‘‘దేశానికి గడచినపది సంవత్సరాలకు పైగా సేవ చేసిన మా ప్రభుత్వ ప్రయాసల ను భారతదేశ ప్రజలు హృదయపూర్వకం గా సమర్థించడం తో పాటు ఆశీర్వదించారు కూడాను’’
‘రాజకీయ వారసత్వంఏదీ లేని నా వంటి వ్యక్తులకు రాజకీయాల లో అడుగుపెట్టి, ఇంతటి స్థాయికి చేరుకోవడానికి అనుమతిని ఇచ్చింది బాబా సాహెబ్ శ్రీ అంబేడ్కర్రూపొందించిన రాజ్యాంగమే’’
‘‘మన రాజ్యాంగం ఒకదీపస్తంభం లాగా మనకు దారిని చూపుతున్నది’’
‘‘భారతదేశం యొక్కఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మేం తీర్చిదిద్దుతామన్నవిశ్వాసంతో, బలమైన నమ్మకంతో ప్రజలు మాకు అనుకూలంగా మూడోసారి తీర్పును ఇచ్చారు’’
‘‘రాబోయే అయిదు సంవత్సరాలు దేశానికి ఎంతో కీలకమైనవి’’
‘‘ఈ కాలాన్ని సుపరిపాలనయొక్క అండదండలతో అందరికీ మౌలిక సదుపాయాలు అందేటటువంటి కాలంగా మార్చాలని మేమనుకొంటున్నాం’’
‘‘ఇక్కడితోనేఆగిపోవాలని మేం అనుకోవడం లేదు. రాబోయే అయిదు సంవత్సరాలలో కొత్త రంగాల లో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించాలని మేం ప్రయత్నిస్తున్నాం’’
‘‘సూక్ష్మ ప్రణాళికరచన ను చేపట్టడం ద్వారా విత్తనం నుండి బజారు వరకు ప్రతి ఒక్క దశలో రైతులకు ఒకపటిష్టమైన వ్యవస్థను అందించడానికి మేం ఎనలేని ప్రయాత్నాలు చేశాం’’
‘‘మహిళల నాయకత్వంలోఅభివృద్ధి సాధనకై ఒక్క నినాదం రూపంలోనే కాకుండా, అచంచలమైన విశ్వాసంతో కూడా భారతదేశం కృషి చేస్తోంది’’
‘‘అత్యవసర స్థితి నాటి కాలం ఓ రాజకీయ అంశం మాత్రమే కాదు దానికిభారతదేశ ప్రజాస్వామ్యం తోను, రాజ్యాంగం తోను, మానవ జాతి తో కూడాను సంబంధం ఉంది’’
‘‘జమ్ము- కశ్మీర్ ప్రజలుభారతదేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని , ఎన్నికల సంఘాన్ని ఆమోదించారు’’

పార్లమెంటు లో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాల ను తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న సమాధానమిచ్చారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రేరణ పూర్వకమైన మరియు ప్రోత్సాహకరమైన ప్రసంగాన్ని ఇచ్చినందుకు గాను రాష్ట్రపతికి ధన్యవాదాలను తెలియజేశారు. రాష్ట్రపతి ప్రసంగం గురించి దాదాపుగా 70 మంది సభ్యులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఆ సభ్యులకు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

 

దేశం యొక్క ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, 60 సంవత్సరాల కాలం గడిచాక భారతదేశం యొక్క వోటరులు వరుసగా మూడో సారి ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం లోని తీసుకు వచ్చారని చెప్తూ, దీనిని ఒక చరిత్రాత్మకమైన ఘట్టం గా అభివర్ణించారు. వోటరులు చేసిన నిర్ణయం యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించాలని ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఖండిస్తూ, గడచిన కొద్ది రోజుల లో అదే సముదాయం దాని ఓటమిని మరియు తమ విజయాన్ని బరువెక్కిన గుండెతో అంగీకరించిందని తాను గమనించినట్లు చెప్పారు.

 

ప్రస్తుత ప్రభుత్వం దాని పాలనలో మూడింట ఒకటో వంతును, అంటే పది సంవత్సరాల కాలాన్ని మాత్రమే పూర్తి చేసింది, మరి మూడింట రెండు వంతుల కాలం లేదా 20 సంవత్సరాల కాలం మిగిలే ఉందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘గత పది సంవత్సరాలుగా దేశానికి సేవలను అందించాలన్న మా ప్రభుత్వం యొక్క ప్రయాసలను భారతదేశం ప్రజలు హృదయ పూర్వకంగా సమర్థించారు. అంతేకాకుండా, వారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పౌరులు ప్రచారాన్ని ఓటమి పాలు చేసి, పనితీరుకు పెద్దపీటను వేసి, భ్రాంతిని కలిగించాలన్న రాజకీయాలను తిరస్కరించి, మరి విశ్వాస ప్రధానమైన రాజకీయాలకు గెలుపు ముద్ర ను వేశారు. ఈ తీర్పును చూస్తే గర్వంగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశం రాజ్యాంగ 75 వ సంవత్సరం లోకి అడుగుపెడుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఇది ఒక విశేషమైనటువంటి దశ, ఎందుకంటే భారతదేశ పార్లమెంటు కూడా 75 సంవత్సరాలను పూర్తి చేసుకొంటున్నది; ఇది చూడబోతే ఒక సంతోషదాయకమైన కాకతాళీయ ఘటనగా ఉందని పేర్కొన్నారు. బాబా సాహెబ్ శ్రీ అంబేడ్కర్ అందించినటువంటి భారతదేశ రాజ్యాంగం పట్ల శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారతదేశం లో రాజకీయ వర్ణచిత్రం తో సంబంధం ఉన్నటువంటి ఒక్క కుటుంబ సభ్యుడైనా లేని వర్గాలు దేశానికి సేవను చేసే అవకాశాన్ని పొందుతున్నాయి అంటే అందుకు కారణం రాజ్యాంగంలో చెప్పుకొన్న హక్కులే అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రాజకీయ వారసత్వం ఏదీ లేని నా వంటి వ్యక్తులు రాజకీయాల లో ప్రవేశించడం, మరి ఇంత ప్రధానమైన స్థితి కి చేరుకోవడం జరిగింది అంటే, అది బాబా సాహెబ్ శ్రీ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ఇచ్చిన అవకాశమే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజలు ఈసారి వారి ఆమోద ముద్ర ను వేశారు కాబట్టి, ప్రభుత్వం ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది అని కూడా ఆయన అన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగం వ్యాసాల కూర్పు మాత్రమే అని చెప్పలేం, అది అందిస్తున్న ప్రేరణ, అత్యంత అమూల్యమైనటువంటివి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

నవంబరు నెల 26 వ తేదీ ని ‘‘రాజ్యాంగ దినం’’ గా స్మరించుకోవాలని తన ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తందని శ్రీ నరేంద్ర మోదీ గుర్తుకు తీసుకువచ్చారు. రాజ్యాంగ దినాన్ని పాటించాలని తాము తీసుకొన్న నిర్ణయం రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మరింతగా వ్యాప్తి చేయడానికి దోహద పడిందని, రాజ్యాంగం లో చేర్చిన మరియు రాజ్యాంగం లో నుండి తొలగించిన కొన్ని అంశాలను ఎందుకు చేర్చడమైంది, ఎందుకు తొలగించమైంది మరి ఎలాగ చేర్చడమైంది, ఎలాగ తొలగించడమైంది అనే అంశాలను పాఠశాలల్లో, కళాశాలల్లో యువజనులు చర్చించడమైంది అని ఆయన అన్నారు. రాజ్యాంగం తాలూకు వేరు వేరు కోణాల ను గురించి ఎలాంటి ముందస్తు సన్నాహాలు లేని విధం గా మన విద్యార్థుల లో వ్యాస రచన పోటీలను, వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని మరియు చక్కటి అవగాహన ను ఏర్పరచగలుగుతాయన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగం మనకు అతి ప్రధానమైన స్ఫూర్తిగా నిలచింది’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగం ఉనికి లోకి వచ్చి ప్రస్తుతం 75వ సంవత్సరం లోకి ప్రవేశిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, తన ప్రభుత్వం దీనిని ఒక ‘‘ప్రజా ఉత్సవం’’ గా నిర్వహించి, దేశవ్యాప్త సంబురాలు జరపడానికి ప్రణాళిక ను సిద్ధం చేసింది అని ఆయన తెలిపారు. రాజ్యాంగం ఉద్దేశ్యాల ను మరియు రాజ్యాంగం స్ఫూర్తిని గురించి దేశం లో ప్రతి ఒక్క ప్రాంతం లో జాగరూకత ఏర్పడేటట్లు కూడా తాము పాటుపడతామని కూడా ఆయన వివరించారు.

 

వోటరులను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ‘వికసిత్ భారత్’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ ల ద్వారా అభివృద్ధి మరియు స్వయం సమృద్ధి అనే లక్ష్యాలను సాధించడం కోసం తన ప్రభుత్వాన్ని మూడోసారి అధికారం లోకి భారతదేశ ప్రజలు తీసుకు వచ్చారు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల లో దక్కిన గెలుపు గత పది సంవత్సరాల లో తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల కు పౌరులు వేసిన ఒక ఆమోద ముద్ర మాత్రమే కాదు, అది వారి భావి స్వప్నాలను మరియు ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇచ్చిన తీర్పు కూడా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘దేశ ప్రజలు వారి భవిష్యత్తు నిర్ణయాలను ఫలవంతం చేసే బాధ్యత ను మాకు అప్పగించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రపంచం లో కల్లోలాలు మరియు మహమ్మారి వంటి సవాళ్ళు తలెత్తినప్పటికీ కూడా గడచిన పది సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుండి అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా వృద్ధి లోకి రావడాన్ని దేశ ప్రజలు గమనించారు అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ‘‘ఆర్థిక వ్యవస్థను ఇప్పుడున్న అయిదో స్థానం నుండి మూడో స్థానానికి తీసుకు పోవడానికి తాజా తీర్పును ప్రజలు ఇచ్చారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రజా తీర్పును ఫలప్రదం చేయగలమన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

 

గత పది సంవత్సరాలలో నమోదైన అభివృద్ధి తాలూకు వేగాన్ని, పరిధిని పెంచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వచ్చే అయిదు సంవత్సరాలలో ప్రజలందరి ప్రాథమిక అవసరాలను తీర్చే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తుంది అని ప్రధాన మంత్రి సభ కు హామీని ఇచ్చారు. ‘‘ఈ కాలాన్ని సుపరిపాలన దన్నుతో ప్రాథమిక అవసరాలన్నింటిని తీర్చే కాలం గా మార్చాలి అని మేం అనుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం రాబోయే అయిదు సంవత్సరాల కాలం కీలకమైంది అని ఆయన ప్రముఖంగా ప్రకటించారు. గత పదేళ్ళలో ఎదురైన అనుభవాల ను ఆధారం గా చేసుకొని, పేదరికానికి వ్యతిరేకంగా ఒక వైఖరిని అవలంబించి పేదరికాన్ని జయించడం పట్ల పేద ప్రజలకు ఉన్న సామూహిక సామర్థ్యాలను తాను నమ్ముతున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు.

 

భారతదేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారిందా అంటే గనక ప్రజల బ్రతుకుల్లో ప్రతి ఒక్క దశ పైన ఆ స్థితి ప్రసరించేటటువంటి ప్రభావాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ఇది ప్రపంచ ముఖచిత్రం పైన సైతం మున్నెన్నడూ ఎరుగనంత ప్రభావాన్ని కలుగజేస్తుంది అన్నారు. రాబోయే అయిదు సంవత్సరాలలో భారతదేశానికి చెందిన స్టార్ట్-అప్స్ మరియు వ్యాపార సంస్థలు ప్రపంచమంతటా విస్తరిస్తాయి, మరి రెండో అంచె నగరాలు, ఇంకా మూడో అంచె నగరాలు వృద్ధికి చోదక శక్తుల వలె మారుతాయి అని ఆయన వివరించారు.

 

ఇప్పటి దశాబ్దాన్ని సాంకేతిక విజ్ఞాన ఆధారిత శతాబ్దంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ, సార్వజనిక రవాణా వంటి అనేక నూతన రంగాలలో నవీన సాంకేతిక విజ్ఞాన ప్రధానమైన అడుగు జాడలు ఏర్పడుతాయి అన్నారు. ఔషధాలు, విద్య లేదా నూతన ఆవిష్కరణ వంటి రంగాలలో ఒక ప్రధానమైన పాత్రను చిన్న నగరాలు పోషిస్తాయన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

 

రైతులు, పేదలు, మహిళాశక్తి, ఇంకా యువశక్తి.. ఈ నాలుగు స్తంభాల ను బలపరచడం కోసం ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణం లో ఈ రంగాల పై ప్రభుత్వం తీసుకొనే శ్రద్ధ కీలకమవుతుంది అన్నారు.

 

వ్యవసాయాన్ని గురించి మరియు రైతుల ను గురించి సభ్యులు చేసిన సూచనలకు, సభ్యులు ఇచ్చిన సలహాలకు ప్రధాన మంత్రి ధన్యవాదాలను వ్యక్తం చేస్తూ, గత పది సంవత్సరాల లో వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చడం కోసం ప్రభుత్వం నడుం కట్టిన ప్రయాసల ను గురించి వివరించారు. ఈ సందర్భం లో ఆయన పరపతి సౌకర్యం, విత్తనాలు, చౌక ధరలకు దొరికే ఎరువులు, పంట బీమా, కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్‌పి) ను చెల్లించి వ్యావసాయక ఉత్పత్తులను కొనుగోలు చేయడం.. వీటికి పూచీపడడాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘ప్రతి ఒక్క దశ లోను సూక్ష్మ ప్రణాళిక రచన మరియు అమలు పద్ధతుల ద్వారా విత్తనం మొదలుకొని బజారు వరకు అనేక దశలలో రైతుల కోసం ఒక పటిష్టమైన వ్యవస్థ ను అందించడానికి మేం అత్యంత కృషిని చేశాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

చిన్న రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి గత ఆరు సంవత్సరాలలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలను అందించగా 10 కోట్ల మంది రైతులకు మేలు జరిగింది అని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. మునుపటి ప్రభుత్వాల కాలాల్లో రుణ మాఫీ పథకాల అమలులో కచ్చితత్వం, విశ్వసనీయత లు లోపించిన సంగతిని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, వర్తమాన హయాంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల ను గురించి ప్రముఖం గా పేర్కొన్నారు.

 

ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు సభలో నుండి బయటకు వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రధాన మంత్రి తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, సభాధ్యక్షుడితో తన సహానుభూతిని వ్యక్తం చేశారు. ‘‘నేను ప్రజలకు సేవకుడిగా నా కర్తవ్యాన్ని పాలించవలసి ఉంది. ప్రజలకు ప్రతి నిమిషం నేను జవాబుదారుగా ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. సభ సంప్రదాయాలకు భంగకరంగా నడుచుకొన్నందుకు ప్రతిపక్ష సభ్యులను ఆయన విమర్శించారు.

 

పేద రైతులకు ఎరువుల నిమిత్తం 12 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని తన ప్రభుత్వం ఇచ్చింది అని ప్రధాన మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇది అత్యధిక మొత్తం. రైతులకు సాధికారిత కల్పన కోసం తన ప్రభుత్వం కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్‌పి) లో రికార్డు స్థాయి పెంపుదలను ప్రకటించడం ఒక్కటే కాకుండా, వారి వద్ద నుండి కొనుగోళ్ళు జరపడంలో కూడా నూతన రికార్డులను సృష్టించింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మునుపటి ప్రభుత్వంతో ఒక పోలికను ఆయన తీసుకువస్తూ, గత పది సంవత్సరాల లో వరి, ఇంకా గోధుమ రైతులకు రెండున్నర రెట్లు అధికంగా ధనాన్ని తన ప్రభుత్వం అందించిందన్నారు. ‘‘ఇంతటితోనే ఆగిపోవాలని మేం అనుకోవడం లేదు. రాబోయే అయిదు సంవత్సరాలకు గాను కొత్త రంగాలలో తలెత్తే సమస్యల ను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఆహార పదార్థాల నిలవ విషయం లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రచార కార్యక్రమాన్ని మేం ప్రస్తుతం చేపట్టాం’’ అని ఆయన అన్నారు. కేంద్రీయ వ్యవస్థ లో భాగంగా లక్షల సంఖ్యలో ధాన్య గిడ్డంగులను ఏర్పాటు చేసే దిశ లో పనులు మొదలయ్యాయి అని ఆయన తెలిపారు.

