ఎర్నాకుళంలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కొచ్చి రిఫైనరీలో పాలీప్రొఫైలిన్ యూనిట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన
రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టుల ప్రారంభం: ఎన్‌హెచ్‌-66లోని తలపాడి-చెంగల విభాగం ఆరు వరుసల నిర్మాణం, వెంగళం నుంచి రామనట్టుకర వరకు కోజికోడ్ బైపాస్ ఆరు వరుసల నిర్మాణం
తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
పెట్రోలియం, సహజ వాయువు మౌలిక సదుపాయాలు, గ్రామీణ అనుసంధానం, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే సేవలు వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు
నీలగిరి, ఈరోడ్ జిల్లాల్లో బీపీసీఎల్‌ సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థకు శంకుస్థాపన, చెన్నైలో ఐఓసీఎల్‌కు చెందిన ల్యూబ్ బ్లెండింగ్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో  పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేరళలోని ఎర్నాకుళంలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

ప్రధానమంత్రి ఎర్నాకుళం పర్యటన వివరాలు

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) కు చెందిన కొచ్చి రిఫైనరీలో రూ. 5,500 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించనున్న పాలీప్రొపిలీన్ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీని సామర్థ్యం ఏడాదికి 400 కిలో టన్నులు. ప్యాకేజింగ్, ఆటోమొబైల్ విడిభాగాలు, వైద్య పరికరాలు, వస్త్రాలు, గృహోపకరణాల తయారీలో పాలీప్రొఫైలిన్ ఎంతో కీలకం. ఇది దేశంలో పాలిమర్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.

రహదారి మౌలిక సదుపాయాల రంగంలో రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మొదటిది ఎన్‌హెచ్‌ 66లోని తలపాడి-చెంగళ విభాగం ఆరు వరుసల రహదారి. రూ. 2,650 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముంబై-కన్యాకుమారి ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంది. ఇది కాసరగోడ్, కన్నూర్ జిల్లాలు, మంగళూరు, ముజపిలంగడ్‌ వంటి పొరుగు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. మంగళూరు, అళికల్ ఓడరేవుకు రవాణాను సులభతరం చేస్తుంది. దీనివల్ల బేకల్, పయ్యన్నూర్, కన్నూర్‌, కాసరగోడ్‌ వంటి ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం మెరుగుపడతాయి.

వెంగళం నుంచి రామనాట్టుకర వరకు సుమారు రూ.2,140 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరు వరుసల కోజికోడ్ బైపాస్ రెండో ప్రధాన ప్రాజెక్టు. ప్రస్తుతం ఉన్న అవిభక్త  రెండు వరుసల రోడ్డును ఇరువైపులా సర్వీస్ రోడ్లతో కూడిన ఆరు వరుసల రహదారిగా ఆధునీకరించారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. రహదారి భద్రత పెరుగుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయం గంట నుంచి 15, 20 నిమిషాలకు తగ్గుతుందని భావిస్తున్నారు. కోజికోడ్ బీచ్, బేపూర్ ఓడరేవు, కప్పాడ్ బీచ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి, పర్యాటకం, వాణిజ్యం వృద్ధి చెందుతాయి.

కేరళలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన 23 గ్రామీణ రహదారులను ప్రారంభిస్తారు. ఇవి సుదూర ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా మార్కెట్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ జీవనోపాధి బలపడుతుంది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన మూడు రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అవి షోరనూర్ జంక్షన్, కుట్టిప్పురం, చంగనాశ్శేరి. ఈ స్టేషన్లను ప్రయాణికులకు ఆధునిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కలిగించేలా ఆధునీకరించారు. స్థానిక నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూనే, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవి అందిస్తాయి.

షోరనూర్-నిలంబూర్ రోడ్డు రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ కీలక రైల్వే విభాగం విద్యుదీకరణ వల్ల షోరనూర్ వద్ద ఇంజిన్లను మార్చాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలు మరింత వేగంగా, సమర్థవంతంగా, పర్యావరణహితంగా సాగుతాయి. పాలక్కాడ్, పొల్లాచ్చి మధ్య కొత్త రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ సర్వీసు నిత్యం ప్రయాణించే వారికి, తీర్థయాత్రికులకు, వ్యాపారులకు, పర్యాటకులకు ఎంతో మేలు చేస్తుంది.

కేరళలోని కొల్లాం జిల్లా పశ్చిమ కల్లాడ వద్ద 50 మెగావాట్ల నీటిపై తేలే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధామంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారు. ఇది దేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు తోడ్పడటమే కాకుండా, తక్కువ కర్బన ఉద్గారాల ఇంధన భవిష్యత్తు వైపు దేశ నిబద్ధతను చాటుతుంది.

తిరుచిరాపల్లిలో ప్రధానమంత్రి పర్యటన

తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన,  జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు. ఈ ప్రాజెక్టులు పెట్రోలియం, సహజ వాయువు మౌలిక సదుపాయాలు, లూబ్రికెంట్ల  తయారీ, గ్రామీణ అనుసంధానం, రహదారుల అభివృద్ధి, రైల్వే సేవల వంటి కీలక రంగాలకు సంబంధించినవి.

పెట్రోలియం రంగంలో నీలగిరి, ఈరోడ్ జిల్లాల్లో రూ. 3,680 కోట్లకు పైగా పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) చేపట్టనున్న సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థకు ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా 8.8 లక్షలకు పైగా ఇళ్లకు పైపుల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్లు అందుతాయి. అలాగే 200లకు పైగా వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరా చేయడంతో పాటు, 201 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

చెన్నైలోని మనాలి వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్‌) నిర్మించిన ల్యూబ్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తారు. దీని సామర్థ్యం ఏడాదికి 672 వేల మెట్రిక్ టన్నులు. సుమారు రూ. 1,490 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ ప్లాంటు, దేశీయంగా ల్యూబ్రికెంట్ల తయారీ సామర్థ్యాన్ని బలపరుస్తుంది.

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తమిళనాడులో 370 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 89 గ్రామీణ రోడ్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు, పాఠశాలలు, వైద్య సౌకర్యాలకు అనుసంధనాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. జాతీయ రహదారి 81లోని గంగైకొండ చోళపురం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ బైపాస్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సర్వీసులు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తూర్పు భారతదేశంతో సహా ఇతర ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయి. దీనివల్ల ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares moments from his metro journey to and from the SRCC programme
September 05, 2026

Prime Minister Shri Narendra Modi today shared glimpses of his metro journey while traveling to and from the SRCC programme.

In a post on X, the Prime Minister shared:

"Metro moments…

On the way to the SRCC programme and back."