నా ప్రియమైన దేశప్రజలారా! మన్ కీ బాత్ కార్యక్రమంలో మీ అందరితో అనుసంధానం కావడం, మీ నుండి నేర్చుకోవడం, మన దేశ ప్రజల విజయాల గురించి తెలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తుంది. ఆలోచనలను పరస్పరం పంచుకుంటూ, మనసులో మాట- ‘మన్ కీ బాత్’- ను పంచుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం అప్పుడే 125 ఎపిసోడ్‌లను పూర్తి చేసినట్టు అనిపించలేదు. ఈ రోజు ఈ కార్యక్రమం 126వ ఎపిసోడ్. ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు భారతదేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జన్మదినం. నేను షహీద్ భగత్ సింగ్, లతా దీదీ ల గురించి మాట్లాడుతున్నాను.
మిత్రులారా! అమరవీరుడు భగత్ సింగ్ ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా దేశ యువతకు ప్రేరణ. నిర్భయం అతని స్వభావంలో గాఢంగా పాతుకుపోయింది. దేశం కోసం ఉరికొయ్య పైకి ఎక్కడానికి ముందు భగత్ సింగ్ బ్రిటిష్ వారికి ఒక లేఖ రాశాడు. తనను, తన సహచరులను యుద్ధ ఖైదీలుగా పరిగణించాలని తాను కోరుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఉరితీయడం ద్వారా కాకుండా తుపాకీ గుండుతో కాల్చడం ద్వారా తమ ప్రాణాలను తీయాలని అతను కోరుకున్నాడు. ఇది అతని అజేయ సాహసానికి గుర్తు. భగత్ సింగ్ జీ కూడా ప్రజల బాధల పట్ల చాలా సహానుభూతితో ఉండేవారు. వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండేవారు. షహీద్ భగత్ సింగ్ జీకి నేను సగౌరవంగా నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా! ఈరోజు లతా మంగేష్కర్ జయంతి కూడా. భారతీయ సంస్కృతి, సంగీతంపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆమె పాటలతో చలించిపోకుండా ఉండలేరు. ఆమె పాటల్లో మానవ భావోద్వేగాలను రేకెత్తించే అంశాలుంటాయి. ఆమె పాడిన దేశభక్తి పాటలు ప్రజలను ఎంతో ప్రేరేపించాయి. ఆమెకు భారతీయ సంస్కృతితో కూడా గాఢమైన సంబంధం ఉంది. లతాదీదీకి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. మిత్రులారా! లతా దీదీని ప్రేరేపించిన గొప్ప వ్యక్తులలో వీర్ సావర్కర్ కూడా ఉన్నారు. ఆయనను ఆమె తాత్యా అని పిలిచేవారు. వీర్ సావర్కర్ జీ పాటలను కూడా ఆమె పాడారు.
లతా దీదీతో నా స్నేహ బంధం ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉంది. ఆమె ప్రతి సంవత్సరం తప్పకుండా నాకు రాఖీ పంపేవారు. మరాఠీ లలిత సంగీత దిగ్గజం సుధీర్ ఫడ్కే మొదట్లో నాకు లతా దీదీని పరిచయం చేయడం నాకు గుర్తుంది. ఆమె పాడి, సుధీర్ జీ స్వరపరిచిన ‘జ్యోతి కలశ్ ఛల్కే’ పాట నాకు చాలా ఇష్టమని నేను ఆమెకు చెప్పాను.
మిత్రులారా! దయచేసి నాతో పాటు ఇది విని ఆనందించండి.
(ఆడియో)
నా ప్రియమైన దేశవాసులారా! ఈ నవరాత్రి సమయంలో మనం శక్తి ఉపాసన చేస్తాం. మహిళా శక్తిని ఉత్సవంగా జరుపుకుంటాం. వ్యాపారం నుండి క్రీడల వరకు, విద్య నుండి సైన్స్ వరకు- ఏ రంగాన్ని తీసుకున్నా- మన దేశ అమ్మాయిలు ప్రతిచోటా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఊహించడానికి కూడా కష్టమైన సవాళ్లను వారు అధిగమిస్తున్నారు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. మీరు ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా సముద్రంలో ఉండగలరా? మీరు చుక్కాని ఉన్న పడవలో- అంటే గాలి వేగంతో కదిలే పడవలో- 50 వేల కిలోమీటర్లు ప్రయాణించగలరా? అది కూడా సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు? మీరు దీన్ని చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారు. కానీ నావికా సాగర్ పరిక్రమ సమయంలో ఇద్దరు ధైర్యవంతులైన నౌకాదళ మహిళా అధికారులు దీన్ని సాధించారు. ధైర్యం, దృఢ సంకల్పం అంటే ఏమిటో వారు నిరూపించారు. ఈరోజు ఆ ఇద్దరు ధైర్యవంతులైన అధికారులను 'మన్ కీ బాత్' శ్రోతలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, మరొకరు లెఫ్టినెంట్ కమాండర్ రూప. ఈ ఇద్దరు అధికారులు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు.
