నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ఎవరైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, ముందుగా మనస్సులోకి ఒకే ఒక భావన వస్తుంది "వెళ్దాం. పిలుపు వచ్చింది" అని. ఈ భావన మన ధార్మిక తీర్థయాత్రల ఆత్మ. శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మనస్సును శుద్ధి చేయడానికి; పరస్పర ప్రేమను, సోదరభావాన్ని పెంపొందించడానికి; దేవునితో అనుసంధానం అవడానికి తీర్థయాత్ర ఒక సాధనం. దీనితో పాటు ఈ తీర్థయాత్రలలో మరొక పెద్ద అంశం ఉంది. ఈ ధార్మిక తీర్థయాత్రలు సేవా అవకాశాల గొప్ప ఆచారం కూడా. ఏదైనా తీర్థయాత్ర జరిగినప్పుడు తీర్థయాత్రకు వెళ్ళే వారి కంటే ఎక్కువ మంది యాత్రికులకు సేవ చేసే పనిలో పాల్గొంటారు. వివిధ ప్రదేశాలలో యాత్రికులకు భోజన సౌకర్యం కోసం భండారాలు, లంగర్లను నిర్వహిస్తారు. ప్రజలు రోడ్ల పక్కన తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. వైద్య శిబిరాలు, సౌకర్యాలను సేవా స్ఫూర్తితో ఏర్పాటు చేస్తారు. చాలా మంది తమ సొంత ఖర్చుతో ధర్మశాలలు నిర్వహిస్తారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేస్తారు.
మిత్రులారా! చాలా కాలం తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. కైలాస మానస సరోవర్ అంటే శివుని నివాసం. ప్రతి సంప్రదాయంలో హిందూ, బౌద్ధ, జైన మతాలలో కైలాసాన్ని విశ్వాసానికి, భక్తికి కేంద్రంగా భావిస్తారు. మిత్రులారా! పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జులై 3వ తేదీన ప్రారంభం అవుతుంది. పవిత్ర శ్రావణ మాసం కూడా కొన్ని రోజుల దూరంలో ఉంది. కొన్ని రోజుల క్రితం మనం జగన్నాథుని రథయాత్రను కూడా చూశాం. ఒడిషా, గుజరాత్ లేదా దేశంలోని ఏ ఇతర ప్రాంతం నుండి అయినా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు ఈ యాత్రలు 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావాన్ని ప్రతిబింబిస్తాయి. మనం మన ధార్మిక యాత్రను భక్తితో, పూర్తి అంకితభావంతో, పూర్తి క్రమశిక్షణతో పూర్తి చేసినప్పుడు మనకు దాని ఫలాలు లభిస్తాయి. యాత్రలు చేస్తున్న అదృష్టవంతులైన భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవా స్ఫూర్తితో ఈ యాత్రలను విజయవంతం చేయడంలో, సురక్షిత యాత్రలుగా తీర్చిదిద్దడంలో అనుసంధానమై ఉన్న వారిని కూడా నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! దేశం సాధించిన రెండు విజయాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి మిమ్మల్ని గర్వంతో నింపుతాయి. ఈ విజయాలను ప్రపంచ సంస్థలు చర్చిస్తున్నాయి. డబ్ల్యు.హెచ్.ఓ. అంటే ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ , ఐ.ఎల్.ఓ. అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ- దేశం సాధించిన ఈ విజయాలను ప్రశంసించాయి. మొదటి విజయం మన ఆరోగ్యానికి సంబంధించింది. మీలో చాలామంది కంటి వ్యాధి – ట్రాకోమా గురించి విని ఉంటారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి దేశంలోని అనేక ప్రాంతాలలో గతంలో సర్వసాధారణంగా ఉండేది. జాగ్రత్త తీసుకోకపోతే ఈ వ్యాధి క్రమంగా కంటి చూపు కోల్పోయేలా చేసేది. ట్రాకోమాను మూలాల నుండి నిర్మూలించాలని మనం ప్రతిజ్ఞ చేశాం. మీకు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది – ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంటే డబ్ల్యు.హెచ్.ఓ. భారతదేశాన్ని ట్రాకోమా రహిత దేశంగా ప్రకటించింది. ఇప్పుడు భారతదేశం ట్రాకోమా రహిత దేశంగా మారింది. ఈ వ్యాధితో అవిశ్రాంతంగా, నిరంతరాయంగా పోరాడిన లక్షలాది మంది ప్రజల కృషి ఫలితం ఇది. ఈ విజయం మన ఆరోగ్య కార్యకర్తలదే. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కూడా దీన్ని నిర్మూలించడంలో చాలా సహాయపడింది. ఈ విజయంలో జల్ జీవన్ మిషన్ కూడా భారీ పాత్ర పోషించింది. శుభ్రమైన కుళాయి నీరు ప్రతి ఇంటికి చేరుతున్న ప్రస్తుత సందర్భంలో అటువంటి వ్యాధుల ప్రమాదం తగ్గింది. భారతదేశం ఈ వ్యాధిని ఎదుర్కోవడమే కాకుండా దాని మూలాలను కూడా తొలగించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యు.హెచ్.ఓ. - కూడా ప్రశంసించింది.
