ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 25న సందర్శించనున్నారు. దేశ సామాజిక - సాంస్కృతిక, ఆధ్యాత్మిక పయనంలో ఇదొక మహత్తర ఘట్టంగా నిలవనుంది.
ఉదయం 10 గంటల సమయంలో ప్రధానమంత్రి సప్తమందిర్‌ను సందర్శిస్తారు. వశిష్టుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వాల్మీకి మహర్షులు.. దేవీ అహల్య, నిషాద రాజు గుహుడు, శబరీమాతల ఆలయాలు ఇందులో ఉన్నాయి. అనంతరం శేషావతార మందిరాన్ని సందర్శిస్తారు.
ఉదయం 11 గంటల సమయంలో మాతా అన్నపూర్ణ మందిరాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. అనంతరం రామ్ దర్బార్ గర్భాలయాన్ని దర్శించి, పూజలు చేస్తారు. అనంతరం రామ్ లల్లా గర్భాలయాన్ని దర్శిస్తారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయోధ్యలోని పవిత్ర శ్రీ రామ జన్మభూమి ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధానమంత్రి లాంఛనంగా ఎగరేస్తారు. ఆలయ నిర్మాణం సంపూర్ణమై.. సాంస్కృతిక వైభవమూ, దేశ ఐక్యతలో కొత్త అధ్యాయం మొదలవుతోందనడానికి ఇది ప్రతీక. ఈ చరిత్రాత్మక సందర్భంలో సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
మంగళప్రదమైన మార్గశిర శుక్ల పంచమి రోజున.. శ్రీరాముడు - సీతమ్మల వివాహ పంచమి రోజున అభిజిత్ ముహూర్త వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 17వ శతాబ్దంలో అయోధ్యలో 48 గంటలు నిరంతర ధ్యానం చేసిన తొమ్మిదో సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ జీ బలిదానం చేసింది కూడా ఈ రోజే. ఇలా ఈ రోజుకు మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యముంది.
పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవు ఉన్న లంబకోణ త్రిభుజాకార పతాకంలో.. భగవాన్ శ్రీరాముడి తేజస్సు, శౌర్యానికి ప్రతీకగా తేజోవంతుడైన సూర్యుడి చిత్రం ఉంటుంది. కోవిదార వృక్షం చిత్రంతోపాటు ‘ఓం’ కారాన్ని కూడా జెండాపై పొందుపరిచారు. రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా.. గౌరవం, ఐక్యత, సాంస్కృతిక అవిచ్ఛిన్నతా సందేశాన్ని ఈ పవిత్ర కాషాయ ధ్వజం మనకందిస్తుంది.
సాంప్రదాయక ఉత్తర భారత నాగర వాస్తుశిల్ప శైలిలో నిర్మించిన శిఖరంపై ఈ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ ఆవరణగా నిర్మించిన 800 మీటర్ల పార్కోటను దక్షిణ భారత వాస్తుశిల్ప సంప్రదాయంలో నిర్మించారు. ఆలయంలోని వాస్తుశిల్ప వైవిధ్యాన్ని ఇది చాటుతుంది.
వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత ఘట్టాలను సూచించేలా ప్రధాన ఆలయం బయటి గోడలపై అద్భుతంగా చెక్కిన 87 రాతి శిల్పాలు, ఆలయ పరిసర గోడలపై భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా పోతపోసిన 79 కాంస్య చిత్రాలు ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఇవన్నీ సందర్శకులకు జ్ఞానాన్ని పెంపొందించుకునేలా అర్థవంతమైన, గొప్ప అనుభవాన్నిస్తాయి. భగవాన్ శ్రీరాముడి జీవితం, భారత సాంస్కృతిక వారసత్వంపై అవగాహనను పెంపొందిస్తాయి.