ప్రధాన మంత్రి: హలో...
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: హలో సర్.
ప్రధాన మంత్రి: నమస్కారం
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: నమస్కారం సర్.
ప్రధాన మంత్రి: అయితే ఇప్పుడు నాతో లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూప ఇద్దరూ మాట్లాడుతున్నారా? ఇద్దరూ ఉన్నారా?
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, రూప: అవును సర్.
ప్రధాన మంత్రి: మీ ఇద్దరికీ నమస్కారం.... వణక్కం.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: వణక్కం సర్.
లెఫ్టినెంట్ కమాండర్ రూప: నమస్కారం సర్.
ప్రధాన మంత్రి: సరే… మన దేశప్రజలు ముందుగా మీ ఇద్దరి గురించి వినాలనుకుంటున్నారు. దయచేసి మాకు చెప్పండి.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: సర్... నేను లెఫ్టినెంట్ కమాండర్ దిల్నాను. నేను భారత నౌకాదళంలోని లాజిస్టిక్స్ కేడర్ నుండి వచ్చాను. సర్… నేను 2014 లో నేవీలో చేరాను. సర్.. మాది కేరళలోని కోజికోడ్. సర్.. మా నాన్న ఆర్మీలో పనిచేశారు. మా అమ్మ గృహిణి. నా భర్త కూడా ఇండియన్ నేవీలో అధికారి. సర్.. మా సోదరి ఎన్ సి సి లో పనిచేస్తోంది.
లెఫ్టినెంట్ కమాండర్ రూప: జై హింద్ సర్... నేను లెఫ్టినెంట్ కమాండర్ రూపను.. నేను 2017 లో నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ కేడర్‌లో నేవీలో చేరాను. మా నాన్నది తమిళనాడు. మా అమ్మది పాండిచ్చేరి. మా నాన్న వైమానిక దళంలో పనిచేశారు. సర్… నిజానికి నేను రక్షణరంగంలో చేరడానికి మా నాన్న నుండి ప్రేరణ పొందాను. మా అమ్మ హోమ్ మేకర్ సర్.
ప్రధాన మంత్రి: సరే… దిల్నా, రూపా! సాగర్ పరిక్రమలో మీ అనుభవం గురించి దేశం వినాలనుకుంటుంది. ఇది అంత తేలికైన పని కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఉండాలి. మీరు చాలా సమస్యలను అధిగమించాల్సి వచ్చిఉండాలి.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: అవును సర్. జీవితంలో ఒక్కసారైనా మన జీవితాలను మార్చే అవకాశం వస్తుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సర్. ఈ పరిక్రమ మాకు భారత నౌకాదళం, భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక అవకాశం. ఈ యాత్రలో మేం దాదాపు 47500 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించాం సర్. మేం 2024 అక్టోబర్ 2న గోవా నుండి బయలుదేరి 2025 మే 29న తిరిగి వచ్చాం. ఈ యాత్రను పూర్తి చేయడానికి మాకు 238 రోజులు పట్టింది సర్. 238 రోజులు ఈ పడవలో మేం ఇద్దరం మాత్రమే ఉన్నాం సర్.