 

తోట పంటల పెంపకం అనేది వ్యవసాయం లో ఒక ముఖ్యమైన రంగం గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు; తోట పంటల దిగుబడిని సురక్షితంగా నిలవ చేయడం, రవాణా చేయడం మరియు విక్రయించడం కోసం సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పెంచడం కోసం తన ప్రభుత్వం అలుపెరుగక శ్రమిస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ మూల మంత్రాన్ని అనుసరిస్తూ, భారతదేశం అభివృద్ధి ప్రయాణం తాలూకు పరిధిని ప్రభుత్వం నిరంతరంగా విస్తరిస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పౌరులకు గౌరవంతో కూడిన జీవనాన్ని అందించాలనేదే ప్రభుత్వానికి ఉన్న అగ్రప్రాధాన్యం అని ఆయన నొక్కిపలికారు. స్వాతంత్య్రం అనంతర కాలం లో దశాబ్దాల తరబడి చిన్నచూపునకు లోనైన వారిని గురించి శ్రద్ధ తీసుకోవడం ఒక్కటే కాకుండా, వారిని ప్రస్తుతం ఆరాధించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘దివ్యాంగ’ సోదరీమణులు మరియు సోదరుల యొక్క సమస్యలను ఉద్యమ తరహాలో పరిష్కరించడం తో పాటు వారు ఇతరులపై ఆధారపడడాన్ని కనీస స్థాయికి తగ్గించి, తద్ద్వారా వారు వారి యొక్క జీవనాన్ని గౌరవం తో గడిపేటట్లు చూడాలని కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. శ్రీ నరేంద్ర మోదీ తన ప్రభుత్వ సమ్మిళిత స్వభావాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సమాజం లో మరచిపపోయిన వర్గం లా మిగిలిన ట్రాన్స్ జెండర్స్ కోసం ఒక చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పాటుపడిందన్నారు. ఇవాళ పశ్చిమ దేశాలు సైతం భారతదేశం అవలంబిస్తున్న అభ్యుదయశీల విధానాన్ని చూసి గర్వపడుతున్నాయి అని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ‘పద్మ పురస్కారాల’ను కూడా ట్రాన్స్ జెండర్ లకు ప్రస్తుతం తన ప్రభుత్వం కట్టబెడుతోందని ఆయన అన్నారు.

 

అదే మాదిరిగా, సంచార సముదాయాలు మరియు ఆ తరహాకే చెందిన ఇతర సముదాయాల కోసం ఒక సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడమైందని ప్రధాన మంత్రి చెప్పారు. బాగా బలహీనులైన ఆదివాసీ సమూహాల (పివిటిజి) కోసమని ‘జన్ మన్’ స్కీములో భాగంగా 24 వేల కోట్ల రూపాయలను కేటాయించిన సంగతిని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. ప్రభుత్వం వోటు ప్రధానమైన రాజకీయాల కంటే అభివృద్ధి ప్రధానమైన రాజకీయాలను అనుసరిస్తోందని చెప్పడానికి ఇది ఒక సూచిక అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో విశ్వకర్మలు ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతిని సైతం ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ప్రస్తావించారు. దాదాపుగా 13 వేల కోట్ల రూపాయల సాయంతో వారికి వృత్తి నైపుణ్యాన్ని అలవరచి, నైపుణ్యాభివృద్ధి కోసం వనరులను అందించి వారి జీవనంలో పరివర్తనను ప్రభుత్వం తీసుకు వచ్చిందని ప్రధాన మంత్రి వివరించారు. వీధి వీధికి తిరుగుతూ, సరకులను విక్రయించే చిన్న వ్యాపారులు బ్యాంకుల నుండి రుణాలను పొందేందుకు వీలును పిఎమ్ స్వనిధి పథకం కల్పించింది. మరి ఈ పథకం ద్వారా వారు వారి యొక్క ఆదాయాలను మరింతగా పెంచుకోవడం వీలుపండింది అని కూడా ఆయన తెలిపారు. ‘‘పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, వెనుకబడిన సముదాయం కావచ్చు, ఆదివాసీలు, లేదా మహిళలు కావచ్చు.. వారు మమ్మల్ని పూర్తిగా బలపరచారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

మహిళల నాయకత్వంలో అభివృద్ధి తాలూకు భారతీయ దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిపలికారు. దేశం ఈ ఆశయ సాధన కు కేవలం ఒక నినాదానికే పరిమితం కాకుండా అచంచలమైన నిబద్ధత తో ముందుకు సాగుతోంది అని ఆయన అన్నారు. మహిళల ఆరోగ్యం విషయంలో శ్రీమతి సుధా మూర్తి గారి ప్రమేయాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, కుటుంబంలో అమ్మకు ఎంత ప్రాధాన్యం ఉంటుందనేది వివరించారు. మహిళల స్వస్థత, పరిశుభ్రత మరియు వెల్ నెస్ లకు గల ప్రాధాన్యాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. టాయిలెట్ లు, సేనిటరీ ప్యాడ్ లు, టీకా మందులు, వంట గ్యాసు ఈ దిశ లో తీసుకొన్న కీలక నిర్ణయాలు అని ఆయన అన్నారు. పేదలకు అప్పగించిన నాలుగు కోట్ల ఇళ్ళలో చాలా వరకు ఇళ్ళు మహిళల పేరిటే నమోదు అయ్యాయని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ముద్ర యోజన మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు మహిళలకు ఆర్థిక సాధికారిత ను కల్పించి, వారు స్వతంత్రంగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చాయి. అంతేకాదు, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో వారు భాగం పంచుకొనేందుకు వీలును కల్పించాయి అని ఆయన అన్నారు. చిన్న పల్లెల లో శ్రమిస్తున్న స్వయం సహాయ సమూహాల కు చెందిన ఒక కోటి మంది మహిళలు ఈ రోజున ‘లఖ్ పతీ దీదీస్’ (లక్షాధికారి సోదరీమణులు) గా అయ్యారు అని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. వారి సంఖ్య ను ప్రస్తుత పదవీకాలంలో మూడు కోట్లకు పెంచే దిశలో ప్రభుత్వం కృషి చేస్తోంది అని ఆయన అన్నారు.

