప్రత్యేకత. ఇప్పుడే ఆచార్య జీ వివరించినట్లుగా.. ఒకప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రకృతి వ్యవసాయం బలమైన ఆధారంగా ఉండేది. ఇప్పుడు మరోసారి దాని విలువను ఈ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికున్న ఆర్థిక, ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిందిగా ఆర్యసమాజ్‌ను నేను కోరుతున్నాను.

స్నేహితులారా,

జల సంరక్షణ మరో ముఖ్యమైన అంశం. ఈ రోజు, ప్రతి గ్రామానికీ జల్ జీవన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమాల్లో జల్ జీవన్ మిషన్ ఒకటి. అయినప్పటికీ.. భవిష్యత్తు తరాలకు తగినంత నీరు మిగిలి ఉంటేనే వాటి ప్రయోజనం నెరవేరుతుంది. దీన్ని సాధించడానికే బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా 60,000 అమృత్ సరోవర్ (పవిత్ర సరస్సు)లను నిర్మించాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలతో పాటు.. సమాజం కూడా ఈ విషయంలో ముందుకు రావాలి. సాధారణంగా.. ప్రతి గ్రామంలోనూ.. చెరువులు, సరస్సులు, బావులు, నీటి కుంటలు ఉండేవి. కానీ మారుతున్న పరిస్థితుల్లో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎండిపోయాయి. వాటిని పునరుద్ధరించాల్సిన, సహజ నీటి వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని నిరంతరం ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి. తక్షణావసరమైన ఇంకుడు గుంతలు నిర్మించి, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ ప్రచార కార్యక్రమమే ‘‘క్యాచ్ ద రెయిన్’’.

స్నేహితులారా,

చాలాకాలం నుంచి చేపడుతున్న ‘‘ఏక్ పేడ్, మా కే నామ్’’ (అమ్మ పేరుతో ఓ చెట్టు) ప్రచారం కూడా విజయవంతమైంది. ఈ క్యాంపెయిన్ కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే చేపట్టే కార్యక్రమం కాదు. ఈ మొక్కలు నాటడం నిరంతరం సాగే ప్రక్రియ. ఈ గొప్ప కార్యక్రమంలో మరింత మందిని ఆర్య సమాజ్ భాగస్వామ్యం చేయాలి.

స్నేహితులారా,

‘‘సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతాం’’ అని మన వేదాలు మనకు బోధిస్తాయి. అంటే.. ‘‘మనం కలసి నడుద్దాం. కలసి మాట్లాడదాం. ఒకరి మనసుని మరొకరు అర్థం చేసుకుందాం’’ అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే.. మన ఆలోచనలను పరస్పర గౌరవించుకుంటూ సామరస్యంతో ఉండాలి. దేశ సంకల్పాన్ని మన వ్యక్తిగత సంకల్పంగా మార్చుకోవడానికి, ప్రజా భాగస్వామ్యం ద్వారా సమష్టి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి దేశం అందించిన సందేశంగా ఈ వేదసారాన్ని మనం పరిగణించాలి. గడచిన 150 ఏళ్లలో.. ప్రతి పనిలోనూ ఈ స్ఫూర్తిని ఆర్యసమాజం నింపుకొంది. ఈ స్ఫూర్తిని మనం బలోపేతం చేయాలి. మానవ సంక్షేమ మార్గంలో మహర్షి దయానంద సరస్వతి బోధనలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. ఈ నమ్మకంతో.. మరోసారి ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Make in India, production-linked incentives push industrial warehousing to record high

Media Coverage

Make in India, production-linked incentives push industrial warehousing to record high
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of determination and hard work
March 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the people of India, through their firm resolve, make even the most difficult tasks possible. He noted that with tireless effort in the right direction, they achieve even the biggest goals.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्। तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥”

The Subhashitam conveys that no matter how far, difficult, or out of reach a goal may seem, it can be achieved through firm determination and continuous hard work. Determination and patience are the forces that turn the impossible into possible.

The Prime Minister wrote on X;

“भारत के लोग अपने दृढ़ निश्चय से किसी भी कार्य को संभव बना देते हैं। सही दिशा में अपनी अथक मेहनत से वे बड़े से बड़े लक्ष्य को भी हासिल कर दिखाते हैं।

यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्।

तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥”