ఇటీవలే… అంటే- కొన్ని రోజుల కిందట ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మనకు దూరమయ్యారు. వ్యవసాయ శాస్త్రాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే ప్రొఫెసర్‌ స్వామినాథన్‌- మన దేశం సదా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా మన రైతులోకం సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఒక తెలివైన విద్యార్థిగా తన ఉజ్వల భవిష్యత్తుకు బాటవేసుకునే వీలున్నా 1943 నాటి బెంగాల్‌ కరువు ఆయనను చలింపజేసింది. ఆ రోజుల్లో ఎంతగా ప్రభావితులయ్యారంటే- ఆరునూరైనా వ్యవసాయ రంగమే తన భవిష్యత్తుగా

  అటుపైన వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగ్‌తో పరిచయం ఏర్పడింది. నాటినుంచీ పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950లోనే అమెరికాలో అధ్యాపకుడుగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, మాతృభూమి సంక్షేమం కోసం తన జన్మభూమి సేవలో తరించడమే తన ధ్యేయమంటూ దాన్ని తిరస్కరించారు.

 పెనుసవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో మేరునగంలా నిలిచిన స్వామినాథన్‌.. మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన పెను సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. ఆ మేరకు 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువుకాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది. అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ ప్రొఫెసర్‌ స్వామినాథన్ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. తదనుగుణంగా వ్యవసాయం రంగంలో.. ముఖ్యంగా గోధుమ సాగువంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. తద్వారా తొలుత గోధుమ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వృద్ధి సాధించగలిగింది. ఫలితంగా ఆహార కొరతతో అల్లాడిన భారత్‌ అప్పటినుంచీ స్వయం సమృద్ధ దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు “భారత హరిత విప్లవ పితామహుడు” అనే బిరుదును ఆర్జించిపెట్టింది.
‘ఏదైనా సాధించగలం’ అనే భారత ఆత్మస్థైర్యానికి హరిత విప్లవం ఒక సమగ్ర ఉదాహరణగా నిలిచింది. ఆ మేరకు మనకు లక్ష సవాళ్లున్నా, ఆవిష్కరణలు ఆలంబనగా వాటిని అధిగమించగల పది లక్షల మేధావుల అండ ఉన్నదని రుజువైంది. హరిత విప్లవం శ్రీకారం చుట్టుకున్న ఐదు దశాబ్దాల తర్వాత నేడు భారత వ్యవసాయ రంగం అత్యధునాతనం, ప్రగతిశీలమైనదిగా మారిందంటే కారణం ప్రొఫెసర్‌ స్వామినాథన్ వేసిన పునాదులేననే వాస్తవాన్ని ఎన్నటికీ మరువలేం. దేశ ఆహార కొరతను అధిగమించడంలో విజయం తర్వాత ఏళ్ల తరబడి బంగాళాదుంప పంటను దెబ్బతీస్తున్న పరాన్నజీవుల ప్రభావాన్ని అరికట్టే దిశగా ఆయన పరిశోధన చేపట్టి సఫలమయ్యారు. అంతేకాకుండా ఈ పంట చలి వాతావరణాన్ని తట్టుకోగలిగే మార్గం కూడా లభించింది. ఇక ప్రపంచం నేడు చిరుధాన్యాలు లేదా ‘శ్రీఅన్న’ను అద్భుత ఆహార ధాన్యాలుగా

పరిగణిస్తోంది. అయితే, ప్రొఫెసర్ స్వామినాథన్ 1990లలోనే చిరుధాన్యాలపై చర్చను ముమ్మరం చేయడమేగాక సాగును ఇతోధికంగా ప్రోత్సహించారు.
ప్రొఫెసర్‌ స్వామినాథన్‌తో నా వ్యక్తిగత సంబంధాలు చాలా విస్తృతంగా ఉండేది. నేను 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో గుజరాత్ వ్యవసాయపరంగా పెద్దగా నైపుణ్యంగల రాష్ట్రం కాదు. దీనికితోడు వరుస కరువులు, పెను తుపానులు, భూకంపం వంటి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మేం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో భూసార కార్డుల పథకం ఒకటి. ఇది భూసారాన్ని చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సమస్యలు తలెత్తినపుడు వాటిని సులువుగా పరిష్కరించడం సాధ్యమైంది. ఈ పథకం అమలు సమయంలోనే నేను ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ని కలిశాను. ఆయన ఈ పథకాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. దాన్ని మరింత మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. చివరకు ఏదైనా పథకంపై సందేహాలు వెలిబుచ్చేవారు స్వామినాథన్‌ మాటతో ఒక్కసారిగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు.


నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమేగాక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా మా మధ్య నిరంతర సంబంధాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2016నాటి అంతర్జాతీయ వ్యవసాయ-జీవవైవిధ్య మహాసభలలో ఆయనను కలిశాను. మరుసటేడాది- 2017లో ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను. ప్రపంచాన్ని పరస్పరం అనుసంధానించే సూదితో ‘తిరుక్కురళ్‌’లోని ఒక ద్విపద రైతుల గురించి అభివర్ణిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే! ఈ సూక్తిని ప్రొఫెసర్‌ స్వామినాథన్ చక్కగా జీర్ణించుకున్నారు. కాబట్టే, ప్రజలు ఆయనను “వ్యవసాయ శాస్త్రవేత్త”గా పిలుస్తారు. కానీ, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు అంతకుమించినవని నా విశ్వాసం. ఆయన నిజమైన “రైతు.. శాస్త్రవేత్త కూడా! ఆయన ‘రైతుల శాస్త్రవేత్త’ ఆయన మెదడులో శాస్త్రవేత్త ఉంటే.. హృదయంలో రైతు ఉన్నాడన్నది నా అభిప్రాయం.
ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ పరిశోధనలు కేవలం ఆయన విద్యా నైపుణ్యానికి పరిమితం కాదు; వాటి ప్రభావం ప్రయోగశాలల వెలుపలకు... వ్యవసాయ క్షేత్రాలు-పొలాలకు విస్తరించింది. ఆయన పనితీరు శాస్త్రీయ జ్ఞానం-ఆచరణాత్మక అనువర్తనాల మధ్య అంతరాన్ని తగ్గించింది. వ్యవసాయం రంగంలో సుస్థిరత కోసం ఆయన సదా పాటుపడ్డారు. మానవ పురోగమనం, పర్యావరణ సుస్థిరత నడుమ సున్నిత సమతౌల్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. సన్న-చిన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడం, ఆవిష్కరణల ఫలాలు వారికీ అందించడంలో ప్రొఫెసర్‌ స్వామినాథన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను తప్పక ప్రస్తావించాలి. ముఖ్యంగా మహిళా రైతుల జీవితాలకు సాధికారతపై ఆయనెంతో శ్రద్ధాసక్తులు చూపారు.

ప్రొఫెసర్ స్వామినాథన్‌లోని మరో విశిష్ట కోణం గురించి చెప్పాలి... ఆవిష్కరణల విషయంలోనే కాకుండా మార్గదర్శకత్వం వహించడంలోనూ ఆయనొక ఆదర్శమూర్తి. ఈ మేరకు 1987లో ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ ఆహార పురస్కార’ తొలి విజేతగా బహుమతి అందుకున్న ఆయన, దానికింద లభించిన సొమ్ముతో లాభాపేక్ష రహిత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఇప్పటిదాకా వివిధ రంగాలలో విస్తృత, విశిష్ట పరిశోధనలు నిర్వహించింది. అలాగే ఆయన ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దారు. అభ్యాసం, ఆవిష్కరణలపై ఎందరిలోనో శ్రద్ధాసక్తులు రగిలించారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ విజ్ఞానం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకుగల శక్తిసామర్థ్యాలను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది. ఆయన ఓ స్వయంగా ఓ సంస్థ స్థాపకులేగాక శక్తిమంతమైన పరిశోధనలు సాగిస్తున్న మరెన్నో సంస్థల స్థాపనకు ఊపిరిపోసినవారు. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌గానూ ఆయన పనిచేయడం ఇందుకు నిదర్శనం. కాగా, ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 2018లో వారణాసి నగరంలో ప్రారంభించబడింది.