 

   ప్రతి కొత్త రంగంలోనూ నాయ‌క‌త్వం వ‌హించేలా మహిళలను ముందుకు న‌డిపించ‌డం, ప్రతి కొత్త సాంకేతికత మొట్ట‌మొద‌ట వారికి చేరేలా చూడాల‌న్న‌దే తమ ప్రభుత్వ కృషికి ప్రేర‌ణ‌నిస్తున్న ఆశ‌య‌మ‌ని శ్రీ మోదీ ప్ర‌క‌టించారు. “దేశంలోని ప‌లు గ్రామాల్లో నేడు నమో డ్రోన్ దీదీ అభియాన్ విజయవంతంగా అమలవుతోంది. దీనికి సూత్ర‌ధారులంతా మ‌హిళ‌లే”న‌ని ఆయ‌న చెప్పారు. డ్రోన్‌లతో ప‌నిచేయించే మహిళలను ‘పైలట్ దీదీలు’గానూ ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇటువంటి గుర్తింపే మహిళలకు చోదక శక్తిగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్రధాని మోదీ అన్నారు. మహిళల సమస్యలను ఉద్దేశ‌పూర్వ‌కంగా రాజకీయం చేసే ధోరణిని విమర్శిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో మహిళల మీద హింసపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

   ప్ర‌పంచంలో భారతదేశ ప్ర‌తిష్ట స‌రికొత్త శిఖ‌రాల‌కు చేరుతున్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై యువత ప్ర‌తిభా సామర్థ్యాలు చాటుకునే మార్గం సుగ‌మం చేయ‌డ‌మేగాక వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిసున్నందున విదేశీ పెట్టుబడులను స్వాగ‌తించ‌గ‌లుగుతోంద‌ని చెప్పారు. ఆ మేర‌కు ‘అయితే... గియితే’ అనే కాలం అంత‌రించింద‌ని ప్రధాని పేర్కొన్నారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో సమతౌల్యం కోసం ఎదురుచూస్తున్న మ‌దుపుదారుల‌లో భార‌త్ సాధించిన ఈ విజ‌యం కొత్త ఆశ‌లు చిగురింప‌జేసింద‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. పారదర్శకత విషయంలో నేడు భారత్ ఆశావ‌హ దేశంగా ఎదుగుతున్న‌ద‌ని శ్రీ మోదీ చెప్పారు.

   లోక్‌సభ ఎన్నికల సంద‌ర్భంగా 1977లో ప‌త్రికా స్వాతంత్ర్యం అణ‌చివేత‌కు గురికాగా, ఆకాశ‌వాణి (రేడియో)స‌హా ప్ర‌జాగ‌ళం నొక్కివేయ‌బ‌డిన రోజుల‌ను ప్రధాని గుర్తుచేశారు.  అలాంటి స‌మ‌యంలో భారత రాజ్యాంగ పరిరక్ష‌ణ‌, ప్రజాస్వామ్య పునరుద్ధర‌ణ ల‌క్ష్యంగా  ప్ర‌జ‌లు ఓటు వేశారని పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగాన్ని కాపాడే నేటి పోరులో భారత ప్రజల తొలి ప్రాధాన్యం ప్రస్తుత ప్రభుత్వమేనని ఆయన నొక్కి చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో దేశ‌వ్యాప్త అకృత్యాలను కూడా శ్రీ మోదీ ప్ర‌స్తావించారు. ఆనాడు 38, 39, 42వ‌  రాజ్యాంగ సవరణలు స‌హా ఎమర్జెన్సీ వేళ మ‌రో 12దాకా నిబంధ‌న‌లను సవరించ‌డాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఆ విధంగా నాటి పాల‌కులు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశార‌ని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిమండ‌లి తీసుకున్న నిర్ణయాలనైనా తోసిపుచ్చ‌గ‌ల అధికారం క‌ట్ట‌బెడుతూ జాతీయ సలహా మండలి (ఎన్ఎసి) ఏర్పాటు చేయ‌డాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నిర్దేశిత విధివిధానాల‌తో నిమిత్తం లేకుండా ఒక కుటుంబానికి అమిత ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని శ్రీ మోదీ ఖండించారు. కాగా, నేడు ఎమర్జెన్సీ శ‌కంపై చర్చను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ప్రధాని మోదీ విమర్శించారు.

   “ఎమ‌ర్జెన్సీ కాలమంటే కేవ‌లం ఒక రాజ‌కీయ అంశం కాదు... అది ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగం, మాన‌వ‌త‌ల‌కు సంబంధించిన‌ది” అని ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్యానించారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను క‌ట‌క‌టాల్లోకి నెట్ట‌డంతోపాటు వారిప‌ట్ల అమానుషంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌స్తావించారు. ఫ‌లితంగా జైలునుంచి విడుద‌ల‌య్యా కూడా కీర్తిశేషులైన లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ వంటి నేతలు కోలుకోలేక‌పోయార‌ని గుర్తుచేశారు. “అజ్ఞాతంలోకి వెళ్లిన అనేక‌మంది ఎమ‌ర్జెన్సీ ముగిశాక కూడా తిరిగి ఇళ్ల‌కు చేర‌లేదు” అని విచారం నిండిన స్వ‌రంతో ప్ర‌ధాని పేర్కొన్నారు. అలాగే ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌, తుర్క్‌మన్‌గేట్ ప్రాంతాల మైనారిటీల దుస్థితిని ఆయ‌న గుర్తుచేశారు.