ప్రధాన మంత్రి: ఓహ్
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: సర్.. ఈ ప్రయాణం కోసం మేం మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాం. నావిగేషన్ నుండి కమ్యూనికేషన్ అత్యవసర పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలి, డైవింగ్ ఎలా చేయాలి, పడవలో వైద్య అత్యవసర పరిస్థితి వంటి ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఏం చేయాలి అనే దాని వరకు భారత నౌకాదళం మాకు వీటన్నింటిపై శిక్షణ ఇచ్చింది సర్. ఈ యాత్రలో మాకు ఎప్పుడూ గుర్తుండే అత్యంత చిరస్మరణీయమైన క్షణం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సర్. పాయింట్ నేమో వద్ద మేం భారత జెండాను ఎగురవేశాం సర్. పాయింట్ నేమో ప్రపంచంలోనే అత్యంత మారుమూల ప్రదేశం సర్. దానికి దగ్గరగా ఉన్నది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమొక్కటే. అక్కడికి వెళ్ళిన మొదటి భారతీయులుగా, మొదటి ఆసియన్లుగా, ప్రపంచంలోనే మొదటి వ్యక్తులుగా సెయిల్ బోట్‌లో అక్కడికి చేరుకున్నాం సర్.. ఇది మాకు గర్వకారణం సర్.
ప్రధాన మంత్రి: వావ్.... మీకు చాలా అభినందనలు.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: ధన్యవాదాలు సర్.
ప్రధాన మంత్రి: మీ మిత్రురాలు కూడా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
లెఫ్టినెంట్ కమాండర్ రూప: సర్.... నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, సెయిల్ బోట్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారి సంఖ్య ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న వారి సంఖ్య కంటే చాలా తక్కువ. వాస్తవానికి సెయిల్ బోట్‌లో ఒంటరిగా జలయాత్ర చేసే వారి సంఖ్య అంతరిక్షంలోకి వెళ్ళిన వారి సంఖ్య కంటే కూడా తక్కువ.
ప్రధాన మంత్రి: సరే... ఇంత సంక్లిష్టమైన ప్రయాణానికి చాలా జట్టుకృషి అవసరం. ఆ బృందంలో మీరిద్దరూ మాత్రమే అధికారులు. మీరు దాన్ని ఎలా నిర్వహించారు?
లెఫ్టినెంట్ కమాండర్ రూప: అవును సర్...ఈ ప్రయాణానికి మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా చెప్పినట్టు దీన్ని సాధించడానికి మేమిద్దరం మాత్రమే పడవలో ఉన్నాం. మేమే పడవ మరమ్మతుదారులం. ఇంజిన్ మెకానికులం. పడవ తయారీదారులం. వైద్య సహాయకులం. వంటపని, క్లీనింగు. డ్రైవింగు, నావిగేషను.. ఇవన్నీ చేశాం. భారత నౌకాదళం మా విజయానికి గొప్ప సహకారం అందించింది. వారు మాకు అన్ని రకాల శిక్షణ ఇచ్చారు. నిజానికి మేం నాలుగు సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. కాబట్టి మాకు ఒకరి బలాలు, బలహీనతలు మరొకరికి బాగా తెలుసు. అందుకే మా పడవలో ఎప్పుడూ విఫలం కాని ఒక పరికరం ఉందని, అది మా ఇద్దరి జట్టుకృషి అని మేం అందరికీ చెప్తాం.
ప్రధాన మంత్రి: సరే… వాతావరణం బాగాలేనప్పుడు ఈ సముద్ర ప్రపంచ వాతావరణం అనూహ్యమైంది. మరి మీరు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు?
లెఫ్టినెంట్ కమాండర్ రూప: సర్.. మా ప్రయాణంలో చాలా ప్రతికూల సవాళ్లు ఉన్నాయి సర్. ఈ యాత్రలో మేం చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా సర్, దక్షిణ మహాసముద్రమైన అంటార్కిటిక్ వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. మేం మూడు తుఫానులను ఎదుర్కోవలసి వచ్చింది. సర్.. మా పడవ కేవలం 17 మీటర్ల పొడవు, దాని వెడల్పు కేవలం 5 మీటర్లు. కొన్నిసార్లు మూడు అంతస్తుల భవనం కంటే పెద్ద అలలు ఉండేవి సర్. మా ప్రయాణంలో మేం తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి రెండింటినీ ఎదుర్కొన్నాం. అంటార్కిటికాలో మేం ప్రయాణించేటప్పుడు మా ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్. మేం గంటకు 90 కి.మీ. వేగంతో గాలులను ఎదుర్కోవలసి వచ్చింది. చలి నుండి మమ్మల్ని మేం రక్షించుకోవడానికి ఒకేసారి 6 నుండి 7 పొరల దుస్తులు ధరించాం. మేం 7 పొరల దుస్తులు ధరించి మొత్తం అంటార్కిటిక్ మహాసముద్రాన్ని దాటాం సర్. కొన్నిసార్లు మేం మా చేతులకు వెచ్చదనం అందేందుకు గ్యాస్ స్టవ్‌ను ఉపయోగించాం సర్. కొన్నిసార్లు గాలి లేని పరిస్థితులు ఉండేవి. మేం మా తెరచాపలను పూర్తిగా తగ్గించి తేలుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితులు మా సహనానికి పరీక్షలు సర్.
ప్రధాన మంత్రి:మన దేశ అమ్మాయిలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని వింటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ పరిక్రమ సమయంలో మీరు వేర్వేరు దేశాలలో ఉన్నారు. అక్కడి అనుభవాలు చెప్పండి. భారతదేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను చూసినప్పుడు వారి మనస్సులలో చాలా ఆలోచనలు వచ్చి ఉంటాయి.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: అవును సర్.. మాకు చాలా మంచి అనుభవం వచ్చింది సర్. మేం 8 నెలల్లో 4 ప్రదేశాలలో బస చేశాం సర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోర్ట్ స్టాన్లీ, దక్షిణాఫ్రికాలలో ఉన్నాం సర్.
ప్రధాన మంత్రి: ప్రతి ప్రదేశంలో సరాసరి ఎంత కాలం ఉండవలసి వచ్చింది?
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: సర్.. మేం ఒకే చోట 14 రోజులు బస చేశాం.
ప్రధాన మంత్రి: ఒకే చోట 14 రోజులా?
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: నిజమే సర్. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయులను చూశాం సర్. వారు కూడా చాలా చురుకుగా, నమ్మకంగా ఉన్నారు. భారతదేశానికి కీర్తిని తెస్తున్నారు. వారు మా విజయాన్ని తమదిగా భావించారని మాకు అనిపించింది సర్. మాకు ప్రతిచోటా వేర్వేరు అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్ స్పీకర్ మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని ఎంతో ప్రేరేపించారు. ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి సర్. మాకు చాలా గర్వంగా అనిపించింది. మేం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు మావురీ ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. మన భారతీయ సంస్కృతి పట్ల గొప్ప గౌరవాన్ని చూపించారు సర్. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... సర్.. పోర్ట్ స్టాన్లీ ఒక మారుమూల ద్వీపం సర్. ఇది దక్షిణ అమెరికాకు దగ్గరగా ఉంది. అక్కడ మొత్తం జనాభా 3,500 మాత్రమే. అవును సర్. కానీ అక్కడ మేం ఒక చిన్న భారతదేశాన్ని చూశాం. అక్కడ 45 మంది భారతీయులు ఉన్నారు. వారు మమ్మల్ని తమ సొంతవారిలా చూసుకున్నారు. మేం మా ఇంట్లో ఉన్నట్టు భావించేలా చేశారు సర్.
ప్రధానమంత్రి: మీలాగే భిన్నంగా ఏదైనా పని చేయాలనుకునే మన దేశ అమ్మాయిలకు మీరిద్దరూ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
లెఫ్టినెంట్ కమాండర్ రూప: సర్.. లెఫ్టినెంట్ కమాండర్ రూపను మాట్లాడుతున్నాను సర్. మీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఎవరైనా హృదయపూర్వకంగా కష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ జన్మించారు అనే విషయాలతో సంబంధం లేదు. సర్… భారతదేశంలోని యువత, మహిళలు పెద్ద కలలు కనాలని, భవిష్యత్తులో అందరు బాలికలు, మహిళలు రక్షణ, క్రీడలు, సాహసయాత్రలలో చేరి దేశానికి కీర్తిని తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం.
ప్రధాన మంత్రి: దిల్నా, రూపా.. మీ మాటలు వింటూ, మీరు చూపిన అపారమైన ధైర్యసాహసాలను వింటూ నేను చాలా సంతోషిస్తున్నాను. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కృషి, మీ సఫలత, మీ విజయాలు నిస్సందేహంగా దేశంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తాయి. ఇలాగే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. మీ భవిష్యత్ ప్రయత్నాలకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా: థాంక్యూ సర్.
ప్రధాన మంత్రి: చాలా చాలా ధన్యవాదాలు. వణక్కం. నమస్కారం.
లెఫ్టినెంట్ కమాండర్ రూప: నమస్కారం సర్.
మిత్రులారా! మన పండుగలు భారతదేశ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. ఛఠ్ పూజ దీపావళి తర్వాత వచ్చే పవిత్ర పండుగ. సూర్య భగవానుడిని ఆరాధించే ఈ గొప్ప పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా అస్తమించే సూర్యుడికి కూడా నీటిని అర్పించి పూజిస్తాం. ఛఠ్ పండుగ కేవలం మన దేశంలోని వివిధ ప్రాంతాలలో మాత్రమే కాకుండా, దాని వైభవం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. నేడు ఇది ప్రపంచవ్యాప్త పండుగగా మారుతోంది.
మిత్రులారా! ఛఠ్ పూజకు సంబంధించి భారత ప్రభుత్వం కూడా ఒక పెద్ద ప్రయత్నంలో నిమగ్నమై ఉందని మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఛఠ్ పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఛఠ్ పూజ ఉత్సవాన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చినప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలలోని ప్రజలు దాని గొప్పతనాన్ని, దివ్యత్వాన్ని అనుభవించగలుగుతారు.
మిత్రులారా! కొంతకాలం కిందట భారత ప్రభుత్వం చేసిన ఇలాంటి ప్రయత్నాల కారణంగా కోల్‌కతాలోని దుర్గా పూజ కూడా ఈ యునెస్కో జాబితాలో భాగమైంది. మనం మన సాంస్కృతిక కార్యక్రమాలకు అటువంటి ప్రపంచ గుర్తింపు ఇస్తే ప్రపంచం వాటి గురించి నేర్చుకుంటుంది, వాటిని అర్థం చేసుకుంటుంది, వాటిలో పాల్గొనడానికి ముందుకు వస్తుంది.
మిత్రులారా! అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి. గాంధీజీ ఎల్లప్పుడూ స్వదేశీని స్వీకరించడాన్ని నొక్కిచెప్పారు. వాటిలో ఖాదీ ప్రధానమైనది. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత ఖాదీ ఆకర్షణ తగ్గుతూ వచ్చింది. కానీ గత 11 సంవత్సరాలలో దేశ ప్రజలలో ఖాదీ పట్ల ఆకర్షణ గణనీయంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలలో ఖాదీ అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ 2వ తేదీన మీరందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను కోరుతున్నాను. గర్వంగా ప్రకటించండి - ఇవి స్వదేశీ అని. #వోకల్ ఫర్ లోకల్‌తో సామాజిక మాధ్యమాల్లో కూడా దీన్ని పంచుకోండి.
మిత్రులారా! ఖాదీ లాగే మన చేనేత, హస్తకళారంగం కూడా గణనీయమైన మార్పులను చూస్తోంది. నేడు మన దేశంలో ఇలాంటి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సంప్రదాయం, నవీన ఆవిష్కరణలు కలిపితే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని ఇవి నిరూపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన యాళ్ నేచురల్స్ దీనికి ఒక ఉదాహరణ. ఇక్కడ అశోక్ జగదీశన్, ప్రేమ్ సెల్వరాజ్ కొత్త చొరవ తీసుకోవడానికి తమ కార్పొరేట్ ఉద్యోగాలను విడిచిపెట్టారు. వారు గడ్డి, అరటి ఫైబర్‌తో యోగా మ్యాట్లను తయారు చేశారు. మూలికా రంగులతో దుస్తులకు రంగులు వేశారు. 200 కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించారు.
జార్ఖండ్‌కు చెందిన ఆశిష్ సత్యవ్రత్ సాహు జోహార్ గ్రామ్ బ్రాండ్ ద్వారా గిరిజన నేత, వస్త్రాలను ప్రపంచ వేదికకు తీసుకువచ్చారు. ఆయన కృషి ఫలితంగా ఇతర దేశాల ప్రజలు కూడా జార్ఖండ్ సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకుంటున్నారు.
బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన స్వీటీ కుమారి సంకల్ప్ క్రియేషన్స్‌ను ప్రారంభించారు. ఆమె మిథిలా పెయింటింగ్‌ను మహిళలకు జీవనోపాధి మార్గంగా మార్చారు. నేడు 500 మందికి పైగా గ్రామీణ మహిళలు ఆమెతో అనుబంధం కలిగి ఉన్నారు. స్వావలంబన మార్గంలో ఉన్నారు. ఈ విజయగాథలన్నీ మన సంప్రదాయాలు అనేక ఆదాయ వనరులను కలిగి ఉన్నాయని మనకు బోధిస్తాయి. లక్ష్యం బలంగా ఉంటే విజయం మన నుండి తప్పించుకోలేదు.
నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే కొద్ది రోజుల్లో మనం విజయదశమిని జరుపుకుంటాం. ఈ విజయదశమి మరొక కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి, 100 సంవత్సరాలు అవుతోంది. ఈ శతాబ్ద ప్రయాణం అంతే అద్భుతమైనది, అపూర్వమైనది, స్ఫూర్తిదాయకమైనది. 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపితమైనప్పుడు దేశం శతాబ్దాలుగా బానిసత్వ సంకెళ్లతో ఉంది. ఈ శతాబ్దాల బానిసత్వం మన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలోని పురాతన నాగరికత గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశ ప్రజలు న్యూనతా భావానికి గురయ్యారు. అందువల్ల దేశ స్వాతంత్ర్యంతో పాటు దేశం సైద్ధాంతిక బానిసత్వం నుండి విముక్తి పొందడం కూడా చాలా ముఖ్యం. ఈ సందర్భంలో పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ ఈ అంశాన్ని ఆలోచించడం ప్రారంభించారు. ఈ కష్టతరమైన పని కోసం ఆయన 1925లో విజయదశమి శుభ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని స్థాపించారు. డాక్టర్ సాహెబ్ మరణానంతరం పరమ పూజ్య గురూజీ ఈ గొప్ప జాతీయ సేవ యాగాన్ని ముందుకు తీసుకెళ్లారు. "రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ ఇదం న మమ్" అని పరమ పూజ్య గురూజీ చెప్పేవారు. అంటే “ఇది నాది కాదు, ఇది దేశానికి చెందినది.” అని అర్థం. ఇది స్వార్థానికి అతీతంగా ఎదగడానికి, దేశం కోసం అంకితభావ స్ఫూర్తిని కలిగి ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. గురూజీ గోల్వాల్కర్ జీ చెప్పిన ఈ వాక్యం లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులకు త్యాగం, సేవ మార్గాన్ని చూపించింది. త్యాగం, సేవా స్ఫూర్తి, క్రమశిక్షణ పాఠం సంఘ్ నిజమైన బలం. ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, నిరంతరాయంగా దేశానికి సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంది. అందుకే దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు ముందుగా అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. లక్షలాది స్వచ్ఛంద సేవకుల జీవితాల్లోని ప్రతి చర్యలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ ఈ నేషన్ ఫస్ట్ అనే జాతి స్ఫూర్తి ఎల్లప్పుడూ ప్రధానమైనది. జాతీయ సేవ అనే గొప్ప యజ్ఞానికి తనను తాను అంకితం చేసుకుంటున్న ప్రతి స్వచ్ఛంద సేవకుడికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి. భారతీయ సంస్కృతికి మహర్షి వాల్మీకి ఎంత ముఖ్యమైన పునాది వేశారో మనందరికీ తెలుసు. శ్రీరాముని అవతార కథలను మనకు అంత వివరంగా పరిచయం చేసినది మహర్షి వాల్మీకి. ఆయన మానవాళికి అద్భుతమైన రామాయణ గ్రంథాన్ని ఇచ్చారు.
మిత్రులారా! రామాయణం ప్రభావం దానిలో పొందుపరిచిన శ్రీరాముని ఆదర్శాలు, విలువల వల్ల వచ్చింది. భగవాన్ శ్రీరాముడు సేవ, సామరస్యం, కరుణతో అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. అందుకే శబరి మాత, నిషాదరాజులతో మాత్రమే మహర్షి వాల్మీకి రామాయణంలోని రాముడు పరిపూర్ణం అయ్యాడని మనం చూస్తాం. అందుకే మిత్రులారా! అయోధ్యలో రామాలయం నిర్మితమైనప్పుడు నిషాదరాజు, మహర్షి వాల్మీకి ఆలయాలు కూడా దాని పక్కనే నిర్మితమయ్యాయి. మీరు రామ్ లల్లాను చూడటానికి అయోధ్యకు వెళ్ళినప్పుడు మహర్షి వాల్మీకి, నిషాదరాజు ఆలయాలను సందర్శించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! కళ, సాహిత్యం, సంస్కృతి గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. వాటి పరిమళం అన్ని సరిహద్దులను దాటి ప్రజల హృదయాలను తాకుతుంది. ఇటీవల, పారిస్‌లోని "సౌంత్ఖ్ మండప" అనే సాంస్కృతిక సంస్థ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ కేంద్రం భారతీయ నృత్యానికి ప్రాచుర్యం కల్పించడంలో గణనీయమైన కృషి చేసింది. దీన్ని కొన్ని సంవత్సరాల కిందట పద్మశ్రీ అవార్డు పొందిన మిలేనా సాల్విని స్థాపించారు. "సౌంత్ఖ్ మండప"తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! నేను ఇప్పుడు రెండు చిన్న ఆడియో క్లిప్‌లను వినిపిస్తున్నాను. వీటిపై దృష్టి పెట్టి, వినండి.