మిత్రులారా! నేడు భారతదేశంలోని జనాభాలో ఎక్కువ మంది ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ – ఐ.ఎల్.ఓ. నుండి చాలా ముఖ్యమైన నివేదిక వచ్చింది. భారతదేశ జనాభాలో 64% కంటే ఎక్కువ మంది ఇప్పుడు ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారని ఈ నివేదిక తెలియజేసింది. సామాజిక భద్రత ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది ప్రజలు లబ్ది పొందుతున్నవాటిలో ఒకటి. నేడు దేశంలోని దాదాపు 95 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ప్రయోజనాన్ని పొందుతున్నారు. గతంలో 2015 వరకు ప్రభుత్వ పథకాలు 25 కోట్ల కంటే తక్కువ మందిని మాత్రమే చేరుకోగలిగాయి. మిత్రులారా! భారతదేశంలో ఆరోగ్యం నుండి సామాజిక భద్రత వరకు- దేశం ప్రతి రంగంలోనూ- సంతృప్తి భావనతో ముందుకు సాగుతోంది. ఇది సామాజిక న్యాయ అద్భుతమైన దృశ్యం కూడా. ఈ విజయాలు రాబోయే కాలం మరింత మెరుగ్గా ఉంటుందని, భారతదేశం ప్రతి అడుగులోనూ మరింత సాధికారత పొందుతుందనే నమ్మకాన్ని కలిగించాయి.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రజా భాగస్వామ్య శక్తితో పెద్ద సంక్షోభాలను ఎదుర్కోవచ్చు. మీకు ఒక స్వరాన్ని వినిపిస్తాను.. ఈ స్వరంలో ఆ సంక్షోభం ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. ఆ సంక్షోభం ఎంత పెద్దదో! ముందుగా దాన్ని వినండి, అర్థం చేసుకోండి.
ఆడియో…. మొరార్జీ భాయ్ దేశాయ్
[రెండు సంవత్సరాలుగా ఈ అణచివేత జరిగింది. ఈ అణచివేత 5-7 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ రెండు సంవత్సరాలలో అది గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రజలపై అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజలను అమానుషంగా చూశారు. ప్రజల స్వేచ్ఛ హక్కును లాక్కున్నారు. వార్తాపత్రికలకు స్వేచ్ఛ లేదు. కోర్టులు పూర్తిగా నిర్బలమయ్యాయి. లక్ష మందికి పైగా ప్రజలను జైలులో పెట్టారు. ఆపై వారి ఏకపక్ష పాలన కొనసాగింది. దీనికి మరో ఉదాహరణ ప్రపంచ చరిత్రలోనే దొరకడం కష్టం.]
మిత్రులారా! ఈ స్వరం దేశ మాజీ ప్రధాన మంత్రి శ్రీ మొరార్జీ భాయ్ దేశాయ్ స్వరం. ఆయన అత్యవసర పరిస్థితి గురించి క్లుప్తంగా మాట్లాడినా ఆ మాటల్లో చాలా స్పష్టత ఉంది. ఆ కాలం ఎలా ఉండేదో మీరు ఊహించవచ్చు! అత్యవసర పరిస్థితి విధించిన వారు మన రాజ్యాంగాన్ని హత్య చేయడమే కాకుండా న్యాయవ్యవస్థను తమ బానిసగా ఉంచుకోవాలని కూడా అనుకున్నారు. ఆ కాలంలో ప్రజలను పెద్ద ఎత్తున హింసించారు. ఎప్పటికీ మర్చిపోలేని ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జార్జ్ ఫెర్నాండెజ్ గారిని సంకెళ్లతో బంధించారు. చాలా మందిని కఠినంగా హింసించారు. ‘మీసా’ (MISA) కింద ఎవరినైనా అలాగే అరెస్టు చేయవచ్చు. విద్యార్థులను కూడా వేధించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా అణచివేశారు.
మిత్రులారా! ఆ కాలంలో అరెస్టయిన వేలాది మంది ప్రజలు ఇటువంటి అమానవీయ దురాగతాలకు గురయ్యారు. కానీ ఇది భారతదేశ ప్రజల బలం వారి ముందు తలవంచలేదు. విచ్ఛిన్నం కాలేదు. ప్రజాస్వామ్యంతో ఎటువంటి రాజీని ప్రజలు అంగీకరించలేదు. చివరికి ప్రజలు గెలిచారు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారు. అత్యవసర పరిస్థితిని విధించిన వారు ఓడిపోయారు. దీనిపై బాబూ జగ్జీవన్ రామ్ గారు తన అభిప్రాయాలను చాలా బలంగా వ్యక్తం చేశారు.
#ఆడియో #
[సోదర సోదరీమణులారా! గత ఎన్నికలు ఎన్నికలు కాదు. ఇది భారత ప్రజల గొప్ప ఉద్యమం. ఆ కాలపు పరిస్థితులను మార్చడానికి, నియంతృత్వాన్ని తిప్పికొట్టడానికి, భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడానికి జరిగిన గొప్ప ఉద్యమం.]
అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు తనదైన శైలిలో చెప్పింది కూడా మనం తప్పకుండా వినాలి-
#ఆడియో #
[సోదర సోదరీమణులారా! దేశంలో జరిగినవాటిని కేవలం ఎన్నికలు అని పిలవలేం. శాంతియుత విప్లవం జరిగింది. ప్రజాశక్తితరంగం ప్రజాస్వామ్య హంతకులను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది]
మిత్రులారా! దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, 50 సంవత్సరాలు గడిచాయి. మనం- దేశవాసులం- 'సంవిధాన్ హత్యా దివస్' జరుపుకున్నాం. అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న వారందరినీ మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగాన్ని బలంగా ఉంచేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండటానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఒక చిత్రాన్ని ఊహించుకోండి. ఉదయం సూర్యుడు కొండలను తాకుతున్నాడు. కాంతి నెమ్మదిగా మైదానాల వైపు ప్రవహిస్తోంది. ఆ కాంతితో ఫుట్‌బాల్ ప్రేమికుల బృందం ముందుకు కదులుతోంది. ఈలలు మోగుతున్నాయి. కొన్ని క్షణాల్లో నేల చప్పట్లు, నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రతి అడుగు, ప్రతి లక్ష్యంతో ప్రజల ఉత్సాహం పెరుగుతోంది. “ఎక్కడిదీ ఇంత అందమైన ప్రపంచం!” అని మీరు ఆలోచిస్తున్నారా? మిత్రులారా! ఈ చిత్రం అస్సాంలోని ప్రముఖ ప్రదేశమైన బోడోలాండ్ వాస్తవికత. నేడు బోడోలాండ్ కొత్త రూపంలో దేశం ముందు నిలబడి ఉంది. ఇక్కడి యువత శక్తి, ఆత్మవిశ్వాసం ఫుట్‌బాల్ మైదానంలో ఎక్కువగా కనిపిస్తుంది. బోడోలాండ్ CEM కప్ బోడో ప్రాంతంలో జరుగుతోంది. ఇది కేవలం టోర్నమెంట్ కాదు. ఇది ఐక్యత, ఆశాభావాల వేడుకగా మారింది. 3,700 కంటే ఎక్కువ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 70,000 మంది క్రీడాకారులు, పెద్ద సంఖ్యలో మన ఆడపిల్లలు ఇందులో భాగస్వాములవుతున్నారు. ఈ గణాంకాలు బోడోలాండ్‌లో భారీ మార్పు సందేశాన్ని ఇస్తున్నాయి. బోడోలాండ్ ఇప్పుడు దేశ క్రీడా పటంలో తన ప్రకాశాన్ని పెంచుకుంటోంది.