   ప్రతిపక్షంలో కొన్ని వర్గాలు అవినీతిపరులను రక్షించే ధోరణి ప్ర‌దర్తిస్తున్నాయంటూ ప్ర‌ధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప‌లు ప్ర‌భుత్వాలు వివిధ కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డాయ‌ని ఆరోపిస్తూ, చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తున్న‌ద‌న్న అభియోగాన్ని ప్రధాని తోసిపుచ్చారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ మండిప‌డ్డారు. గత ప్రభుత్వాల హయాంలో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన ప‌లు సందర్భాలను ఆయన గుర్తుచేశారు. “అవినీతిపై యుద్ధం నాకు ఎన్నికల అంశం కానేకాదు. నా వ‌ర‌కూ అదొక ఉద్య‌మం” అని ప్రధాని మోదీ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం 2014లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చాక *పేద‌ల‌ప‌ట్ల అంకితభావం, అవినీతిపై ఉక్కుపాదం* పేరిట జంట వాగ్దానాలు చేశామ‌ని ప్రధాని గుర్తుచేశారు. త‌ద‌నుగుణంగా ప్రపంచంలోనే అతిపెద్ద పేదల‌ సంక్షేమ పథకం ప్ర‌వేశ‌పెట్టామ‌ని, అవినీతి నిరోధం దిశ‌గా నల్లధనం, బినామీ ఆస్తుల‌పై కొత్త చట్టాలు తెచ్చామ‌ని పేర్కొన్నారు. అలాగే ప్రత్యక్ష లబ్ధి బ‌దిలీ నిబంధనలు రూపొందించి, అర్హులైన లబ్ధిదారులంద‌రికీ ప్రయోజనాలు చేరేలా చూస్తున్నామ‌ని తెలిపారు. “అవినీతిపరులపై ఉక్కుపాదం మోపడం కోసం దర్యాప్తు సంస్థలకు నేను సంపూర్ణ అధికారాలిచ్చాను” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

   దేశంలో ఇటీవలి ప‌రీక్ష ప‌త్రాల లీకేజీపై రాష్ట్రపతి ఆందోళనను పునరుద్ఘాటిస్తూ- జాతి భవిష్యత్తుతో ఆట‌లాడుతున్న శ‌క్తుల‌పై తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేప‌డుతోంద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారిని క‌ఠినంగా శిక్షించకుండా వదిలేదిలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి యువతకు హామీ ఇచ్చారు. “మ‌న యువతరం ఎలాంటి సందేహాలకు తావులేకుండా ఆత్మ‌విశ్వాసంతో త‌మ సామర్థ్యాన్ని ప్రదర్శించే విధంగా వ్యవస్థ మొత్తాన్నీ మేం పటిష్టంగా తీర్చిదిద్దుతున్నాం” అని ఆయన చెప్పారు.

   లోక్‌సభ ఎన్నికలలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఓటింగ్ గణాంకాలను ఉటంకిస్తూ- అక్క‌డి ప్ర‌జ‌లు నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టార‌ని కొనియాడారు. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంత ప్రజానీకం పెద్ద సంఖ్యలో త‌ర‌లివ‌చ్చి ఓట్లు వేశార‌ని  ప్రధాని గుర్తుచేశారు. “భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సంఘాన్ని జమ్ము కశ్మీర్ ప్రజలు ఈ విధంగా ఆమోదించారు” అని వారి తీర్పును ఆయన‌ ప్రశంసించారు. దేశ పౌరులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన తరుణమిది అని శ్రీ మోదీ అభివ‌ర్ణించారు. కొన్ని దశాబ్దాలుగా  ఎడ‌తెర‌పిలేని బంద్‌లు, నిరసనలు, పేలుళ్లు, ఉగ్రవాద దుశ్చ‌ర్య‌లు జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టాయని పేర్కొంటూ, అలాంటి ప‌రిస్థితులును ఎంత‌మాత్రం ఆమోదించ‌బోమంటూ తీర్పునిచ్చిన కేంద్రపాలిత ప్రాంత ఓటర్లను ప్ర‌ధాని  అభినందించారు. ఆ మేర‌కు ప్రజలు రాజ్యాంగంపై తమ అచంచల విశ్వాసం చాటార‌ని, త‌మ భవిష్యత్తును తామే  నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి “ఒక విధంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదంపై మ‌న యుద్ధం అంతిమ చ‌ర‌ణానికి చేరింది. మిగిలిన ఉగ్రవాద వ‌ల‌యాల నిర్మూల‌న‌కు మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం” అని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో కేంద్ర పాలిత ప్రాంత‌ ప్రజలు తమకు మార్గ‌నిర్దేశం చేయ‌డంతోపాటు అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పారు.

   దేశ ప్ర‌గ‌తికి ముఖ‌ద్వారంగా ఈశాన్య భార‌తం శ‌ర‌వేగంతో పురోగ‌మిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ దిశ‌గా గ‌డ‌చిన కొన్నేళ్లుగా తాము చేప‌ట్టిన ప్ర‌గ‌తిశీల చ‌ర్య‌ల గురించి ఆయ‌న వివ‌రించారు. అందుకే ఆ ప్రాంతంలో మౌలిక స‌దుపాయాలు అనూహ్య రీతిలో వృద్ధి చెందాయ‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో రాష్ట్రాల మ‌ధ్య చిర‌కాల స‌రిహ‌ద్దు వివాదాలకు ఏకాభిప్రాయంతో అర్థ‌వంత‌మైన రీతిలో ప‌రిష్క‌రించామ‌ని చెప్పారు. ఈ కృషి ఫ‌లితంగా ఆ ప్రాంతంలో శాశ్వ‌త శాంతి నెల‌కొన‌గ‌ల‌ద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