#ఆడియో క్లిప్ 1
ఇప్పుడు రెండవ ఆడియో క్లిప్‌ను వినండి:
#ఆడియో క్లిప్ 2
మిత్రులారా! భూపేన్ హజారికా పాటలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను ఎలా అనుసంధానిస్తాయో తెలియజేసేందుకు ఈ స్వరాలు సాక్ష్యంగా ఉన్నాయి. నిజానికి శ్రీలంకలో చాలా ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇందులో శ్రీలంక కళాకారులు భూపేన్ దా జీ ప్రసిద్ధి చెందిన పాట "మనుహే-మనుహార్ బాబే"ని సింహళ, తమిళ భాషల్లోకి అనువదించారు. నేను వీటి ఆడియోను మీ కోసం వినిపించాను. కొన్ని రోజుల క్రితం అస్సాంలో ఆయన జన్మ శతాబ్ది వేడుకలకు హాజరయ్యే భాగ్యం నాకు లభించింది. ఇది నిజంగా ఒక చిరస్మరణీయ కార్యక్రమం.
మిత్రులారా! భూపేన్ హజారికా జీ జన్మ శతాబ్ది ఉత్సవాలను అస్సాం జరుపుకుంటుండగా, కొన్ని రోజుల క్రితం విచారకరమైన సందర్భం కూడా వచ్చింది. జుబీన్ గర్గ్ జీ అకాల మరణంతో ప్రజలు శోకతప్తులయ్యారు.
జుబీన్ గర్గ్ దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన ప్రఖ్యాత గాయకుడు. ఆయనకు అస్సామీ సంస్కృతితో గాఢమైన సంబంధం ఉంది. జుబీన్ గర్గ్ ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో నిలిచి ఉంటారు. ఆయన సంగీతం భవిష్యత్ తరాలను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంటుంది.
“జుబీన్ గర్గ్, ఆసిల్
అహోమార్ హమోసకృతిర్, ఉజ్జాల్ రత్నో...
జనోతార్ హృదయాత్, తేయో హదాయ్ జియాయ్, థాకిబో”
అంటే జుబీన్ అస్సామీ సంస్కృతికి చెందిన ప్రకాశవంతమైన కోహినూర్ రత్నం. ఆయన భౌతికంగా మన మధ్య నుండి వెళ్ళిపోయినప్పటికీ, మన హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉంటారని అర్థం.
మిత్రులారా! ఒక గొప్ప ఆలోచనాపరుడు, తత్వవేత్త ఎస్. ఎల్. భైరప్పను కొన్ని రోజుల క్రితం మన దేశం కోల్పోయింది. భైరప్పతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. మేం వివిధ అంశాలపై చాలా లోతైన చర్చలు చేశాం. ఆయన రచనలు యువత ఆలోచనలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ఆయన కన్నడలో చేసిన అనేక రచనల అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మన మూలాలు, సంస్కృతి గురించి గర్వపడటం ఎంత ముఖ్యమో ఆయన నేర్పించారు. ఎస్.ఎల్. భైరప్పకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన రచనలను చదవాల్సిందిగా యువతను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! వచ్చే రోజులు పండుగలు, ఆనందాలను తీసుకువస్తున్నాయి. మనం ప్రతి సందర్భంలోనూ చాలా షాపింగ్ చేస్తాం. ఈసారి 'జీఎస్టీ పొదుపు పండుగ' కూడా జరుగుతోంది.