మిత్రులారా! ఈ ప్రదేశానికి ఒకప్పుడు పోరాటమే గుర్తింపుగా ఉండేది. అప్పుడు ఇక్కడి యువతకు మార్గాలు పరిమితం. కానీ నేడు వారి దృష్టిలో కొత్త కలలు, వారి హృదయాలలో స్వావలంబన ధైర్యం ఉన్నాయి. ఇక్కడి నుండి వస్తున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఇప్పుడు భారీ వేదికపై తమ ముద్ర వేస్తున్నారు. హాలీచరణ్ నార్జారీ, దుర్గా బోరో, అపూర్వా నార్జారీ, మన్బీర్ బసుమతారి- ఇవి కేవలం ఫుట్‌బాల్ ఆటగాళ్ల పేర్లు కాదు - బోడోలాండ్‌ను మైదానం నుండి జాతీయ వేదికకు తీసుకెళ్లిన కొత్త తరం గుర్తింపులివి. వారిలో చాలామంది పరిమిత వనరులతో సాధన చేశారు. చాలామంది క్లిష్ట పరిస్థితుల్లో తమ మార్గాన్ని ఎంచుకున్నారు. నేడు దేశంలోని చాలా మంది చిన్నపిల్లలు వారి పేరును పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తమ కలలను ప్రారంభిస్తారు.
మిత్రులారా! మన సామర్థ్యాలను విస్తరించుకోవాలనుకుంటే ముందుగా మన ఫిట్‌నెస్, ఆరోగ్యాలపై దృష్టి పెట్టాలి. మిత్రులారా! ఫిట్‌నెస్ కోసం, ఊబకాయం తగ్గించడం కోసం నా సూచనలలో ఒకటి మీరు గుర్తుంచుకోండి! మీ ఆహారంలో నూనెను 10% తగ్గించండి. ఊబకాయాన్ని దూరం చేయండి. మీరు ఫిట్‌గా ఉన్నప్పుడు మీరు జీవితంలో మరింత సూపర్ హిట్ అవుతారు.
