రేపు ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్ , టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
దేశంలో పరిశోధనాభివృద్ధి వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన రూ. 1 లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి-ఆవిష్కరణ పథకం నిధిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలో ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధనాభివృద్ధి వ్యవస్థను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
ఈఎస్‌టీఐసీ-2025 ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో నోబెల్ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలతో పాటు విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వానికి చెందిన 3,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్-మాన్యుఫ్యాక్చరింగ్, కృత్రిమ మేధ, బయో-మాన్యుఫ్యాక్చరింగ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్-సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్-క్లైమేట్, హెల్త్-మెడికల్ టెక్నాలజీస్, క్వాంటం సైన్స్-టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీస్ వంటి 11 కీలక అధ్యయన అంశాలపై సదస్సులో చర్చిస్తారు.
ఈఎస్‌టీఐసీ-2025లో భాగంగా ప్రముఖ శాస్త్రవేత్తల చర్చలు, ప్యానెల్ చర్చలు, ప్రజెంటేషన్లు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భారత శాస్త్ర సాంకేతిక వ్యవస్థ బలోపేతం కోసం పరిశోధకులు, పరిశ్రమలు, యువ ఆవిష్కర్తల మధ్య సహకారానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుంది.