డాక్టర్‌ స్వామినాథన్‌కు నివాళి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేనే మరో ద్విపదను ప్రస్తావించదలిచాను. “ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే.. తానేది.. ఏ రీతిలో ఆకాంక్షించాడో ఆ రీతిలో.. దాన్ని సాధించగలడు” అని ఈ ద్విపద చెబుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, రైతులకు సేవలందించాలని చిరుప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడాయన. ఆ విధంగానే వినూత్నంగా.. ఆవిష్కరణాత్మకంగా, భావేద్వేగకంతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం సాధించారు. వ్యవసాయ ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మన పయనంలో డాక్టర్ స్వామినాథన్ కృషి, పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేస్తాయి. మనం కూడా ఆయనెంతో ప్రీతిగా అనుసరించిన సూత్రాల అమలుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. ఆ మేరకు రైతుల సంక్షేమం ప్రాతిపదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మన వ్యవసాయ రంగంలో మూలాలకు చేరేలా చూడాలి. తద్వారా భవిష్యత్తరాలను వృద్ధి, సుస్థిరత, సౌభాగ్యంవైపు ప్రోత్సహించాలి.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch

Media Coverage

‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం
July 06, 2026

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు.


సురక్షిత, సుఖవంతమైన జీవితానికి లోటు లేని బాల్యం ఆయనది. శ్యామా ప్రసాద్‌ తండ్రి, సర్ అశుతోష్ ముఖర్జీ సమకాలీన అగ్రశ్రేణి విద్యావేత్తలలో.. మేధావులలో ఒకరు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. అంతటి తీవ్ర వ్యక్తిగత విషాదాలను చవిచూసినప్పటికీ దేశ సేవపై ఆయన సంకల్పం మరింత బలపడి, తిరుగులేని నిబద్ధతతో ముందుకే నడిపింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే- అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి.. అంతిమ శ్వాసలోనూ ఒక వ్యక్తి త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి క్షణాల్లో డాక్టర్ ముఖర్జీ జీవన ప్రస్థానం ఒకటిగా మిగిలింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు- తాను విశ్వసించిన ఆదర్శం కోసం డాక్టర్ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.


డాక్టర్ ముఖర్జీ సదా దేశానికే ప్రథమ స్థానమిచ్చారు... భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణంగా ఆనాటి సంప్రదాయ ఆలోచనలకు సవాలు విసురుతూ సంస్థల, వ్యవస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా- “భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి” అని కుండబద్దలు కొట్టారు.


డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం అనేక విధాలుగా ముందంజ వేసింది. ఆయన హయాంలో గ్రంథాలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనం, వ్యవసాయంలో కొత్త కోర్సులకు శ్రీకారం వంటి విశిష్ట కృషి కొనసాగింది. క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం తదితరాలపైనా ఆయన ఏకకాలంలో దృష్టి సారించారు. ప్రస్తుత-పూర్వ విద్యార్థులలో తమ విశ్వవిద్యాలయంపై సగర్వ భావనను ప్రోది చేస్తూ, ఏటా జనవరి 24న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విశ్వవిద్యాలయంపై ఒక పాట రాయాల్సిందిగా గురుదేవులు రవీంద్ర నాథ్‌ టాగోర్‌ను ఆయన అభ్యర్థించారు.


ఈ స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన జీవిత చరమాంకంలో కనిపిస్తుంది. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయాన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ఎంచుకోవడం గమనార్హం. ప్రమిద ఎంత చిన్నదైనా, దాని వెలుగు స్వల్పమే అయినా తన పరిధికి మించి చీకటిని పారదోలగల శక్తి దానికి ఉంటుందని భావించారు. తదనంతర క్రియాశీల మనుగడలోనూ జనసంఘ్ ఇదేవిధంగా ముందడుగు వేసింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు-పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, అసాధారణ నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో పారిశ్రామిక రంగాన్ని దేశానికి గౌరవం, అవకాశాలు, విశ్వాసాలను పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిగణించారు. తదనుగుణంగా సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులందరూ ఆయనలో అసమాన నిబద్ధతగల మద్దతుదారును కనుగొన్నారు.


ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాబోదు.


సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం భారత నాగరిక సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి డాక్టర్ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు.


పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డాక్టర్ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. అటుపైన 50 ఏళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్య విలువల మూలాలపై మరోసారి దెబ్బకొడుతూ 42వ సవరణ చట్టం తెచ్చారు.


మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ డాక్టర్ ముఖర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరువు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.


ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ- “మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా... క్షుణ్ణంగా... అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్థాంతరంగా వదిలేయకండి... అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి.. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి” అని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో నేటి యువత దృక్పథం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నేటి సందర్భానికి తగినట్లు వారంతా డాక్టర్‌ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.