మిత్రులారా! ప్రతిజ్ఞ చేయడం ద్వారా మీరు మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఈసారి మనం స్వదేశీ ఉత్పత్తులతో మాత్రమే పండుగలు జరుపుకోవాలని నిశ్చయించుకుంటే మన వేడుకల ఆనందం అనేక రెట్లు పెరుగుతుందని మీరు చూస్తారు. 'వోకల్ ఫర్ లోకల్' ను మీ షాపింగ్ మంత్రంగా చేసుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే మీరు కొనుగోలు చేయాలని ఎప్పటికీ నిర్ణయించుకోండి. దేశ ప్రజలు తయారు చేసిన వాటిని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్తారు. దేశ పౌరుడు కష్టపడి పనిచేసిన వస్తువులను మాత్రమే మీరు ఉపయోగిస్తారు. మనం ఇలా చేసినప్పుడు మనం కేవలం వస్తువులను కొనడం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆశను తీసుకువస్తాం. చేతివృత్తులవారి కష్టాన్ని గౌరవిస్తాం. ఒక యువ వ్యవస్థాపకుడి కలలకు రెక్కలు ఇస్తాం.
మిత్రులారా! పండుగల సమయంలో మనమందరం మన ఇళ్లను శుభ్రం చేసుకోవడంలో తీరిక లేకుండా ఉంటాం. కానీ పరిశుభ్రత ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వీధి, ప్రాంతం, మార్కెట్, గ్రామం - ప్రతిచోటా పరిశుభ్రత మన బాధ్యతగా మారాలి.
మిత్రులారా! ఈ సమయం అంతా ఇక్కడ వేడుకల సమయం. దీపావళి ఒక విధంగా గొప్ప పండుగగా మారుతుంది. రాబోయే దీపావళి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. కానీ అదే సమయంలో మనం స్వావలంబన చెందాలి. దేశం స్వావలంబన చెందేలా చూడాలి. దానికి మార్గం స్వదేశీ ద్వారా మాత్రమే ఉందని నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను.
మిత్రులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే! వచ్చే నెలలో కొత్త గాథలు, ప్రేరణలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.
Amar Shaheed Bhagat Singh is an inspiration for every Indian, especially the youth of the country. #MannKiBaat pic.twitter.com/6yE1a73H9e
— PMO India (@PMOIndia) September 28, 2025
Lata Didi's songs comprise everything that stirs human emotions. The patriotic songs she sang had a profound impact on people. #MannKiBaat pic.twitter.com/XCcbXLAEyH
— PMO India (@PMOIndia) September 28, 2025
India's Nari Shakti is making a mark in every field. #MannKiBaat pic.twitter.com/LGAH8xKplo
— PMO India (@PMOIndia) September 28, 2025
Lieutenant Commander Dilna and Lieutenant Commander Roopa have exemplified true courage and unshakable resolve during the Navika Sagar Parikrama. #MannKiBaat pic.twitter.com/McWDkNBTFT
— PMO India (@PMOIndia) September 28, 2025
Chhath Puja honours Surya Dev with offerings to the setting sun. Once local, it is now becoming a global festival. #MannKiBaat pic.twitter.com/KIgB6kdm05
— PMO India (@PMOIndia) September 28, 2025
Over the last 11 years, the attraction for Khadi has grown remarkably, with sales rising steadily. #MannKiBaat pic.twitter.com/AIHtbDT9rR
— PMO India (@PMOIndia) September 28, 2025
India's handloom and handicraft sector is undergoing a remarkable transformation. #MannKiBaat pic.twitter.com/5NrH8Kzt38
— PMO India (@PMOIndia) September 28, 2025
The RSS has been relentlessly and tirelessly engaged in national service for over a hundred years. #MannKiBaat pic.twitter.com/1tle1CRHWI
— PMO India (@PMOIndia) September 28, 2025
Remembering the noble ideals of Maharshi Valmiki. #MannKiBaat pic.twitter.com/AJ8t3Xadbn
— PMO India (@PMOIndia) September 28, 2025
Indian culture transcends all boundaries, touching hearts not just across India but around the world. #MannKiBaat pic.twitter.com/eadFE7S8PH
— PMO India (@PMOIndia) September 28, 2025
Let us make 'Vocal for Local' the shopping mantra. #MannKiBaat pic.twitter.com/yNUC3dBj4W
— PMO India (@PMOIndia) September 28, 2025
Cleanliness should extend beyond our homes, becoming our responsibility everywhere - in streets, neighbourhoods, markets and villages. #MannKiBaat pic.twitter.com/W08219X4HO
— PMO India (@PMOIndia) September 28, 2025