నా ప్రియమైన దేశవాసులారా! మన భారతదేశం ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందినట్టే కళలు, చేతిపనులు, నైపుణ్యాల వైవిధ్యం కూడా మన దేశ గొప్ప లక్షణం. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కొన్ని ప్రత్యేకమైన, స్థానిక వస్తువుల గురించి మీరు తెలుసుకుంటారు. 'మన్ కీ బాత్'లో మనం తరచుగా దేశంలోని అటువంటి ప్రత్యేకమైన ఉత్పత్తుల గురించి మాట్లాడుకుంటాం. అలాంటి ఒక ఉత్పత్తి మేఘాలయకు చెందిన ఎరి సిల్క్. దీనికి కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ గుర్తింపు జీ.ఐ. ట్యాగ్ లభించింది. ఎరి సిల్క్ మేఘాలయకు వారసత్వ సంపద లాంటిది. ఇక్కడి తెగలకు -ముఖ్యంగా ఖాసీ సమాజానికి చెందిన ప్రజలు దీన్ని తరతరాలుగా సంరక్షించారు. వారి నైపుణ్యాలతో కూడా దీనిని సుసంపన్నం చేశారు. ఈ పట్టుకు ఇతర దుస్తులతో పోలిస్తే వైవిధ్యమైన అనేక లక్షణాలు ఉన్నాయి. దీని అత్యంత ప్రత్యేక లక్షణం దీన్ని తయారు చేసే విధానం. ఈ పట్టును పట్టు పురుగులను చంపే విధానంలో పొందరు. కాబట్టి దీన్ని అహింసా పట్టు అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఇటువంటి ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వీటికి హింసతో సంబంధం ఉండదు. ఇవి ప్రకృతిపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు. అందువల్ల మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ప్రపంచ మార్కెట్‌కు సరైన ఉత్పత్తి. దీని మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పట్టు మిమ్మల్ని శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. వేసవిలో చల్లబరుస్తుంది. ఈ వైవిధ్యం కారణంగా ఈ పట్టు చాలా ప్రదేశాలకు అనుకూలంగా ఉంటుంది. మేఘాలయ మహిళలు ఇప్పుడు స్వయం సహాయక బృందాల ద్వారా ఈ వారసత్వాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు. ఎరి సిల్క్‌కు జీ.ఐ. ట్యాగ్ లభించినందుకు మేఘాలయ ప్రజలను నేను అభినందిస్తున్నాను. ఎరి సిల్క్‌తో తయారు చేసిన దుస్తులను ప్రయత్నించమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవును- మీరు ఎల్లప్పుడూ ఖాదీ, చేనేత హస్తకళ, వోకల్ ఫర్ లోకల్‌లను గుర్తుంచుకోవాలి. వినియోగదారులు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తే, వ్యాపారులు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తే, 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' కొత్త శక్తిని పొందుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రం భారతదేశానికి కొత్త భవిష్యత్తును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మన తల్లులు, సోదరీమణులు, అమ్మాయిలు నేడు తమకే కాకుండా మొత్తం సమాజానికి కొత్త దిశను సృష్టిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీరు కూడా సంతోషిస్తారు. ఈ మహిళలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. వారు తమ జీవనోపాధి కోసం రోజంతా కష్టపడి పనిచేసేవారు. నేడు ఆ మహిళలు చిరుధాన్యాలు- శ్రీఅన్న- నుండి బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ దాకా 'భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్' పేరుతో వెళ్తున్నాయి. భద్రాచలం మహిళలు స్వయం సహాయక బృందంతో అనుసంధానమై శిక్షణ పొందారు.
మిత్రులారా! ఈ మహిళలు మరో ప్రశంసనీయమైన పని చేశారు. వారు 'గిరి శానిటరీ ప్యాడ్లు' తయారు చేయడం ప్రారంభించారు. కేవలం మూడు నెలల్లో వారు 40,000 ప్యాడ్‌లను తయారు చేసి పాఠశాలలు, సమీపంలోని కార్యాలయాలకు పంపిణీ చేశారు- అది కూడా చాలా సరసమైన ధరకు.
మిత్రులారా! కర్ణాటకలోని కలబుర్గి మహిళల విజయాలు కూడా గొప్పవి. వారు జొన్న రొట్టెను ఒక బ్రాండ్‌గా మార్చారు. వారు ఏర్పాటు చేసిన సహకార సంఘంలో ప్రతిరోజూ మూడు వేలకు పైగా రొట్టెలు తయారవుతున్నాయి. ఈ రొట్టెల వాసన ఇకపై గ్రామానికి మాత్రమే పరిమితం కాదు- బెంగళూరులో కూడా ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్‌ఫామ్‌లలో ఆర్డర్లు వస్తున్నాయి. కలబుర్గి రొట్టె ఇప్పుడు పెద్ద నగరాల వంటశాలలకు చేరుతోంది. ఇది ఈ మహిళలపై గొప్ప ప్రభావాన్ని చూపింది. వారి ఆదాయం పెరుగుతోంది.
