ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ లో ఈ నెల 14వ తేదీన పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్ర సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించి దీన్ దయాళ్ రైతు సంక్షేమ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందచేస్తారు.
ఉత్తరాఖండ్ లో సహకార, వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉత్తేజితం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు తగినంత మద్దతు ఇవ్వడం ద్వారా ఉత్తరాఖండ్ లో ఆ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఉపాధి కోసం బలవంతంగా వలస పోవడాన్ని నిలువరించవచ్చు. ఈ కార్యక్రమం అమలుకు తొలి వాయిదాగా జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్రప్రభుత్వానికి మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి అందచేస్తారు.
అలాగు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైతు సంక్షేమ పథకం కింద లబ్ధిదారులందరికీ రుణ పంపిణీ చెక్కులను ప్రధానమంత్రి అందచేస్తారు.ఈ పథకం కింద ఉత్తరాఖండ్ ప్రభుత్వం రైతులకు కేవలం రెండు శాతం నామమాత్రపు వడ్డీపై లక్ష రూపాయల విలువ గల బహుళ ప్రయోజనరుణం అందిస్తుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ప్రయత్నంలో ఇది కీలక చర్య.
ప్రధానమంత్రి దీపావళి పండుగను ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో భారత సైనికదళం, ఐటిబిపి జవానులతో చేసుకునేందుకు 2018 నవంబర్ 7వ తేదీన ఉత్తరాఖండ్ లో పర్యటించారు. అంతకు ముందు 2018 అక్టోబర్ 7వ తేదీన డెహ్రాడూన్ లో జరిగిన గమ్యం ఉత్తరాఖండ్ : ఇన్వెస్టర్ల సదస్సు 2018లో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర సందర్శనకు వచ్చారు.