   మణిపూర్‌కు సంబంధించి లోగ‌డ రాజ్యసభలో తన విస్తృత ప్రసంగాన్ని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఆ రాష్ట్రంలో పరిస్థితిని చ‌క్క‌దిద్ద‌డానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్న‌ద‌ని పునరుద్ఘాటించారు. మణిపూర్‌లో హింసాత్మ‌క అల‌జ‌డి సంద‌ర్భంగా  11,000కుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన 500 మందికిపైగా నిందితుల‌ను అరెస్టు చేశామన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు వేగంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌నే వాస్తవాన్ని మనమంతా తప్పక గుర్తించాలని ప్రధాని ఉద్ఘాటించారు. మణిపూర్‌లో శాంతి పునఃస్థాప‌న‌కుగ‌ల‌ క‌చ్చితమైన‌ అవకాశాలను ఈ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇవాళ మణిపూర్‌లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు త‌దితర సంస్థలన్నీ మునుప‌టిలా పనిచేస్తున్నాయని శ్రీ మోదీ సభకు తెలిపారు. అంతేగాక బాల‌ల ముందంజ‌కు ఎలాంటి ఆటంకాలూ లేవ‌ని ఆయన చెప్పారు. మణిపూర్‌లో శాంతి, సౌహార్ద భావ‌న‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత భాగస్వాములంద‌రితో చర్చలు కొన‌సాగిస్తున్న‌ట్లు ప్రధాని తెలిపారు. దేశీయాంగ శాఖ మంత్రి స్వ‌యంగా మ‌ణిపూర్‌లో మ‌కాం వేసి, శాంతి స్థాపనకు నాయకత్వం వహించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సమస్యలకు పరిష్కారాన్వేష‌ణ‌తోపాటు శాంతిభద్రతలను ప‌రిర‌క్ష‌ణ కోసం సీనియర్ అధికారులను కూడా ఆదేశించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

   మ‌ణిపూర్‌లో ప్ర‌స్తుత తీవ్ర వ‌ర‌ద ప‌రిస్థితిపై ప్ర‌ధానమంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అక్క‌డ సహాయ చర్యల కోసం రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ ద‌ళాల‌ను నియ‌మించిన‌ట్లు శ్రీ మోదీ సభకు తెలియజేశారు. సహాయ చర్యలలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని ఉద్ఘాటించారు. మణిపూర్‌లో సాధారణ ప‌రిస్థితులు నెలకొల్పి, శాంతిని పున‌రుద్ధ‌రించే దిశ‌గా అన్ని రాజకీయ పార్టీలు త‌మ‌ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల‌ని చెప్పారు. ఇది భాగ‌స్వాములంద‌రి కర్తవ్యమని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. అలాగే రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌తో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మరింత ప్రమాదంలోకి నెట్టవ‌ద్ద‌ని అసమ్మతివాదులకు ప్రధాని సూచించారు. మణిపూర్‌లో సామాజిక సంఘర్షణల‌కు సుదీర్ఘ చరిత్ర ఉంద‌ని, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అక్క‌డ 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని ఆయన సభకు గుర్తు చేశారు. అలాగే 1993 నుంచి ఐదేళ్ల‌పాటు సాగిన సామాజిక సంఘర్షణను గుర్తుచేస్తూ- విజ్ఞత, సహనంతో ఈ పరిస్థితిని స‌రిదిద్దాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. మణిపూర్‌లో శాంతి స్థాప‌న దిశ‌గా సాధారణ పరిస్థితులు నెలకొల్పే తన కృషికి తోడ్ప‌డాల్సిందిగా  భావసారూప్యతగల వ్యక్తులందరికీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

   లోక్‌సభలో పాదంమోపి, దేశ ప్రధాని కావడానికి ముందు తాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాన‌ని గుర్తుచేశారు. అందువ‌ల్ల స‌మాఖ్య విధానం ప్రాధాన్యాన్ని ఆ త‌ర్వాత అనుభవంతో తెలుసుకున్నాన‌ని ఉద్ఘాటించారు. ఈ నేప‌థ్యంలో సహకారాత్మ‌క‌-పోటీత‌త్వ‌ సమాఖ్య విధానం బలోపేతంపై శ్రీ మోదీ తన వైఖరిని నొక్కిచెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రాలు, వాటి సామ‌ర్థ్యం ప్రపంచానికి వెల్ల‌డ‌య్యేలా ప్రతి రాష్ట్రంలో జి-20 సంబంధిత కీల‌క కార్యక్రమాలను నిర్వహించిన‌ట్లు గుర్తుచేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర‌-రాష్ట్రాల మ‌ధ్య సంప్ర‌దింపులు, చ‌ర్చ‌లు రికార్డు స్థాయిలో సాగాయ‌ని ఆయన తెలిపారు.

   రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని ప్ర‌ధాని పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశం తదుపరి విప్లవానికి మార్గనిర్దేశం చేయ‌గ‌ల‌ద‌రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. త‌ద‌నుగుణంగా అభివృద్ధి, సుపరిపాలన, విధాన రూపకల్పన, ఉపాధి కల్పనస‌హా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ట్రాలూ పోటీపడేలా ప్రోత్సహిస్తున్నామ‌ని తెలిపారు. ప్రపంచం భారత్‌ తలుపులు తడుతున్న నేటి ప‌రిస్థితుల్లో దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ముందంజ వేయ‌గ‌ల‌ద‌నే దృఢ విశ్వాసం త‌న‌కుంద‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు. భారత వృద్ధి ప‌య‌నానికి అన్ని రాష్ట్రాలూ త‌మ‌వంతు సహకారం అందిస్తూ ,దాని ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు. రాష్ట్రాల మధ్య పోటీ వ‌ల్ల కొత్త అవకాశాల సృష్టితో యువతకు ఎంతో ప్రోత్సాహం ల‌భిస్తుంద‌న్నారు. ఈ మేర‌కు ఈశాన్య భార‌త రాష్ట్రం అస్సాంలో సెమీకండక్టర్ల సంబంధిత  పనులు వేగంగా సాగుతుండ‌టాన్ని ఈ సంద‌ర్భంగా ఉదాహరించారు.