మిత్రులారా! వివిధ రాష్ట్రాల గాథలకు వేర్వేరు రూపాలున్నాయి. కానీ వాటి ప్రకాశం ఒకటే. ఈ వెలుగు ఆత్మవిశ్వాసం, స్వావలంబన. అలాంటి రూపమే మధ్యప్రదేశ్‌కు చెందిన సుమా ఉయికే ఉదంతం. సుమా గారి ప్రయత్నాలు చాలా ప్రశంసనీయం. ఆమె బాలాఘాట్ జిల్లా కటాంగి బ్లాక్‌లో స్వయం సహాయక బృందంలో చేరి పుట్టగొడుగుల పెంపకం, పశుపోషణలో శిక్షణ పొందారు. ఇది ఆమెకు స్వావలంబనకు మార్గాన్ని చూపించింది. సుమా ఉయికే ఆదాయం పెరిగినప్పుడు ఆమె తన పనిని కూడా విస్తరించారు. ఒక చిన్న ప్రయత్నంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు 'దీదీ క్యాంటీన్', 'థర్మల్ థెరపీ సెంటర్'లను ఏర్పాటు చేయడం దాకా చేరుకుంది. దేశంలోని ప్రతి మూలలో లెక్కలేనంత మంది మహిళలు తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఇటీవల వియత్నాం నుండి చాలా మంది వివిధ మాధ్యమాల ద్వారా నాకు తమ సందేశాలను పంపారు. ఈ సందేశాలలోని ప్రతి పంక్తిలో భక్తి, ఆత్మీయత ఉన్నాయి. వారి భావాలు హృదయ స్పర్శిగా ఉన్నాయి. బుద్ధుని పవిత్ర అవశేషాలు రెలిక్స్ ను తమకు దర్శనం చేయించినందుకు వారు భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారి మాటల్లోని భావోద్వేగాలు విశిష్టమైన కృతజ్ఞతల కంటే ఎక్కువగా ఉన్నాయి.
మిత్రులారా! బుద్ధుని ఈ పవిత్ర అవశేషాలను మొదట ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని నాగార్జునకొండలో కనుగొన్నారు. ఈ ప్రదేశానికి బౌద్ధమతంతో గాఢమైన సంబంధం ఉంది. ఒకప్పుడు శ్రీలంక, చైనా దేశాలతో సహా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చేవారని చెప్తారు.
మిత్రులారా! గత నెలలో బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాంకు తీసుకెళ్లారు. అక్కడ 9 వేర్వేరు ప్రదేశాలలో వాటిని ప్రజల సందర్శన కోసం ఉంచారు. భారతదేశం చూపిన ఈ చొరవ ఒక విధంగా వియత్నాంకు జాతీయ పండుగగా మారింది. సుమారు 10 కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో ఒకటిన్నర కోట్లకు పైగా ప్రజలు బుద్ధుని పవిత్ర అవశేషాలను సందర్శించారంటే అది ఎంత పెద్ద పండుగో మీరు ఊహించవచ్చు.
సామాజిక మాధ్యమాల్లో నేను చూసిన చిత్రాలు, వీడియోల ద్వారా విశ్వాసానికి హద్దుల్లేవని నాకు అర్థమైంది. వర్షం అయినా, మండే ఎండ అయినా, ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. సందర్శకులు, వృద్ధులు, దివ్యాంగులు - అందరూ భావోద్వేగాలకు గురయ్యారు. వియత్నాం అధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి, సీనియర్ మంత్రులు అందరూ గౌరవభావనతో తలలు వంచారు. అక్కడి ప్రజలలో ఈ సందర్శన పట్ల గౌరవం ఎంతగా ఉందంటే వియత్నాం ప్రభుత్వం దీన్ని మరో 12 రోజులు పొడిగించాలని అభ్యర్థించింది. భారతదేశం ఆ అభ్యర్థనను సంతోషంగా అంగీకరించింది.
మిత్రులారా! బుద్ధ భగవానుడి ఆలోచనలలో దేశాలను, సంస్కృతులను, ప్రజలను కలిపే శక్తి ఉంది. గతంలో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయిలాండ్, మంగోలియాలకు తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే భక్తి భావన కనిపించింది. మీ రాష్ట్రంలోని బౌద్ధ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం అవుతుంది. అలాగే మన సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానం అవడానికి ఒక అద్భుతమైన అవకాశం అవుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ నెలలో మనమందరం 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' జరుపుకున్నాం. నాకు మీ నుండి వేలాది సందేశాలు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడటానికి ఒంటరిగా బయలుదేరిన వారి గురించి చాలా మంది నాకు చెప్పారు. తరువాత సమాజం యావత్తూ వారితో చేరింది. ప్రతి ఒక్కరి సహకారం మన భూమికి గొప్ప బలం అవుతోంది. పూణేకు చెందిన రమేశ్ ఖర్మాలే గారు చేసిన పని మీకు చాలా స్ఫూర్తినిస్తుంది. వారాంతంలో ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రమేశ్ గారు, ఆయన కుటుంబం పలుగూ పారలతో బయలుదేరతారు. ఎక్కడికో తెలుసా? జున్నర్ కొండల వైపు. సూర్యతాపం ఎక్కువగా ఉన్నా, నిటారుగా ఎక్కవలసి వచ్చినా వారి అడుగులు ఆగవు. వారు పొదలను తొలగిస్తారు. నీటిని నిలపడానికి కందకాలు తవ్వుతారు. విత్తనాలు నాటుతారు. వారు కేవలం రెండు నెలల్లోనే 70 కందకాలు తవ్వారు. రమేశ్ గారు అనేక చిన్న చెరువులను నిర్మించారు. వందలాది చెట్లను నాటారు. ఆయన ఆక్సిజన్ పార్క్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఫలితంగా పక్షులు ఇక్కడికి తిరిగి రావడం ప్రారంభించాయి. వన్యప్రాణులు కొత్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.
మిత్రులారా! గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో పర్యావరణం కోసం మరో అందమైన చొరవ కనిపించింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ 'మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్' ఉద్యమాన్ని ప్రారంభించింది. లక్షలాది చెట్లను నాటడం ఈ ఉద్యమ లక్ష్యం. ఈ ఉద్యమంలో ఒక ప్రత్యేకత 'సిందూర్ వనం'. ఈ వనాన్ని ఆపరేషన్ సిందూర్ వీరులకు అంకితం చేశారు. దేశం కోసం తమ సర్వస్వం అంకితం చేసిన ఆ ధైర్యవంతుల జ్ఞాపకార్థం సిందూర్ మొక్కలను నాటుతున్నారు. ఇక్కడ మరొక ఉద్యమం 'ఏక్ పెడ్ మా కే నామ్' కు కొత్త ప్రేరణ లభిస్తోంది. ఈ ఉద్యమం కింద దేశంలో కోట్లాది చెట్లను నాటారు. మీ గ్రామంలో లేదా నగరంలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి. చెట్లను నాటండి. నీటిని ఆదా చేయండి. భూమికి సేవ చేయండి. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడినప్పుడే మన భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచగలం.
మిత్రులారా! మహారాష్ట్రలోని ఒక గ్రామం ఒక గొప్ప ఉదాహరణను చూపింది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ పాటోదా. ఇది కార్బన్ న్యూట్రల్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో ఎవరూ తమ ఇంటి బయట చెత్త వేయరు. ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించే పూర్తి వ్యవస్థ ఉంది. అక్కడ మురికి నీటిని కూడా శుద్ధి చేస్తారు. శుభ్రం చేయకుండా ఏ నీరూ నదిలోకి పోదు. ఇక్కడ ఆవు పేడతో చేసే పిడకలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ బూడిదతో మరణించిన వ్యక్తి పేరు మీద ఒక చెట్టును నాటుతారు. ఈ గ్రామంలో పరిశుభ్రత కూడా చూడదగింది. చిన్న చిన్న అలవాట్లు సామూహిక సంకల్పంగా మారినప్పుడు భారీ మార్పు ఖచ్చితంగా ఉంటుంది.