   ఐక్యరాజ్య సమితి 2023ను ‘చిరుధాన్య సంవత్సరం’గా ప్రకటించడాన్ని ప్ర‌స్తావిస్తూ-  భార‌త చిన్న-స‌న్న‌కారు రైతుల సామ‌ర్థ్యానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. త‌ద‌నుగుణంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే దిశ‌గా రాష్ట్రాలు విధివిధానాలను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రపంచ విప‌ణిలో వాటికి స‌ముచిత స్థానం ద‌క్కేవిధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని ఆయన కోరారు. ప్రపంచ  పోషకాహార విప‌ణిలోనూ చిరుధాన్యాలు కీల‌క పాత్ర పోషించ‌గ‌ల‌వ‌ని, పౌష్టిక‌త లోపంగ‌ల‌ ప్రాంతాలలో ఇవి ప్రధాన ఆహారం కాగ‌ల‌వ‌ని కూడా ఆయన పేర్కొన్నారు.

   దేశ పౌరుల ‘జీవ‌న సౌల‌భ్యం’ పెంచే విధానాలను, త‌ద‌నుగుణం చ‌ట్టాల‌ను కూడా రూపొందించాలని ప్రధానమంత్రి రాష్ట్రాల‌కు సూచించారు. అలాగే పంచాయతీ, పుర‌పాల‌క‌, న‌గర‌ పాలక, మహానగర పాలక, తాలూకా లేదా జిల్లా త‌దిత‌ర అన్ని స్థాయుల్లోనూ అవినీతిపై  పోరాడాల్సిన అవసరం ఎంత‌యినా ఉంద‌ని, ఈ విష‌యంలో అన్ని రాష్ట్రాలూ ఏకాభిప్రాయంతో ముందంజ వేయాల‌ని ఉద్బోధించారు.

   భారతదేశాన్ని 21వ శతాబ్దపు న‌మూనాగా తీర్చిదిద్దే దిశ‌గా ప్రభుత్వ నిర్ణయాత్మ‌క‌త‌, క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌, పాలనల ప‌రంగా సామ‌ర్థ్యం ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాని నొక్కిచెప్పారు. ఈ మూడు అంశాల ప‌రంగా సాగుతున్న కృషి మ‌రింత వేగం పుంజుకోగ‌ల‌ద‌ని ప్రధానమంత్రి దృఢ విశ్వాసం వెలిబుచ్చారు. సామ‌ర్థ్యం ఇనుమ‌డిస్తే పారదర్శకతకు దారితీస్తుంద‌ని, తద్వారా పౌర హక్కులకు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని, జీవ‌న సౌల‌భ్యాన్ని పెంచుతుంద‌ని చెప్పారు. ముఖ్యంగా ‘అయితే... గియితే’ ధోర‌ణికి కాలం చెల్లింద‌ని తెలిపారు. పౌర జీవ‌నంలో ప్ర‌భుత్వ జోక్యాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌ని, అదే స‌మ‌యంలో ఆప‌న్నుల‌కు చేయూత‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

   ప్రకృతి వైపరీత్యాలు నానాటికీ పెరుగుతున్నాయంటూ వాతావరణ మార్పులపై ప్ర‌ధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప‌రిస్థితిని చక్క‌దిద్ద‌డంలో అన్ని రాష్ట్రాలు ముందుకు రావాల‌ని కోరారు. అందరికీ మంచినీరు, ఆరోగ్య సేవల ప్ర‌దానం మెరుగుకు స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని శ్రీ మోదీ అన్నారు. ఈ ప్రాథమిక లక్ష్యాల సాధన‌కు రాజకీయ సంకల్పం ఉండాల‌ని, ఆ మేర‌కు ప్రతి రాష్ట్రం ముందుకొచ్చి కేంద్రానికి సహకరించ‌గ‌ల‌ద‌ని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

   ప్ర‌స్తుత శ‌తాబ్దం భారత‌దేశానిదేన‌ని, ఈ సువ‌ర్ణావ‌కాశాన్ని జార‌విడుచుకోరాద‌ని ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు. ప్ర‌పంచంలో మ‌నలాంటి ప‌రిస్థితులుగ‌ల ప‌లు దేశాలు అవ‌కాశాల స‌ద్వినియోగంతో అభివృద్ధి సాధిస్తే, భార‌త్ ఎన్నో అవ‌కాశాల‌ను కోల్పోయింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో సంస్క‌ర‌ణ‌ల‌ను వాయిదా వేయాల్సిన అవ‌సరం లేద‌ని, పౌరుల‌కు నిర్ణ‌యాధికారాన్ని మ‌రింత విస్త‌రిస్తే ప్ర‌గ‌తికి, వృద్ధికి మార్గం దానంత‌టదే సుగ‌మం కాగ‌ల‌ద‌ని సూచించారు.

    “విక‌సిత‌ భారత్ స్వ‌ప్న సాకారం 140 కోట్లమంది పౌరుల లక్ష్యం” అని పేర్కొంటూ, దీన్ని సాధించడంలో ఐక్యతకు అమిత‌ ప్రాధాన్యం ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. భారత సామ‌ర్థ్యంపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టడానికి యావ‌త్ ప్రపంచం సిద్ధంగా ఉందని ఆయ‌న పునరుద్ఘాటించారు. ఈ మేర‌కు “ప్రపంచానికి భారతదేశ‌మే  తొలి ప్రాథ‌మ్యం” అని, ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

   చివ‌ర‌గా- రాష్ట్రప‌తి త‌న ప్ర‌సంగంలో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించ‌డంతోపాటు  దిశానిర్దేశం చేయ‌డంపై ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని త‌న ప్ర‌సంగం ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India digital public infrastructure is charting the journey towards becoming $1-tn digital economy by 2027-28

Media Coverage

India digital public infrastructure is charting the journey towards becoming $1-tn digital economy by 2027-28
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జూలై 2024
July 20, 2024

India Appreciates the Nation’s Remarkable Rise as Global Economic Powerhouse