నా ప్రియమైన మిత్రులారా! ఈ సమయంలో అందరి దృష్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై ఉంది. భారతదేశం కొత్త చరిత్రను సృష్టించింది. నేను నిన్న గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా గారితో కూడా మాట్లాడాను. శుభాంషు గారితో నా సంభాషణను మీరు కూడా విని ఉండాలి. ఇప్పుడు శుభాంషు గారు మరికొన్ని రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి ఉంది. ఈ మిషన్ గురించి మనం మరింత మాట్లాడుకుంటాం. కానీ 'మన్ కీ బాత్' తర్వాతి ఎపిసోడ్‌లో.
ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మీకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. కానీ, మిత్రులారా! బయలుదేరే ముందు నేను మీకు ఒక ప్రత్యేక రోజును గుర్తు చేయాలనుకుంటున్నాను. జూలై 1న- అంటే ఎల్లుండి – మనం రెండు ముఖ్యమైన వృత్తులను- డాక్టర్లను, సి.ఏ.లను గౌరవిస్తాం. ఈ రెండు వృత్తులూ సమాజానికి మూలస్థంభాలు. వారు మన జీవితాలను మెరుగుపరుస్తారు. వైద్యులు మన ఆరోగ్య రక్షకులు. సి.ఏ.- చార్టర్డ్ అకౌంటెంట్ - ఆర్థిక జీవితానికి మార్గదర్శి. వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా! నేను ఎల్లప్పుడూ మీ సూచనల కోసం నిరీక్షిస్తూ ఉంటాను. 'మన్ కీ బాత్' తర్వాతి ఎపిసోడ్ మీ సూచనలతో సుసంపన్నం అవుతుంది. కొత్త విషయాలతో, కొత్త ప్రేరణలతో, దేశవాసుల కొత్త విజయాలతో మనం మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
More and more people are adopting yoga in their daily lives. #MannKiBaat pic.twitter.com/rMO4ZSGjY2
— PMO India (@PMOIndia) June 29, 2025
I extend my best wishes to all the fortunate devotees going on the various Yatras. I also commend those who are engaged in making these Yatras successful and safe with a spirit of service: PM @narendramodi in #MannKiBaat pic.twitter.com/iVhENprVHu
— PMO India (@PMOIndia) June 29, 2025
A remarkable milestone!
— PMO India (@PMOIndia) June 29, 2025
India has been declared Trachoma-free by the World Health Organisation. #MannKiBaat pic.twitter.com/9ZfbrLbPcL
According to a recent ILO report, more than 64% of Indians are now covered under some kind of social protection. #MannKiBaat pic.twitter.com/lHTHDQrbxw
— PMO India (@PMOIndia) June 29, 2025
PM @narendramodi recalls the dark days of the Emergency and salutes the defenders of the Constitution. #MannKiBaat pic.twitter.com/gq5NLN1GcI
— PMO India (@PMOIndia) June 29, 2025
Bodoland is fast emerging as a shining beacon on India's sports map. #MannKiBaat pic.twitter.com/A42Ted4kDx
— PMO India (@PMOIndia) June 29, 2025
Meghalaya's Eri Silk, now a GI-tagged product, blends tradition, sustainability and innovation. #MannKiBaat pic.twitter.com/r9KpJ9fvc7
— PMO India (@PMOIndia) June 29, 2025
Today, our Nari Shakti is driving change, not just for themselves, but for the entire nation. #MannKiBaat pic.twitter.com/XvsypN5CtL
— PMO India (@PMOIndia) June 29, 2025
People from Vietnam have expressed profound gratitude to India for facilitating the darshan of the relics of Bhagwan Buddha, a moving reminder of our timeless cultural bond. #MannKiBaat pic.twitter.com/B6F9d25PBe
— PMO India (@PMOIndia) June 29, 2025
Across India, individuals and communities are becoming catalysts of change. Their unwavering commitment to conservation is not only protecting nature but also safeguarding the future for generations to come. #MannKiBaat pic.twitter.com/FI0ocBFMv3
— PMO India (@PMOIndia) June 29, 2025


